Home » Dr Dasaradhi Rangacharya » Jeevanayanam
అయితే వినోబాజీ ప్రారంభించిన భూదానం విజయవంతం అయిందా అంటే కాలేదు. అందుకు వినోబాజీ బాధ్యులు కారు. అది స్వప్రయోజనపరుల చేతుల్లో పడింది. ధ్వంసం అయింది.
ప్రపంచాన్ని అచ్చరువులో ముంచిన మహాత్ముని అహింసా సిద్దాంతం ఏమయింది? స్వప్రయోజనపరుల చేతుల్లో పడింది. ధ్వంసం అయింది.
ఈ స్వప్రయోజనపరులని లెక్క లేనన్ని అవతారాలు. వారు బుద్దుని నుంచి గాంధీ వరకు అందరినీ మింగారు. వారికి తమ రంగు పులిమారు. వారే వీరని జనాన్ని భ్రమింపచేశారు. తమ పబ్బం గడుపుకున్నారు. వీరిని గుర్తించడం తేలికే. ఎదిరించడం కష్టం!
వెదిరె రామచంద్రారెడ్డిగారు తొలిభూదానంలోనే ఇసుమంత కాపట్యం ఉందంటారు. వారి తండ్రిగారు పరమపదించేప్పుడు భూదానం చేయవలసిందని ఆదేశించారట. అది వినోబాజీకి ఇచ్చిన భూదానంతో కలిసి వచ్చిందట!
మరొక మెరుపు. రావి నారాయణరెడ్డిగారు కమ్యూనిస్టు వారి ఊరు బొల్లేపల్లి. పోచంపల్లికి దగ్గర రామచంద్రారెడ్డిగారు రావివారి బంధువు.
రావి నారాయణరెడ్డిగారు - భూదోనోద్యమం పుట్టుకముందు - 1942 ప్రాంతంలో- ఎర్రబల్లి - ధనరెడ్డిపల్లి గ్రామాలలోని 500 ఎకరాల భూమి హరిజనులకు పంచిపెట్టారు!
ఎంతటి ఉద్యమం అయినా వ్యక్తుల శ్రద్దాసక్తుల మీద ఆధారపడి ఉంటుంది. మానవులలో మానవత - నైతికబలం పెంపొందుతేనే ఏ ఉద్యమం అయినా ఏ సంస్కరణ అయినా ఫలిస్తుంది.
ఉద్యమాలూ సంస్కరణలూ బలప్రయోగంవల్ల సాధ్యపడవు. ఇది చరిత్ర చెప్పిన అతి వాస్తవ సత్యం.
ఇరవయి ఆరు
నీడవంటితోడు:
కమల వచ్చింది. ఆమెను అన్నయ్య తీసుకొని వచ్చారు. కమల 1949 జనవరిలో వచ్చింది. అంతకుముందు ఒకసారి అత్తగారు కమలను తీసుకొని వచ్చారు. స్వాతంత్ర్యం రావాలి; కమల రావాలి అని ఆనాటి ఆవేశంలో వల్లించాను.
ఇప్పుడు స్వాతంత్ర్యం వచ్చింది. అది మనకోసం కాదని తేలింది. ఆవేశం అడుగంటింది. కమల మా ఇంట్లోనే కాదు - నా జీవితంలో ప్రవేశించింది. 'ప్రాణం పోతేనేం' అని పోరాడామే! ప్రాణం పోయిఉంటే పాపం కమల! ఈ ఆలోచనయే రాలేదు ఆనాడు! ఆవేశం ఆలోచనను చంపుతుంది. కమల అదృష్టమో నా ఆయుష్యమో - భగధనుగ్రహమో నేను జీవించి ఉన్నాను. కమల వచ్చింది!
1940లో మా పెళ్ళి అయింది. అప్పుడు నాకు పన్నెండు- కమలకు ఏడేళ్ళు! ఈ తొమ్మిది ఏళ్ళలో మేమిద్దరం మాట్లాడుకున్నది సుమారు లేదు. తొమ్మిదేళ్ళ తరువాత ఇవ్వాళ వచ్చిన కమల నా జీవితంలో ప్రవేశించింది. కాదు - నా జీవితాన్ని ఆక్రమించుకుంది!
