Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
యుద్ధం జరుగుతూ వుంది. బలాబలాల పరీక్ష జరుగుతూ వుంది. అటు చీనీ, ఇటు భారతెదేశం. యుధిష్ఠిరుడు, ఊర్మిళా , ఒడియా , బెంగాలీ, తమిళుడూ, తెలుగువాడూ - ఎవరి ప్రత్యేకతా లేదక్కడ. అంతమందీ ఇవాళ ఫిరంగులు, తుపాకులు, స్టెన్ గన్ల పొగలో కలిసిపోయారు. ఒక్కటిగా -- కాళ్ళూ, చేతులూ, కళ్ళూ చెవులూ -- ఏ అవయవమూ ఎవరి సొంతమున్నూ కాదు- అన్నీ భాతరదేశానివి. ఏ మట్టిలో వారు పుట్టారో ఆ మట్టిలోనే కలిసి పోతారు ఒకనాడు. ఆ మట్టినే కాపాడడానికి వేన వేలు సైనికులు ఈ సరిహద్దు ప్రాంతానికి వచ్చారు. వీరి వెనక నలబై అయిదు కోట్ల మందున్నారు. దురాక్రమణ తిప్పి కొట్టడానికి సిద్దంగా ఉన్నారు.
పొద్దు దూరడంతో యుధిష్ఠిరుడు కొండపైకి వెళ్ళేవాడు. 'హిందీ చీనీ భాయీ భాయీ' కి బదులు ఇప్పుడు కొత్తమాట వినవస్తోంది. ఎదిరి పక్షం నుంచి - "హల్లో బాయ్ ఫ్రెండ్ !"
అడవి చెట్ల మాటు నుంచి పసుపచ్చని ఆడదాని నవ్వు మొహం చూసి గతుక్కుమన్నాడతడు. ప్రళయంలో పుట్టిన మోహినీ మూర్తిలా వుందామే. ఒక చేతిలో దుర్భిణీ, మెళ్ళో వేలాడుతున్న కెమెరా, ఒక చేతిలో ట్రాన్సిస్టరు రేడియో, అవతలి వేపు కొండల్లోంచి భారతీయ భాషలన్నిటిలో వినిపిస్తోంది రేడియో సంగీతం. మోసం నిండిన ఆ మాయాజాలం తుత్తునియులు చెయ్యాలనుకునేవాడు యుధిష్ఠిరుడు. అతడి రక్తం సలసల మరిగేది.
దూరం నుంచే ఆ యువతి ముఖ శోభ చూసేవాడు యుధిష్ఠిరుడు. వినేవాడామే కోమల కంఠస్వరం , రేడియో సంగీతమున్ను తన దుర్భిణితో ఆమె మొహం బాగా పరికించి చూశాడు స్పష్టంగా. ఊర్మిళ తలపు కొచ్చి ఒక నెట్టు నేట్టేది. ఊర్మిళ మొహంతో ఈ సైనిక రమణి మొహం కత్తు కలుస్తుంది. శరీరం కూడా ఊర్మిళ లాగే వుంది సన్నంగా. అయితే, ఊర్మిళలా లేడి కళ్ళు లేవీమేకి. బెడిస కళ్లీమేవి.
యుధిష్ఠిరుడు గుళ్ళు గురిపెట్టి శత్రు సైనికుల్ని చంపేవాడు . కాని, ఆ మీనాక్షి చూపుల తూపులు సహించరానివిగా వుండే వతనికి. మధ్య మధ్య మనస్సు డీలా పడిపోయేది. ఆ మీనాక్షి యొక్క లేడి, కళ్ళు ఊర్మిళ కాల్పనికచ్చాయామూర్తి కనపడేది. ఛా, పగవాడి చిల్లంగి ఇది. అర్జునుడు మీనాక్షి'లో బాణం కొట్టి ద్రౌపదిని సంపాదించాడు. భారత దేశం కోసం మీనాక్షిని తుపాకి నల్లీతో జయిస్తాడు యుధిష్ఠిరుడు.
ఎంతోమంది చైనా కన్యలు అలా కొండ మీద కనిపించేవారు. పదిహేను దినాలై భారత జవానులు ఆ కొండమీద శిభిరం వేసి దిగారు. వందలు, వడలు చైనా సైనికులు మరణించారు. ఎంతోమంది గాయపడ్డారు. భారత పక్షంలో కూడా తక్కువ నష్టం కలగలేదు. ఉభయపక్షాలా రేట్ క్రాసు వారు నిర్విరామంగా పని చేస్తున్నారు.
మీనాక్షి గుండె మీద రెడ్ క్రాసు గుర్తు సూర్యకాంతిలా మెరుస్తూ వుండడం చూశాడు యుధిష్ఠిరుడు. ప్రతి ఉదయం వినే వాడామే మధుర కంఠస్వరం - "హల్లో బాయ్ ఫ్రెండ్!"
