Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 9



    చాంగ్- సున్ తండ్రి ఆ మాటలు విననట్లే పాత పుస్తకపు పుటలు త్రిప్పి కళ్ళకు దగ్గరగా పెట్టుకొని చదివాడు-
    "హిందూస్తాన్ ప్రజలు అత్యంత శాంతిప్రియులు, సత్యము, పలుకువారు. వారు ఎవరినీ మోసగించరు. అన్ని దేశములతోడను మిత్రత్వ సద్భావము కలిగి యుండును."
    "నాన్నా! ఈ వెర్రి మొర్రి కబుర్లేవరు చెపుతున్నారు నీకు - మాస్కో రేడియో వినడం లేదు కదా?"
    "కావచ్చు. 1400 సంవత్సరాల క్రితం హ్యు - ఎన్ - సాంగ్ మాస్కో రేడియోనే విని ఉంటాడు."
    "నాన్నా! హిందూస్తాన్ విషయంలో ఆ పాత పుస్తకాల్ను విశ్వసించకు. హిందూస్తాన్ సైన్యాలు చైనా మీద దండెత్తాయి. మన దేశాన్ని రక్షించుకోవడానికి మేం వెళ్తున్నాం."
    వృద్దుడు క్రింద వచాల్ను గడగడా చదివేశాడు.
    "నిర్జనములై హిమ క్షేత్రములైన సరిహద్దులకు - ఎంతో రక్తం ప్రవహించిన సరిహద్దులకు - తమ సామ్రాజ్య విస్తరణకు గాను - చైనా సామ్రాట్టులు సైన్యాలు పంపుతున్నారు - సైనుకుల రక్తం ప్రవహింప జేస్తున్నారు."
    "చచ్చి పిడికెడు బూడిదైన కవుల వాగుడు వినే సమయం లేదు నాన్న! శలవిప్పించండి. వెళ్తాను."
    "వెళ్ళు నాయనా, వెళ్ళు ఎవరికి చెప్పి ఈ లోకంలోకి వచ్చావు?' ఎవరికి చేప్పి వెళ్తావు?"
    అంతిమ క్షణాల్లో అతని దృష్టి ఆ రక్త రేఖ వెంట మరొకసారి పయనించి అతని కెదురుగా పడి వున్న మృతుని ముఖం మీద పడింది - దరిద్రుడు చచ్చీ చిరునవ్వు నవ్వుతున్నాడు- ఓడీ గెల్చినట్లు - చచ్చీ అమరుడైనట్లు ! ఎందుకలా నవ్వుతున్నాడు? అవును. చచ్చినా తన మాతృభూమిలో సమాధి అవుతాడు. మరి తానో? పరాయి దేశంలో ....! అతనిని తన మాతృదేశపు మృతిక ప్రేమతో తన ఒడిలోకి తీసుకుంటుంది. అతని తలిదండ్రులూ , భార్య బిడ్డలు సమాధి పై పూలు చల్లడానికి వస్తారు.
    ఆ చిరునవ్వు చిందులాడే ముఖం ఎవరిది?
    నేనే చంపాను అతణ్ణి - నా చేత్తో - నా తుపాకితో , అయినా, అతదేవడో నాకు తెలీదు. ఎందుకు? అతను నా చేతిలో చావడానికి ఎందుకు వచ్చాడు! - ఇంతదూరం ! మరికొన్ని క్షణాలు - అంతే - నేను చనిపోతాను. నాతొ పాటు ఈ ప్రశ్నా చనిపోతుంది - అంతమౌతుంది. నాతో పాటు ఆ ప్రశ్నకూ సమాధియే గతి.
    తన బొంది నుంచి క్రమక్రమంగా జారిపోతున్న ప్రాణాలను బిగపట్టి నిలుపుకున్నాడు. ఎడమ చేత్తో గాయాల్ను ఒత్తి పట్టి కుడిచేతి ఊత దేకడం ప్రారంభించాడు - మంచు మీద దేకింది కొన్ని గజాలే అయినా మూడు వేల మైళ్ళని పించిందతనికి- హాంగ్ - చౌ నుంచి బొమ్డిల్లా వరకు నడచినట్లనిపించింది. ఆ సుదీర్ఘ ప్రయాణంలో ఒక రక్త రేఖ - ఎర్రని నెత్తుటి గీత - అతనికి మార్గదర్శకత్వం వహించింది. - అది భారతదేశపు సరిహద్దు దాకా తీసుకుని వచ్చింది. అతడిప్పుడొక దరహసిత ముఖం చూస్తున్నాడు.  
    చలికి కొంకర్లు పోతున్న అతని వెళ్ళు భారతీయ సైనికుని జేబుల్ను సోడా చేశాయి - మూడు కాగితాలు, ఒకానొక భారతీయ బాషలో కనిపించాయి - ఒక పాకెట్లు- అందులో రెండు ఫోటోలు - ఒకటి కాటుక కళ్ళ విశాల నేత్రాల యువతిని - మరొకటి ముగ్గురు పాపలది- ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల ..... లిన్ - కూ, చిన్న చింగూ,చిన్న మేమీ,తన మేధస్సుకేమైంది? వాళ్ళు తన పిల్లలా? కారు. భారతీయ సైనుకుని బిడ్డలు. పాకెట్లోంచి ఒక కార్డు తీశాడు. దాని మీద తప్పక అతని పేరూ చిరునామా ఉంటాయనుకున్నాడు. చనిపోయేముందు తానేవరిని చంపిందీ , తన నెవరు చంపిందీ తెలిసిపోతుందనుకున్నాడు.
