Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    4. నిజాం నవాబు ముస్లిముల సహితంగా తన ప్రజలను నమ్మలేదు. ఈ న్యూనతాభావమే ఆనాటి ముస్లిముల్లో అలజడి కలుగచేసింది. ఆ ఫలితంగానే ముల్కీ నిబంధనలు వచ్చాయి. స్వాతంత్ర్యం వచ్చింది. కాబట్టి యువకులు ఉద్యోగాలు తమ హక్కు అని భావించారు.
    
    అటు మద్రాసు ఆంధ్రంలోని పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి:
    
    1. అక్కడ తెలుగులో విద్య ప్రారంభం అయి చాలాకాలం అయింది. స్వచ్చంద విద్యాసంస్థలు అనేకం వెలిశాయి. విద్యావంతులు ఎక్కువయినారు. ప్రభుత్వ ఉద్యోగం ప్రతిష్టాకరం అయింది. చదువుకున్నవారు ఉద్యోగాలకు ఎగబడ్డారు. ఉద్యోగాలు కరువయినాయి. ఉద్యోగాలక్సోం అర్రులు చాస్తున్నారు.
    
    2. పోలీసు చర్య జరిగింది. భారత ప్రభుత్వం నిజాం అధికారులను నమ్మలేదు. తాసిల్దారు స్థాయినుంచి పై ఉద్యోగాలకు అధికారులను మద్రాసాంద్రం నుంచి దింపింది. వారు - దొడ్డిదారిన ముల్కీలు సాధించి, తమ వారిని తెలంగాణం ఉద్యోగాల్లో నింపారు.
    
    3. నిరుద్యోగులయిన మద్రాసాంద్ర యువకులు తెలంగాణం మీద పడ్డారు. వారికి తెలిసినన్ని ఎత్తులు స్థానిక యువకులకు తెలియవు. వారు ముల్కీలు - ఉద్యోగాలు - సులభంగా సాధించగలిగారు. స్థానికులకు ముల్కీ సాధించడమే కష్టం అయిపోయింది.
    
    ఈ పరిస్థితుల్లో అసంతృప్తి - అసహనం - న్యూనతాభావం - అభద్రత తమకు ఇక ఉద్యోగాలు దొరకవనే ఆతురత విద్యావంతులయిన - కానున్న విద్యావంతులలో అలజడికి కారణం అయింది. అల్లర్లు చెలరేగాయి.
    
    ఇక్కడ ఒక ప్రకృతి సూత్రం గమనించాలి. తమిళులు తమకు ఉద్యోగాలు రానివ్వడం లేదని మద్రాసు ఆంధ్రులు ఆంద్రరాష్ట్రం సాధించారు. వారు ఉద్యోగాన్వేషణలో తెలంగాణ యువకులమీద తమ తెలివితేటలు చూపారు.
    
    నీరు పల్లానికి ప్రవహిస్తుంది!
    
    జనం ఉద్యోగాలు ఉన్నచోటకి ఉరుకుతారు!!
    
    ఇప్పుడు విదేశాలకు ఉరుకుతున్నారు!!!
    
    విచిత్రం అయిన విషయం స్వాతంత్ర్యం వచ్చి నలభయిఏడేళ్ళయింది. రాజ్యాంగంలో ఎన్నడో సమానతా సూత్రాన్ని పొందుపరచుకున్నాం. ఇప్పుడు సుమారు అన్ని రాష్ట్రాల్లోనూ - బూజుపట్టిన ముల్కీవంటి - స్థానిక నిబంధనలు ఏర్పడినాయి!
    మన నడక ముందుకా? వెనక్కా ? ఆలోచించాలి!
    
డోర్నకల్లు :
    
    నేను ఇంటర్ పాసయ్యాను. ఆ రోజుల్లో ఇంటర్ పాసయినవారే అరుదు. డోర్నకల్లు స్కూల్లో అదే సంవత్సరం ఎనిమిదవ తరగతి ప్రారంభించారు. డోర్నకల్లుకు నా అవసరం ఉంది అని మిత్రులు గండి మల్లికార్జునరావుగారు భావించారు. నన్ను పెరుమాళ్ళ సంకీస నుంచి డోర్నకల్లుకు బదిలీ చేయించారు. ఛార్జి ఇవ్వడం అనే లాంఛనానికి కాదు - ఆ ఊరి అనుబంధం - ప్రజల అనురాగం ఆత్మీయతలకు కృతజ్ఞతలు చెప్పడానికి - కాలినడకన - సంకీస చేరుకున్నాను.
    
