Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam



                                                        మాంధాత కథ

    "ఇది యమున, గంగతో సమానమగు పుణ్యనది, ఇచటనే పూర్వము మాంధాత అనేక యజ్ఞములు చేసినాడు" అన్నాడు రోమశుడు.
    "ఎవరా మాంధాత? అతని చరిత్ర ఏమి? తెలియపరచవలసినది" అని ప్రార్థించినాడు ధర్మరాజు. రోమశుడు మాంధాత కథ చెప్పినాడు:-
    యువనాశ్వుడు ఇక్ష్వాకు వంశపు రాజు. అతను సంతానమునకై భృగుమహర్షిని ఆశ్రయించినాడు. భృగువు పుత్రకామేష్టి చేయించినాడు. అతడు ఒక కుండ నిండ మంత్ర జలము సిద్ధము చేసి ఉంచినాడు. ఒక రాత్రి యువనాశ్వునకు దాహమయినది. తెలియక కుండలోని మంత్రజలమును త్రాగినాడు. తెల్లవారి ఈవిషయము భృగువునకు తెలిసినది. "మహారాజా! నీ భార్యకు ఇచ్చుటకు సిద్ధము చేసిన మంత్రజలమును నీవు త్రాగినావు. దైవ నిర్ణయము తప్పదు. నీగర్భము నుండి ఇంద్ర సమానుడగు పుత్రుడు కలుగును" అని చెప్పి పంపినాడు.
    యువనాశ్వుడు తన రాజ్యమునకు వెళ్లిపోయినాడు. భృగువు చెప్పినట్లు జరిగినది. యువనాశ్వుని గర్భమునుండి, ఎడమ భాగమును ఛేదించుకొని ఒక పుత్రుడు జన్మించినాడు. దేవేంద్రుడు ఆ బాలునకు తన రెండవ వేలునందు గల అమృతమును కురిపించినాడు. దేవతలు ఆ బాలునకు "మాంధాత" అని పేరు పెట్టినారు.
    మాంధాతను ఇంద్రుడు పెంచినాడు. దేవతలు అతనికి సాయము చేసినారు. దివ్యాస్త్రములు అలవడినవి, ఇంద్రుడు మాంధాతను భూలోకమునకు చక్రవర్తిని చేసినాడు.
    మాంధాత ఇంద్రుని అర్ధ సింహాసనమున కూర్చుండి రాజ్యము చేసినాడు. "అజగరము" అను ధనుస్సును, అభేద్య కవచమును ధరించి సర్వలోకములను జయించినాడు. అనేక యజ్ఞములు చేసి పద్మ సంఖ్యగల గోదానములు చేసినాడు.
    ఒకసారి భూలోకమున వర్షములు కురియ లేదు. కరువు ఏర్పడినది. ప్రజలు హాహాకారములు చేసినారు. మాంధాత ధనువు ధరించి ఇంద్రునితో ఘోర యుద్ధము చేసినాడు. ఆకాశమును మేఘములను కొట్టి వానలు కురిపించినాడు. కరువును బాపినాడు. ప్రజల బాధలు నివారించినాడు.
    రోమశుడు చెప్పిన కథ విన్నారు ధర్మరాజాదులు. యమునలో స్నానము చేసినారు. బయలుదేరినారు.

