Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



    "డేగా!" శిబి అన్నాడు "పావురము ప్రాణ భయమున నన్ను ఆశ్రయించినది. ఆశ్రయించిన వారిని విడుచుట ధర్మముకాదు. నీ ఆకలి మరొక ఆహారమున తీరగలదు. నీకు అనేక జంతువుల మాంసము పెట్టించెదను. పావురము నందుగల ఆగ్రహము విడువుము. దీనిని రక్షించుట నా ధర్మమూ".
    "మహారాజా! నీవు పావురమును రక్షించదలచిన దీనికి సమముగా నీ మాంసమును కోసి ఇమ్ము. తూకమున నీమాసము పావురమునకు సమానముగా ఇచ్చిన నేను పావురమును విడిచెదను" అన్నది డేగ.
    అది విని శిబి సంతోషించినాడు. "డేగా! నీవు నన్ను రక్షించినావు. నీకు నా మాంసము ఇవ్వగలను". అని తన శరీరమును కోసి త్రాసునందు ఉంచినాడు. స్వ శరీర మాంసము ఎంత ఉంచినను పావురమునకు సమానము అగుటలేదు. శిబి స్వయముగ తానే త్రాసులో కూర్చున్నాడు. త్రాసు యొక్క మరొక పళ్లెరములో ఉన్న పావురము ఎగిరినది.
    పిట్టలు ఇంద్రాగ్నులుగా మారినవి. వారు శిబిముందు ప్రత్యక్షము అయినారు. "నీ ధైర్య శౌర్యాది గుణంబు లనన్య సాధారణంబులు గావున నీ కీర్తి నిత్యంబై శబ్ద బ్రహ్మంబు గలయంతకాలంబును వర్తిల్లుచు నుండెడున"ని శిబికి వరంబిచ్చి యింద్రాగ్నులు చనిరి.

                                                                                    ఆలోచనామృతము:-

    మనుషులందరూ మానవులు కారు. మనుష్యుని మానవుని చేయుటకు నిరంతరమయిన ప్రయత్నము జరిగినది. జరుగుచున్నది. జరుగనున్నది. ఈ ప్రయత్నమందలి భాగమే రామాయణ, మహాభారత, భాగవత రచనలు.
    మనిషిలో రాక్షసుడు, మానవుడు, దైవము ఉన్నారు. సంతత యత్నము, సంస్కారము ద్వారా తనలోని రాక్షసుని చంపినవారు మానవులు. అంతమాత్రమున ఊరుకొనక మానవతను పెంచుకున్నవారు. మానవతా మూర్తులు మానవతను కూడ అధిగమించి దైవత్వమును చేరుకున్న మహాత్ములు మానవ చరిత్రలో బహుకొద్ది మంది ఉన్నారు.
    స్వార్థము, క్రోధము, ఈర్ష్య ఇవి మనిషిలోని రాక్షసత్వములు. మనిషి తన కోసము మాత్రము కాక పరుల కొఱకు ప్రయత్నించినపుడు అతనిలోని రాక్షసత్వము కొంత తగ్గును. అందులకే కుటుంబము, కులము, గ్రామము అను వ్యవస్థలు ఏర్పడినవి. అందువలన మనిషిలో కొంతలో కొంత రాక్షసత్వము తగ్గినది.
    పరుల బాధను చూచి వ్యధచెందుట, బాధలో ఉన్నవారిని ఆదుకొనుట మానవతా లక్షణము. ఇతరులను రక్షించుటకు తన సర్వస్వము అర్పించుట మానవతామూర్తి లక్షణము. భాగవతమునందలి రంతిదేవుడు అటువంటివాడు.
    సర్వ భూతములను తనవలె చూచువాడు మానవత్వమును అధిగమించినవాడు. పండితులు సమదర్శనులు. వారు పశుపక్ష్యాదుల బాధను కూడ సహించలేరు. వాటి బాధలను నివారించుటకు సహితము ఆత్మార్పణము చేయుదురు. శిబి చక్రవర్తి అటువంటివాడు.
    శిబి పక్షిని రక్షించదలిచినాడు. ప్రతిఫలము ఆశించలేదు. తననుమించిన ధర్మములేదు. అతడు దానిని దాటినాడు. తన శరీరమును కోసి ఇచ్చి ఒక పక్షి ప్రాణము రక్షించినాడు.
    ఇంతకు మించిన త్యాగము కనిపించదు. ఇది మానవతకు పరాకాష్ఠ దైవత్వమునకు దగ్గరిది. మానవుని దైవత్వము వరకు ఎదిగించుటకు అవతరించినది శిబి చక్రవర్తి కథ, అది చెప్పిన భారతము.