    
    సంకీసలో నా బదిలీ వార్త అప్పటికే వ్యాపించింది. స్కూలుకు వెళ్ళాను. పిల్లలు నన్ను కదలనివ్వనన్నారు. అప్పటికి "ఘోరావ్" అనే పదం లేదు. అంత పని చేశారు. తుమ్మా శేషయ్య నాయకత్వాన ప్రజలు గుంపులుగా వచ్చారు. 'వాళ్ళకే బలం ఉందా? మాకూ ఉంది. బదిలీ రద్దు చేయిస్తా మన్నారు. వారికి నా అవసరాలు విన్నవించాను.
    
    1. నేను బి.ఏ. చదువుకోవాలి. డోర్నకల్లులో కొంత వీలుంటుంది.
    
    2. నా బావమరిది రమణకు నాలుగవ తరగతి అయిపోయింది. వేరే చోట ఉంచి చదివించే స్తోమత నాకు లేదు.
    
    3. గార్లకు అందుబాటులో ఉంటాను. అమ్మను ఆదుకోవడానికి వీలుంటుంది.
    
    నా సౌకర్యాలదృష్ట్యా వారు కొంత మెత్తపడ్డారు. కాని మనసును మెలిపెట్టిన సంఘటన పెరుమాళ్ళాచార్యుల వారిది. వారు అర్చకులు, పెద్దలు, విద్వత్తు గలవారు.
    
    వారు కర్ర పట్టుకొని - నడవలేక నడవలేక - స్కూలుకు వచ్చారు. వారిని చూచి లేచి నుంచున్నాను. అందరూ నుంచున్నారు. వారు కుర్చీలో కూర్చున్నారు. ఆయాసం తీర్చుకున్నారు - అన్నారు.
    
    "ఆ పెరుమాళ్ళు నీకేమి అపకారం చేసిండని ఊరు వదిలిపోతావు నాయనా?"

    నా గుండెలోని సంద్రాలు - పున్నమి చంద్రుని చూచినట్లు - పొంగాయి. అంత అభిమానం భరించరానిది అయింది. నేత్రములు సజలములు అయినాయి. పెరుమాళ్ళాచార్యులవారి పాదాలమీద పడ్డాను.

    "స్వామీ! అట్ల అనొద్దు. పెరుమాళ్ళు ఉపకారమే కాని - అపకారం చెయ్యరు. నా స్వార్ధం కోసం పోతున్న, ఆశీర్వదించండి."
    
    "నాయనా! పాఠశాల మరికొంత అభివృద్ధి చెందిన తరువాత పోలేవా?"
    
    శేషయ్యవారికి వివరించారు.
    
    "పెరుమాళ్ళ సంకీసకు ఇంతే ప్రాప్తం ఉన్నది. వెళ్లిరా నాయనా!" అన్నారు.
    
    వారిని చేయిపట్టుకుని ఇంటిదాకా తీసికెళ్ళాను. వారికి పాదాభివందనం చేశాను. ఆశీస్సులు అందుకున్నాను. "వెళ్ళేటప్పుడు స్వామివారిని దర్శించుకుని వెళ్ళు" అని పంపించారు.
    
    విషయం గ్రహించినట్లున్నారు. మల్లికార్జునరావుగారు వచ్చారు. వారు రాజకీయులు. గ్రామస్తులకు నచ్చచెప్పగలిగారు. గ్రామస్తులు కమలను - ఉదయను - కవితను తీసుకొని వచ్చారు. కోవెలలో మాతో కళ్యాణం చేయించారు. భోగాలు చేయించారు. ఒక ఉత్సవం జరిపారు. బండివెంట ఊరి బయటిదాకా వచ్చి - పెళ్ళికూతురును వలె - మమ్ములను సాగనంపారు.
    
    నేను ఒక్కొక్కరినీ కౌగలించుకుని శలవు తీసుకున్నాను.
    
    మా బండి సాగిపోతున్నది    
    
    జనం ఇంకా నిలిచి చూస్తున్నారు!
    
    నాడు నాలో కలిగిన భావోల్బణం చెప్పడానికి నేటికీ నాకు పదాలు దొరకడం లేదు!!
    
    భావాలను సమగ్రంగా వెల్లడించగల భాష పుట్టదు!!!
    
