Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
చెప్పనైతే చెప్పాను గాని మళ్ళీ వచ్చే ప్రశ్న ఇబ్బంది కలిగిస్తుందని తరవాత గ్రహించాను. అనుకున్నట్లే అయింది. వెంటనే బేగమ్ అడిగారు.
బేగమ్ : అయితే పుట్టింది లక్నో లో కాదా?
బదులు చెప్పడానికి ఆలోచించాను. కొంతసేపు మౌనంగా ఉండి ప్రశ్న విననే విననట్లు నటించి " బేగమ్ గారి రాజభవనం లక్నోలోనే ఉందా?" అని అడిగాను.
బేగమ్ : ఒకప్పుడు, ప్రస్తుతం కాన్పూరే స్వగ్రామం అయింది.
నేను : నేనూ అదే నిశ్చయించాను.
బేగమ్ : ఏమి ?
ఈ ప్రశ్నకు జవాబు చెప్పడం మరీ కష్టమనిపించింది. కధంతా యేమని చెప్పను? విన్నవిస్తే అవసరంగా బాధ పెట్టినట్లు అవుతుంది." "పరిస్థితులు అలా వచ్చాయి . లక్నో వెళ్ళడానికి బుద్ది పుట్టడం లేదు" అన్నాను.
బేగమ్ : మంచిది. కాని అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తుండు.
నేను : రావడం ఏమిటి ? వెళ్ళడానికే మనసొప్పటం లేదు. ఒకటి తమ దయ, రెండవది ఈ తోట. పరిసరాలు ఒకసారి చూచినవాడు విడవాలని అనుకుంటాడా? ముఖ్యంగా నాలాంటి మానసికరోగపు స్త్రీలకు ఈ వాతావరణము ఎంతో హాయిగా ఉంటుంది.
బేగమ్ : అయితే ఈ అడివి బాగనిపించిందన్నమాట. మనిషి అలికిడి ఉండదు. పట్నానికి కోసుల దూరం. నాలుగు పైసల సరుకుకు పంపితే ఉదయం వెళ్ళిన మనిషి సాయంకాలానికి గాని తిరిగి రాడు. కీచురాళ్ళ రోదకు చెవులు చిల్లులుపడ్తాయి. రోగం వస్తే ఊళ్ళో నుండి వైద్యుడు వచ్చేవరకు ప్రాణమే పోతుంది.
నేను : ఎవరి మనసు వారిది. నాకు మాత్రం పసందుగా ఉంది. ఇక్కడ ఉంటే మరేదీ అవసరం ఉండదనిపిస్తుంది. అయినా ఇక్కడుంటే రోగాలేందుకు వస్తాయి?
బేగమ్ : వచ్చిన కొత్తలో నేనూ ఇలాగే అనుకునేదాన్ని. కొన్ని రోజుల తరవాత పట్టణాల్లో ఉండేవారు ఇక్కడ ఉండలేరని అర్ధం అయింది. పట్టణాల్లో అనేకరకాల సౌకర్యాలు, ఉంటాయి. అన్నీ ఏమో గానీ నవాబుగారు కలకత్తా వెళ్ళినప్పటి నుంచి రాత్రిళ్ళు నిద్రపట్టడం లేదు. భయం భయంగా ఉంటుంది. దేవుడిచ్చిన సిపాయిలూ, సేవకులు అంతా ఉన్నారు, ఇప్పుడు కూడా పది పన్నెండు మంది మగ నౌకరులు ఉన్నారు. దాసీలకు లెక్కలేదు. అయినా భయంగా ఉంటుంది. మూడు నాలుగు రోజులు చూస్తాను. అప్పటికీ నవాబు రాకుంటే ఊళ్ళో ఏదైనా ఇల్లు తీసుకుని ఉంటాను.
నేను : క్షమించండి. మీ స్వభావంలో భయం ఉన్నట్లుంది. ఇలాంటి ఆలోచనలు రానీయకండి. ఊళ్ళో పరిస్థితి చెప్పకండి. ఎండకు ప్రాణాలు పోతున్నాయి. ఇక రోగాల సంగతి అడక్కండి ఆ దేవునికే తెలియాలి.
