Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    వృద్దురాలు : పట్నం నిండా నీ పాటలే మ్రోగుతుంటే , రెండో కారణం బేగమ్ గారు లక్నో వారు.
    నేను : మీరు కూడా లక్నోవారేనా ?
    వృద్దురాలు : నీకెలా తెలుసు?
    నేను : మీ మాట తీరు దాగుతుందా?
    వృద్దురాలు : అవును. నేను అక్కడి దాన్నే. కచేరీకి ఏం తీసుకుంటావో చెప్పు. ఇంకా చాలా పనులున్నాయి.
    నేను : నా వెల అందరికీ తెలిసిందే. యాభై రూపాయిలు పుచ్చుకుంటాను. కాని బేగమ్ గారు లక్నో వారు. పైగా ఆదరంతో నన్ను పిలిచారు. వారి నుండి ఏమీ తీసుకొను. గోష్ఠి ఎప్పుడు?
    వృద్దురాలు : ఈ రోజు సాయంకాలం. ఈ రూపాయిలూ చిల్లర ఖర్చుకు తీసుకో. మిగతావి అక్కడ లభిస్తాయి.
    నేను : (డబ్బు తీసుకొని) ఇదేం అవసరం? అయినా బేగమ్ గారు నొచ్చు కుంటారేమోనని తీసుకుంటున్నాను. ఇల్లెక్కడ? అడిగాను.
    వృద్దురాలు : ఇల్లు కాస్త దూరం. నవాబ్ గంజ్ లో . ఈ కుర్రాడు సాయంకాలం వస్తాడు. అతని వెంట వచ్చేయి. ఒక విషయం గుర్తుంచుకో. వెంట మీ ఇంటికి వచ్చే మగవాళ్ళేవరూ ఉండకూడదు.
    నేను : వాద్యగాళ్ళు?
    వృద్దురాలు : వాద్యగాళ్ళు. సేవకులు రావచ్చు. మరెవరూ ఉండరాదు.
    నేను : వెంట తెచ్చేంత పరిచయం గలవా రేవరున్నారిక్కడ ? ఎవరూ రారు.
    ఇంతలో సేవకుడు హుక్కా తయారుచేసి తెచ్చాడు. నా సంజ్ఞ ప్రకారం ముసలావిడ ముందుంచాడు. హుక్కా ఆనందంగా పీల్చింది. నేను ఒక తమలపాకుకు సున్నం రాచి, కాచు వేసి వక్కల డబ్బాలో పడి ఉన్న సన్నని పొడి , యాలకుగింజ నలిపివేసి చుట్టి ముసలవ్వకు ఇచ్చాను.
    వృద్దురాలు : హయ్యో బిడ్డా! పళ్ళేక్కడున్నాయి పాన్ నమలడానికి?
    నేను : తినండి. మీకు తగిన తాంబూలమే సిద్దం చేశాను.
    ముసలవ్వ తాంబూలం వేసుకొని చాల సంతోషించింది. ఇది మా నగరపు మర్యాద అని పొగడుతూ వెళ్ళిపోయింది. "కాస్త పొద్దుండగానే వచ్చేయి. గడియ పొద్దుండగానే ఉత్సవం మొదలు అవుతుంది."
    నేను : అది కచేరీ ఆచారం కాదు. అయినా బేగమ్ గారు శలవిచ్చారు. కాబట్టి పెందలకడనే వచ్చి అభినందన గీతం పాడుతాను.
    జన్మభూమి విలువ బయట ఉన్నప్పుడు గాని తెలియదు. కాన్పూరులో వందల కచేరీలు జరిగాయి. కాని ఇంత ఉత్సాహం కలుగలేదు. సాయంకాలం కోసం నిరీక్షిస్తూ కాలం గడిపాను. వేసవిపగలు కొండలా ఉంటుంది. కష్టంగా గడిచింది. అయిదు గంటలకు కుర్రాడు వచ్చాడు. మొదటి నుంచే సిద్దంగా కూర్చున్నాను. వాద్యగాళ్ళను కూడా పిలిపించాను. కుర్రాడు ఇల్లు ఎక్కడుందో చెప్పాడు. ప్రయాణమై వెళ్ళాను.
