Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
కమల నాతో కష్టాలే పంచుకుంది. చిరునవ్వుతో పంచుకుంది. చిరుబుర్లాడక పంచుకుంది. వాస్తవంగా కష్టసుఖాలు సాపేక్షితాలు ఒకరి సుఖం ఒకరికి కష్టం అందుకు వ్యతిరేకమూ కావచ్చు.
"ఏవం వర్షసహప్రాణాం శతంవా2హం త్వయా సహ
ప్రతి క్రమం నవేత్స్యామి స్వర్గోపి నహి మేమతః"
"ఇలా అడవిలో నీతో వందల వేలసంవత్సరాల గడుపగలను. నిన్ను విడిచి ఉండలేను. అలాంటి స్వర్గం సహితం నాకు రుచించదు" అంటుంది సీత రామునితో.
ఆ గొడ్ల కొట్టం మాకు యమ సదనం అయింది. ఒకనాడు త్రాచుపాము కుబుసం కనిపించింది. ఆర్ధిక దారిద్ర్యం పడుకోవడానికి మంచాలు లేవు. తల్లిదండ్రుల బాధ పిల్లల గురించి ఉదయ, కవిత గురించి విలవిలలాడాం. ఒక మిత్రుడు మంచం తెచ్చి ఇచ్చాడు. గుడ్డి దీపపు వెలుగులో ఒకనాటి రాత్రి పాము కనిపించింది. కమల బావిలో చేద వేసింది. కొట్టం చూరులో పాము కనిపించింది. అది గిలకలేని బావి. భయానికి మొగ్గుతే బావిలో పడాల్సిందే! చాద బావిలోకి వదిలింది. పరిగెత్తింది. చాద బావిలో పడిన చప్పుడుకు పాము పారిపోయింది.
కవిత ముద్దుగా ఉండేది. ఆమెను ఎత్తుకుంటే ముసిముసి నవ్వేది. నవ్వినట్లూ, నవ్వనట్లూ ఉండేది. బొద్దుగా పెరుగుతున్నది. ముచ్చటగా ఉండేది. ఉదయకు కవిత అంటే ప్రాణం చుట్టుపట్లవాళ్ళు ఎప్పుడూ ఆమెను ఎత్తుకొని తిరిగేవారు.
ఒకనాడు చాపలు అల్లుకునే బిచ్చపుది - చంకన బిడ్డతో బిచ్చానికి వచ్చింది. కమల కవితను ఎత్తుకుని బిచ్చం వేసింది. "అమ్మా! బిడ్డకు తెల్ల కామెర్లు కనపడటం లేదా?" అన్నదా బిచ్చగత్తె.
కమల గుండెలో గునపం దిగింది. వెంటనే నాకు కబురంపింది. నేను ఇంట్లో వాలాను. మిషను ఆస్పత్రికి తీసికెళ్ళాం. ఇంజక్షను ఇచ్చాడు. తగ్గుతుందన్నాడు. తెల్లవారి మళ్ళీ తీసుకురమ్మన్నాడు. ఆ రాత్రి కవితకు ఆయాసం ఎక్కువయింది. మరో డాక్టరు మిత్రునికి చూపించాం. మందు అక్కర్లేదు, తగ్గుతుంది అని బొంకాడు.
డాక్టర్లు, వకీళ్ళు నిజం చెప్పరు. ఒకడు చచ్చేవరకు బతుకుతావంటాడు మరొకరు ఓడేవరకు గెలుస్తావంటాడు.
కవిత ముసి నవ్వడం తగ్గింది. ముంచుకుని పడుకుంటూంది. అది మా మనసులకు మసి పట్టించింది. కమలకూ - నాకూ మనస్సులో తుఫానులు చెలరేగుతున్నాయి. కమల కుమిలిపోతున్నది. నా బాధ వ్యక్తం కానిచ్చి ఆమెను మరింత బాధపెట్టరాదని నేను మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాను. ఆమె స్థితీ అలాగే ఉంది.
