Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
రమణను నేను ఉంచుకొని చదివించడం అతని జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు. అతను చదువుకున్నాడు. వృద్దిలోకి వచ్చాడు. మిగతా పిల్లలకూ కొంత సాయం చేశాను. అంతా బావున్నారు. తాను నాటిన మొక్క పూస్తుంది, కాస్తుంది. అప్పుడు ఆనందం కలుగుతుంది.
వ్యక్తుల జీవితాల్లో ఇలాంటి మలుపులు ఉంటాయి. పడవ సాగిపోయి ఉంటే ప్రకాశం పంతులు ఆంధ్రకేసరి అయ్యేవారు కారు.
ఒకనాడు వార్త వచ్చింది. కమల కన్నది - ఆడపిల్ల మళ్ళీ ఆడపిల్ల అని నేను బాధ పడలేదు. నాకు ఆడ - మగ సమానమే. మా చెల్లెళ్ళ విషయంలోగాని - మా పిల్లల విషయంలోగాని ఇసుమంత వ్యత్యాసం చూపలేదు, చూపడం లేదు, చూపను.
ప్రకృతిని మించిన వింత ఏ లోకంలోనూ లేదు తనకు బిడ్డ కలిగిందంటే తల్లిదండ్రుల మనసుల్లో సముద్రాలు పొంగిస్తుంది. ఆనంద డోలికల్లో ఊపుతుంది. ఆతురత పెంచుతుంది. పరిగెత్తాలి - నా కూతురును చూడాలి. ఇదీ నా తొందర, ఉరుకు, పరుగు.
ఆ రోజుల్లో వాన పట్టుకుంటే వారాల కొద్ది వదిలేది కాదు. కుంభవృష్టి కురుస్తున్నది. ఏరులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. సంకీస జల దిగ్భంధంలో ఉంది. అయినా ఉరకాలె. పట్నం చేరాలె. కమలనూ - పాపనూ చూడాలె. అందరూ వారించారు. ప్రాణాలతో పట్నం చేరవు అన్నారు. ఎవరూ తోడు రాము అన్నారు.
సాహసం చేశాను. ప్రేమ అలా చేయించింది. ప్రేమ ప్రేయసీ ప్రియుల మధ్య మాత్రమే ఉంటుందనడం వట్టి భ్రమ. లోకం సాంతం ప్రేమ మీద ఆధారపడి ఉన్నది - సర్కారు మీద కాదు. ప్రేమ పర్యవసానం చూడదు. ఫలితం ఆశించదు. ఏ ఫలితం ఆశించి మనం పిల్లలను ప్రేమిస్తున్నాం? త్యాగాలు చేస్తున్నాం?
సాహసంగా ఒక గొడుగుతో వంటరిగా బయలుదేరాను. ఈదురుగాలితో వాన ఎడా-పెదా కొడుతున్నది. కాలిబాటలు కాలువలయినాయి. చెప్పులు తొలిదెబ్బకే కొట్టుకుపోయాయి. గొడుగు గాలికి ఎగిరిపోయింది. వాన ముఖానికి కొడుతున్నది. నిర్మానుష్యం దుఃఖం ముంచుతున్నది. ఉరుములు, మెరుపులు, ఫెళఫెళారావాలు. ఎక్కడో పిడుగు పడింది.
నేను సాగుతున్నది సూటిబాట కాదు. చుట్టుబాట. ఈ బాటలో కాలవలు తప్ప నదులు లేవు. రామాపురం వద్ద రైలు వంతెనమీంచి గార్ల చేరుకోవాలి.
మబ్బులు చిమ్మచీకట్లు చేశాయి. వానలో పూర్తిగా తడిశాను. జల్లు దంచి కొడుతున్నది. అయినా ఆగలేదు. వంటరిగా సాగుతున్నాను. పిల్ల కాలువ అడ్డం వచ్చింది. మామూలుగా పిల్ల కాలవే! అప్పుడు వాగులా సుళ్ళు తిరుగుతూ పారుతున్నది. నాకు ఈతరాదు. దాని లోతు తెలియదు!
చింతచెట్టు కింద నిలిచాను. వణుకుతున్నాను. పిట్టలు కూడా చెట్టు కొమ్మల్లో తల దాచుకున్నాయి చలి!