                                                     ఆలోచనామృతము

    1. మానవ ఇతిహాసమున ఇది మరొక ముఖ్య ఘట్టముగా కనిపించుచున్నది. చ్యవనుని కథయందు దేవ మానవ వైద్య సమిష్టి కృషి కనిపించినది. చ్యవనుడు అశ్వినులకు అంతస్తు కలిగించినాడు.
    దేవ మానవ సమిష్టి కృషికి మాంధాత కథ మరొక నిదర్శనము. కృత్రిమ సంతానమునకు గాను అనేక ప్రయోగములు జరుగుటను మనము ఇదివరకే గమనించినాము. ఆ దిశలో ఇది మరొక ప్రయోగము.
    భృగువు, యువనాశ్వుడు, ఇంద్రుడు కలిసి సమిష్టిగా జరిపిన ప్రయోగము. ఆడదానితో ప్రమేయము లేకుండ మగవానికే సంతానము కలిగించుట ఈ ప్రయోగపు ఉద్దేశ్యము.
    యువనాశ్వునకు భార్యలేదని నా ఉద్దేశము. ఎందుకనగా ఒక్క సందర్భమున ఆమెను గురించి తప్ప ఆమె కనిపించదు. యువనాశ్వునకు భార్య ఉన్న మాంధాతను ఇంద్రుడు పెంచవలసిన పనిలేదు.
    ఈ ప్రయోగమున యువనాశ్వునకు గర్భము కలిగించినారు. శస్త్ర చికిత్స చేసి శిశువును తీసినారు. శస్త్ర చికిత్సలో యువనాశ్వుడు మరణించి ఉండును. ఒక ప్రయోగమునకు అతడు బలి అయినాడు.
    ఈ ప్రయోగమున ఉన్న ముగ్గురిలో గర్భము కలిగించుటతో భృగువుని పని తీరినది. బిడ్డను కనుటతో యువనాశ్వుని పని తీరినది. మాంధాతను పెంచి పోషించు బాధ్యత ఇంద్రునిమీద పడినది. దానిని అతడు చక్కగా నిర్వహించినాడు.
    ఈ కథ మొత్తమున స్త్రీలు కనిపించరు. మాంధాతకు చన్నిచ్చు స్త్రీలు లేకపోయినారా? కథలలో దేవతా స్త్రీలు కూడ లేరు. స్త్రీ ప్రమేయము లేక పురుషుడే బిడ్డలను కని పెంచుటను గురించిన ప్రయోగముగా కనిపించుచున్నది.
    ఇంత సాహసవంతమయిన ప్రయోగము చేయుటకు కారణము స్త్రీల తిరుగుబాటుకాదు కదా!
    పురుషుడు గర్భము దాల్చి, బిడ్డను కనుటను గురించి వైద్య శాస్త్రజ్ఞులు తేల్చవలసి ఉన్నది.
    2. మాంధాత ప్రజారంజకుడయిన పాలకుడుగా కనిపించుచున్నాడు. ఇంద్రుడు అతనికి తల్లి, తండ్రి, గురువు అన్ని అయినాడు. అతనికి రాజ్యము ఇచ్చినవాడు కూడా ఇంద్రుడే.
    కరువులో ప్రజల బాధలను చూడలేక అతడు ఇంద్రుని మీదికే యుద్ధమునకు ఉరికినాడు. ఇంద్రుని గెలిచి అతని వద్ద వర్షవిద్య నేర్చినాడు. మాంధాత ప్రజలకు హర్షము కలిగించినాడు. ప్రజల కొఱకు తన వారిని ఎదిరించినవాడు మాంధాత.
    మాంధాత మానవాళిని బాధా విముక్తులను చేసిన మహాపురుషుడు.
    మాంధాత చరిత్రను సృష్టించినాడు.

                                                                                            శిబి చరిత్ర

    "ఇది భృగుతుంగ పర్వతము. పూర్వము ఇచట శిబి అనురాజు యజ్ఞము చేసినాడు" అని రోమశుడు చెప్పినాడు. "శిబి ఎవరు? అతని కథ ఏమి?" అని అడిగినాడు ధర్మరాజు. రోమశుడు చెప్పినాడు.
    శిబి సత్యవంతుడు. ధర్మాత్ముడు. కీర్తిమంతుడు. అతనిని అగ్ని, ఇంద్రుడు పరీక్షించదలిచినారు. దేవేంద్రుడు డేగ అయినాడు. అగ్నిదేవుడు పావురము అయినాడు.
    డేగ పావురమును తరిమినది. పావురము రక్షణకై ఉరికినది. శిబి చాటునకు పోయినది. దాగినది. డేగదానివెంట పరిగెత్తి వచ్చినది. పావురము శిబి చాటున దాగుటను గమనించినది.
    "మహారాజా! పావురము నాకు ఆహారము. దానిని తరిమి తెచ్చినాను. ఆహారమునకు విఘ్నము కలిగింపరాదు. సకల భూతములు ఆహారము వలననే జీవించుచున్నవి. నీవు పావురమును ఇవ్వకున్న నా ప్రాణములు పోవును. నా ప్రాణములు పోయిన నా భార్యా పుత్రులు జీవింప జాలరు. ఒక్క పావురమును రక్షించి ఇంతమంది చావునకు నీవు కారణము కారాదు. నీవు ధర్మజ్ఞుడవు అని విన్నాను. పావురమును ఇచ్చి నన్ను కాపాడుము".




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.