Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
ఇరవయి ఏడు
ఉద్యోగ లక్షణం:
ఖమ్మం నుంచి నేలకొండపల్లికి బస్సు ఛార్జీ ఒక రూపాయి. మరో రూపాయి జేబులో ఉన్నట్లుంది. బస్సు దిగాను. సాగిపోతున్నాను. ఇంటిముందు అరుగులమీద పెండ్యాల సత్యనారాయణగారు కనిపించారు. వారే పలకరించారు. చెప్పాను.
"నువ్వు ఉద్యోగం చేస్తావా?" ఆశ్చర్యంగా అడిగారు. వారు నేలకొండపల్లి సర్పంచ్.
అంతకన్న గతిలేదు.
"దేశభక్తులంత దీనులైపోయిరి
కొత్త ఖాదివాడు కోట్లకెక్కె" అన్నాను.
"రంగాచార్లూ! ఎంతలో కాలం ఎంత మారిపోయిందయ్యా! నువ్వు చెప్పినట్లు మనకు స్థానం లేదు" వారి గొంతు పూడిపోయింది. 'నేనూ వస్తా ఉండు', అని వారు నాతో వచ్చారు. హెడ్ మాస్టరుకు పరిచయం చేశారు. బయలుదేరారు. గేటుదాకా వెళ్ళారు. మళ్ళీ తిరిగి వచ్చారు.
"భోజనం ఎక్కడ?" అడిగారు.
"జేబులో రూపాయి ఉంది" అన్నాను.
"చింత చస్తుంది. పులుపు చావదు. మేమింకా బతికే ఉన్నాం. మా ఇంటికిరా" అని గిరుక్కున తిరిగి వెళ్ళిపోయారు.
నా కనులనుంచి బాష్పబిందువులు రాలాయి. హెడ్ మాస్టర్ సర్ఫరాజ్ చకితుడయి చూచాడు. అతనికి ఉద్యోగం తెలుసు - మనసు తెలియదు.
మనసు మాత్రం తెలిసిన నేను ఉద్యోగం చేయగలనా?
పగలు సత్యనారాయణగారి ఇంటికి వెళ్ళాను. ఒక గది ఖాళీ చేయించి, శుభ్రం చేయించి ఉంచారు. మంచం పడక ఏర్పాటు చేశారు.
"నాయనా! మాకు నువ్వే భారం కావుగాని ఉన్నంతకాలం ఇక్కడే భోంచెయ్యి ఈ గదిలో ఉండు" అన్నారు పెండ్యాలవారి మాతృమూర్తి ఆమె అక్షరాల అన్నపూర్ణ! అక్కడ ఉన్నన్నాళ్ళూ విసుగులేకుండా భోజనం పెట్టింది. ఆమె నన్ను పుత్రునిగా - శ్రీమతి సోదరునిగా చూసుకున్నారు.
భగవంతుడు ఆశ్రయం చూపించక మానడు! భద్రాద్రి దేవాలయం నిర్మించిన కంచర్ల గోపన్న - రామదాసు జన్మస్థానం నేలకొండపల్లి. దాన్నే విరాటరాజు పట్నం అంటారు. జమ్మిచెట్లు ఎక్కువ. ఊరి బయట - చెరువు పక్కన వెంకటేశ్వరాలయం ఉంది. అక్కన్నుంచి మరికొంత దూరంలో "విరాటరాజు గద్దె" అనే దిబ్బ ఉండేది. ఈ మధ్య తవ్వకాల్లో అది బౌద్ద స్థూపం అని తేలింది. బుద్ధ విగ్రహాలు బయట పడినాయి!