    కార్డు మీద ఇంగ్లీషు అక్షరాలున్నాయి. చాలాకాలం క్రితం కాలేజీలో ఇంగ్లీషు చదివాడతను -- గుణించుకొని మెల్ల మెల్లగా చదివాడు.
    Life member, India - china Frindship Association- జీవితకాలం భారత చైనా మైత్రీ సంఘ సభ్యుడు.
    చాంగ్ - సున్ ముందు ఆ కార్డు, ఆ ముఖం, భూమి , ఆకాశం - అన్నీ గిరగిరా తిరిగాయి.
    "జీవిత కాలం!" అతడాలోచించాడు. 'ఇప్పుడా భారతీయుని బొందిలో ప్రాణం లేదు. జీవితం అంతమైంది.'
    కాని ......అతని ప్రాణాల్ను హరించిందేవరు?
    ఒక చైనీయుడు .....ఒక చైనావాడు!
    చైనా, భారతదేశాల మైత్రి ఏమిటి? ఎందుకు? ఎక్కడ?
    భారతీయ సైనికుని బ్రతుకేమైంది?
    ఎవరు అతణ్ణి హత్య చేసింది?
    ఎందుకు?
    ఇంతవరకూ భయంతో మెదడులో దాగి ఉన్న ప్రశ్న ఇప్పుడు - అమాంతంగా బహిర్గతం అయింది.
    ఎందుకు?
    కార్డు చేతి నుండి జారి పడిపోయింది. మంచు మీద పడిన దాన్ని లేవనెత్తాలనుకున్నాడు చాంగ్- సున్ . కాని చలితో - మంచు చలితో - చావు చలితో కొంకర్లు పోతున్న వ్రేళ్ళు స్వాధీనం తప్పాయి. రెండు చేతుల్తోనూ ప్రయత్నించినప్పటికీ ఎత్తలేకపోయాడు ఆ కార్డును.
    చేతులెత్తి స్వాధీనం తప్పిన తన చేతి వ్రేళ్ళను చూచుకున్నాడు. రక్తం కనిపించింది. వ్రేళ్ళకు - వ్రేళ్ళకు రక్తం కనిపించింది.
    ఎవరి రక్తం ?
    చూపు క్రిందికి వంచి చూశాడు. అక్కడ - అదేచోట - రెండు రక్తరేఖలు - నెత్తుటి గీతలు - కలిసి ఏకమైపోయినాయి.
    అతని చేతికి రెండు రక్తాలూ - ఆ భారతీయ సైనికునిదీ , తన స్వంతపుదీ - అంటివున్నాయి.
    తరువాత - రక్తరంజీతాలైన అతని రెండు చేతులూ ప్రశ్నార్ధకంగా విశాల నీలాకాశం వైపు లేచాయి.
    "ఎందుకు?"
    జీవితపు అంతిమ క్షణాల్లో మేమీ "ఎందుకు?" అని ప్రశ్నించినట్లనిపించింది. వృద్దుడైన తన తండ్రి "ఎందుకు?" అని ప్రశ్నించినట్లనిపించింది. తన ముద్దుల కొడుకు  వచ్చీ రాని పలుకుల్తో "ఎందుకు నాన్నా?" అన్నట్లనిపించింది.
    చావు వెక్కిలితో బాటు అతని నోటి నుండి ఒకే ఒక శబ్దం వెలువడింది -
    "ఎందుకు?"
    కాని, రక్తం పులుముకున్న మంచుకు తాకిన, చనిపోయేవాని గొంతు నుండి వెలువడ్డ ఆ ప్రశ్న జీవం పోసుకుని బ్రతికి నిలిచింది....
    "ఎందుకు?"
    హిమాచ్చాదితములైన కొండలన్నీ అదే ప్రశ్నను ప్రతిధ్వనించాయి.
    "ఎందుకు?"
    ప్రశాంతమై అనంతమైన నీలాకాశంలో - భారతదేశం నుండి చైనా వరకూ వ్యాపించి ఉన్న ఒకే ఒక నీలాకాశంలో - ఆ ప్రశ్న ప్రతిధ్వనించింది. హిమాలయపు మంచు చలి నుండి తప్పుకోవడానికి , పెకింగ్ వైపు ,ఆకాశంలో ఎగిరి పోతున్న పక్షుల పంక్తులు ఈ ప్రశ్నాఘాతానికి విలవిల్లాడెయి.

                                          *  *  *  *




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.