స్త్రీ తన మెత్తని అడుగులతో - చప్పుడు కాకుండా - పురుషుని జీవితంలో ప్రవేశిస్తుంది. అప్పుడు జీవితం చిగురిస్తుంది. అంతకు ముందుటి జీవితం మోడు మాత్రం అనిపిస్తుంది. అది బతుకా - జీవితమా అర్ధం కాదు.
స్త్రీ మాత్రమే జీవితాన్ని సార్ధకం చేయగలదు.
కమల ఎంతటి పిల్ల! అలా పరిమళంలా వచ్చింది. జీవితాన్ని సురభిళం చేసింది. ఆమె అతి చకచక్యంగా కలిసిపోయింది.
కమల నా బట్టలు - ఉన్నవే - సర్దిపెట్టింది. పుస్తకాలు ఒకచోట చేర్చింది. సిగరెట్టు పీకలు లేకుండా శుభ్రం చేసింది. స్నానానికి నీళ్ళు తోడింది. వీపు రుద్దింది. తువ్వాలుతో తల తుడిచింది. వళ్ళు తుడుచుకోవడానికి తువ్వాలు అందించింది. వేళకు భోజనం - ఉన్నదే - వడ్డించింది. ఎదురుగా కూర్చుంది. విసనకర్రలతో విసిరింది. కొసరి కొసరి తినిపించింది. నా రాక కోసం కనులు పరచుకుని ఎదిరి చూచింది.
మాకు 'శోభనం' ఎవరూ ఏర్పాటు చేయలేదు. ఉన్నంతలో నులక మంచం పరుపు-చిరిగినా దుప్పటి పరిచింది కమల. పూలు లేవు. పూల మంచాలు లేవు. ఊదు బత్తీలు లేవు. పాలు లేవు. పండ్లు లేవు. మిఠాయిలు లేవు. అయినా తొలిరేయికి ఇవన్నీ అనవసరం అనిపించింది. మేము మనసులు విప్పుకున్నాం. ముచ్చట్లతో మనసులు నింపుకున్నాం. మా మనసులు రెండు కాదు ఒకటి అనుకున్నాం. కష్టసుఖాలు కలిసి పంచుకుందాం అనుకున్నాం. ఆ మాట నిలుపుకున్నాం. అర్ధశతాబ్ద పుపై దాంపత్యంలో కలిసి ఏడ్చాం. కలిసి నవ్వాం. సుఖాలు తక్కువ. కలిసి కష్టాలు అనుభవించాం.
కమలా నేను కలిసి ఏటికి వెళ్లాం, స్నానాలు చేశాం. బిందెలతో మంచినెలలు తెచ్చాం. నేను కట్టెలు కొట్టాను. కమల వడ్లు దంచింది. పిండి విసిరింది. ఇల్లు అలికింది. ముగ్గులు పెట్టింది. వంట చేసింది. మా ముగ్గురు చెల్లెళ్ళను సవరించింది. అమ్మను ఆదరించింది. ఇంటికి ఒక కొత్త శోభ తెచ్చింది.
ఆనందానికి 'అర్ధం' అంతగా అవసరం లేదని అర్ధం అయింది.
కమలా - నేనూ వెన్నెట్లో రైలు కట్ట పక్కనుంచి నడిచి డోర్నకల్లు వెళ్లాం. లైలా-మజ్నా, 'దేవదాసు', 'మల్లీశ్వరి' లాంటి సినీమాలు చూచాం. కాలినడకన తిరిగి వచ్చాం.
సంబరం వయసులో ఉంది - డబ్బులో లేదు!
కమల నా జీవితంలో వెన్నెలలా ప్రవేశించింది. అది నిజమే. కాని బాధ్యతలు పెంచింది. బాధ్యతలు ఎరుకపరిచింది. జీవితానికి నిలకడ కావాలి. జీవిక కావాలి, అందుకు సంపాదన కావాలి!
'సంపాదన' అంటే ఏమో తెలియకుండా ఇంతకాలం గడిపాం. దేశాన్ని ఉద్దరిస్తానని ఆరో క్లాసులో చదువు చెడగొట్టుకున్నాను. తోడివాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను ఆలస్యంగా లోకంలో ప్రవేశించాను.
