Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
గ్రామస్తులు ఓదార్చారు. కన్నీటితో కదలరాదన్నారు. కళ్ళు కడిగించారు. బండి ఎక్కించారు. తాతయ్య సహితంగా అందరూ ఊరి బయటిదాకా వచ్చారు.
"రంగడూ! ఆ శ్రియఃపతి నీయందున్నాడు. 'సుఖాస్తుతే పంథ్యాః' - మార్గము నీకు సుఖప్రదము అవుతుంది" అని తాతయ్య చెమ్మగిలిన కనులతో నిలచిపోయారు. మా బండి కనుచూపుమేర దాటింతరువాత కదిలారు.
వారు పెద్దలు మలినము ఎరుగని మనసున్నవారు. తాతయ్య మాట శతథా సత్యమయింది. తాతయ్య పరమపదించిన విషయం మాకు తెలియపరచలేదు - మేము ఆస్తి అడుగుతామని! తండ్రి చావు తెలిసి వెళ్ళిన మా అమ్మను అభిమానించలేదు.
కరువు :
ఆ సంవత్సరం కరువు. త్రాగేనీరు దొరకడం గగనం అయింది. కరువులు మనకు సర్వసాధారణం పురాణాలలో కరువులు కథలు అనేకం.
ఒకసారి పన్నెండేళ్ళు వరుసగా కరువు వచ్చింది. విశ్వామిత్రునికి కాయ, గసరు, మాంసం ఏదీ లభించలేదు. ఒకనాటి రాత్రి ఒక మాలగూడెంలో - చర్మం తీసి ఆరగట్టిన కుక్క మాంసం కనిపించింది. కుక్కమాంసం దొంగిలిస్తుండగా మాలతను పట్టుకున్నాడు. విశ్వామిత్రుని గుర్తించాడు. 'ఇంతటివాడవు - ఈ పని చేయవచ్చునా?' అని అడిగాడు. "ప్రాణరక్షణకు ఎంతటి నీచ కార్యమైన చేయవచ్చు. ఇప్పుడు దొంగిలించడం - కుక్కమాంసం తినడం అనే రెండు పాపాలూ చేస్తున్నాను. నీవు స్వచ్చందంగా నాకు మాంసం ఇవ్వు ఒక పాపం తప్పుతుంది. రెండో పాపం తపస్సు చేసి తీర్చుకుంటాను" అని విశ్వామిత్రుడు కుక్క మాంసం తిని జీవించాడు.
డొక్కల కరువులో బురద తాగి బ్రతికాం అని మా పితామహులు చెప్పారు.
ఆంగ్రేజులు రైళ్ళు మున్నగు రవాణ సౌకర్యాలు కలిగించింతరువాత - ధాన్యం తరలింపు సాధ్యం అయింది.
ఆ సంవత్సరపు కరువులో ధాన్యం పండలేదు. పెసలు - మొక్కజొన్నలు పండాయి. రూపాయికి పదిసేర్లు మొక్కజొన్న అన్నం, పెసరు గుగ్గిళ్ళతో కాలం గడిపాం.
అలాంటి స్థితిలో రష్యావారు ఉచితంగా బియ్యం పంపారు. ఒక బస్తా రష్యా బియ్యం సంకీసకు వచ్చాయి. మాకు రష్యా ఆరాధ్యదేశం. అది భూతల స్వర్గం అని మా విశ్వాసం రష్యా బియ్యం చూచి రష్యాను చూచినట్లు పొంగిపోయాం. సర్కారువారు బియ్యం మాత్రమే పంపారు. గ్రామంలో చింతపండు - పప్పు - నూనె వసూలు చేసి, జనానికి అన్నం - పప్పుచారు పెట్టాం వారు తింటుంటే ఎంతో ఆనందం అనిపించింది.
ఇచ్చుకోటంలో ఉన్న సంబరం పుచ్చుకోవడంలో లేదు. కరువు భయానక రూపం చూచాం కరువు వలచి వచ్చింది. విడిచిపోదు. మనుషులు ఎట్లాగో బ్రతికారు. పశువుల బాధ చూడలేం. బిడ్డలా చూచుకున్న గొడ్డును కసాయికి అమ్ముకున్నారు.
కరువు అనగానే ఏదో నామమాత్రపు పనులు నిజాముల కాలంనుంచి అమలు పరుస్తున్నారు. నేటి సంక్షేమ రాజ్యంలో కరువు వచ్చిన చోట - కనీసం ఓటుకోసం అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్నారు. ఆ రోజుల్లో ప్రజలకు ప్రభుత్వపుజాడ రాజధానిలో మాత్రమే కనిపించేది.
