Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9
ఇంద్రధనుస్సు
ఇంద్రధనస్సు లో కేవలం ఏడు రంగులున్నాయి. కానీ, ఇక్కడి పువ్వులలో వున్న రంగులకి అంతం లేదు. కనుచూపు మేరంతా ఎడతెగని రంగుల శోభ. ఊర్మిళకి ఈ రంగులన్నీ వివరించలేదేమో తాను! ఇంద్రధనస్సు రంగులు ఏడూ సహజంగా వొక్క సూత్రంలో చెప్పగలిగాడు - పరీక్ష ప్రశ్న పత్రాల్లో జ్ఞాపకం పెట్టుకోడానికి సులువైన ఉపాయమది.
అందుకని క్లాసులో ప్రతివాడూ ఫేలవుతున్న యుధిష్టిరుడు భూష్ పండితుణ్ణి మెచ్చుకునేవాడు.
ఇవాళ ఇక్కడి పువ్వులు చూసి వెనకటి మాటలు తనువుకి వచ్చేవి యుధిష్టిరుడికి. కళ్ళముందు కొండల మీద కొండలు - కనుచూపు మేర కీకారణ్యం. ఒకటి రెండు కొండలు గడ్దీగాదా ఏదీ లేకుండా బోడీగా నుమ్చున్నాయి. శైవసన్యాసుల్లాగ. ఎవరు ఎత్తు ఎదుగుతారా అని పోటీ పడుతున్నట్టున్నా యవి. కొండల మధ్య పూల వనం, మధ్య ముసుగులో ముద్దరాళ్ళలాగ సెలయేళ్ళు. ఇదిగో, ఇలాటి కొండ ప్రదేశానికి వచ్చాడు తాను. అయితే (ఒడిశా) వరుణాయి పర్వతానికి, ధవళగిరికీ మధ్య ఎంతో తేడా వుంది. కాని, పువ్వుల మాటా? ఇన్ని పువ్వులు ఎక్కడా చూడలేదు తాను.
ఇక్కడ రంగులే రంగులు. దానికి తోడు ఎన్నో విచిత్రమైన కీటపతంగాలూ, పక్షులూ, పశువులూ, వాటి స్వర్ణాలున్నూ ఇక్కడి మట్టి కొత్త కొత్త రూపాలతో పువ్వులుగా పూసినట్టుంది. పువ్వులు జీవన్యాసం పొంది చింతగీరులూ, మిడతలూ, సీతాకోకచిలుకలు, పిట్టలూ, అయినట్టున్నాయి. ఎగురుతున్నాయి. పాడుతూ తిరుగుతున్నాయి. పెద్దపులులూ, ఎలుగుబంట్లూ, గొరపోతులూ అయి అరుస్తున్నట్టున్నాయి.
మరో విచిత్ర జంతువూ మనిషి కదల - ఒక తలకాయ , ఒక ముక్కు రెండు కళ్ళు, రెండు చెవులు, రెండు చేతులు, రెండు కాళ్ళు -తిన్నగా సరళరేఖలా నిలబడి నడుస్తున్నాడక్కడ. కనీ వినీ ఉండని - సభ్యత లేని మనిషి. ఈ అనాగరిక, అసభ్య ప్రదేశంలో ఒకనాడు వినపడింది సభ్య ధ్వని. ఆ ధ్వనిలో అక్కడి పక్షుల, పశువుల, మిడతల స్వరం లీనమై పోయింది. ఆకాశ వాయువు కంపించింది. పర్వతాఅరణ్యం వుర్రుతలూగిపోయింది. పట్నాలూ, బజారులూ నిర్మించి సభ్యులనిపించుకునే మనుషులు కొందరు ఇక్కడ పేల్చారు తుపాకులు.
యుధిష్ఠిరుడు తన ఒడిశా ప్రాంతంలో ఆదిమవాసుల్ని చూశాడు . ఇక్కడి మనుషుల్ని చూసి పోల్చుకునేందుకు ఎన్నో కొత్త కొత్త ఉపాదానాలు దొరికాయతడికి. భూమ్మీది మనుషులందరూ ఎప్పుడో ఒకనాడు ఇలాటి అడవిలోనే పుట్టి వుంటారు. అందులో కొందరు అడవులు కొట్టి, దార్లు వేసి, పట్టణాలు కట్టి, సభ్యులనిపించుకుని వుంటారు. అదిగో, అలాటి సభ్యుల వెంట ఇక్కడికి వచ్చాడు యుధిష్ఠిరుడు. తాను ఒక్కడే కాదు - వేలు వేలు తనతో కూడా వచ్చారు. కొందరి మొహాల్లో గడ్డాలున్నాయి. కొందరి మొహాల్లో మీసాలున్నాయి. కొందరికి మీసాలూ, గేడ్డాలూ వున్నాయి. కొందరు నల్లగా వున్నారు. కొందరు తెల్లగా వున్నారు. కొందరు చామన చాయగా వున్నారు. కొందరు ఎర్రగా వున్నారు. కొందరు రాగి రంగుతో వున్నారు - అంతా ఇంద్రధనస్సు లా వున్నారు.