రాజకీయాల అరాచకం చేతకాదని తేల్చుకున్నాను. కొత్త ఖాదీవారు నన్ను దరికి చేరనివ్వరు అని అర్ధం అయింది. పలుకుబడి త్యాగాన్ని త్యజించింది. అది అధికారం వెంటపడింది. కాలం వేషం మార్చింది. నీతి నిజాయితీల బట్ట మార్చింది. అవినీతి, అన్యాయపు వేషం వేసింది.
నేను వేషం మార్చడం చేతకానివాణ్ణి బతుకునకు ఆర్జన అవసరం, ఉద్యోగం తప్ప ఆ రోజుల్లో అన్యం నాస్తి. ఉద్యోగానికి సర్టిఫికేటు కావాలి. 'దేశభక్తి' ఎందుకూ కొరగానిదని తేలిపోయింది!
ఆరో తరగతిలో చదివిన చదువు మరిచాను. ఇంతకాలం పనికిరాని చదువు వెంట పడ్డాను! ఇప్పుడు నన్ను ఆరో తరగతిలో చేర్చుకొమ్మన్నా పైరవీ చేయాలి! ఖద్దరు వాళ్ళను అర్ధించాలి!!
పైరవీ చేయడం - అర్ధించడం జీవితంలో చేతకాలేదు! మెట్రిక్ పరీక్ష ఇద్దామనుకున్నాను. ఆనాడు చదువుకు ఈనాటి అవకాశాలు లేవు. అలీఘర్ - ఆంద్ర విశ్వవిద్యాలయాలు మాత్రమే ప్రైవేటుగా మెట్రిక్ విధ్యార్దులను అనుమతిస్తున్నాయి. అలీఘర్ వెళ్ళలేను. 'ఆంద్ర' కు వెళ్ళడానికి నిశ్చయించుకున్నాను.
ఈ ఊళ్ళో నేనే విద్యావంతుణ్ణి, నాకు ఎవడు చదువు చెపుతాడు? బెజవాడలో ట్యుటోరియల్స్ ఉన్నాయి. డబ్బులేదు. కరస్పాండెన్స్ కాలేజీ ప్రైవేటుది ఉండేది. కొంత డబ్బు కట్టాను. పాఠాలు వచ్చాయి. తరవాత కట్టలేకపోయాను. నిలిచి పోయాయి.
నా వద్ద ఉన్నదీ కృషి మాత్రమే! పుస్తకాలు తెచ్చుకున్నాను. రాత్రింబవళ్ళు చదివాను. రాత్రిళ్ళు లాంతరుకు కిర్సనాయిలు కరువయింది. సంపాదన లేని కుటుంబంలో నా స్థాయి తగ్గింది. కమలకు కష్టాలు మొదలయినాయి. ఇద్దరం సంహించాం.
ఈలోగా అన్నయ్యకు, చెల్లెళ్ళకు పెళ్ళిళ్ళు! మేనవాళ్ళు సహితం మాకేమీ లేదని అన్నయ్యకు పిల్లలను ఇవ్వలేదు. ఒక విధవ సంబంధం చూచాం. వారూ ఇవ్వమన్నారు. రాయచూర్ నుంచి - మా ఇప్పటి బావగారు - ముడుంబ శ్రీనివాసాచార్యులవారు వచ్చారు. వారి చెల్లెలు - ఇప్పటి మా వదినను - అన్నయ్యకు ఇస్తామన్నారు. మా చెల్లెలు శకుంతలను చేసుకోవలసిందని షరతు పెట్టాం. వారు అంగీకరించారు.
అయితే, ఎదురుబదురు చేసుకోవడం అమ్మకు ఇష్టం లేదు. మరొకటి గోత్రాలు మావీ, వారివీ ఒకటే అందుకూ అమ్మకు ఇష్టం కాలేదు. అయితే, అప్పుడు మాకు వాటిమీద నమ్మకాలూ లేవు, గత్యంతరమూ లేదు. పెళ్ళిళ్ళకు అమ్మ రాలేదు. మేమే వెళ్లాం.
పెళ్ళిళ్ళు రాయచూర్ దగ్గరి 'బిచ్చాల' గ్రామంలో జరిగాయి. అన్నయ్య పెళ్ళికి నేనూ - కమలా పీటలమీద కూర్చున్నాం. శకుంతల పెళ్ళికి అన్నయ్యా వదినా కూర్చున్నారు. పెళ్ళిళ్ళ తరువాత గార్లలో ఏమీ ఏర్పాట్లు చేయలేదు -చేయలేము.





