Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    "నీ మనసు మాట నువ్వు చెప్పలేవూ ? మరెవరు చెపుతారు?"
    "నువ్వు చెపుతావు" దృడమైన స్వరంతో అనేదామే.
    నవ్వేసేవాడు మాగుణి. "నీ మనసు మాట నేనా చెప్పేది?"
    'అవును, నువ్వే చెపుతావు. ఇదేమైనా విడ్డురమైన మాట కనకనా? ఇవాళ దాకా అన్నీ చెపుతూ వచ్చావు. ఇవాళ మాత్రం ఎందుకు చెప్పవన్నా?"
    ఊర్మిళ ఇంకేమీ అనలేకపోయేది. చప్పున మొహం తిప్పేసి, కర్ర వూత పట్టుకుని వెళ్ళిపోయేవాడు మాగుణి.
    యుధిష్ఠిరుడు వుత్తరం రాశాడు. రోజూ రాయడేమీ వుత్తరం? వారానికీ - పదిహేను రోజులకీ - నేలకీ రాస్తాడు. తిరుగు జవాబులో రాసిందామే. దానికి జవాబుగా రాశాడివాళ అతడు - 'తుపాకి వొదిలి కలం పట్టుకుందికి సమయం చిక్కలేదు' అని. ఎంతో సరదాగా రాశాడివాళ. నలుగురు చీనా సైనికుల్ని తరిమికొట్టాడు తను. నలుగురిలో కనీసం ఇద్దరు చచ్చారు. ఏమంటే - దగ్గరి ఎత్తు కొండ మీంచి. తన గుండు దెబ్బతో ఇద్దరు పసుపు సైనికులు దొర్లిపోవడం తాను స్వయంగా చూశాడు. అది జరిగిన తరవాత ఎదిరి పక్షం వాళ్ళు చేతులెత్తేశారు. తనని అభినందించినట్టు. అవతలి వేపు నుంచి ధ్వని కూడా వినవచ్చింది. - 'హిందీ చీనీ భాయీ భాయీ!"
    ఆ ధ్వని అసలు అర్ధమేమిటో ఎరగడతను - అది వేళాకోళం కాదు కదా? రణరంగంలో ఇదేం ధ్వని? ఈ లడాయి భాయీ భాయిల మధ్య జరుగుతూ వుందా? అవును, అన్నదమ్ములు కాకపోతే మరెవ్వరు చేస్తారు యుద్ధం? మహాభారతం తలపుకి వచ్చేదతడికి.
    దూరపు కొండ మీద మేఘం వాలి విశ్రాంతి తీసుకుంటూ వుంది. తన చేతి స్టెన్ గన్ ఖచ్ ఖచ్ ఖచ్ శబ్దం చేస్తూ కుడివేపుకి మొహం తిప్పుతోంది. రెండు వేపులా విరామం లేని దాడి. ఉదయం - సాయంకాలం ఎంత వేగంగా దొర్లిపోతున్నాయక్కడ? తానెప్పుడు తింటాడో, ఎప్పుడు విశ్రాంతి తీసుకుంటాడో - ఏమీ తనుపు లేదు తనకి. వేళకి సెలవిక్కడ.
    తిరిగి వచ్చి అవులిస్తోంది. ఊర్మిళ. దగ్గర వూళ్ళో గ్రామ సేవిక ఆమె. ఎన్ని వూళ్ళో తిరిగితే గడుస్తుంది సమయం. ధవళగిరి వెనక నుంచి ఎర్రగా పొద్దు దూడపెయ్యి లాగ ఆకాశం మీదికి పాకుతుంది. వరుణేయి కొండ వెనక తల్లి ఒడిలో దాగుండిపోతుంది. రాత్రి పడేది - తెల్లవారేది. ఊర్మిళ సమయం చెల్లేది కాదు. అన్ని పనుల మధ్య వుత్తరం కోసం ఎదురు చూడడ మొకపని. నెల దినాలు గడిచిపోయాయి. ఎంచేతో వుత్తరం రాలేదు. తపాలాశాఖలో తప్పిపోయిన వుత్తరాలన్నీ తనవేనేమో! జంకుతూ జంకుతూ మెల్లిమెల్లిగా పోస్టు జవానుని అడిగేదామే. సాకూతంగా ఆమె వేపు చూసేవాడు పోస్టు జవాను. తుదకి "లేదు" అనేసేవాడు. ఊళ్ళోని మాలతీ, మాధవీ రాదా వచ్చీ యుద్ధం కబుర్లు అడిగేవారు. ఊరి బడి పంతులమ్మ సవిత వార్తా పత్రిక చదివి చెప్పేది - భారతీయ జావానులు చీనా సైనికుల చేత బందీలయ్యారని.