    బేగమ్ గారి ఇంటికి గంట దోవ. కాలువ పక్కన తోట ఉంది. నాలుగువైపుల నాగజముడు , ఇతర ముళ్ళ చెట్లు ఎత్తుగా పెంచారు. అది ఒక గోడలా తయారైంది. తోట పూర్తిగా ఆంగ్లపద్దతిలో ఉంది. తాటి, కర్జూరచెట్లు వరుసలుగా ఉన్నాయి. అంచులకు కత్తిరించబడిన ఎరుపు చెట్లు, నలువైపుల పచ్చదనం . అక్కడక్కడ రాళ్ళతో గుట్టల్లాంటివి చేశారు. వాటి మీద అనేకరకాల చెట్లు రాళ్ళలోంచి మొలచి నట్లున్నాయి. తోటలో నలువైపుల కాసారములు నిర్మించబడినాయి. వాటిలో ముత్యం లాంటి శుభ్రమైన నీరుంది. మాలీ గొట్టాలతోనూ, జలయంత్రాలతోనూ నీరు పెడ్తున్నారు. ఆకుల నుండి నీటి బొట్లు రాలుతున్నాయి. పగలంతా నీటికి తపించిన పూలకు నీరు చల్లడం వల్ల ప్రాణం వచ్చింది. ఎంత పచ్చగా , చల్లగా ఆనందంగా ఉంది వాతావరణం!
    జన్మదినోత్సవం జరిగింది. స్త్రీల పాటలు వినిపించాయి. ఇవతల నేను అభినందన గేయం పాడాను. శ్యామ కళ్యాణి ప్రారంభించాను. వినేవారు ఎవరూ లేరు. నేను పాడుకున్నాను. బేగమ్ గారు ఒక సవరను, అయిదు రూపాయలు బహుమానంగా పంపారు. కొద్ది సేపటిలో సాయంకాలం అయింది. చంద్రుడు ఉదయించాడు. వెన్నెల పరచుకుంది. కాసారజలం చంద్రకిరణాలతో కలిసి వింత శోభ నిస్తుంది.
    తోటలో సుందర హర్మ్యం. తోట మధ్యన ఒక తటాకం ఉంది. దాని చుట్టూ విదేశపు పూలమొక్కలు అందంగా అలంకరించబడినాయి. ఈ చెరువునకు కలిపి ఒక ఉన్నత వేదిక నిర్మించబడింది. దాని మధ్యన పుష్కలంగా గాలి వచ్చే ఒక చిన్న బంగళా ఉంది. ఈ తటాకం కాలువ నీటితో నిండుతుంది. అందు నీరుపడు ధ్వనితో చల్లదనం వ్యాపిస్తుంది. ఎంత ఆహ్లాదకరంగా ఉంది! సుందర సంధ్యాసమయం. శుభ్రమైన గాలి. రంగురంగుల పూలపరిమళపు గుభాళింపు . అలాంటి వాతావరణం ఎక్కడా చూడలేదు. వేదిక మీద మల్లెలాంటి తెల్లగుడ్డ పరచబడింది. ఒక బాలీసు పెట్టబడింది. దాని ముందు మమ్ము కూర్చుండబెట్టారు. ఈ వేదిక నుండి సౌధం వరకు గులాబి చెట్ల వరుస ఉంది. ఆ మార్గానే బేగం గారు విచ్చేస్తారని తెలిసింది. ఎదురుగా చిల్మనులు వ్రేలాడుతున్నాయి. వేదిక మీద పచ్చని దీపాలు వెలిగాయి. పాడవలసిందని అజ్ఞ వచ్చింది. నేను కేదారం ప్రారంభించాను. చాలాసేపు గానం చేశాను. ఇంతలో ఒక దాసీది రెండు చేతులతో రెండు కమలల్లాంటి గాజుదీపాలు తీసుకొని వచ్చింది. దీపాలు అక్కడ పెట్టి వాద్యగాళ్ళను అతిధి గృహంలోకి వెళ్ళాల్సిందనీ, అక్కడికే భోజనాలు పంపబడతాయనీ చెప్పి పంపించింది. ఇంక అంతపుర గోష్ఠి జరుగుతుంది. వారు వెళ్ళగానే బేగమ్ గారు విచ్చేశారు. గౌరవసూచకంగా లేచి నుంచున్నాను. నన్ను దగ్గరికి పిలిచారు. తాము పరుపు మీద కూర్చొని బాలీసుకు అనుకున్నారు. నన్ను ఎదురుగా కూర్చోవలసిందని సంజ్ఞా చేశారు. సలాము చేసి కూర్చున్నాను. అజ్ఞ కోసం నిరీక్షిస్తూ బేగమ్ వదనాన్ని ధ్యాసగా చూచాను.
