Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
పెరుమాళ్ళ సంకీసలో రామాలయం ఉంది. అందుకే 'పెరుమాళ్ళ' విశేషణం. సరిగ్గా భద్రాది రాముని వంటి విగ్రహాలు ఉన్నాయి ఈ ఆలయంలో అక్కడి రామనవమి నాటి సీతారామ కళ్యాణం చుట్టుపట్ల ప్రఖ్యాతం ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి.
పెరుమాళ్ళ సంకీస తెలంగాణ సాయుధ పోరాటం రోజుల్లో కమ్యూనిస్టులకు పెట్టనికోట! దళనాయకుడు తుమ్మా శేషమ్మ అంటే ఆ ప్రాంతం దొరలకు రజాకార్లకు గర్భనిర్భేద్యం. నాతో ఖమ్మంలో చదువుకున్నవాడు - సిరిపురం క్యాంపులో నాతో పని చేసినవాడు నరసింహారెడ్డి ఆ ఊరి దొర వారి గడీ కూలింది. పొలాలు ప్రజలు పంచుకున్నారు. రజాకార్లు ఆ ఊరు తగలబెట్టారు. ఒకసారి కాదు పెక్కుమార్లు స్త్రీలను అతిక్రూరంగా చెరిచారు. మంగళసూత్రాలు 'తవ్వ'లతో కొలుచుకున్నారు. ఇళ్ళవాసాలు దూలాలతో 'కాడు' తగలపెట్టారు. ప్రాణాలతో ఉన్నవాళ్ళను చేతులూ - కాళ్ళూ పట్టుకుని ఊయలవలె ఊపి ఆ మంటలలోనికి విసిరారు. మంటలకు తాళలేక బయటపడినవారిని తుపాకులతో కాల్చారు. మళ్ళీ మంటల్లో వేశారు! అలా ఎంతమంది ఆహుతి అయిందీ లెక్కలు లేవు!
నేను - కమల - మా పసిపిల్ల ఉదయశ్రీ ఎద్దుల బండిలో గార్లనుంచి బయలుదేరాం. మార్గంలో చిలుకోడు అనే గ్రామం ఉంది. ఆ వూరి దొర వెంకటరెడ్డి, అక్కాడి బ్రాహ్మణులు మాకు స్వాగతం పలికారు. భోజనాలు, ఏర్పాటు చేశారు. నాటి భోజనాలు - వారి ఆత్మీయతా, అనుబంధం మరువరానివి. జీవితంలో శ్రమించి బహుశా అన్నీ సాధించవచ్చు. ఆత్మీయత, అనుబంధం, అనురాగం లాంటి మనసుకు సంబంధించినవి - లభించాలి, సాధించలేం. గార్లనుంచి వచ్చిన బండిని తిప్పి పంపారు. వాళ్ళ బండ్లు కట్టించారు. వాళ్ళూ మా వెంట వచ్చారు మమ్ములను సంకీస ప్రజలకు పరిచయం చేయడానికి.
మా బండ్లు సంకీస చేరాయి. తుమ్మా శేషయ్య మున్నగువారు బంతిపూలు దండలతో మాకు స్వాగతం పలుకడానికి సిద్దంగా ఉండడం చూసి చిలుకోడు వెంకటరెడ్డిగారు ఆశ్చర్యపోయారు. 'రంగాచారి మాకు కొత్తని పరిచయం చేయటాన్కి వచ్చినారు? ఆయన మాకు పోతేడే మీకంటే ముంగలినుంచి ఎరుక' అని తుమ్మా శేషయ్య నన్ను కౌగలించుకుంటే నా కనులు చెమ్మగిల్లాయి. కమ్యూనిస్టులు రాక్షసులు అని నమ్మిన వెంకటరెడ్డి దొర గుండె చెమర్చింది. మా కోసం ఏర్పాటు చేసిన ఇంట్లో మమ్ము దింపారు. సుమారు ఊరంతా కూడింది. చిలుకోడు వారున్నారు. చాయ్ లు అందాయి. కబుర్లు - ఇకఇకలు - పకపకలు - హాసాలు - అపహాసాలు - పరాచికాలు!
అదొక నిండయిన విందు!
అది అందరికీ అందదు!!
'ఒక బడిపంతులకు ఇంతటి స్వాగతమా?' నా కంటే ముందు ఉండిన హెడ్ మాస్టరు పరేషాన్ అయిండు!
