Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam



    
    పెళ్ళి తరువాత అన్నయ్యకు భయంకరమైన జబ్బు చేసింది. ఖమ్మం హీరాలాల్ ఇంట్లో చికిత్స మిత్రుల దగ్గర డబ్బు తేవడం - మూత్రపురీషాలు ఎత్తిపోయవలసిన అన్నయ్య సేవలో పడిపోయాను. చాల కాలానికి భగవదనుగ్రహం వల్ల అన్నయ్య ఆరోగ్యం బాగుపడింది.
    
    కాలం ఎప్పుడు ఎవరిని కసురుతుందో తెలియదు. నాయన అన్నయ్య గుడిసెలో అమ్మను చెల్లెళ్ళను వదిలిపోయారు. ఎలాంటి ఆధారంలేని నేను ఇల్లు కట్టాను. అందరిని పోషించాను. ఇప్పుడు ఇల్లుంది. పొలం గింజ ఉంది. అయినా మాకు మాన్యత తగ్గింది. కాలం కత్తెర అయింది. మేము ఏం చేయగలం? నా చదువు కోసం కమల పుట్టింటికి వెళ్తానంది. కాదనలేకపోయాను. వెళ్ళింది.
    
    గండి మల్లికార్జునరావుగారిది డోర్నకల్లు అంతకుముందే వారు మిత్రులు సిరిపురం కాంగ్రెసు క్యాంపులో కలిసి పనిచేశాం. వారు గార్ల మా ఇంటికి వచ్చారు. పరిస్థితి గమనించారు. డోర్నకల్లు రమ్మన్నారు. వెళ్ళాను. అనంతరామయ్యగారి కొడుకులకు ట్యూషను చెప్పేట్లూ - వారింట్లోనే భోజనం - బస ఏర్పాటు చేశారు. అక్కడ లాంతరులో కిర్సనాయిలు కొరత లేదు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని - తపస్సు చేసినట్లు చదివాను.
    
    మల్లికార్జునరావుగారి భార్య భద్రమ్మ - అనంతరామయ్యగారి సతీమణి సీతమ్మ నన్ను తనువాడిగా చూచుకున్నారు. వారి ఆప్యాయత లేకుంటే నా చదువు సాగేది కాదు అనంతరామయ్యగారు - సీతమ్మ ఈ లోకంలో లేరు. ఆప్యాయతలు మనుషులతో అంతరించవు.
    
    నేను ఏం చదివానో ఎంత చదివానో తెలియదు. బెజవాడ వెళ్ళి నలుగురితో కలిసి తెలుసుకోవాలనుకున్నాను. ఇంతలో బెజవాడ కాలేజీలో పరీక్షకు సంబంధించిన 2363 నెంబరు హాల్ టిక్కెట్టు అందింది. మార్చి 51 లో పరీక్షలు ఫిబ్రవరిలో వెళ్దామనుకున్నాను. మళ్ళీ డబ్బు సమస్యే!
    
    నా సమస్య గార్ల మిత్రుడు చందా వీరభద్రంగారికి తెలియపరిచాను. వారు చందాలు వసూలు చేసి ఇచ్చారు. ఆ డబ్బుతో బెజవాడ చేరుకున్నాను. తెలిసిన వాళ్ళ ఇంట్లో నిడిశాను. కొద్దిరోజుల్లోనే డబ్బు కరిగిపోయింది. పరీక్ష మానుకుని తిరిగి పోవడం తప్ప గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది. డబ్బు సైతం కాలమంతట బలీయం అయింది అని అర్ధం అయింది. పడిన శ్రమ సాంతం వృధా కానున్నది! కృష్ణ వడ్డున కూర్చోని వంటరిగా ఏడ్చాను. కమల గుర్తుకు వచ్చింది. ఆమె ఉంటే ఓదార్చేది! ఒక మార్గం చూపేది!! అప్పటికి దేవుని మీద నమ్మకం లేదు. భగవంతుని ప్రార్దించటం తెలియదు!
    
    భగవంతుడు కరుణామయుడు. ప్ర్రార్ధించుకున్నా ప్రత్యక్షం అవుతాడు! అలా ప్రత్యక్షం అయినాడు గవర్నరుపేట చౌరస్తాలో బొగ్గారపు సీతారామయ్య! సీతారామయ్య సిరిపురం క్యాంపులో నాతోపాటు పనిచేసినవాడు సంపన్నుడు. సంవత్సరంగా - గోష్ఠి సుబ్బారావుగారి ట్యుటోరియల్ లో - మెట్రిక్ చదువుతున్నాడు. సీతారామయ్య నన్ను ఆత్మీయంగా పలకరించాడు. నా కథ సాంతం అతని ముందు కక్కాను. అతను ఆత్మబంధువులా ఆదుకున్నాడు. సామాను సహితంగా నన్ను తన గదికి చేర్చాడు. తనతోపాటు నాకు 'రాఘవ రెస్టారెంటు'లో భోజనం టిక్కెట్లు కొన్నాడు. ఆనాటి నుంచి నేను గార్ల తిరిగి వెళ్ళేవరకు ఎలాంటి లోటు రాకుండా చూచాడు.
    