చైనా వాళ్ళు ఇంగ్లీషు వాళ్ళని ఇష్టపడకపోయినా వారి ఇంగ్లీషు భాషనీ మాత్రం వదల్లేక పోయారు. ఆ భాషలో మూడు శబ్దాలు ఉచ్చరిస్తూ ఆ చైనా యువతి యుధిష్ఠిరుడి దగ్గర పరిచితురాలయింది బాగా. అయితే, ఆ ప్రియ వాక్యానికి తుపాకి మొనతోనే జవాబు చెప్పేవాడు యుధిష్ఠిరుడు. అయినా, ఆమె కళ్ళలో ఊర్మిళ కళ్ళు అవుపడే వతడికి. ఆమె రెడ్ క్రాస్ లో ఒక సేవిక. ఆడదని ఆగకుండా ఆమె వేపు గుండు పేల్చాడతను. అవతలి కొండమీది ప్రతిధ్వని తిరిగి వచ్చింది. ఆవాళ నించీ ఆమె అవుపడలేదు. భారత జవానుల ప్రత్యక్రమణ కూలదొయ్యాలని చైనా దండు చేసిన కౌశలమంతా వ్యర్ధమైంది.
ఆ తరవాత కొండలూ, కోనలూ, అడవులూ, నదులూ సెలయేళ్ళూ అంతటా ఉసుళ్ళపుట్ట చైనా సైన్యం - లెక్కలేనంత దండు ప్రత్యక్ష మైంది. కనుచూపు మేర అడవి కొండల్లో చెట్లూ, తుప్పలూ, తప్ప ఏమీ లేవో, అలాగ మనుషులే మనుషులు. ఆ మానవ పర్వతం గుండా పిండి చేసి మానవతరంగాలు నిరోధించడం కోసం నిలబడ్డాడు యుధిష్ఠిరుడు. మాగుణిభాయి కుస్తీ సమయంలో తనను పట్టి వేలాడుతున్న అయిదారుగురు యువకుల్ని జూడించి , పక్షి స్నానమప్పుడు రెక్కలు దులిపినట్లు దులిపి పారేసేవాడు.
మానవ తరంగాలు నిరోధించడం కోసం, దిగ్వలయ వ్యాప్తమైన మానవ సముద్రంలోకి వురికాడు యుధిష్ఠిరుడు. ఒకణ్ణి చంపితే అయిదుగురు వచ్చి నిలబడేవారు. చెమట్లు పోసి కళ్ళు కనపడేవి కావు. చెమట తుడిచేసుకు చూసేవాడు. తన శరీరం ఎర్రగా రక్తంలా వుంది. రక్తం - ఎక్కణ్ణుంచి వచ్చింది శరీరానికి రక్తం? చూసిందికీ, ఆలోచించడానికీ సమయం లేదు. సమయం ఎన్నాళ్ళయో సెలవు పుచ్చుకుంది. తన దగ్గర హటాత్తుగా గుండె దెబ్బ తగిలింది వెనక నించి తిరిగి చూశాడు. వెనకని కూడా శత్రు సైన్యం.
కుడి చెయ్యి కదలడం లేదు. తుపాకి పెల్చలేడిక. ఎడమ చేత్తో నీళ్ళ బుడ్డి తీసి నోట పెట్టుకున్నాడు. తరువాత ? తరవాత ఏమైంది తనకి తెలియదు.
కళ్ళు విప్పి చూసినవాడు తన శరీరమంతటా బాండేజీ కట్టి వుంది. మాటాడడానికి , ఊపిరి తియ్యడానికి కష్టంగా ఉంది. దెబ్బలు తిన్నవాళ్ళని చీనా డాక్టర్లు ఒక్కొక్కరు వచ్చి చూసిపోతున్నారు. యుధిష్ఠిరుడు తాను ఎక్కడున్నదీ తెలుసుకున్నాడు.
"హిందీ చీనీ భాయి భాయి" అంటూ ఒక డాక్టరు వచ్చి, తన గుండెలూ, బాడీ పరీక్ష చేశాడు. వెనక నుంచి తగిలిన గుండు వచ్చి తన గుండెల్లో వుండిపోయింది. అందుకని ప్రాణంతకమైన ఆపరేషను అవసరం. తన చావుకి ఎవరూ భాధ్యులు కారని ప్రకటన పత్రికలో సంతకం చేసేస్తే ఆపరేషను జరుగుతుంది.
ఇన్నాళ్ళ తరవాత రవంత విశ్రాంతి దొరికింది యుధిష్ఠిరుడికి. ఇది చివరి విశ్ర్రాంతి కావచ్చు. నల్ల కళ్ళజోడు పెట్టుకున్న ఒక నర్సుని కలం కాగితం ఇమ్మని ప్రార్ధించాడు. నర్సు అతణ్ణి తేరిచూసి అంది - "హల్లో బాయ్ ఫ్రెండ్!"