బౌద్దాన్ని పూడ్చిపెట్టడానికి స్థూపాన్ని దిబ్బ చేసి ఉంటారు! పోలీసు చర్య తరువాత తెలంగాణలో ఒక విద్యా ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. ఇది ప్రజా ఉద్యమం. గ్రామాల్లో పాఠశాలలు స్థాపించుకోవడానికీ - ఉన్నవాటిలో క్లాసులు పెంచుకోవడానికి ప్రజలు పూనుకున్నారు. వాళ్ళే పాఠశాలలకు స్థలాలు ఇచ్చారు. భవనాలు కట్టించారు. ప్రభుత్వం అడిగిన డిపాజిట్లు చెల్లించారు. హైదరాబాదు DPI ఆఫీసులో - తరగతుల పెంపుకోసం - డిపాజిట్లు కట్టడానికి జనం బారులు తీరి నిలిచేవారు!
తెలంగాణ శతబ్దాలుగా విద్యాదాహంతో తల్లడిల్లింది ఇప్పుడు ఆ దాహం తీర్చుకోవడానికి ఉవ్వెత్తున లేచింది.
తెలంగాణ తెలుగుకోసం ఎంత తపించిందంటే 'అలంపురం'లో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలకు ఇరవయి వేలమంది తరలి వచ్చారు. రాధాకృష్ణ పండితుడు తెలుగులో తుంగభద్రా స్రవంతి వంటి ఉపన్యాసం ఇచ్చారు.
విద్యాఉద్యమంలో భాగంగానే నేలకొండపల్లిలో 5,6 తరగతులు ప్రారంభించారు. ఉపాధ్యాయుల్లో నేను తప్ప అంతా ఉర్దూ మీడియంవారే! ఉద్యమాన్ని ఉరుకులు పెట్టించాలని నా భావన. ఎక్కువ క్లాసులు నేనే తీసుకునేవాణ్ణి పిల్లలకు కూడా నా మీద అభిమానం ఏర్పడింది. పెట్రోమాక్సు లైట్లు పెట్టి రాత్రిళ్ళు పిల్లలను చదివించాను. పిల్లలూ నేనూ రాత్రిళ్ళు అక్కడే పడుకునేవాళ్ళం!
నేలకొండపల్లిలో బ్రాహ్మణ కుటుంబాలు ఎక్కువ వారి పిల్లలకు చక్కగా చదువు చెపుతున్నానని వారికి అభిమానం. అందరూ భోజనాలకు పిలిచేవారు. తమ ఇంట్లో చేయకుంటే సత్యనారాయణగారు చిన్నపుచ్చుకునేవారు!
ఆత్మీయత గట్లు తెంచుకుని ప్రవహించింది. అందరూ ఆత్మీయులే అయినా గార్ల వెంటాడడం విడువలేదు.
కమల - తల్లిగారింట - ప్రసవించింది. ఆడపిల్ల ఉత్తరం వచ్చింది. బిడ్డ అంటే మా రూపమే! ఏదో ఉత్సాహం ఉరకాల్నని ఆతురత! అయినా వెళ్ళలేకపోయాను. స్వతంత్ర భారతంలో తొలి ఎన్నికలు. ఎన్నికల డ్యూటీ పడింది. శలవు ఇవ్వమన్నారు. ఏం చేస్తాం? ఉండిపోయాను.
అంతవరకు తెలంగాణకు ఎన్నికలు తెలియవు. సిబ్బందికీ అంతే. శిక్షణలు ఇచ్చారు. అప్పటి ఎన్నికలు పెట్టెల పద్దతిలో జరిగేవి. అభ్యర్ధికి ఒక పెట్టె, దానిమీద అతని గుర్తు ఎందరు అభ్యర్ధులుంటే అన్ని పెట్టెలుండేవి.
తమ ఉద్యమం కొనసాగించడం విషయంలో ఆదేశాలు అందుకోవడానికి కమ్యూనిస్టు నేతలు రష్యా వెళ్ళారు! అప్పటి నియంత 'స్టాలిన్' ను కలిశారు, వివరించారు. సముద్రతీరం లేనిచోట విప్లవం సాధ్యపడదు, విరమించండి అన్నాడు స్టాలిన్. కమ్యూనిస్టులు బేషరతుగా ఉద్యమం విరమించారు. అప్పటికి సర్దార్ పటేల్ పరమపదించారు. అయినా పార్టీమీద నిషేధం తొలగించలేదు. పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ - P.D.F. పేర ఎన్నికల్లో పోటీ చేశారు. వారి ఎన్నికల చిహ్నం హస్తం. కాంగ్రెస్ గుర్తు కాడితో రెండెడ్లు.