పెరుమాళ్ళ సంకీసది కేంద్ర పాఠశాల అంటే - దాని అధీనంలో సుమారు పది పాఠశాలలు ఉంటాయి. ఆ పాఠశాలలు ఉపాధ్యాయులకు వేతనాలు తెప్పించి చెల్లించడం - నెలనెలా ఉపాధ్యాయులకు 'ఆదర్శబోధన' ఏర్పరచడం లాంటివి హెడ్ మాస్టరుగా నా విధులు. ఆ ఉపాధ్యాయులను నేను నా అధీనులుగా చూడలేదు. సమానులుగా చూచాను. వారు ఆప్యాయత కనబరచారు. అందువల్ల నెలనెల సమావేశాలు 'తద్దినాలు'గా కాక పెళ్లిలుగా జరిగేవి.
పెరుమాళ్ళ సంకీస పాఠశాలకు స్వంత భవనం లేదు. కమ్యూనిస్టులను రూపుమాపడానికి అని వచ్చిన సాయుధ పోలీసులు తిరిగిపోగా - వారికోసం వేసిన పాకల్లో స్కూలు ఉంది. హెడ్ మాస్టరుకు సహితం కుర్చీలేదు. గ్రామవాసుల సహకార సద్భావాలతో గ్రామా మధ్యంలో స్కూలు కోసం ఒక భవనం కొనగలిగాను. ఉపాధ్యాయులకు, పిల్లలకు ఫర్నిచరు ఏర్పాటు చేయగలిగాను. పాఠశాల స్వంత భవనంలో ప్రవేశించే ఉత్సవ సందర్భంగా సభ ఏర్పాటు చేశాను. పిల్లలతో నాటకం వేయించాను. పాటలు పాడించాను.
అలాంటిది ఆ ఊరికి కొత్త ప్రజలు మురిసిపోయారు పిల్లలను స్కూలుకు పంపించారు. బడి నిండిపోయింది నేను ప్రత్యేకంగా హరిజనులను గురించి శ్రద్ద తీసుకున్నాను. హరిజన విద్యార్ధులను చాల మందిని చేర్చగలిగాను. నాకు సనాతనులనుండి ఆటంకాలుగాని హరిజనులనుండి అడ్డంకులుగాని ఎదురుకాలేదు. అందరూ ఎంతో ఆప్యాయతగా సహకరించారు. తరవాత కొంతకాలానికి ఇనస్పెక్షనుకు వచ్చిన నాజర్ 'కలయో వైష్ణవమాయమో' అని పాఠశాల ప్రగతికి అబ్బురపడినాడు. నాకు సర్టిఫీకేటు ఇస్తానన్నాడు. గ్రామ ప్రజల ఆత్మీయత నాది - ఆప్యాయతయే నాకు సర్టిఫికేటు అన్నాను.
పిల్లలకోసం ఆటల మైదానం కూడా లభించింది. యువకుల కోసం "బ్యాడ్ మింటన్ కోర్టు" ఏర్పాటు చేశాను. సాయంకాలాల్లో నేనూ వారితో ఆడాను. యువకులు ఉత్సాహంగా కూడేవారు. వారికి సమాజం - సాహిత్యం - సమానత గురించి చెప్పేవాన్ని. కొన్ని పుస్తకాలు చదివించాను. "గోలకొండ పత్రిక" రెండు రోజుల తరువాత వచ్చేది. ప్రయాణ సౌకర్యాలు మృగ్యం.
మా మిత్రుడు కన్వంతరెడ్డి నరసింహారెడ్డి ఆ ఊరికి దొర అని చెప్పాను సాయుధ పోరాటంలో వారి గడీ కూల్చినారు. ప్రజలు పంచుకున్న భూములు తిరిగి రాబట్టుకోవడం విషయంలో ఇంకా సంఘర్షణలు జరుగుతున్నాయి. తుమ్మా శేషయ్య ఆయుధం త్యజించిన మాట నిజం. అయినా అతని పలుకుబడికి తిరుగులేకుండా ఉంది. మానుకోట - మహబూబాబాదు నియోజక వర్గంనుంచి కన్నెగంటి శ్రీనివాసరావు కమ్యూనిస్టు అభ్యర్ధిగా మరింత మెజారిటీతో గెలిచారు. ఆ పరిస్థితుల్లో నేను అక్కడ ఉన్న పదిహేను మాసాల్లో నరసింహారెడ్డి ఒక్కసారి కూడా ఆ ఊరికి రాలేదు.
నేను విద్యాతృష్ణతో - చేతికి అందిన రెవిన్యూ ఇన స్పెక్టరు పదవిని వదులుకున్నాను. ఆ రోజుల్లో ఉపాధ్యాయులు తప్ప ప్రైవేటుగా యూనివర్సిటీ పరీక్ష ఇవ్వడానికి వీలులేదు. అందుకు టీచరుగా రెండు సంవత్సరాల సర్వీసు ఉండాలి. నాకు ఆ యోగ్యత వచ్చింది. ఇంటర్ పుస్తకాలు తెప్పించుకున్నాను. తెలుగు - సంస్కృతం సివిక్సు ఆప్షనల్ గా అధ్యయనం ప్రారంభించాను.