ఇంతలో దాది పాపను ఎత్తుకొచ్చింది. మూడేళ్ళ పసివాడు. ఎంత అందంగా ఉన్నాడు! చిలక పలుకులు! బేగమ్ దాది నుంచి తీసుకుని ఒడిలో కూర్చోబెట్టుకుంది కొద్ది సేపు. తరవాత దాదికి ఇస్తుంటే నేను తీసుకున్నాను. ముద్దులు పెట్టుకున్నాను. చాలాసేపు ఆడించాను. దాదికి ఇచ్చేశాను.
నేను : బాబుకోసం తప్పక వస్తాను.
బేగమ్ : ( చిరునవ్వు నవ్వి) ఏదో విధంగా రావడం కావాలి.
నేను : వస్తాను. వస్తాను. వస్తాను. మీకు విసుగు కలిగే దాకా వస్తాను.
తరవాత ఆ మాట ఈమాట మాట్లాడుకున్నాం. బేగమ్ నా పాటను మెచ్చుకున్నారు. ఇంతలో వంటమనిషి వచ్చి భోజనం సిద్దంగా ఉందని నివేదించింది.
బేగమ్ : భోజనానికి పదండి.
నేను : మంచిది.
బేగమ్ లేచి నుంచున్నారు. నేనూ లేచాను. ఆమె నా చేయి పట్టుకుంది. దాసీలతో "మీరు ఇక్కడే ఉండండి. భోజనం చేసి వచ్చి ఇక్కడే కూర్చుందాం " అన్నది.
నేను : మనోరంజకమైన ఈ వాతావరణం వదిలి వెళ్ళ బుద్ది కావడం లేదు. కాని తమ అజ్ఞ.
బేగమ్ : ఇక్కడికే తెప్పించుకుందామా?
నేను : అవసరం లేదు. భోజనం చేసి ఇక్కడికే వద్దాం.
బేగం : (ఒక దాసీతో) వీరి వెంట వచ్చిన వారికి భోజనాలు అయినాయా?
దాసీ : (చేతులు కట్టుకొని) అయినాయి దొరసాని!
బేగమ్ : అయితే వారిని పంపించేయండి. రెండవ కచేరి విరమించాం. ఉమ్రావ్ జాన్ భోజనం చేసి వెళ్తారు.
తరవాత మేమిద్దరం భవనం వైపు నడిచాం. ఒక దాసీ దీపం తీసుకొని ముందు నడిచింది. బేగమ్ నా చెవిలో "నీతో చాలా మాట్లాడాల్సి ఉంది. కాని ఈరోజు కుదరదు. రేపు నాకు తీరిక లేదు. ఎల్లుండి ఉదయం వచ్చేయి. భోజనం ఇక్కడే" అన్నారు.
నేను : నేను కూడా కొంత విన్నవించుకోవాలి.
బేగమ్ : ఈరోజు కాదు. పద భోజనం చేతాం. తరవాత నీ పాట వినాలి.
నేను : వాద్యగాళ్ళను పంపించి........
బేగమ్ : మగవాళ్ళ ముందు పాట వినడం మాకు నచ్చదు. మా దసీల్లో ఒకతే మంచి తబలాకత్తే . ఆమె వాద్యానికి పాడండి.
నేను : చిత్తం.
భవనానికి చేరాం. విశాలంగా ఉంది. అందంగా అలంకరించబడింది. రాజభవనాల తరవాత ఇంత సొగసుగా అలంకరించబడిన భవనం మరొకటి చూడలేదు. మొదట వరండా కనిపించింది. తరవాత అనేక గదులు దాటిపోయాం. అన్ని గదులూ రకరకాలుగా అలంకరించబడినాయి. చివరకు దస్తర్ ఖాన్ పరచి ఉన్న గదిలో ప్రవేశించాం. మరో ఇద్దరు స్త్రీలు మాకోసం వేచి ఉన్నారు. ఇద్దరూ చెలికత్తెలు. జరీ బట్టలు ధరించారు. అందంగా ఉన్నారు.
దస్తార్ ఖాన్ మీద పలావు, బిర్యానీ, మజఆఫర్, మతంజన్, సఫేదా, షేర్ బరంజ్, బాఖర్ ఖానియాఁ రకరకాల కూరలు, కబాబులు, ఊరగాయలు, మురబ్బాలు, మిఠాయిలు, పెరుగు, మీగడ, వివిధపదార్ధాలు ఉన్నాయి. లక్నో వదిలిన తరవాత సుఖమైన భోజనం ఇవ్వాళే. ప్రతి వస్తువు బెగమ్ నా ముందుంచేది. నేను కాస్త వెనుకా ముందాడినా , ఆమె బలవంతం వల్ల ఎక్కువే తిన్నాను.
