Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    నేను అరుగు మీద కూర్చున్నాను. మా అమ్మాయి ఉదయ - శేషయ్య వళ్లొంచి నా వడిలోకి వచ్చి కూర్చుంది. ఆమె ఊరంతటికీ ముద్దుబిడ్డ.
    
    "ఏమయ్యా పంతులూ! మర్రి కింద మంత్రాలతోని ఊరికి కీడు చేస్తవా? నీ పళ్ళు పీకుతమని వచ్చిన్రు వీళ్ళంత" అన్నాడు శేషయ్య.
    
    పరిస్థితి ఆవగతం అయింది. నేను మర్రి కింద శ్లోకాలు చదవడాన్ని మంత్రాలుగా విన్న బాటసారి ఊళ్ళో ఊదాడు. వాళ్ళు శేషయ్యను తీసుకుని నామీదికి దండయాత్రకు వచ్చారు. అర్ధం అయింతరువాత నాకు నవ్వు వచ్చింది. పెద్దగా నవ్వాను. నా వడిలో ఉన్న ఉదయ నవ్వింది. శేషయ్య నవ్వాడు.
    
    మా నవ్వులకు జనం అబ్బురపడ్డారు. లిప్తపాటు తేరుకోలేదు.
    
    "ఊరికి పీడ ముంచుకొస్తాంటే ఎందు కట్ల నవ్వుతారు?" నలుగురు అన్నారు.
    
    "ఏదేని మంత్రాలు గింత్రాలని భయపడి చస్తాను వినురి, సారు విడమర్చి చెప్పుతరు" అన్నాడు శేషయ్య.
    
    నాకు మంత్రతంత్రాల మీద నమ్మకం లేదనీ, నాకు రావనీ వివరించి - నా చదువు సంగతి చెప్పి, "అస్త్యుత్తరాస్యాం దిశిదేవతాత్మా' అనే కుమారా సంభవంలోని కాళిదాసు శ్లోకాలు చదివి వినిపించాను.
    
    "ఎరకలేక అన్నం సారూ! ఏమనుకోవద్దు" అని జనం అంతా వెళ్ళిపోయారు.
    
    "వదినమ్మా! అన్నగారు గండం నుంచి బయట పడ్డడు. చాయ్ తాగించెడిదాక కదిలెడిదిలేదు" శేషయ్య డిమాండు.
    
    "తప్పిన గండానికి ఇంత చిన్నకోరిక కోర్తవనుకోలేదన్నా! ఉండు, షక్కర్ చాయ్ తెస్త" అని కమల లోనికి వెళ్ళి చాయ్ చేసి తెచ్చింది.
    
    "ఆడబిడ్డ సొమ్మమ్మ, ఇంతకంటే ఎక్కువ అరగది" అని చాయ్ అందుకున్నాడు శేషయ్య.
    
    నా గుండె చెమర్చింది! ఎక్కడ అన్న? ఎక్కడి చెల్లెలు? ఇంతటి అనుబంధాలు ఏవీ ఈనాడు? ఎలా ఆవిరి అయిపోయాయి!
    
    చినగూడూరు నుంచి మా మాతామహలు చాకలి వానితో పెండ్లి పత్రిక పంపారు. వారి దత్తపుత్రుని పుత్రిక యాదగిరి లక్ష్మి వివాహం - రావలసిందని అప్పటికి పెండ్లి పత్రికలు పోస్టులో పంపడం ఎరుగరు. పత్రికలు పంపినవారు చాకలివానికి తవ్వెడు బియ్యం - ఉప్పు - మిరపకాయ - చింతపండు ఇచ్చేవారు. దారి బత్తెం కావచ్చు. పత్రిక అందుకున్నవారు మళ్ళీ ఆ విధంగానే ఇవ్వాలి. పంపిన వైర్కి - అందుకున్నవారికి అనుబంధం అనిపించేది. తెచ్చినవానికి పూట గడిచేది. అప్పుడు అన్నీ ప్రత్యక్షంగా జరిగేవి. ఇప్పుడు పోస్టుద్వారా ఉత్తరాలు అందుతాయి. జనుబంధాలు కనిపించవు. ఇప్పుడు అనుబంధాల పనీ లేదు! మనిషి యంత్రమే కదా?
    
    మాతమహలు గోవర్ధనం భట్టరాచార్యులవారు పెద్దవారయినారు. వారిని చూడాలి. కమలకు మా తాతయ్యనూ - తామరల చెరువునూ చూపాలి. ఎద్దుల బండి తీసుకున్నాం. నిండు పున్నమి - పండు వెన్నెల్లో బయలుదేరాం. వెన్నెలంటే నాకు ఎంతో ఇష్టం ఇప్పటికీ కృష్ణపక్షపు వేకువ వెన్నెల్లో వాకింగు చేస్తాను.
    