    చదువు పోల్చుకుంటే నేనే వారికన్న మిన్నగా ఉన్నాను. చదువులో అన్యోన్యం సాయపడ్డాం. కలిసి పరీక్షలు వ్రాశాం. లెక్కలు పరీక్షలో నెగ్గలేమనిపించింది. వాస్తవంగా పేపర్ మెట్రిక్ స్థాయిని మించి ఉంది. అదీకాక ప్రశ్నాపత్రాలు ఇంగ్లీషులో ఉండేవి. జవాబులు తెలుగులో వ్రాయాల్సివచ్చేది.
    
    "ఆంద్ర విశ్వవిద్యాలయంలో ఆంగ్లప్రశ్నపత్రా లేమిటి?" అని పత్రికలకు వ్రాశాను. పత్రికలు మంచి ప్రచారం ఇచ్చాయి. గణితంలో ప్రశ్నాపత్రం - వాటిస్థాయి విద్యార్ధుల ఇక్కట్లను గురించి కూడా పత్రికలకు వ్రాశాం. అలాంటివి పత్రికల్లో రావడం అప్పటికి కొత్త.
    
    అంతటితో ఊరుకోలేదు. ధరఖాస్తులు వ్రాశాం. విద్యార్ధులతో సంతకాలు చేయించాం. వైస్ ఛాన్సలర్ కు పంపించాం. గోష్ఠి సుబ్బారావుగారు ఆంధ్రవిశ్వవిద్యాలయం సెవెట్ సభ్యులు. వారిని కలిసి వివరించాం. వారికీ అర్ధం అయింది. మా కోరికలు రెండు:
    
    1. ప్రశ్నాపత్రాలు తెలుగులో ఉండాలి.
    
    2. గణితంలో ఆ సంవత్సరపు విద్యార్ధులకు అదనంగా 20 మార్కులు కలపాలి.
    
    సుబ్బారావుగారు విశాఖ వెళ్ళారు. అప్పటికే మా వినతి పత్రాలు - పత్రికా ప్రకటనలు కొంత కదలిక తెచ్చాయి. సుబ్బారావుగారు కొంతపని చేశారు; బెజవాడ తిరిగి వచ్చారు. తెలుగు ప్రశ్నాపత్రాలను గురించి విశ్వవిద్యాలయం అంగీకరించిందనీ అదనపు గణితపు మార్కుల గురించి పరిశీలిస్తామని హామీ లభించిందనీ వారు తెలియపరచారు.
    
    నేనూ సీతారామయ్యా బెజవాడ వదిలాం. నైజాం బండిలో బయల్దేరాం. సీతారామయ్య పాపటపల్లిలో దిగాడు. పండితాపురం వెళ్ళాడు. నేను గార్లలో దిగాను. మెట్రిక్ పరీక్ష ఇవ్వడంతో ఒక కార్యం సాధించినట్లు అనిపించింది. సుమారు దశాబ్దం తరువాత మళ్ళీ పరీక్ష ఇచ్చాను. భవిష్యత్తు సాంతం ఆ ఫలితం మీద ఆధారపడి ఉంది.
    
    కమల వచ్చింది. నిత్యకృత్యం కష్టంగా గడుస్తున్నది. కష్టాలకు అలవాటుపడ్డ వారికి ఇబ్బందులు ఉండవు. కష్టాలకే కథలన్నియు సుఖాలకు కథలు లేవు. చూస్తుండగానే ఫలితాలు వచ్చాయి. నేను - సీతారామయ్య ఇద్దరం పాసయ్యాం.
    
    పాసయిన నాడు ఆ ఆనందానికి అవధులు లేవు. ఒక ఘనకార్యం సాధించినట్లూ ఒక తపస్సు ఫలించినట్టూ అనిపించింది. భద్రం - వేంకటేశ్వరరావు - కృష్ణమూర్తి అంతా ఎంతో సంతోషించారు. భయ్యాదుకాణంలో మిఠాయి కొన్నాను. అది కన్నులకు అందించాను. వార్త వినిపించాను. ఆమె ఆనందానికి అంతు లేదు. ఈ విజయంలో సగం కమలదే. అమ్మా - చెల్లెళ్ళూ సంతోషించారు.
    
