Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
పెండ్యాల సత్యనారాయణగారు 80 ఎకరాల సుక్షేత్రం అయిన మాగాణిలో 70 ఎకరాలు ఉద్యమానికి ధారపోశారు. కమ్యూనిస్టు నాయకుడు సర్వదేవభట్ల రామనాథంగారు కోట్ల ఆస్తిని ఉద్యమానికి హారతి చేశారు!
మద్రాసు రాష్ట్రంలోని ఆంద్రప్రాంతంలోని 134 స్థానాలలో కాంగ్రెస్ 34, కమ్యూనిస్టులు 41, కిసాన్ మజ్దార్ పార్టీ 20, కృషి కార్ లోక్ పార్టీ 15, సోషలిస్టులు 8, మిగతా స్వతంత్రులు గెలిచారు.
మద్రాసు - హైదరాబాదు రాష్ట్రాలలోని తెలుగు ప్రాంతాల సీట్లు 234 కాగా, ఉబహ్య ప్రాంతాలనుంచి కమ్యూనిస్టులు 53 స్థానాలు గెలుచుకున్నారు. అదీ కాంగ్రెస్ లోని వారే కిసాన్ మజ్దార్ - కృషి కార్ లోక్ పార్టీలు స్థాపించి చీలిపోవడం వల్ల. కమ్యూనిస్టు మహానాయకులకు ఈ సామాన్య సూత్రం అర్ధం కాలేదు. ఆంధ్రలో తమ ప్రభుత్వం స్థాపించనున్నట్లు తొడగొట్టి సవాలు చేశారు. ఈ సవాలుకు బెదిరిన కాంగ్రెస్ వారు ఐక్యసంఘటనగా ఏర్పడ్డారు. 1955 లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో వారు 147 స్థానాలను గెల్చుకోగా, కమ్యూనిస్టులు 15 సీట్లు మాత్రమే గెలిచి చావుదెబ్బ తిన్నారు. అప్పటినుంచి వారు కోలుకోలేదు!
1952 అక్టోబర్ 19 న పొట్టి శ్రీరాములుగారు 58 రోజులు నిరశన వ్రతం అవలంబించి అమరులయినారు. అందువల్ల 1953 అక్టోబరు ఒకటవ తేదీన కర్నూలు రాజధానిగా - ఆంద్రరాష్ట్రం ఏర్పడింది. రాజకీయ కీచులాటలు రగులుకున్నాయి!
1948-49 ప్రాంతంలో మద్రాసు నుంచి 'సందేశం' అనే వారపత్రిక వచ్చేది. వారు ఆంద్రరాష్ట్రాన్ని గురించి వ్యాసాల పోటీ నిర్వహించారు. అందుకు నేను ఒక వ్యాసం పంపాను. అందులో ముఖ్యమంత్రి - మంత్రి పదవులకే రాష్ట్రం కోరుతున్నారు అని వ్రాశాను. నాకు బహుమతి లభించింది.
రాజకీయ కీచులాటలు నా వాణిని నిజం చేశాయి. ప్రజలను మతం ఏకం చేయనట్లే, భాష - కులం వగైరాలు ఏకం చేయలేవని నా అభిప్రాయం.
ఎన్నికలు ముగియగానే కమలకోసం - మా బిడ్డకోసం - పరుగులు తీశాను. అప్పటికి నాకు జీతం వచ్చినట్లుంది. ఖమ్మం చేరుకున్నాను. పన్నెండు రూపాయలకు బాతా శాండిల్స్ - ఆరు రూపాయలకు ఎవరెడీ బ్యాటరీ కొన్నాను. కమలకు చీర - పాపకు గౌను - సవాశేరు జిలేజీ కొన్నాను. నల్లగొండ బస్సు ఎక్కాను. కట్టంగూరులో దిగాను. అప్పటికి మధ్యాహ్నం అయింది. బస్సులు లేవు. రోడ్డు లేదు. కాలినడక సాగించాను. అడ్లూరు మార్గం తెలియదు. అడుక్కుంటూ సాగాను. ఒక మోట బావి దగ్గర కూర్చున్నాను. జిలేబీ తిన్నాను. మోట నీళ్ళు తాగాను. సంచీ పట్టుకుని నడక సాగించాను సాయంత్రానికి అడ్లూరు చేరాను.
అడ్లూరులో నన్ను చూచారు. కమల - మిగతావాళ్ళూ సంబరపడిపోయారు. మా వలపు ఫలితం - పసిపాపను చూచుకున్నాం. కమలా నేనూ మురిసిపోయాం. ఏమిటి ఆ సంబరం? మనలోంచి ఊడిపడిన బిడ్డ అనియా? ఆ బిడ్డకోసం సర్వస్వం అర్పించడానికి సిద్దం అవుతాం. అంతటి ప్రేమా - త్యాగం కల్పించాడు భగవానుడు! ప్రకృతిలో జీవరాసులు అన్నీ అంతే. అలా కాకుంటే పసిబిడ్డలు ఎలా పెరుగుతారు?