    పరువపు మనసు, పండు వెన్నెల, పాలలో తానమాడుతున్న ప్రకృతి పక్కన కమల. పసిపిల్ల ఉదయ బండికి గూడు వద్దన్నాను. చుక్కలకింద పయనం బండివాని జానపదగీతం. మనసు పురి విప్పింది. ఆనందం ఆటలాడింది.
    
    "పల్లెల అందం చూడాలంటే
    
    పాల వెన్నెలలు పురి విప్పాలి" అనే గేయం గొణిగాను.
    
    ఆనందం ఉర్రూతలూగుతూ సాగిపోతున్నాం. సరిగ్గా మా ఎదుట ఈతచెట్ల పొద నిప్పులు గుమ్మరించింది. నిప్పు రవ్వలు గంపతో గుమ్మరించినట్లు పడుతున్నాయి.     

    బండి మనిషి బండిని నిలిపాడు. 'కొరివి దయ్యం నిప్పులు కుమ్మరిస్తున్నది. ఎట్ల తిరిగినా మల్ల ఈడికే వస్తం. బండి ఇప్పుత పొద్దు పొడిచినంక పోదాం' అన్నాడు.
    
    అమృత భాండంలో విసపూచినుకు పడినట్లుయింది. నాకు భయం కాలేదు. నిప్పుల గుమ్మరింత అందంగా ఉంది. దయ్యాలు లేవని బండి మనిషికి చెప్పి ప్రయోజనం లేదు. భగవంతుని మీద భారం వేసి నడుద్దామన్నాను. ఒక చిన్న అబద్దం ఆడాను నాకు మంత్రాలు వచ్చు అన్నాను.
    
    బండి సాగింది. మేము ఈత పొదలోంచి సాగుతున్నాం. ఈతచెట్ల శిఖరానా నిప్పంటుకుంది. ఒక గణుపు వరకు కాలగానే రాలుతున్నది. నిప్పంటుకున్న ఈత పీచు నిప్పులు గుమ్మరిస్తుంది. బండివాడు అది నమ్మలేదు. బాట సాగుతున్నది. నాకు మంత్రాలు వచ్చునని నమ్మాడు.
    
    ప్రశాంతత, వెన్నెల, పిల్లగాలి, మౌనరాగం, బండి - చక్రాల చప్పుడుతో, మెల్లమెల్లగా సాగుతున్నది. ఉదయ నిద్రలోనికి జారుకుంది. కమలకు ప్రకృతి పరవశత్వం వివరిస్తున్నాను. ఎద్దుల మువ్వలు ఒక్కసారి ఘల్లుమన్నాయి, ఎద్దులు నిలిచాయి!
    
    "మెకం నిలపడ్డది. చూడుండి" - బండివాని స్వరంలో భయం బుసలు కొడుతున్నది.
    
    అటు చూచాను. బండికి ఎదురుగా - బాటమీద - చిరుతపులి తిష్ఠ వేసింది. వెన్నెలలో స్పష్టంగా కనిపిస్తుంది. కళ్ళు మెరుస్తున్నాయి. నాలుకతో మీసాలు దువ్వుతున్నది. ఠీవిగా కూర్చున్నది. రాజసం వలకబోస్తున్నది.
    
    పులి ఎదుట మేము!
    
    మా ఎదుట పులి!!
    
    మేము బలహీనులం, నిస్సహాయులం, ఏం చేయగలం? కలమ బెదిరిపోయింది. ఉదయను ఉదరమున దాచుకుంది. తల్లి! తాను బలి అవుతుంది!! బిడ్డను రక్షిస్తుంది!!!
    
    నా మనసులో భయపు చీకట్లు అలుముకున్నాయి. అర్ధం కావడం లేదు. చేష్టలు ఉడిగాను.
    
    "మంత్రాలు చదువుండ్రి" - బండి మనిషి మెల్లగా అన్నాడు
    
    కమలలో దుఃఖం పొర్లుతున్నది
    
    నాకు గజేంద్రుడు గుర్తుకు వచ్చాడు. చేతులు జోడించి, కళ్ళు మూసుకున్నాను. మెల్లగా చదివాను:
    
    "లావొక్కింతయు లేదు, ధైర్యము విలోలంబయ్యె, బ్రాణంబులున్
    ఠావుల్ దప్పెను, మూర్చవచ్చె, దనువున్ డస్సెన్, శ్రమంబయ్యెడిన్
    నీవేతప్ప నితఃపరంబెరుగ, మన్నింపన్ దగున్ దీనునిన్
    రావే ఈశ్వర! కావవే వరద! సంరక్షించు భద్రాత్మకా!"
    