    ఆ రాత్రి కమలా - నేనూ కలసి కలలుగన్నాం. ఒక ఉద్యోగం వస్తుంది. స్థిరమయిన ఆదాయం ఉంటుంది. వేళకు తినవచ్చు. బట్టలు కొనవచ్చు. రామన్న పిల్లలకు ఇంత పెట్టగలం. కమల గర్భవతి.
    
    నేను రెండు ఉద్యోగాలకు దరఖాస్తులు పెట్టాను. రెవెన్యూ ఇన్స్ పెక్టర్ పోస్టుకు పళని అప్పన్ ఇంటర్వ్యూ చేశారు. 'దేశ భక్తులకు ఈ స్థితి పడుతుంది అనుకోలేదు' అని సానుతాపం వెల్లడించారు. ఉద్యోగం వస్తుందని వాచ్యంగా చెప్పలేదు.
    
    నేను ఎవరి సిఫారసు - మా అన్నయ్యది సైతం - కోరలేదు. పైరవీ చేయలేదు. ఎవరినీ అర్ధించలేదు. అయినా ఒకే పోస్టులో రెండు అపాయంట్ మెంట్స్ వచ్చాయి. ఒకటి రెవిన్యూ ఇన స్పెక్టర్ - లేవీ, రెండవది టీచరు ఉద్యోగం ఆనాడు ఎంత మురిసిపోయామో! జీవితానికి ఒక ఆలంబనం లభించింది!
    
    మిత్రులంతా రెవిన్యూ ఇన స్పెక్టరు ఉద్యోగానికి వెళ్ళమన్నారు. అది ధాన్యం వసూలుకు సంబంధించిన ఉద్యోగం. 'ఇన్నాళ్ళు దరిద్రం అనుభవించావు. రెండు చేతులా సంపాదించవచ్చు' అన్నారు. ఎందుకో నాకు నాటికీ - నేటికీ దానం మీద ఆశలేదు విజ్ఞాన సముపార్జనే ధ్యేయం. టీచరు ఉద్యోగానికి వెళ్ళాలని నిర్ణయించాను. ఆ రోజుల్లో టీచర్లు మాత్రమే ప్రైవేటుగా పరీక్షలు ఇచ్చే వీలు ఉండేది. బి.ఏ. డిగ్రీ సాధించాలని ఉద్దేశం. అది టీచరుగానే సాధ్యం నేలకొండపల్లికి పోస్టింగ్ వచ్చింది.
    
    పోస్టింగ్ వచ్చింది. ఉద్యోగంలో చేరడానికి బట్టలు లేవు. కొనడానికి డబ్బు లేదు. ఎవరిచ్చారో గుర్తులదు - ముఫ్ఫయి రూపాయలూ ఇచ్చారు. డోర్నకల్లు వెళ్ళాను. ఈ వార్త చెప్పాను. రెండు జతల 'బిన్నీ' బట్టలు కుట్టించాను. అప్పుడు 'బిన్నీ' మిల్లు బట్టలే ప్రసిద్ది.
    
    ఇంటి దగ్గర కమల - అమ్మ చెల్లెళ్ళు సాగనంపారు. మిత్రులు అంతా స్టేషనుకు వచ్చారు. నన్ను రైలు ఎక్కించి పంపించారు.
    
    గార్లతో నాకు అనుబంధం ఏర్పడింది. గార్ల ప్రజలు నాకు పోరాటం నేర్పారు. నన్ను పోషించారు. మా కుటుంబాన్ని పోషించారు. అంతేకాదు - ఆత్మీయత చూపించారు. ఆప్యాయత కురిపించారు.
    
    ఏరు - ఏటిమీది వంతెన - పొలాలు - రాతిస్తంభం - శివాలయం లక్ష్మీనారాయణ కోవెల - గాంధీ పార్కు - జండా బజారు - వెంకటేశ్వరస్వామి విడిది - పీఠలకొట్టం - పెద్ద బజారు - భయ్యా మిఠాయి దుకాణం - రామలచ్చయ్య హోటలు - పోస్టాఫీసు - స్టేషను - వీటితో కలకాలపు అనుబంధం.
    
    వీటిని అన్నింటినీ వదిలి వెళ్ళిపోతున్నాను. ఆడపిల్ల తల్లిగారింటికివలె అప్పుడప్పుడూ వస్తాను. అయినా గార్ల వదలినట్లే!
    
    హృదయం భారంగా ఉంది.
    
    గుండె బరువుగా ఉంది.
    
    గొంతు నిండిపోయింది.
    
    కనులు చెమ్మగిల్లాయి.
    
    జీవనం ఒక యానం. ఒక మజిలీ దాటాం.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.