కొండల అవతలి నుంచి మిడతల దండులా వచ్చి పడుతున్నారు . మరి కొందరు సభ్య మనుషులు. పసుపచ్చగా వుంది వాళ్ళ రంగు. గేడ్డాలూ, మీసాలూ లేవనే చెప్పాలి. బోడి కొండల్లా వున్నాయి మొహాలు. 'దబాయించిన వాడిదే రాజ్యం' అంటారు వాళ్ళు. అది తమ పూర్వ పురుషుల సాగు భూమట! వాళ్ళ మహావీరుడు పాన్కు భూమండల మంతా ఎలేవాడట! నిజం దేవుడెరుగును. పూర్వ ప్రభుత్వం తమది ఇప్పుడూ వుండాలని వాళ్ళ పట్టుదల. ఇదే వాళ్ళ తోలి జన్మ స్థానమట! ఇక్కడే వాళ్ళ బతుకట!!
యుధిష్ఠిరుడు అన్నీ ఎరక్కపోయినా , రాజ్యాలు ఏర్పడని నాటి నుంచి అదే తమ జన్మభూమి. ఈ కొండల సందు గొందుల్లో కోనల్లో, గుహలలో - ప్రతి రాతి మీదా తమవారి గుర్తులున్నాయి. అక్కడే నైమిశారణ్యం. అక్కడ్నుంచే వేదాలు, ఉపనిషత్తులు , మహాభారతం, రామాయణం - అన్నీ వెలువడి కన్యాకుమారి దాకా పాకాయి. అక్కణ్నుంచి కన్యాకుమారి దాకా పుణ్యభూమి భారత వర్షం. అక్కణ్నుంచే వచ్చాడు వ్యాసుడు - అక్కణ్నుంచే వచ్చాడు వాల్మీకి, వసిష్టుడూ, విశ్వామిత్రుడూ, మనువూ పరాశరుడూ , బుద్దుడూ అక్కణ్నుంచే వచ్చారు. కత్తులతో వారు ఏలలేదు. ధర్మంతో అహింసతో, శాంతితో ఏలారు దేశం.
కొండ అవతలి సభ్యతా, ఇవతలి సభ్యతా పుట్టించిన ధ్వని వల్ల అక్కడి పశువులూ, పక్షులూ, అడివి ప్రాంతం మనుషులూ ఇళ్ళూ వాకిళ్ళు వొదిలేసి పారిపోయారు. కీకారణ్యంలో దాక్కున్నారు. ఆ కీకారణ్యం ఎన్ని బాబిలోన్లనీ, ఈజిప్టుల్ని, హరప్పాలనీ మొహంజాదార్లనీ, ఎన్ని సారంగగదాల్నీ , జవుగాదాల్నీ మింగిందో! యుధిష్ఠిరుడి దగ్గర ఆ లెక్కలేమీ లేవు. ఇప్పుడు అతడొక యువకుడు. ఎన్నాళ్ళయో ఒడిశా మిలిటరీ లో చేరాడతడు. ఇప్పుడు పిలుపు వచ్చింది. సీమాంతంలో యుద్దానికి వచ్చాడు. దేశం పిలుపు - దురాక్రమాణం చేసిన చీనావాళ్ళని హతమార్చాలి. తనవంటి వేలాది యువకులు అన్నీ ప్రదేశాల నుంచీ వచ్చి పడుతున్నారు. సీమాంత ప్రదేశానికి. అక్రామంగా చైనా చేస్తున్న రక్తపాతాన్ని రక్తం ధారపోసి ఆపుతారు వాళ్ళు, తమ ధర్మంలో ఇతర్లని కలపడానికి మనుషుల్ని నరికేవారు పూర్వం. అదిగో , అలాటిదా ఆ రక్త పాతం? సరిహద్దు తగాయిదా అన్న మిష మీద రాజకీయంగా ఉన్నతి సాధించడానీకా? కాదు, అదేమీ కాదు . ఇది అన్యాయం , సహించరాని అక్రమం. ఈ అసత్యం ఆపుచేసి సత్యం పటిష్టించాలి.