కూపోదకం, వటచ్చాయా, తాంబూలం, తరుణీకుచం
శీతకాలేతు ఉష్ణంవా ఉష్ణకాలేతు శీతలం!
బావి నీరు - మర్రి నీడ - తాంబూలం - పడుచుపిల్ల చన్నులు చలికాలంలో వెచ్చగాను, ఎండకాలంలో చల్లగానూ ఉంటాయట! అవి దొరకవు సరె, కప్పు వేడి చాయ్ - ఒక్క సిగరెట్టు వున్నా ఎంత బావుండేది? అది ఊహ - వాస్తవం ముందర వాగు!
సాహసం చేశాను. వాగులో దిగాను. మునిగాను. ప్రవాహ వేగానికి కొట్టుకుపోతున్నాను. తలపైకి వచ్చినపుడు ఊపిరి పీల్చుకుంటున్నాను. చివరి గడియలు లెక్కిస్తున్నాను. దైవ కృప ఒక చెట్టు అందింది. చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నాను. మళ్ళీ సాగాను. రామాపురం చేరాను. పరవళ్ళు తొక్కుతున్న ఏటిని రైలు వంతెన మీంచి దాటాను. గార్ల చేరుకున్నాను.
అమ్మ నన్ను చూచింది. దడుచుకున్నది. "ఏందిర ఈ సాహసం!" అని తల తుడిచింది. పొడి బట్టలు ఇచ్చింది. వేడి వేడి చాయ్ ఇచ్చింది. రెండు కప్పులు త్రాగాను. సిగరెట్టు దమ్ము వదులుతుంటే Coffee and Cigarett are good combination as lyric and beautiful girl అన్న ఒక ఆంగ్ల రచయిత వచనాలు గుర్తుకు వచ్చాయి!
'ఎంత కన్నబిడ్డ అయితే మాత్రం ఇంత సాహసం చేస్తవా?' అని నన్ను కోప్పడ్డ అమ్మ మనవరాలిని చూడడానికి, పెసరకాయలు - మొక్కజొన్న కంకులు తీసుకొని బయలుదేరింది.
హైదరాబాదులో దిగి - ఆగాపురాలో ఉన్న కమల మేనమామ ఇంటికి పరిగెత్తాం. కమల పాపను పక్కలో పెట్టుకుని మహదానందంగా ఉంది. నన్ను చూడ్డంతో అది ఇనుమడించింది. వాట్శావంగా కమల అందం నెమరువేస్తున్నది. అయినా - ప్రకృతి చిత్రం - పాపమీదికే దృష్టిపోయింది. కాకిపిల్ల కాకికి కాదు కాని, పాప వాస్తవంగా నిండుగా - ముద్దుగా ఉంది. చూస్తూ ఉండిపోయాను.
"రంగడూ! కాలికేమో తొక్కినావు చూసుకో" అన్నది అమ్మ నేను కలువైపు చూచుకున్నాను. ఏమీ లేదు, ఇంతలో అమ్మ పాపను ఎత్తుకుంది. "అట్లచూడకు కన్నవారి దృష్టి చెడ్డది అంటారు" అన్నది.
ఉదయ పక్కనే నుంచుంది. గమనించలేదు. అప్పుడు ఎత్తుకుని ముద్దాడాను.
పాపకు 'కవిత' అని పేరు పెట్టాం.
కమల తల్లిగారింటికి - నేను సంకీస వెళ్ళాం.
ఆ వేసవిలో వరంగల్లు కాలేజీలో ఇంటర్ పరీక్ష వ్రాశాను. ద్వితీయ శ్రేణి - సెకండ్ క్లాసులో - పాసయినాను. ఆ రోజుల్లో సెకండ్ క్లాసే గొప్ప. అది 1954.
ఆ వేసవిలో మా రెండవ చెల్లెలు రమాదేవి వివాహం - భద్రాచలానికి చెందిన గొట్టుపుళ్ళ శేషాచార్యులవారితో జరిగింది. భద్రాచలంలో 'నేనూ లక్ష్మణాచార్యులూ కలిసి ఆడుకున్నామురా' అని నన్ను ఆప్యాయతగా దగ్గరకు తీసుకున్న ఆ మహనీయ సన్నివేశం మరువరానిది. ఆ పెద్దమనిషి అమరవాది శేషాచార్యులూ మా పితామహులు కలిసి ఆడుకున్నారట!