ఎవరీమె? మీనాక్షి కాదు కదా? సరిగ్గా అనుకున్నట్టే అయింది. ఆమెకి యుధిష్ఠిరుడి గుండు రవ్వపడి కన్నొకటి చెడిపోయింది. రెండో కన్ను కూడా కొంచెం దెబ్బతింది. అయినా, గాయపడిన సైనికుల సేవ చేస్తున్నదామే. ఒక ఫోటో పైకి తీసి యుధిష్ఠిరుడి ఎదుట పెట్టింది.
అది యుధిష్ఠిరుడి ఫోటో. కొండ మీంచి ఆ ఫోటో తీసిందామే. యుద్ధం చేస్తున్నప్పటి తన మొహం ఎన్నడూ తాను చూసివుండేవాడు కాదు యుధిష్ఠిరుడు. ఇన్నాళ్ళ తరవాత తన ఫోటో తాను చూడడానికి అవకాశం దొరికింది. ఇన్నాళ్ళకి ఊర్మిళ కి వుత్తరం రాయడానికి సమయం చిక్కింది.
చెయ్యి వున్న చోటి నుంచి కదలడం లేదు. కొంచెం మీది కేత్తితే రక్తం ధారకడుతూ వుంది వెళ్ళదాకా. వుత్తరం రాయడానికి అతడికి సాయం చేసింది మీనాక్షి. "నీకు నేను అన్యాయం చేశాను" అన్నాడు యుధిష్ఠిరుడు. నల్ల కళ్ళ జోళ్ళలోంచి కన్నీటి బిందువు ఆమె ముక్కు చివరకు జారింది.
పెద్ద డాక్టరుతో ఆర్మీ కమాండరు వచ్చాడు. పత్రంలో సంతకం చేశాడు యుధిష్ఠిరుడు. చివరకొక కోరిక కోరాడు - ఒక అభావనీయమైన కోరిక -
ఆపరేషనులో తాను మరణిస్తే - అవును, మరణిస్తే - తన శవం నుంచి తన కళ్ళు రెండూ తీసి వెంటనే ఈ నల్ల కళ్ళజోడు నర్సు కళ్ళకి అతికించాలి.
తుళ్ళిపడ్డాడు పెద్ద డాక్టరు. గతుక్కుమన్నాడు కమాండరు. అందరూ మీనాక్షి వేపు చూశారు. అవును - ఆమె కళ్ళు యుధిష్ఠిరుడే పాడు చేశాడు. అందుకని తన కళ్ళు ఆమెకు దానం చేస్తున్నాడు. పత్రంలో తన కోరిక రాయాలని తన అభిలాష.
మీనాక్షి అరిచింది - "వద్దు, వద్దు - ఏమిటి మీరు చేస్తున్నది?"
విదేశీ యువకుడి నోట తన పేరు 'మీనాక్షి' అని వినడం సంతోషంగా వుందామెకి.
"నేను చెయ్యవలసిందే చేస్తున్నాను మీనాక్షీ! నా కళ్ళతో ప్రపంచాన్ని నువ్వు చూడాలని నా కోరిక. నా ప్రియ భారతభూమి జవానుల వీరత్వం, సాహసం నువ్వు నా కళ్ళతోనే చూడాలి. ఏదో నెపం మీద కాదు, సత్య రూపంలో చూడాలి."
చైనా కమాండరు యుధిష్ఠిరుణ్ణి ఎంతో మెచ్చుకున్నాడు. "ఇతడి లాటి యోధుడు గొప్ప వ్యక్తీ నా సేనలో వుంటే నిజంగా గర్వించేవాణ్ణి నేను."
"నా కంటే మహా యోధులున్నారు భారత సేనలో" అని జవాబు చెప్పాడు యుధిష్ఠిరుడు.
కళ్ళు లేని శవాన్ని పత్రంతో సహా భారతీయ రెడ్ క్రాసు వారికి పంపారు చైనా రెడ్ క్రాసు వారు. శవం మీద రంగు రంగుల పువ్వులు కప్పారు. మిలిటరీ బ్యాండు వాద్యాలతో అంత్య సంస్కారం జరిగింది. మాతృదేహానికి, భారతదేశం కళ్ళన్నీ కేంద్రీకృతమై వున్న ఆ కొండల మీద.
ఊర్మిళకి వుత్తరం వచ్చింది.
యుధిష్ఠిరుడు యుద్ధం చేస్తున్నప్పటి ఫోటో అందులో ఉంది. వణుకుతున్న చేత్తో రాసిన నాలుగైదు అక్షరాలూ మాత్రమున్నాయి. తక్కిన కాగితమంతా నెత్తుటి వెళ్ళ మరకలు.
"నేను గెలిచాను ఊర్మీ - ఓడిపోలేదు!" తలుపు మూసుకుని గదిలో కూలబడింది ఊర్మిళ. పదేపదే చదివింది వుత్తరం. పదేపదే చూసింది ఫోటో.
* సమాప్తం *