ప్రతి జవాను పరివారాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందనీ, వారి పిల్లల చదువు సంధ్యలూ, భార్య బిడ్డలా తిండి తిప్పలూ - అన్ని భాద్యతలూ ప్రభుత్వమే వహిస్తుందనీ సర్కారు ప్రకటించింది. అయితే, ఆ విషయంలో యుధిష్ఠిరుడు విచారించలేదు. అటు, ఉత్సాహమే లేదతనికి. ఇంటి దగ్గర తిండికి లోపం లేదు. ఊర్మిళ గ్రామ సేవికగా ఉండి గడిస్తున్నది. తల్లీ కొడుకులకి చాలు. తన జీవితం కోసం వాళ్ళు ఎదురుచూసేవాళ్ళు కారు. అయితే , తాను ముక్కూ మొహం తెలీని చోటికి వెళ్ళడం, మోహమెరగనివాళ్ళతో లడాయి చెయ్యడం - ఇదే అతణ్ణి నిచ్చేర పాటు కలిగించింది. అంతా దట్టమైన పొగ మంచులా వుందతడికి. ఆ విస్మయంలో భయం కూడా లేదని చెప్పలేడతడు. పై వూరు నీరు లాగ, వున్న వూరు మశానం లాగ మధ్య మధ్య గుండె దడదడలాడింది. మళ్ళీ ఉత్సాహం, ఉన్మాదం వులికేది. ఉహూ - ఈ ప్రదేశంలో తన శక్తీ సహనమూ ప్రదర్శిస్తాడు. ఎన్నాళ్ళయో ఇలాటి అవకాశం కోసం నిరీక్షిస్తున్నాడతడు. తన జీవనంలో తొలిసారి జయిస్తాడు తాను. తన తోడి జవాన్లు కొందరు డాక్టరు సర్టిఫికెట్లు సంపాదించి కాయిలా అని మిష పెట్టారు. యుధిష్ఠిరుడు వాళ్ళని జాలి చూపు చూశాడు. ఆ జాలి క్రమంగా అసహ్యంగా పరిణమించింది. 'ఛీ ఛీ, కేవలం డబ్బు కోసం సైన్యానికి వచ్చారు వీళ్ళు."
నిజానికి యుధిష్ఠిరుడు డబ్బు కోసం సైన్యంలో పేరు రాయించలేదు. చిన్నప్పుడు ఏ పనిలో అతడు చేరాలో ఆ పని చెడింది. ఏ కొమ్మ పట్టుకుంటే ఆ కొమ్మ విరిగిపోయింది. ఇక్కడికి జయించాలని వచ్చాడు - కొంచెం పేరు సంపాదించాలని పలుకుబడి, సంపాదించాలని. అదీ సాగదూ, ఫరవాలేదు.
ఊర్మిళ మాట తలపుకి వస్తుంది. సమ్మానం, పలుకుబడి లక్ష్యం లేదు ఆమెకి. "ఏమీ అక్కరలేదు. మీరు చాకిరీ మానేసి వచ్చేయండి. నా గడనతో గడుపుకుందాం. ఒక్కడే కొడుకు. ఏ పదిమందున్నారని?' నవ్వుతూ అనేదామే.
"ఈ ఒక్క కొడుకునీ మనిషిగా తయారుచెయ్యాలంటే ఎంత ఖర్చు కావాలో తెలుసా? మన ఇద్దరి జీతం కలిపినా చాలదు. తన కొడుకు కోసం డేరాడూన్ లో నెలకి మూడు వందలు - అని కర్నల్ సిం చెప్పేవాడు ."
'అయితే అయింది, మనం కర్నల్ సిం కాము కదా?"
"కనకనే ఇద్దరమూ గడించడం అవసరం , అదీకాక, నువ్వు గడిస్తూ వుంటే నేను కూచోనా గూనాడిలాగ?"
"ఓహో , సిగ్గేస్తుంది కామోసు, ఏం?" అవును, మగతనం తరిగిపోతుంది?"
చిరునవ్వుతో బుగ్గ మీద చిన్న చరువు చరిచేది ఊర్మిళ. యుధిష్ఠిరుడి కంటే తన సిగ్గరితనం తక్కువ అనిపించుకోవాలన్నట్టు ఆమె నటన.
నిజంగా చిత్రమైన పిల్ల ఊర్మిళ. తల్లి తండ్రులూ అన్నదమ్ములూ, బంధువులూ - ఎవ్వరి మాట వినకుండా, తుదకి తన అభ్యంతరమూ లక్ష్య పెట్టకుండా తననే పెళ్ళాడాతానని ఆమె చెప్పినప్పుడు నిచ్చేరపోయాడు యుధిష్ఠిరుడు. ఊరి పెత్తందారు , ధనవంతుడు బిసుబాబుగారి కుమారుడు ఆమెని కట్టుకోడానికి సర్వసన్నద్దుడయ్యాడు. అయినా, కాదని వండపొయ్యి, వుండనిల్లూ లేని యుధిష్ఠిరుణ్ణి , ఓ అంటే నా రాని వాణ్ణి వరించింది. కన్నతల్లి కూడా మొహం ముడిచి ఇంట్లో దూరింది. మైనరు స్కూలు హెడ్మాస్టారు తండ్రి సిగ్గుపడి పెళ్ళి పీనేమీదికి రావడం మానేశాడు. అతడికి మారు ఊర్మిళ మామ కన్యాదానం చేశాడు. పది వూళ్ళలో ఈ కబురు బాజాలు మోగింది. ఊర్మిళ మాత్రం ఎవ్వరి మాట వినలేదు. నిందా, అవమానం లెక్కచెయ్యలేదు.





