Home » Dr Dasaradhi Rangacharya » Sri Mahabharatam
అందమయిన కొండ, సుందరమయిన అరణ్యము. పెనుగాలి. జోరున వాన. ఉరుములు. మెరుపులు. హాయి. ఆనందము. వణుకు. చెట్ల క్రింద పాండవాదులు.
వాన చాలాసేపు కురిసినది. నీరు వరదలుగా పారినది. కొండ వాగులు పొంగి పొరలినవి. వాన బరువునకు చెట్లు కూలినవి.
వాన నిలచినది. వాతావరణము తడిగా ఉన్నది. పరిసరములు తడితడిగా ఉన్నవి. నేల తడితడిగా ఉన్నది. చెట్లు తడితడిగా ఉన్నది. మనుషులు తడిగా ఉన్నారు. మనుషుల మనసులు తడితడిగా ఉన్నవి.
పాండవాదులు నడక సాగించినారు. మార్గములు దుర్గామములు--మిట్ట పల్లములు-రాళ్లు- గుట్టలు- ముళ్లు- మోళ్లు అందరు నడచినారు. ద్రౌపది అలసినది. నీరసించినది. నడువజాలక పోయినది. పడిపోయినది. మూర్చిల్లినది.
మూర్చిల్లిన ద్రౌపదిని చూచినాడు ధర్మరాజు. దుఃఖించినాడు. విలపించినాడు. "ద్రౌపది పాదములు తామరరేకుల వంటివి. కరకు నేలన నడచి నెత్తురులు పడుచున్నవి. మెత్తని పానుపులు మాత్రము ఎరిగిన ద్రౌపది కరకు రాలమీద పడుకొనుచున్నది. ద్రుపదుడు ఈమెను మాకు ఇచ్చినపుడు సుఖపడును అనుకున్నాడు. ఈమె ఈరీతిగా ఇక్కట్ల పాలయినది" అని ఏడ్చినాడు. ధౌమ్యాదులు ధర్మరాజును ఊరడించినారు. చల్లని మంచుగాలికి ద్రౌపది మూర్ఛ తేరుకున్నది. అందరిని చూచినది. తన స్థితి చూచుకున్నది. దిగ్గున లేచి కూర్చున్నది. మొగ్గవలె ముడుచుకున్నది.
"అన్నా!" భీముడు అన్నాడు. "ద్రౌపది నడువజాలకున్నది. లక్క ఇంటి కథ సందర్భమున నాకును హిడంబకు పెళ్లి జరిగినది. మాకు ఘటోత్కచుడు కలిగినాడు. అతడు బలవంతుడు. మనము తలచినపుడు వచ్చును. అతనిని రావింతును. అతని వలన సాయము లభించును.
ధర్మరాజు అంగీకరించినాడు. భీముడు పిలచినాడు. ఘటోత్కచుడు వారి ఎదుట వాలినాడు. తండ్రులకు నమస్కరించినాడు. బాపలకు మ్రొక్కినాడు. తనను రావించిన పనిని గూర్చి అడిగినాడు.
"నాయనా! ఘటోత్కచా!" భీముడు అన్నాడు. "ఈమె నీకు తల్లి ద్రౌపది. మిక్కిలి శ్రమచెంది ఉన్నది. నడువజాలకున్నది. నీవు ఈమెను ఎత్తుకొని మావెంట రావలెను".
ఘటోత్కచుడు ద్రౌపదికి నమస్కరించినాడు. తండ్రి భీమునితో అన్నాడు:-
"తండ్రీ! ఈ మార్గములు దుర్గమములు. కాలినడకన సాగుట దుస్తరము. ద్రౌపది మాతనేకాదు మీ అందరిని ఎత్తుకొని ఆకాశమార్గమున వెళ్లుటకు నాకు తగినంత పరివారమున్నది".
ఘటోత్కచుడు, అతని పరివారము అందరిని ఎత్తుకున్నారు. ఆకాశమార్గమున సాగినారు. వారు గంధమాదన పర్వతము చేరినారు.
పాండవులు అక్కడ వయ్యారమున పారు గంగను చూచినారు. గంగా తీరమున బదరీ వనమును చూచినారు. నర నారాయణుల ఆశ్రమము దర్శించినారు. గంగానదిలో స్నానములు చేసినారు. మైనాక పర్వత, హిరణ్యశిఖర, బిందు సరోవరములను చూచినారు పాండవులు బదరికాశ్రమమున ఆరు రోజులున్నారు.
ఒకనాడు భీముడు, ద్రౌపది గంధమాదనమున విహారమునకు వెళ్లినారు. అవి రమణీయ ప్రదేశములు. ప్రకృతి పులకించు స్థలములు, కొండలు, చెట్లు, మంచు, సెలయేళ్లు, జలపాతములు, పక్షులు పారావతములు, మత్తుగొలుపు వాతావరణము, మైకము తెప్పించు గాలి. గాలి పరిమళములు మోసి తెచ్చినది, బాగున్నది, గాలి సౌగంధిక పద్మమునే తెచ్చినది. సౌగంధిక పుష్పము ద్రౌపదీ, భీముల ముందు వాలినది.