    "అయితే , మన సైన్యం ఓడిపోతుందన్నమాట!" అనేది మాధురి.
    "ఓడిపోతే ఏం? భీముడు మొదట ఓడిపోయేవాడు. తుదకి మనం తప్పకుండా గెలుస్తాం.' అనేది రాధ.
    "గ్రహాలు చూసి జ్యోతిష్యం చెప్పినట్టు చెప్పేస్తున్నావేమిటి?" పక్కింటి సురజి అమ్మ ముసిల్ది వచ్చి యువతుల జట్టులో కలిసిపోతూ అనేది. "చెప్పనే చెప్పను. చెప్పితే ఈ ఇంట్లో వుండను." అని సామెత కూడా పలికేది. "నేను చెవులో గూడు కట్టుకు చెప్పానర్రా యుధిష్ఠిరుడికి - 'ఎంత కష్టం మీద మీ అమ్మ కందిరా నిన్ను, నా కళ్ళతో నేను చూశానురా. ఎందుకురా పీకల మీదికి తెచ్చుకుంటావు?" అని ఎంతో చెప్పాను. నా మాట వాడు చెవిన పెడితేనా? ఫౌజు లోకి వెళ్ళి పేరు రాయించుకు వచ్చాడు!"
    "అతను మంచిపనే చేశాడు పిన్నీ! మన దేశం కోసం యుద్ధానికి వెళ్ళాడు" అనేది మాధవి.
    "ఏమిటీ! మన దేశమా?" వెక్కిరించేది నురజి అమ్మ. "దేశం మీది! వారి పెళ్ళాం పిల్లల్ని ఎవరు ఆదుకుంటారు?"
    'చూడని వాళ్ళు చూడర్ర
    పేరు తాబేలు, తీసింది బుర్ర !"
    బలే చూశానే మీ దేశం. కష్టం వస్తే కడకండి చూడరే ."
    "నువ్వు అంటున్నావా ఈ మాటలు పిన్నీ!" పంతులమ్మ సవిత అనేది, "మీ అక్క కన్నకొడుకు నుదుట స్వయంగా సింధూర తిలకం పెట్టి యుద్దానికి పంపింది కదా!"
    "పంపితే! ఇక్కడ కోడలు, మనవడు, మనవరాలు నాలుగు ప్రాణాలు తన పీకల మీద అవాల్తీ. తల్చుకు తల్చుకు దినం చెల్లకుండా వుంది తెలుసా ?" అంటూ పైట కొంగుతో కళ్ళు ఒత్తుకునేది సురజి అమ్మ.
    "సర్కారు వారి నుంచి సొమ్ము దొరుకుతుంది కదా!" అడిగేది మాధురి.
    "సొమ్ముతోనే అంతా అయిపోతుందా? ఒక్కగానొక్కని కొడుకు. వాణ్ణి ఒదిలి తల్లి గుండె ఎంత బాధపడుతుందో మీకెలా తెలుస్తుంది? ఇదిగో, ఊర్మిని చూడండి, మీ కళ్ళముందు . ఊళ్ళో ఎన్ని నిందలు, ఎన్ని అపవాదులు, ఎన్ని తిరస్కారాలు తినడం లేదది! యుధిని కట్టుకోవాలని ఎంత అవస్థ పడలేదు."
    నోరు విప్పితే అంతుండదు సురిజి అమ్మ మాటలకి.
    మాధురి మధ్య ఆడ్డం వచ్చి అనేది - "ఉండదు పిన్నీ. మరి వాగకు నువ్వు."
    ఊర్మిళ మాటాడకుండా మంటి ముద్దలా కూచునే వుండేది. తాను తిన్న నిందలకూ, అవమానాలకూ, ఎవరినీ నిందించేది కాదామె. బిసుబాబుని కూడా ఎన్నడూ పల్లెత్తుమాట అన్న పాపాన పోలేదు. అన్నిటికీ తానే బాధ్యురాలనుకునేది. చిన్నప్పటి నుంచి మగ కుర్రాళ్ళతో పోటీపడి పని చెయ్యడానికే ఆమె పుట్టినట్టుంది. పరుగు పందెం మొదలుకొని, ఆటల్లోనూ, చెట్లెక్కడంలోనూ , ఏటిలో ఈత కొట్టడం లోనూ , బైస్కిలు ఎక్కడం లోనూ , చదువుకోడం లోనూ - ఎందులోనూ ఆమె తగ్గేది కాదు. ఆడదైనా, మగాడైనా ఇలా పెట్రేగి పొతే సంఘం వూరుకుంటుందా ఏ వూళ్ళో అయినా? అందుకని ఎవరైనా పల్లెటూరి పద్దతిని వేళాకొళమాడితే తప్పేముంది?