    కమలను గట్టిగా పట్టుకున్నాను. కూర్చున్నాను పులి కదల్లేదు. కూర్చున్నది. భీతాహం. భయం. బుగులు మౌనప్రార్ధన కల బిందువులు క్రమంగా రాలుతున్నాయి.
    
    పులి వళ్ళు విరుచుకుంది. వట్టి దౌర్భాగ్యులు అన్నట్లు ఒక చూపు చూచింది. పక్కనున్న 'కోతులగుట్ట' వైపు దర్పంగా సాగిపోయింది. మా ప్రాణాలు మరల ఎదల్లో చేరాయి. ఎద్దులు మువ్వల సవ్వడితో సాగాయి. గూడూరు తాతయ్య ఇంటికి చేరాం. తాతయ్యకు విషయం సాంతం వివరించాను.
    
    'రంగడూ, నీవు ధన్యుడవురా! ఆ పరాత్పరుడు నాస్తికులనే రక్షించుతాడు. వాడు రావణుని - శిశుపాలుని - హిరణ్యాక్ష హిరణ్యకశిపులను రక్షించలేదా?!' అన్నారు.
    
    యాదగిరి లక్ష్మి అందాల రాశి. ఆమెను చూస్తే 'అప్సరసలు ఇలాగే ఉంటారు' అనిపిస్తుంది. ఆమె మాకు మరదలు. మా అన్నయ్యకు ఇమ్మని అడుగుతే "ఏమున్నదని ఇస్తాం" అన్నారు మా మామ - అత్తా ఇప్పుడు ఆమెను చేసుకోవడానికి వచ్చినవాడు కట్నం కక్కుతేగాని చేసుకోనని అలిగాడు. అందరూ సతమతం అవుతున్నారు.
    
    నాకు ఆవేశం వచ్చింది. అతని దగ్గరికి ఉరికాను. "నా మరదలు దివి నుంచి భువికి వచ్చిన అప్సరభామ నీవు ఎదురు ఇచ్చి చేసుకోవాలి. నీవు వదులుకో ఈ ముహూర్తానికే నేను చేసుకుంటా" అన్నాను.
    
    పెళ్ళి కొడుకు జంకాడు. కడలి వచ్చాడు.  పెళ్ళి మామూలుగా జరిగింది. కట్నం తరువాత వసూలు చేశాడు. అది వేరే సంగతి. ఇప్పుడు యాదగిరి లక్ష్మి పిల్లలు మనుమలతో కళకళ లాడుతున్నది.
    
    పెళ్ళి జరిగింతరువాత కమలను - ఉదయను తీసుకొని బయలుదేరాను. అది ఆ ఊరికి - అప్పటికి - అబ్బురం కమలకు మా ఇల్లు చూపించాను. చిన్నతనంలో ఆడుకున్న జోడు చింతలనీడ - పడివున్న గుడిస్తంభం చూపాను. నాతో ఆడుకున్న నరసింహను పరిచయం చేశాను. తామరలు చూడడానికి చెరువుకు చేరాం చెరువు బోసిగా ఉంది. రిక్తంగా ఉంది. వెలవెల పోతున్నది. తామరలు లేవు చెరువు కట్ట మీద మోదుగులు లేవు కట్ట క్రింద నాగజముళ్ళు లేవు. రాకుంటే బావుండేది. కనీసం మనసులో ఆ దృశ్యం మిగిలేది అనిపించింది.
    
    మళ్ళీ రాత్రి వెన్నెల్లో బయల్దేరాం.
    
    తాతయ్యకు పాదాభివందనాలు చేశాం. తాతయ్య నన్ను కౌగలించుకున్నాడు. "వాడు పెద్దవాడయిండు, నువ్వన్న వచ్చినవు సంతోషం మళ్ళచూస్తనోలేదో" అని బావురుమన్నారు.
    
    అంతటి ధీరుడు కృంగిపోయాడు. ఓదార్చడం మా శక్యం కాలేదు. "ఎందుకట్లంటవు తాతయ్యా, మళ్ళ వస్తగదా!" అన్నాను.
    
    "రంగడూ! మళ్ళరావటం లేదురా! అమ్మమ్మపోతే వచ్చిన్రు గనకనా?" అన్నారు.
    
    ఈ తడవ నా గుండె చెరువయింది. తాతయ్యమీద పడి భోరుమన్నాను. కమలా ఉదయా ఏడ్చారు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.