దాశరథి స్థలం అనేదాన్ని చూచాను.
చిక్కని అడవిలో కాలిబాటన నేనూ - బావగారూ, పర్ణశాల వెళ్ళాం. ఆ రమణీయ ప్రదేశంలో నిజంగా సీతారాములు నివసించినట్లనిపించింది. అక్కడ గోదావరి - ప్రవాహం - మార్చుకోదు ఎల్లకాలాల్లోనూ ఆ దీవికి నీరు ఉంటుంది. సీతమ్మ అక్కణ్నుంచే నీళ్ళు ఎత్తుకుపోయిందేమో అనిపిస్తుంది. పక్కనే 'సీతవాగు' ఉంది. అక్కడ ఆ తల్లి స్నానం చేసింది. అక్కడ పసుపు కుంకుమరాళ్ళు దొరుకుతాయి. రాళ్లమీద చీరలు ఆరేసిన చారలు కనిపిస్తాయి. గోదావరికి ఆ దరిన "రథంగుట్ట" మీద సీతమ్మను ఎత్తుకుపోతున్న రావణుని రథచక్రాల జాడలు కనిపిస్తాయి. జటాయువుతో యుద్ధం చేసిన చోట ఒక పెద్ద గొయ్యి కనిపిస్తుంది.
నదీతీరాన వంటరి శోకరాముని చిన్న ఆలయం ఉంది. అక్కడి పూజారి భార్యాహీనుడు కావాలట,భార్య ఉంటే చనిపోతుందట!
తరువాత కాలంలో భూకంపంలో ఆ ఆలయం కూలిపోయింది. ఈ మధ్య మళ్ళీ వెళ్ళాం. అడవిని క్షవరం చేశారు. నేల నున్నగా ఉంది. ఆలయం కొత్తది కట్టారు. జనారణ్యం వెలిసింది. నాటి ఆనవాళ్ళు ఏమీలేవు.
ఇక్కడేనా సీతారాములు నివసించింది అనిపించింది!
ముల్కీ ఉద్యమం :
ఆ రోజుల్లోనే విద్యార్ధులు ముల్కీ ఉద్యమం లేవదీశారు. అప్పటికి ఇంకా హైదరాబాదు రాష్ట్రమే! బూర్గుల రామకృష్ణారావుగారే ముఖ్యమంత్రి!
విద్యార్ధులు - ముఖ్యంగా హైదరాబాదు నగరంలో - ముల్కీ అల్లర్లు ప్రారంభించారు. గోడల మీద "ఇడ్లీ సాంబార్ గో బాక్" అని వ్రాశారు. ఊరేగింపులు, సభలు జరిపారు. నిజాం కాలేజీ ముందు విద్యార్దుల మీద పోలీసు కాల్పులు జరిగాయి. అది అంతటితో సర్దుమణిగింది. ఇవి విద్యార్ధులలో అసంతృప్తి అసహనం వల్ల వచ్చిన ఉద్యమం - అల్లరి ఇందుకు కారణాలు లేకపోలేదు:
1. తెలంగాణలో తొలి ఎన్నికల తరువాతనే - 1952 లో కల్లోలాలు తగ్గాయి. ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయి. విద్యావిషయికంగా అప్పుడే కన్ను తెరుస్తున్నది. H.S.C తెలుగు బాచ్ ఆ సంవత్సరమే వచ్చింది.
2. విద్యాసంస్థలు ప్రారంభించడం - విస్తరించడం లో ఒక ప్రజా ఉద్యమం వచ్చింది. అయితే అది ఇంకా దిగువస్థాయిలో - ఏడు ఎనిమిది తరగతుల వరకే స్థిమితం అయింది. కాలేజీల సంఖ్య నైజాంనాటికంటే పెరుగలేదు.
3. నిజాం కాలంలో తెలంగాణలో హిందువులకు ఉద్యోగాలు లభించవు అని ప్రజలు తేల్చుకున్నారు. వారు తమ వృత్తులలోనే స్థిరపడ్డారు. మానసికంగా ఉద్యోగ అన్వేషణ సంసిద్దత అప్పుడప్పుడే మొదలయింది.