ఎన్నికల్లో - తెలంగాణలో - ఎర్ర కెరటం లేచింది. ఎక్కడ చూచినా కమ్యూనిస్టు సానుభూతియే! సిబ్బంది సైతం హస్తం చూపి ఓట్లు వేయించారు. ఒక్కొక్క అభ్యర్ధి రెండు, మూడు స్థానాలనుంచి పోటీ చేశారు, నెగ్గారు.
హైదరాబాదు రాష్ట్రంలో తొలి ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెసుకు 93 - P.D.F అంటే - కమ్యూనిస్టులకు 42 - సోషలిస్టులకు స్వతంత్రులకు 29 సీట్లు వచ్చాయి. తెలంగాణ నూరు స్థానాలకు కమ్యూనిస్టులు 40 గెలుచుకున్నారు. నల్లగొండ జిల్లాలో మొత్తం 14 స్థానాలను వారే గెలుచుకున్నారు. రావి నారాయణరెడ్డిగారికి నెహ్రూగారికన్న ఎక్కువ ఓట్లు వచ్చాయి!
మాడపాటి హనుమంతరావుగారు - జమలాపురం కేశవరావుగారు - సురవరం ప్రతాపరెడ్డివంటి అగ్ర కాంగ్రెస్ నాయకులూ ఓడిపోయారు - కాదు, కొత్త కాంగ్రెసు వారు వాళ్ళను ఓడించారు! వారు త్యాగధనులు. ఎన్నికల పితలాకం తెలియనివారు. కొత్త ఖద్దరుధారులు వారికి -గెలిచే అవకాశం లేని - నియోజక వర్గాలు కేటాయించారు. దేశభక్తులను దీనులను చేశారు.
ఎన్నికల తరువాత కాంగ్రెసులో ముఠాల మల్లగుల్లాలు జరిగాయి. పేరుకు రామానంద తీర్ధ అధ్యక్షులు అయినా పాత దేశాయి కాంగ్రెసువారే ముఖ్యమంత్రీ ఉపముఖ్యమంత్రీ అయ్యారు. బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగానూ, కొండా వెంకట రంగారెడ్డి ఉపముఖ్యమంత్రిగానూ హైదరాబాదు రాష్ట్రంలో తొలి ప్రజాప్రభుత్వం ఏర్పడింది.
సాయుధ పోరాటం నిర్వహించిన వారికీ - ప్రగతివాదులకు మంత్రివర్గంలో ఒక్క స్థానం కూడా లభించలేదు. ముఠాలు కట్టడం నేర్చినవారు మంత్రి పదవులు సంపాదించుకున్నారు. పోరాటం జరిపినవారిని - మీ పని అయిపోయింది అని ఇళ్ళకు పంపించారు.
అవమానం భరించలేక జమలాపురం కేశవరావుగారు అసువులు బాశారు.
స్థానిక పాలన మంత్రి పూల్ చంద్ గాంధీ దాశరథి, తాళ్ళూరి రామానుజస్వామి, నారాయణస్వామి వంటి త్యాగధనులకు జిల్లా పంచాయత్ ఇన స్పెక్టర్ల ఉద్యోగాలు ఇచ్చారు! అంటే, నేను - మా అన్నయ్య - కొద్ది నెలల తేడాతో ఉద్యోగాల్లో చేరాం.
చదువులు లేక - ఆస్తులు ఉద్యమానికి అర్పించుకుని - తిండికి లేక చచ్చిన దేశభక్తులను - కనీసం లెక్కించే శ్రమ ప్రభుత్వం చేయలేదు!