వేసవి శలవులు సరిగ్గా ఏప్రెల్ 25న మొదలయ్యేవి. మృగశిర ప్రవేశంనాడు - 7 జూన్ కు మళ్ళీ స్కూళ్ళు తెరిచేవారు. ఏప్రెల్ - మే నెలలు జీతాలు ముందుగానే ఇచ్చేవారు. నాకు కొంత తక్కువ రెండువందలు వచ్చాయి. అవి తీఉస్కుని హైదరబాదు చేరాం. అక్కడ మా అన్నయ్య ఉన్నారు. కమల మేనమామ - అమ్మమ్మ ఉన్నారు. ఆనాటి హైదరాబాదు వాతావరణం ఎంతో అనుకూలంగా హాయిగా ఉండేది. ఎండలు ఉండేవి కావు. కాస్త ఎండవస్తే సాయంత్రానికి ఒక జల్లు వచ్చేది. వేసవి హైదరబాదులో గడపడం ఒక అనుభవం! గండిపేట నీళ్ళు మధురములు. ఆరోగ్యదాయకములు. అందుకే "గండిపేట్ కా పానీ - హైదరాబాద్ కీ బిర్యానీ" అని సామెత.
నేను అన్నయ్య ఇంట్లో ఉన్నా సాహిత్య కార్యక్రమాలకు వెళ్ళలేదు. ఇంటర్ బి.ఏ. పాస్ కావడం నా జీవిత సమస్య. మనిషి తొలి బాధ్యత కుటుంబం అని నా అభిప్రాయం భార్య - పిల్లలను నిర్లక్ష్యం చేసి - బయట పేరు సంపాదించటం బాధ్యతారాహిత్యం.
"మైఁ ఉన్ కె మహఫిల్ గరమ్ సె కాంప్ జాతాహూఁ
జో ఘర్ కో పూంక్ కర్ దున్యామే నామ్ కర్తేహైఁ" అంటాడు ఇక్భాల్.
(ఇంటిని గాలికి వదిలి లోకంలో పేరుకోసం పాకులాడ్తారు.
అలాంటివారు సావాసం అంటే ఎందుకో నాకు వణుకు.)
శలవులు. వేరే పనులు లేవు. ఇంటర్ చదువులో నిమగ్నున్ని అయినాను. నేను సబ్జక్టులన్నింటినీ పరిపూర్ణంగా అధ్యయనం చేస్తాను. చాన్సుకు ఏదీ వదలను. పైగా చెప్పేవాడు లేడు. ఎక్కువ కృషి చేయాల్సివస్తుంది. అందుకోసం అది బాగా వంట పడ్తుంది. నేను పాఠంలో లీనం అయిపోతాను. మనసుకు ఎక్కింది మరువను.
కమలతో కలిసి ఒకటి రెండు సినిమాలు చూడ్డం. ఉదయను బాగే -ఆమ్ అంటే, పబ్లిక్ గార్డెనుకు తీసికెళ్ళటం తప్ప మిగతా సమయం అధ్యయనంలోనే గడిపాను. ఆ రోజుల్లో పబ్లిక్ గార్డెన్ లోనే జంతు ప్రదర్శనశాల ఉండేది. అది ఒక చిన్న అరణ్యంలా ఉండేది. భవనాలు లేవు. మొదట్లో పారిశ్రామిక ప్రదర్శన అక్కడే జరిగేది.
శలవులు అయిపోనున్నాయి. గార్లకు బయలుదేరాం. కమల అమ్మమ్మ రాగమ్మగారు మా వెంట వచ్చారు. గార్ల ఇంటికి చేరుకున్నాం. సాయంకాలం అయింది. తెల్లవారి సంకీస ప్రయాణానికి బండి మాట్లాడుకున్నాం.
మా ఇంటి బావి - ఎన్నడూ ఎండనిది - ఎండిపోయింది. రాగమ్మగారు స్నానం చేస్తానంటుంది. నీళ్ళు తాగడానికే కరువు ఆమె పెద్ద మనిషి కొంత చాదస్తం. ఏటికి వెళ్తానంటుంది. ఏరు ఎండిపోయింది. ఆమెది మొండి పట్టు. వదలదు. మా ఇంటిముందు వారింటి బావిలో కొద్దిగా నీరుంది. అక్కడికి వెళ్ళింది. తలమీంచి స్నానం చేసింది. తడి బట్టల్తో వచ్చింది. దేవుణ్ణి ననా శాపనార్దాలు పెట్టింది. 'నీ బిడ్డలను నువ్వే చంపుకుంటవా - ముండాకొడక. తెల్లారేవరకు వానపడెయ్యకుంటే ఇక్కడనే ప్రాణాలు విడుస్త' అన్నది. వాకిట్ల కూలబడ్డది.