పాపకు "ఉదయి శ్రీ" అని నామకరణం చేశాను. జంధ్యాల పాపయ్యశాస్త్రి - ఉదయశ్రీ పద్యాలకు ప్రభావితుడై పెట్టిన పేరు. ఒక కావ్యం పేరునే బిడ్డపేరుగా అప్పటికి బహుశా నేనే పెట్టానేమో!
ఖర సంవత్సర మార్గశీర్ష శుక్ల ద్వాదశి సోమవారం - 10-12-51 ఉదయం ఆరు గంటలకు ఉదయశ్రీ జన్మించింది. ఆమె మాకు తొలి సంతానం.
అడ్లూరులో కొన్నాళ్ళు ఉన్నాను. అవి ఇంకా బంధుప్రేమ ఉన్న రోజులు. కాలినడకన చుట్టుపట్ల బంధువుల ఇండ్లకు వెళ్ళి వచ్చాను. వాళ్ళందరూ ఎంతో ఆత్మీయత కనబరచారు.
ఒకరు - చక్కెర వేయలేని తమ అశక్తతకు నొచ్చుకుంటూ - బెల్లం వేసిన పాలు ఇచ్చారు. రుచిగా ఉన్నాయి.
మా అత్తగారి చెల్లెలు కమలమ్మగారింట్లో భోజనం. విస్తట్లో కొంత అన్నం వదిలేశాను. "వదిలేయడానికి మళ్ళీ వడ్డిస్తాను. అది కలుపుకో నాయనా!" అన్నారు కమలమ్మగారు. నాకేమీ అర్ధం కాలేదు. అత్తవారింట్లో భోజనం చేసేపుడు విస్తట్లో అల్లుడు అన్నం వదిలేయడం ఆచారమట!
అడ్లూరు నుంచి కొండపల్లి మార్గంలో 'బరాకత్ గూడెం'లో ఆగాను. అక్కడ కమల చిన్న అమ్మమ్మగారు - వెంకటమ్మగారు ఉన్నారు. వారు ఎంతో వాత్సల్యం కనబరచారు. ప్రేమాభిమనాలు లభించడం అరుదు. భగవంతుడు సహితం ప్రేమ పిపాసియే! భక్తితో సమర్పించిన పత్రం - పుష్పం - ఫలం - జాలం చాలును అన్నాడు. కన్నప్ప గండూషాంబు నిషేచనం - పుక్కిటినీటితో లింగానికి అభిషేకం చేశాడు. శివస్వామి కణ్ణప్పను కరుణించాడు!
స్వాతంత్ర్యం వచ్చినంతమాత్రాన బానిసత్వం పోయినట్లుకాదు. బానిసత్వం మనసులో గూడు కట్టుకుంటుంది. వదలదు. టీచర్ల స్థితి అలాగే ఉండేది. నాజర్ - డిప్యూటీ ఇన స్పెక్టరు - వచ్చాడంటే చేతులు కట్టుకొని నుంచుంటారు. నాజర్ తాను దొరను అన్నట్లు ప్రవర్తిస్తాడు. టీచర్లు సహితం 'బాంచెను దొరా' అన్నట్లు చేతులు నలుపుకుంటూ సేవలు చేస్తారు.
నాకు అది నచ్చదు. నేను అలా చేయలేదు. ఈ బానిసత్వం వదిలించడానికి ఉపాధ్యాయ సంఘం ఏర్పాటు చేయాలనుకున్నాను. గ్రామాలు పర్యటించాను. కొంత ప్రయత్నం చేశాను. నాజరు నిజామును తల తన్నినవాడు. 'సంఘం' అంటే వాడికి బెదురు. నన్ను "పమ్మి" అనే దూరంగా ఉన్న పల్లెకు హెడ్ మాస్టరుగా బదిలీ చేశాడు. నేను దేబిరించలేదు, పమ్మికి వెళ్ళాను.
స్కూలు విషయంలో కొండపల్లికి - గోఖనిపల్లికి పోటీ కొండపల్లివారు ఆరో తరగతి తెచ్చుకుంటే గోఖనిపల్లివారు ఏడవ తరగతి తెచ్చుకున్నారు. వారు కోరి 'పమ్మి' నుంచి నన్ను పిలిపించుకున్నారు. కమలా - ఉదయశ్రీ - నేనూ గోఖనిపల్లి చేరుకున్నాం. ప్రజలు మాకు ఉచితంగా ఇల్లు ఇచ్చారు. పాలు, పెరుగు, కూరగాయలు సమకూర్చారు. విద్యార్ధులు మా ఇంట్లో కట్టెలు కొట్టారు. విద్యార్ధినులు ఇళ్ళు అలికారు. ధాన్యం దంచారు. పిండి విసిరారు. మా విషయంలో ఎంతో అభిమానం కనబరచారు. మాకు మిగిలిన కూరగాయలు వగైరా ఇతరులకు అందించేవాళ్ళం!