పరిణామం - సుమారుగా - వ్యక్తం అవుతున్నది. అయినా శక్తిహీనులంగా - నిస్సహాయంగా - నిర్వీర్యులంగా నిలిచి ఉన్నాం. విధి ఎంత బలీయం అయిందో మనిషి ఎంత బలహీనుడో అవగతం అవుతున్నది.
కవిత ముసినవ్వడం లేదు!
మనసులో చీకట్లు ముసురుతున్నాయి!!
ప్రయత్నం మానలేదు. మందులు ఇస్తున్నాం.
అమ్మలక్కలు వస్తున్నారు. మంత్రాలు వేస్తున్నారు. దిష్టి తీస్తున్నారు. ధైర్యం చెపుతున్నారు.
మేము ఉన్నది పశువుల కొట్టంలో తడకకు అవతలి పక్క ఒక ఎద్దు మూలుగుతున్నది. ఆ సాయంకాలం కవిత కోలుకుంటున్నట్లనిపించింది. ముసినవ్వింది. కొంతలో కొంత దైర్యం వచ్చింది.
లాంతరు వెలిగించి ఉంచాం. ఉదయ నిద్రపోయింది. తడక అవతల ఎద్దు గురకపెట్తున్నది. మొరపెడ్తున్నది. కవిత - లాంతరు వెలుగులో - ఆటలాడుతున్నది. అర్దరాత్రి దాటింది. ముగ్గురం నిద్రపోయాం.
"ఏమండీ! కవిత చల్లగా ఉందండీ!" కమల తెల్లవారుజామున లేపింది.
లేచి చూచాను.
కవిత వెళ్ళిపోయింది!
లాంతరు ఆరిపోయింది!!
ఎద్దు చచ్చిపోయింది!!!
మా మీద - నిలుస్తాయనుకున్న కొండలు - కూలాయి.
దుఃఖం కట్టలు తెంచుకుంది. గొల్లుమన్నాం ఇరుగుపొరుగులు వచ్చారు. ఓదార్చారు.
ముసినవ్వుల కవితను నేలమీద - చాపలో - వేశారు.
గార్లనుంచి అమ్మ వచ్చింది!
కవితను తీసుకొని వెళ్ళిపోయింది!!
రిక్తహస్తాలతో తిరిగి వచ్చింది!!!
"కవిత ఏది అమ్మా?" అని గుండె పగిలి ఏడుస్తే - జవాబుగా ఆమె మమ్ములను పట్టుకొని ఏడ్చింది.
కూడిన జనం వకంట తడి పెట్టారు. ఓదార్చలేకపోయారు.
కాలానికి గాయం మాన్పే శక్తీ ఉంది. క్రమంగా మేమూ కోలుకుంటున్నాం. ఒకనాటి ఉదయం ఉదయ కనిపించలేదు. "ఉదయా!" అని పిలుస్తూ పిచ్చివాళ్ళలా వెదికాం. వీధి వాళ్ళందరు గాలించారు. మా మీద కొండలు కూలాయి!!!
'స్వామీ! ఏ తప్పుకు స్వామీ ఇంత శిక్ష! ఈ పరీక్ష!' అనుకున్నాం. ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళాం. ఉదయ స్వామి ముందు కూర్చుంది. "మా కవితను మాకివ్వు" అని ఏడుస్తున్నది.
"అమ్మా! ఉదయా!" అప్పటి మా దుఃఖానికి రాళ్ళు కరిగాయి! భాష కరిగింది! పదాలు విరిగాయి! ఉదయను ఇంటికి తీసుకువచ్చాం.