రాగమ్మగారిని తీసుకొచ్చినందుకు బాధపడ్డాం. చిరాకుపడ్డాం. అమ్మా మేమూ బ్రతిమిలాడాం. చుట్టుపక్కలవాళ్ళు వేడుకున్నారు. ఆమె వినలేదు. ఆ రాత్రి మేమూ భోజనాలు చేయలేదు. పడుకున్నాం కొంత చిరాకు కొంత మూర్ఖత్వం మీద కోపం. నిద్ర రాలేదు.
రాత్రి గడుస్తున్నది, అమాంతంగా ఆకాశంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. చల్లని గాలి రివ్వున వీచింది. నేను బయటికి వచ్చాను. రాగమ్మగారు ఆరుబయట నిశ్చలంగా - శిలాప్రతిమలా కూర్చుని ఉంది. మెరుపులు - ఉరుములు అట్టహాసంగా ఉన్నాయి. చిటపట చినుకులు మొదలయినాయి. బోరున వాన!వాన!వాన!! ఎంత వానంటే - చెప్పలేనంత కుంభవృష్టి!
రాగమ్మగారు వానలోనే పడి ఉంది. కుంభవృష్టిలో సహితం కదలదు. రాతి బొమ్మలా నిశ్చలంగా కూర్చుంది. తెల్లవారింది. వాన వెలిసింది. నంగనాచిలా పొద్దుపొడిచింది. 'వినడా దేవుడు! ఎందుకు వినడు!! చెప్పటం చాతకావాలె' అని అప్పుడు లేచింది రాగమ్మగారు స్నానం చేసి చాయ్ తాగింది.
విచిత్రం ఏమంటే - రాత్రి ఎండిపోయివున్న ఏరు పొంగి ప్రవహించింది. బండి మనిషి బండి ఏరు దాటదు అన్నాడు. నిలిచి పోయాం. తెల్లవారి ప్రయాణం సాగించాం. అప్పటికీ బండి సగం మునిగిసాగింది. నడియేట్లో అమ్మమ్మ ఏటికి పసుపుకుంకుమ అర్పించింది.
మనోబలం - సంపూర్ణ విశ్వాసం అన్నింటినీ జయించగలవు. అయితే విశ్వాసానికి అంతబలం కావాలి!
ఆర్. కె నారాయణ అనే ప్రఖ్యాత ఆంగ్లరచయిత 'గైడ్' అనే నవల వ్రాశారు. అందులో ఈ విషయం స్పృశించారు. దేవానంద్ నాయకుడుగా, ఆ నవల ఆధారంగా సినిమా వచ్చింది. అందులో సన్యాసి ఆవేదనకు వాన కురుస్తుంది.
భారతీయ సంప్రదాయంలో పంచభూతాలకు ప్రాణం ఉంది. అవీ పులకిస్తాయి. రామాయణంలో రోమపధుని అంగరాజ్యంలో కరువు వస్తుంది. రుశ్య శృంగుని రాజ్యంలోకి తీసుకొని వస్తారు. వానలు పడ్తాయి. కరువు తీరుతుంది.
మహాభారతంలో అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులు ఉన్న ప్రదేశం కనిపెట్టాలనుకుంటాడు దుర్యోధనుడు ధర్మరాజు ఉన్నచోట వానలు పడి సస్యశ్యామలంగా ఉంటుంది అంటాడు భీష్ముడు.
రాగమ్మగారి వృత్తాంతంతో ప్రభావం అయి, నా నవల "మోదుగుపూలు"లో ఇలాంటి సన్నివేశం చేర్చాను. 'కరువులో జనం చస్తున్నారు. నా గుమ్ముల్లో గింజెందుకు?' అని వీరయ్యగారు గరిసెల్లో గింజ పంచుతుంటారు. అప్పుడు మబ్బ్లు కమ్ముకొని వాన కురుస్తుంది. 'మంచి మనసుకు ప్రకృతి పులకిస్తుంది' అంటాడు నా ఛాయగల నాస్తిక నాయకుడు రఘు.
సంకీస చేరుకున్నాం. స్కూలు, మామూలు కార్యక్రమం. చెరువు నిండింది. చెరువు కట్టకింద నాగజముళ్ళు అందంగా పూచాయి. కమల గర్భం దాల్చింది. సుమారు ప్రసవ దినాలు. కంపు ఇక్కడే జరుగుతుందని, అత్తగారిని రమ్మని వ్రాశాను. ఈలోగా కమలకు రక్త విరేచనాలు మొదలయినాయి. రాగమ్మగారు కమలను తీసుకొని హైదరాబాదు వెళ్ళిపోయింది. అప్పుడు తన పిల్లలతో మా అత్తగారు దిగారు. ఆమెకు నలుగురు మగ పిల్లలు పల్లెలో ఉన్నారు. చదువు సంధ్యలు లేవు. రెండవవాడు రమణను బలవంతంగా నా దగ్గర ఉంచుకున్నాను. మిగతా పిల్లలతో అత్తగారు వెళ్ళిపోయారు.