సౌగంధికము కమలము. అందమయినది. సువాసనలు విరజిమ్మునది. మృదువైనది సుకుమారమయినది. ద్రౌపది సౌగంధికమును చూచినది. అందుకున్నది వాసన చూచినది మురిసినది. భీముని చూచినది. ఆమె కనులో ఆనందము ఉన్నది. మురిపెము ఉన్నది. అన్నది:-
"నాథా! ఇది పూవు! ఎంత అందముగా ఉన్నది. ఒక్క పూవు మనసును ఊరించుచున్నది. ఇటువంటి పూలు మరిన్ని తేవా! నన్ను మురిపింపవా?"
భీముడు ఆమె ఆనందమును చూచినాడు. మ్రోడు విరబూసినట్లు అనిపించినది. "ద్రౌపదీ! నీ కోరిక తీర్తును. పూలు తెత్తును. నీకిత్తును. మురిపింతును" అన్నాడు.
ద్రౌపది ఆ ఒక్కపూవును ధర్మరాజునకు ఇచ్చినది.
భీముడు సౌగంధికము తెచ్చుటకు బయలుదేరినాడు. అతడు బంగారు ధనువును ధరించినాడు. ఖడ్గమును దాల్చినాడు. సాగినాడు. సౌగంధికము వచ్చిన గాలినిపట్టి సాగినాడు. తుమ్మెదల ధ్వనులను వినుచు, కోకిలల కూతలను ఆలకించుచు, పుష్పముల సువాసనలను ఆఘ్రాణించుచు, ఉల్లాసముగా భీముడు సాగినాడు. అతడు ఎదురుగా వచ్చిన మృగములను చంపినాడు. ఏనుగులను ఎత్తి ఏనుగుల మీదను, సింహములను ఎత్తి సింహముల మీదను వేసి చంపినాడు. అతని వేగామునకు దేవ, గరుడ, గంధర్వ, కిన్నెర, కింపురుష స్త్రీలు బెదరి గుహలలో దాగి భీముని చూచినారు. అతడు చెట్లను విరిచినాడు. తీగలను పెరికినాడు. అతడు సింహనాదము చేసినాడు. ఆ నాదమునకు పక్షులు బెదరి గుంపులు గుంపులుగా లేచి ఎగిరిపారినవి. భీమునకు ఆ పక్షుల రెక్కలు తడిసి కనిపించినవి. దానినిబట్టి దగ్గరలో కొలను ఉన్నదని గ్రహించినాడు. అటు నడిచినాడు. అక్కడ అతనికి విశాలమయిన సరస్సు కనిపించినది. అది అందముగా ఉన్నది. ఆహ్లాదకరముగా ఉన్నది. భీముడు ఏనుగువలె అందు ప్రవేశించినాడు. స్నానము చేసినాడు. బయటకు వచ్చి శంఖనాదము చేసినాడు. ఆ శంఖనాదమున దిక్కులు పిక్కటిల్లినవి.
గంధమాదనమందు ఒక గుహలో హనుమంతుడు ఉన్నాడు. అతడు భీముని శంఖనాదము విన్నాడు. భీముడు మహాబలవంతుడని కనుగొన్నాడు. అతనిని పరీక్షించ దలచినాడు. భీముని మార్గమున వృక్షములను వేసినాడు. తాను దారికి అడ్డముగా పడుకున్నాడు. తోకను ఆడించినాడు. తోక ఆడించిన ధ్వనికే అల్లకల్లోలము అయినది. మృగములు కకావికలయి పరుగులు తీసినవి. పక్షులు కేకలు పెట్టుచు, ఎగిరి ఆకాశమును ముంచివేసినవి.
భీముడు ఆధ్వని విన్నాడు. ఆశ్చర్యపడినాడు. అటు వచ్చినాడు హనుమంతుని చూచినాడు. అతడు మహాకాయుడు బలస్వరూపుడు. విశ్వరూపుడు. తోకను టెక్కెమువలె నిలిపినాడు. యోగనిద్ర నటించినాడు.
భీముడు మారుతిని చూచినాడు. అతని యోగనిద్రను గమనించినాడు. మారుతికి నిద్రాభంగము కలిగించదలచినాడు. తన శక్తినంతయు కూడదీసుకొని సింహనాదము చేసినాడు. మారుతి చలించలేదు. భీముడు మరింత గట్టిగా అరచినాడు.
హనుమంతుడు మెల్ల మెల్లగా కనులు తెరచినాడు. భీముని చూచినాడు. నిర్లక్ష్యముగా అన్నాడు:-
"ఎవరవయ్యా నీవు? ఏల నాకు నిద్రాభంగము కలిగించినావు? పశు, పక్షి, మృగాదులు ధర్మమును ఎరుగజాలవు. సర్వ భూతదయాస్వరూపమగు ధర్మమును మానవులు ఎరుగుదురు. నీవు మానవుడవు. ధర్మమును ఎరుగక మాబోటి పెద్ద మృగములకు నిద్రాభంగము కలుగునట్లు గర్జించుచున్నావు. ఈ వనములు నరులకు గోచరములు కావు. నీవు ఎవరవు? ఇచ్చటికి ఏల వచ్చితివి? వివరింపుము".