గిన్నె, నీళ్ళు వచ్చాయి. చేతులు కడుక్కొని, తాంబూలాలు వేసుకున్నాం. మళ్ళీ ఆ వేదిక మీద సమావేశమైనాం. బేగమ్ కాక చెలికత్తెలు, దాసీలు, మాములు, పనివాళ్ళు అంతా పది పన్నెండు మంది స్త్రీలు ఉన్నారు.
తబలా జత, సితార్ తేవలసిందని ఆజ్ఞాపించారు బేగం గారు. అవి వచ్చాయి. ఒక చెలికత్తె తబలా ప్రారంభించింది. బేగమ్ స్వయంగా సితార్ వాదనం ప్రారంభించగా నేను పాట ప్రారంభించాను.
భోజనాలయ్యేవరకే పది పదకొండైంది. పాటకు కూర్చునేవరకూ సరిగ్గా పన్నెండు ఎంతో డబ్బు ఖర్చు చేసి అడవిలోనూ, కొండల్లోనూ సిద్దం చేసిన ఆ తోట వింతగానూ, భయంకరంగానూ కనిపిస్తుంది. ఆ ఉన్నత సౌధానికి ఒక మూల నుంచి దూరంగా, దట్టంగా ఉన్న చెట్ల చివర కొమ్మల్లోంచి చంద్రుడు కనిపిస్తున్నాడు. కుంగుతున్నాడు. వెలుగు మీద చీకటి వ్యాపించింది. ప్రతి వస్తువు, భయానకంగా, ఉంది. చెట్లు తమ పొడవుకంటే ఎంతో పొడవుగా కనిపిస్తున్నాయి. రయ్యిమని గాలి వీస్తుంది. సర్విచెట్ల చప్పుడు వినిపిస్తుంది. నిశ్శబ్ద వాతావరణంలో చెరువులో పడుతున్న నీటి ధ్వని పెద్దగా వినిపిస్తుంది. అప్పుడప్పుడు ఒక పక్షి, బెదిరి లేచి కేక పెడుతుంది. క్రూర మృగాల గాండ్రింపులకు పిట్టలు ఎగురుతున్నాయి. అవి ఎగిరినప్పుడు చెట్ల ఆకులు రాలుతున్నాయి. చేప అమాంతంగా చెరువులో గంతులు వేస్తుంది. కప్పలు బెకబెక రాగాలు పాడుతున్నాయి. ఈ వేదిక మీద కూర్చున్న భూషణ, భూషితాలైన పది పన్నెండు మంది సుందరాంగులు తప్ప ఎక్కడా ఎవరు లేరు. గాలికి కొన్ని గాజు దీపాలు ఆరిపోయాయి. రెండు లాంతరుల వెలుగుంది. వాటి అడ్డాలూ ఆకుపచ్చగా ఉన్నాయి. చెరువులో కనిపించే చుక్కల వెలుగువినా అంతటా అంధకారం! సమయానుకూలంగా "సోహిని" ప్రారంభించాను. ఆ రాగపు భాయకరస్వరం హృదయాలను కదిలించింది. అంతా భయవిహ్వలులైనారు.
తోట భయంకరంగా ఉంది. కళ్ళలో భయం . గుండెలో భయం. ముఖ్యంగా దట్టమైన చెట్ల కింద చిక్కని చీకట్లు చేరాయి. ఒకరి ముఖాలు ఒకరు చూచుకుంటున్నారు. ఎటు చూచినా నిరామయంగా ఉంది. నా గుండె దడదడలాడుతుంది. బేగం అన్నది నిజం. అది ఉండదగిన చోటు కాదు అనుకున్నాను. నక్కల కూతలు వినిపించాయి. దాంతో భయం మరీ ఎక్కువైంది. తరవాత కుక్కలు మొరిగాయి. భయంతో ఎవరి నోటా మాట రాలేదు. ఇంతలో బాలీసుకు అనుకుని కూర్చున్న బేగం తలెత్తి చూచింది. ఎదురుగా ఏదో కనిపించింది. పెద్ద్జ కేక పెట్టింది. పరుపు మీద పడిపోయింది. మిగతా స్త్రీలంతా అటు చూచారు. నేను వెనక్కు తిరిగి చూచాను.