పోలీసు చర్యకు ముందు ఉస్మానియా యూనివర్శిటీలో ఉర్దూ మీడియం మాత్రమే ఉండేది. పోలీసు చర్య తరువాత ఇంగ్లీషు - హిందీ మీడియములు చేర్చారు. అంటే, ఉర్దూ - ఇంగ్లీషు - హిందీ ఏ మీడియంలో నయినా పరీక్ష వ్రాయవచ్చు. నిజాం నవాబు జనంమీద రుద్దిన భాషగా ఉర్దూ విషయంలో ఒక గుడ్డి ద్వేషం ఉండేది. తరవాత కాలంలో భాష ప్రజలది, దోచుకున్నవాడు ప్రభువు అని అర్ధం చేసుకున్నాం. ఉర్దూ విషయంలో ఎంతో అభిమానం పెంచుకున్నాం. అనేక కవితలు అనువదించాను. కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. "తెలుగు ఆఫ్సానే" అని తెలుగు కథలను ఉర్దూలోనికి అనువదించాను. ఉర్దూ కథలను తెలుగు చేశాను. ఈ రెండు కథల సంపుటులు ఆంద్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు.
రామాయణంలో రాముడు లంకను జయిస్తాడు. సీతను తన వద్దకు తెమ్మని రాముడు హనుమంతుని ఆదేశిస్తాడు. హనుమంతుడు అశోకవనంలో ఉన్న సీత దగ్గరకు వెళ్తాడు. అంతకు ముందు సీతను నానాయాతనలు పెట్టిన రాక్షస స్త్రీలు అతనికి కనిపిస్తారు. హనుమంతునికి కోపం వస్తుంది. వారిని చంపుతానంటాడు. 'వకనశ్చిన్నాపరాధ్యతి!" అంటుంది సీత - తప్పు చేయనివాడు ఉంటాడా? అంటుంది. తప్పుచేసిన వారినల్లా చంపుతే లోకంలో మనిషి మిగలడు. అయితే చేసిన తప్పును గ్రహించాలి. మళ్ళీ అదే తప్పు చేయకుండటానికి ప్రయత్నించాలి.
న్నెఉ ఉర్దూను ఆనాడు ద్వేషించిన తప్పుకు అనువాదాలు చేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నాను. పరిణత వయసులో నేర్చుకున్నదేమంటే - దేనినీ ద్వేషించరాదు. అన్నింటినీ ప్రేమించాలి. ద్వేషంలో మనసు హింస పడుతుంది. ప్రేమలో మనకు వికసిస్తుంది.
ఇంతకూ ఆనాటి ఉర్దూ మీది ద్వేషంతో ఇంగ్లీషు మీడియం తీసుకున్నాను. మెట్రిక్యులేషను తెలుగు మీడియంలో వ్రాశాను. ఇంగ్లీషుతో అంత పరిచయం లేదు. పెరుమాళ్ళ సంకీసలో నేనే పండితుణ్ణి. స్వంతంగానే సాధన ప్రారంభించాను. సంస్కృతమూ - సివిక్సు ఇంగ్లీషులో వ్రాయాలి. 'సాధనమున పనులు సమకూరు ధరలోన' అన్న వేమన పద్యం అక్షరసత్యం అని అర్ధం అయింది.
నాకు ఆరు బయలు - నేటికీ - ఇష్టం టీచరుగా ఉన్నప్పుడు వీలున్నంతవరకు ఆరుబయట - చెట్టు కింద పాఠాలు చెప్పాను. నేను పుస్తకాలు తీసుకుని ఊరి బయట మర్రి చెట్టు క్రింద చదువుకునేవాణ్ణి. ఒకనాడు అలాగే మర్రి చెట్టు క్రింద చదివి వస్తున్నాను. ఇంటిముందు జనం కూడి ఉన్నారు. తుమ్మా శేషయ్య వారికి ఏదో వివరిస్తున్నాడు. నేను ఇంటి చేరాను. జనం నన్ను చూచి "మర్రికింద మంత్రాలు చదువుతున్నాడు" అన్నారు. నేను అబ్బురపడ్డాను. చకితుణ్ణి అయినాను. నాకు ఏమీ అర్ధం కాలేదు.
"అరె! ఆయన్ని రానిస్తారె లేదా?" అన్న తుమ్మా శేషయ్య నన్ను అరుగు మీద కూర్చోమన్నాడు.
నాకు ఏమీ అర్ధం కాలేదు. గుండె దడదడలాడింది. మనసు ఏదో అశుభం శంకించింది. దర్వాజలో కమల కనిపించింది. భీతహరిణేక్షణగా ఉంది.