అదిగో, అప్పుడు భగవద్గీత అధ్యయనం చేశాను. మానవ జీవితహానికి - కృష్ణ పరమాత్ముడు ప్రవచించిన - శ్రీ మద్భగవద్గీతను మించిన కరదీపిక లేదని అర్ధం చేసుకున్నాను. వ్యాఖ్యాతల్లో - చాలామంది గీతకు అపార్ధాలు కల్పించారు. గీత మానవుని కార్యోన్ముఖుని చేస్తుంది. సత్య దర్శనం చేయిస్తుంది. జీవితానికి అర్ధం తెలియపరుస్తుంది. గీత పరమార్ధం గలది. పారమార్ధికం మాత్రం కాదు.
దేహినో2స్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా
తథా దేహాన్తర పాప్తి ర్దీరస్తత్ర న ముహ్యతే.
'ఈ దేహానికి కౌమారం వస్తుంది. యవ్వనం వస్తుంది. వార్ధక్యం వస్తుంది. అలాంటిదే "దేహాంతరప్రాప్తి" అంటే' మరో దేహాన్ని పొందడం. అది తెలిసినవాడు చలించడు, అని ఉపదేశిస్తున్నాడు భగవానుడు!
భగవానుడు 'మరణం' అనలేదు. 'దేహాంతర ప్రాప్తి' అన్నాడు.
వరునికి బాల్యం నుంచి కౌమార్యం - కౌమార్యం నుంచి యవ్వనం - యవ్వనం నుంచి వార్ధక్యం మార్పులు మాత్రమే అలాంటిదే మరణం కూడా!
మరణం జీవితానికి అంతం కాదు. అంతమే అవుతే కవిత మాకు దుఃఖం ఎందుకు మిగిలించిపోయింది?
కవిత పోయింది.
కవితతో అనుబంధం పోలేదు.
అనుబంధం మృత్యువును మించిన బలం కలది!
ప్రకృతిలో పదార్ధానికి మార్పు తప్ప నాశం లేదు. గింజ మొక్క అవుతుంది. మొక్క వృక్షం అవుతుంది. వృక్షం బీజాలకు కారణం అవుతుంది ఇవి మార్పులు మాత్రమే - ఏదీ అంతం కాదు.
అలాంటిదే జీవితం జీవితానికి మరణం అంతం కాదు. మార్పు మాత్రమే! అందువల్ల జీవితంలో కలిగే ఏ మార్పుకూ దుఃఖించక, ఈ మార్పుకు ఎందుకు దుఃఖించడం?
మరణం మార్పు మాత్రమే అనే జ్ఞానం కలిగినవాడు దుఃఖించడు అంటాడు భగవానుడు. ఇందులో అవాస్తవం లేదు.
గీతను చర్చించడానికి ఇది సమయం కాదు.
నేను ఈ మధ్య భగవద్గీత రచించాను.
శరతల్పం:
జీవితం సంఘటనల అనంత తోరణం. అయితే అన్ని సంఘటనలూ ప్రభావం వేయవు. నా మీద ప్రభావం వేసిన ఒక సంఘటన కరిణ గురువయ్యది.
గురువయ్య డోర్నకల్లులో హమాలీ పని చేస్తాడు. అతడు జ్ఞాతతృష్ణ గలవాడు. అప్పుడప్పుడూ నా దగ్గరికి వచ్చేవాడు. మంచి విషయాలు చెప్పమనేవాడు. చెప్పింది శ్రద్దగా వినేవాడు. సంశయాలకు సమాధానాలు అడిగి తెలుసుకునేవాడు. ఆ ఆమధ్య అతడు రావడం మానేశాడు. నేనూ అంతగా గమనించలేదు.
ఒకనాటి సాయంత్రం నేను స్కూలు నుంచి వచ్చాను. బట్టలు మార్చుకుంటున్నాను. ఒకతను వచ్చి "గురవయ్యను కింద పెట్టిన్రు, రమ్మంటున్నారు" అన్నాడు. నేను పరిగెత్తాను.
గురవయ్యను భూశయనం చేయించారు. అతను చూచాడు. కంట తడిపెట్టాడు చేతులు జోడించాడు. తాను వెళ్ళిపోతున్నట్లు సంజ్ఞచేసి చూపాడు.