        చిలిపి కనులు వెదజల్లు రేఖా చిత్రాలు
        ఎదురుబొదురు మార్కొని చెయు సవాలు!
    ఆతోట , ఆ పరిసరాలు అమరపురి అనే ఆనుమానం కలిగింది. ఎదుట బాలీసుకు అనుకోని కూర్చున్న రంభను చూచి ఆ అనుమానం దూరమయింది. జడ పిరుదుల నంటుతుంది. చిత్రించినట్లున్న కనుబొమలు, గులాబి రేకుల్లాంటి విశాల నేత్రాలు , అందమైన ముక్కు, చిన్న చుబుకము, పచ్చని నాజూకు పెదవులు, మొత్తం రూపంలోనూ వంక కనిపించదు. ఎత్తూ , లావూ కూడా సమానంగా ఉన్నాయి. ఆమె అందాన్ని మించిన అందం చూడలేదు. కొంతవరకు ఖుర్షీద్ ముఖంలో పోల్చవచ్చు. కాని ఎక్కడ ఖుర్షిదు, ఎక్కడ ఈ దేవకన్య! ఖుర్షీద్ ముఖంలో అల్పత్వం కనిపిస్తుంది. ఈమె ముఖాన ఠీవి. ఖుర్షీద్ ఈమె ముందు కొంత వికారంగా కనిపిస్తుంది. శీరీషకుసుమం లాంటి ఈ సాకుమార్యం ఆమెలో ఎక్కడిది? రెండవది ఆమె ముఖం మీద ఎప్పుడూ ఉదాసీనత కనిపిస్తుంది. చిరచిరలాడుతుంది. బేగమ్ గారిలో ప్రసన్నత ఉంది. మాట్లాడితే పూలు రాలుతాయి. మాటకు నవ్వుతుంది. కాని ఆమె ముందు మాట్లాడే ధైర్యం ఎవరికి? అందం, అనందం , నిరాడంబరత, వారిలోనే చూచాను. ధనికులను అంతా స్తుతిస్తారు. నిస్వార్ధంగా అమీరుల ముఖస్తుతి చేసినా దోషం లేదంటాను. బట్టలు, ఆభరణాలు కూడా రూపానికి తగినట్టే ఉన్నాయి. లేత ఎరుపు ముసుగు భుజాల మీద పడుతుంది. బిగుతైన చొక్కా, ఎరుపు పైజమా , చెవులకు పచ్చల దుద్దులు, వజ్రపు ముక్కు పుడక. మెడలో సాధారణ గొలుసు, చేతులకు బంగారు గాజులు, అందం . అందానికి తగిన నిరాడంబరత. అందుకు తగిన దుస్తులు, ఆభరణాలు, ఆశ్చర్యంతో చిత్తరువునై చూస్తున్నాను. నా రూపం ఎలా ఉందో మీరు చూస్తూనే ఉన్నారు. కాని నమ్మండి, ఆవిడ దృష్టి కూడా నాపైనే ఉంది. నన్నే చూస్తుంది. ఇరువైపుల చూపులు కలుస్తున్నాయి. అనేకసార్లు మనసులో ఒక ఆలోచన వచ్చింది. కాని ఎలా వ్యక్తపర్చడం? యేమని చెప్పడం? ఒక దాసీది వెనుక నిలిచి ఫంకా వీచుతుంది. ఇద్దరు ముందు నుంచున్నారు. ఒక దాసీచేతిలో వెండి డబ్బా, మరొక దాసీ చేతిలో పాన్ దాన్ ఉన్నాయి. చాలాసేపు బేగమ్ మాట్లాడలేదు. నేనూ మాట్లాడలేకపోయాను. చివరకు ఆమె ప్రారంభించింది.
    బేగమ్ : నీ పేరేమి?
    బేగమ్ : (చేతులు కట్టుకొని ) ఉమ్రావ్ జాన్.
    బేగం : స్వంతంగా లక్నోయేనా?
    ఆ ప్రశ్నించిన పద్దతికి బదులు చెప్పడం కష్టం అయింది. ముఖ్యంగా ఈ సమయంలో స్వంత ఊరు లక్నో అని చెపితే నా మనసులో ఉన్న భావం నశిస్తుంది. ఫైజా బాదు అని చెపితే అనవసరంగా రహస్యం బయటపడుతుంది. బాగా అలోచించి చెప్పాను.
    నేను : చిత్తం. లక్నోలోనే పెరిగి పెద్దదాన్నయాను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.