    డోర్నకల్లు - తోరణకల్లు - ఆనాటి దక్షిణాపథ జనజీవితానికి నాడి వంటిది. వంద ఏళ్లక్రితం ఇల్లందు - బొగ్గుట్టలో తొలి సింగరేణి బొగ్గు గని వెలసింది. ఇల్లందును ప్రధాన రైలుమార్గంతో కలపడానికి గార్ల అనువయింది. గార్ల జంక్షన్ అవుతే జనం తెలివి మీరుతారని జాగీర్దారు అనుమతించలేదు. అందువల్ల గార్లకు కేవలం మూడు మైళ్ళలో ఉన్న డోర్నకల్లు నుంచి ఇల్లందుకు రైల్వే లైను వేశారు. అక్కడి నుంచే దక్షిణా పథానికి బొగ్గు సరఫరా అయింది. అప్పుడు రైళ్లన్నీ బొగ్గుతోనే నడిచేవి. బొగ్గు నింపుకోవడానికి - గాంధీజీ బండి సహితంగా - అన్నీ డోర్నకల్లులో ఆగేవి.
    
    జాగీర్దారు పలుకుబడితో - వారు వేటకు రావడానికి అనువుగా - గార్లలో స్టేషను ఏర్పడింది. ఆ రోజుల్లో మూడు మైళ్ళలో స్టేషను ఉన్నది గారాల మాత్రమే. స్టేషను చిన్నది అయినా ఎప్పుడోగాని రాని జాగీర్దారు కోసం వెయిటింగ్ రూము ఏర్పాటయింది. వారు వచ్చినపుడు దిగడానికి అన్ని సౌకర్యాలు గల "రాహత్ మహల్" విశ్రాంతి గృహం సిద్దం చేయించుకున్నారు. నవాబు వచ్చినపుడు రైలుపెట్టెనుంచి "రాహత్ మహల్" లోపలివరకు తివాచీలు పరచేవారు. వారు ఉన్నన్నాళ్ళూ - ప్రతి రోజూ - హైదరాబాదు నుంచి మంచి నీళ్ళు వచ్చేవి. మరిన్ని వివరాలు "మోదుగుపూలు" నవలలో వ్రాశాను.
    
    డోర్నకల్లులో ప్రధాన చర్చి ఉన్న విషయం మనవి చేశాను. మిషనరీలు ఒక ఆసుపత్రి - ఒక స్కూలు మున్నగు సంస్థలు నిర్వహించారు. డోర్నకల్లు ఊళ్ళో పల్లె వాతావరణం - రైల్వే ప్రాంతంలో పారిశ్రామిక వాతావరణం - మిషనరీ ప్రాంతంలో మత వాతావరణం కనిపిస్తాయి.
    
    నేను డోర్నకల్లు స్కూల్లో జాయన్ అయినాను. ఆ రోజే ఆ స్కూలును పదో తరగతి వరకు పెంచే బాధ్యత మల్లన్న - మల్లికార్జునరావు - నాకు వప్పగించారు. కొన్నాళ్ళు గార్లలోనే మకాం పెట్టాను. వచ్చిపోయేవాణ్ణి తరువాత అది కుదరలేదు.
    
    1. పోస్టింగు ఉన్న ఊళ్ళోనే ఉండాలని ఒక నియమం. శలవు తీసుకున్నపుడు 'తర్కె ముస్తఖర్' అంటే - హెడ్ క్వార్టర్ వదిలే అనుమతి తీసుకోవలసి వచ్చేది. ఈ నియమాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రభుత్వం వాటిని మార్చదు. పాటించదు. నియమాలు స్థావరాలు, జీవితం జంగమం. ప్రభుత్వాలకు ఇది అర్ధం కాదు.
    
    ఉన్న నియమాలను పాటించాలనేది నా నియమం.
    
    2. బోధనా బాధ్యత - క్లాసులు పెంచే విషయంలో నిమగ్నత నన్ను గార్లలో ఉండనీయలేదు.
    
    నాకు మెట్రిక్ చదువుకోవడానికి వసతి కల్పించిన అనంతరామయ్య - సీతమ్మలు నన్ను వారి ఇంట్లో ఉండమన్నారు. అయితే, మనిషి ఇరుకు కావడం అప్పుడే ఆరంభం అయింది. ఆశ జీవితానికి అవసరం కాని, దురాశ అంకురించింది. నాకు చదువుకోవడానికి ఇచ్చిన హాలు అద్దెకు ఇచ్చారు. ఇంటికి ఒక పక్కగా ఉన్న 'పక్కా' పశువుల కొట్టంలో ఒక గదికి తడకలు కట్టించి మా నివాసానికి ఇచ్చారు. ఒకవైపు పశువులు - ఒకవైపు మేము ఉండేవాళ్ళం. అలా ఉండడానికి కొంత ఆర్ధిక దుస్థితి కొంత ఆత్మీయుల మధ్య ఉండాలనే ఆతురత కారణాలు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.