కొండపల్లివారు నా విషయంలో పోటీపడ్డారు. మళ్ళీ కొండపల్లికి రప్పించుకున్నారు. ముగ్గురం తొలుత సత్యనారాయణగారి ఇంట్లో దిగాం. 'ఇద్దరికి అన్నం పెట్టలేమా? వేరే ఇంటికి వెళ్లొద్దు' అంటారు మాతృశ్రీ మేము అంగీకరించలేదు. వైష్ణవుల ఇంట్లో వాటా చూచి - మమ్ములను అక్కడి చేర్చారు. అక్కడ వంట చేసింది తక్కువ రోజూ ఎవరో ఒకరు భోజనానికి పిలిచేవారు. ఆ ఇంటికి మా అన్నయ్య వచ్చారు. నాయన వచ్చారు.
బెజవాడలో కృష్ణాజిల్లా ఉపాధ్యాయ సంఘ వార్షికోత్సవాలు జరిగాయి. లక్ష్మయ్య గారు నన్ను ఆహ్వానించారు. నేను కాస్త ఆలస్యంగా - భోజన విరామ సమయానికి చేరుకున్నాను. 'తెలంగాణం నుంచి రంగాచార్యులవారు వచ్చారు. వారి ఉపన్యాసం విందామా? భోజనాలకు వెళ్దామా?' అని సభికులను లక్ష్మయ్యగారు అడిగారు. అందరూ ముక్తకంఠంగా ఉపన్యాసం వింటాం అన్నారు. నేను తెలంగాణ రాజకీయ పరిస్థితులు - విద్యావిధానం - టీచర్ల స్థితిని గురించి గంటంబావు మాట్లాడాను. అందరూ హర్షధ్వానాలు చేశారు. సభలు ముగిసేవరకు వాళ్ళతోనే ఉన్నాను.
'తెలంగాణ వాణి' అని నా ఉపన్యాసానికి ప్రాముఖ్యతను ఇచ్చి పత్రికలు ప్రకటించాయి. ఇప్పటివలె జిల్లా ఎడిషన్లు అప్పటికి లేవు. ఆ వార్త చూచిన 'నాజరు' తాళలేకపోయాడు. నన్ను మానుకోట తాలూకా "పెరుమాళ్ళ సంకీస" అనే మారుమూల గ్రామానికి బదిలీ చేయించాడు.
కొండపల్లి గ్రామప్రజలు - విద్యార్ధులు - ఉపాధ్యాయులు పెద్ద సమావేశం - విందు ఏర్పాటుచేసి, మాకు ఘనంగా వీడ్కోలు చెప్పారు. గోఖనిపల్లివారు కూడా అందులో పాల్గొన్నారు. నేను రుద్రకంఠంతో - సజల నయనాలతో వారికి కృతజ్ఞతలు సమర్పించుకున్నాను.
తరువాత సహితం - నేటికీ ఆ గ్రామాలతో నాకు అనుబంధాలున్నాయి. 1970లో నా 'చిల్లరదేవుళ్ళు' ప్రచురణ సందర్భంలో గోఖనిపల్లిలో నన్ను సన్మానించారు. 1990లో కమలనూ - నన్నూ ఆ ఊళ్ళోనే ఆత్మీయంగా సన్మానించారు.
కొండపల్లివారు పిలిస్తే వెళ్ళలేకపోయాను. కాని సత్యనారాయణగారిని దర్శించుకోవడానికి వెళ్ళాను. వారు పరమపదించడానికి వారం ముందు సకుటుంబంగా వెళ్ళి - సత్యనారాయణ దంపతులకు పూలు -పండ్లు ఇచ్చి - శాలువలు కప్పి సత్కరించాం.
పెరుమాళ్ళ సంకీస అటు గార్లకూ - ఇటు చిన్న గూడూరుకూ పది పదిహేను మైళ్ళలో ఉన్న గ్రామం. ఆ ఊరికి బస్సుగాని - రైలుగాని లేదు వర్షాకాలంలో నదులు పొంగితే జలదిగ్భంధంలో ఉండిపోతుంది. నన్ను దిగ్బంధం చేయడానికి ఆ గ్రామం బదిలీ చేశారు.
పెరుమాళ్ళ సంకీస ప్రాంతంలో 'తాళ్ళ సంకీస' అని మరొక గ్రామం ఉంది. 'కీస' అంటే జేబు తాటిచెట్టుకు జేబులాంటి సంచీ కట్టి ఉంటుందేమో అనుకునేవాళ్ళం అన్నయ్యా, నేనూ మరీ చిన్నవాళ్ళంగా ఉన్నపుడు గూడూరులో అలాంటి ముద్రపడింది మరీ చిన్నతనంలో 'సంకీస' గురించి మనసులో అలా సంకీసకు చేరుకోవాడనికేనేమో ఆ ముద్ర! మనసును మించిన మహిమ దేనికీ లేదు. మనం గుర్తించాలి - అంతే.