    ఊళ్ళోని శ్రీ పంచ బిసుబాబు కుమారుణ్ణి పెళ్ళాడానని తాను పంతమూని కూచున్ననాడు , తన తల్లి ఎన్ని తిట్లూ, చీవాట్లూ తినలేదు బిసుబాబు నోట! ఆ తరవాత ఎన్ని ప్రసంగాలు వచ్చినా బిసుబాబే చెడగొట్టేవాడు. ఆమె గ్రామ సేవిక కాకుండా ఎన్ని కుట్రలు పన్నాలో ఆన్నీ పన్నాడతను, అయినా, ఎన్నడూ అతణ్ణి పల్లెత్తుమాట అనలెదామే. ముందుకాని వెనకకాని.
    తన విషయంలో ఎన్ని కుచ్చితాలు, ఎన్ని కళంకాలు సృష్టించాలో అన్నీ ఇప్పుడు నీటి మీద గీతల్లా మాసిపోయాయి. యుధిష్ఠిరుడి దగ్గర నుంచి రెండు పంక్తుల వుత్తరం వస్తే చాలు - భూమండలమంతా ధారపోసేయ్యామంటే వెనకాడ దామె.
    "ఊర్మిళా!" ఎవరి పిలుపో వినబడింది.  కంఠం బాగా ఎరిగినట్టుంది. అయితే, తన పేరు ఆ కంఠంలో విన్నట్టు లేదు. మళ్ళీ అదే పిలుపు. తుళ్ళిపడిందామే. బిసుబాబు - తన గుమ్మంలో నుంచుని పిలుస్తున్నాడు. ఉన్న పళానా లేచి నుంచుంది ఊర్మిళ.
    "యుధిష్ఠిరుడి దగ్గర నుంచి వుత్తరమేదైనా వచ్చిందా?" నెమ్మదిగా అడిగాడు బిసుబాబు.
    "లేదు" అనేసి ఊరుకుంది ఊర్మిళ . బిసుబాబు ఏదైనా శుభవార్త తెచ్చి వుంటాడనుకుందామె.
    "విచారించకు. ఉత్తరం వచ్చి తీరుతుంది. యుధిష్ఠిరుడు శుభంగా తిరిగి వస్తాడు." బిసుబాబు కంఠం ఓదార్పు స్వరంతో వుంది. అతడున్నూ ఇవాళ ఊర్మిళ గుమ్మానికి వచ్చాడు. ఊళ్ళో ఎవరింటయినా చీమ చిటుక్కుమన్నా బిసుబాబు చెవికి వస్తుంది. ఎవరేం భావిస్తున్నారో పసికట్టడం;లోనూ దురంధరుడు అతడు. పోస్టు జవానును కూడా అదిగడతడుప ఊర్మిళకి ఏమైనా వుత్తరం వచ్చిందా? అని ఊర్మిళ వుత్తరం కోసం ఎంత ఆతురపడుతున్నదో పోస్టు జవాను దగ్గర విన్నాడు. అందుచేత హటాత్తుగా ఊర్మిళ గుమ్మంలో ప్రత్యక్షం.
    తన ఇంటికి వుత్తరం రాయడం కోసం ఇల్లు విడిచి రాలేదు యుధిష్ఠిరుడు. ఆ దేశంలో తెలియని పల్లెలో తన గుళ్ళతో ఎదిరి పక్షం చీనా సైనుకులు ఎలా చస్తున్నారో వారి వాళ్ళకి చీనా భాషలో రాయించాలని వచ్చాడతడు.
    రోజుకి రోజు ఆ మనుషుల్ని చంపే అభిజ్ఞాత అధికమవుతూ వుందతడికి. భారతదేశంలోని అన్ని భాషల వారితో కలిసి మెలసి తిరిగే అభిజ్ఞిత కూడా అధికమవుతూ వుంది. సమగ్ర భారతదేశాన్ని ఆ సరిహద్దు ప్రాంతంలో చూడగాలుగుతున్నాడతడు. భారతదేశంలోని మహాశక్తి, సాహసం, మర్యాద అపూర్వంగా అవగతమవుతున్నాయతడికి. దానితో పాటు ప్రతిపక్షం చీనా సైనికుల విషయమున్నూ తెలుసుకుంటున్నాడు. ఎన్నడూ పగలేని , పరిచయం లేని చీనా వారి గుండెలు గురి చూస్తున్నాడతడు. దూరంలో వున్న ఒడిశా దేశం యుధిష్ఠిరుడు కాడిప్పుడు తాను. భారతదేశంలోని నలభై అయిదు కోట్ల పేర్లలో ఊర్మిళ , జితెంద్రుడు , బిసుబాబు, మాగుణి భాయి పేర్లు మరుగుపడి పోయాయి. యుధిష్ఠిరుడిప్పుడు భారతీయుడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.