                                                                                           సౌగంధికము

    ధర్మరాజాదులు మరికొన్ని తీర్థములను సేవించి కాలపర్వతము చేరినారు. అక్కడికి కైలాస పర్వతము ఆరువందల యోజనముల దూరమున్నదని రోమశుడు చెప్పినాడు. ధర్మరాజునకు కైలాసమును దర్శించవలెనను ఉత్సుకత కలిగినది. అతడు భీమునితో అన్నాడు:-
    "భీమా! ఇవి పర్వత మార్గములు. ఈ మార్గములందు రథములు నడువవు. ఇవి దుర్గమ మార్గములు. కావున ఇంద్రసేనాది భటులతో నీవు, సహదేవుడు, ద్రౌపది, ధౌమ్య సహితులైన విప్రులు వెనుకకు మళ్లుడు. నేను నకులుడును వెళ్లి రోమశుడు చూపిన తీర్థములు సేవించి తిరిగివత్తుము".
    "అన్నా! ధర్మరాజా! అట్టిమాటే నీకు తగదు. అర్జునుని విడిచియున్నందులకే చింతాక్రాంతులమై ఉన్నాము. నిన్ను విడిచి భరించజాలము. ఈ వనములు రాక్షస ప్రదేశములు. నేను మీకు రక్షగా ఉండవలసి ఉన్నది. రథములతో వెళ్లజాలనపుడు ఇంద్రసేనాదులను, రథములను ఎచటనైన ఉంచి వెళ్లుదము".
    ధర్మరాజు అందుకు అంగీకరించినాడు. గంధమాదనమున అర్జునుని చూడగలమని రోమశుడు చెప్పినాడు. అర్జునుని చూచుటకు ధర్మరాజాదులు ఆతురత పడినారు. వారు గంధమాదనమునకు బయలుదేరినారు. మార్గమందు పుళిందాధిపతి అయిన సుబాహుని పట్టణము వచ్చినది. సుబాహుడు పాండవులకు ఆతిథ్యము ఇచ్చినాడు. వారు రథములను, ఏనుగులను, గుఱ్ఱములను, సారథులను అచటనే నిలిపినారు. పాండవులు, ద్రౌపది, విప్రులు పాదచారులయి ప్రయాణము సాగించినారు.
    అర్జునుని చూడవలెనని ఆతురతతో పాండవులు గంధమాదనము చేరినారు. గంధమాదన పర్వతమున అనేక శిఖరములుండినవి. వివిధములయిన పక్షులు, సింహ, శార్దూలాది క్రూర మృగములు ఉండినవి. అచట స్ఫటిక శిలలు ఉండినవి. సెలయేటి జలములు వాని మీద ప్రవహించుచున్నవి. ప్రదేశము రమ్యముగా ఉన్నది. రమణీయముగా ఉన్నది. ఆప్రదేశమును చూచి వారు చకితులు అయినారు. ఆ రమణీయతకు ముగ్ధులయినారు. అందమయిన దృశ్యములను అవలోకించసాగినారు.
    వారు అట్లు చూచుచుండగా బ్రహ్మాండమయిన గాలి చెలరేగి వీచినది. ఆ గాలి వలన మంచు లేచి దుమ్మువలె సూర్య మండలమును ఆక్రమించినది. ఆ పెనుగాలికి చెట్లు విరిగిపడినవి. కొమ్మలు విరిగినవి. కొండ చరియలు కూలినవి.    
    అమాంతముగా వచ్చిన ఆపదకు పాండవాదులు బెదిరినారు. అంధకారము వ్యాపించినట్లయి, వారికి ఏమియు కనిపించలేదు. గాలికి తట్టుకొనలేక అటు ఇటు ఉరికినారు. పొదలను, తీగలను, చెట్లను పట్టుకొనుచు వృక్ష మూలములకు చేరినారు.
    అప్పుడు ధర్మరాజు, ధౌమ్యుడు, సహదేవుడు ఒక చెట్టు క్రిందికి చేరినారు. భీముడు, ద్రౌపది ఒక చెట్టు క్రిందకు చేరినారు. రోమశ, నకుల, విప్రులు ఒక వృక్షము క్రిందకు చేరినారు.
    పెనుగాలి ఆగలేదు. దుమ్ములేచుట నిలువలేదు. ఇంతలో కారుమబ్బులు కమ్ముకున్నవి. గుండెలు అవియునట్లు ఉరుములు ఉరిమినవి. కళ్లు మిరుమిట్లు గొలుపు మెరుపులు మెరసినవి. చిటపట చినుకులు మొదలయి జోరున వాన కురవసాగినది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.