Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    చాల మంది పురుషుల రాక సాగింది. కవిత కూడా బాగా రాణించింది. సభకు వెళ్ళని రోజంటూ లేదు. కచేరీలు ఎక్కువగా వచ్చాయి. కొద్ది రోజుల్లో బాగా డబ్బు సంపాదించాను. కాన్పూరు జనుల ఆచార వ్యవహారాలు, మాటా మర్యాద నచ్చక మాటిమాటికి లక్నో గుర్తుకు వచ్చేది. అయినా స్వేచ్చలో ఏదో అనందం ఉంది. లక్నో వెళ్ళ బుద్ది అయ్యేది కాదు. లక్నో వెళ్తే ఖానమ్ దాసిగా పడి ఉండాల్సిందే. ఈ వృత్తిలో ఖనమ్ తో విడిపడి ఉండడం సాధ్యపడదు. వేశ్యలంతా ఆమె మాటకు అణగిమణిగీ ఉంటారు. మంచి వాద్యబృందం లభించడం కష్టం. వాద్యం లేకుండా సంగీత సభలు, నాట్యసభలూ ఎలా సాధ్యం? రాజుల, నవాబుల వరకు నేను వెళ్ళానంటే ఖానమ్ చలవే. నేను మంచి పాటకత్తేనే. అయినా లక్నోలో చాలామంది మంది పాటకత్తేలున్నారు. మంచిచెడు విలక్షణ రసజ్ఞులకు . సాధారణ జనులలో అమ్ముడయ్యేది పేరు. పెద్ద మనుషుల చూపు పెద్ద వేశ్యల పైనే ఉంటుంది. అలాంటప్పుడు నన్నెవరు అడుగుతారు? కాన్పూరులో నా విద్యను మించిన గౌరవం లభించింది . రాజుల , నవాబుల ఇండ్లలో పెళ్ళిళ్ళు, ఉత్సవాలు జరుగుతే నన్ను పిలవడం గర్వంగా భావించేవారు. దూరంగా ఉంటె గాని లక్నో గొప్పదనం తెలియదు. ఇక్కడ హజ్రత్ షారఖ్ లక్నవీ ప్రఖ్యాతులు. వారిని మించినవారు లేరని భావన. వారి శిష్యులు వేలమంది ఉన్నారు. లక్నో లో వారి పేరు విన్నవాడే లేడు. ఒకనాడు ఏమి జరిగిందో వినండి. ఒక మహాశయుడు గదిలోకి వేం చేశారు. మాటల సందర్భంలో కవిత్వాన్ని గురించిన చర్చ వచ్చింది . " తమకు హజ్రత్ షారఖ్ తెలుసా?" అని అడిగారు. "తేలియదు. షారఖ్ ఎవరు ?" అని అడిగాను. వీరు వారి శిష్య బృందం లో నివారు. వెంటనే కోపం వచ్చేసింది.
    వారు : మీరు లక్నో వాసులని విన్నాను.
    నేను : చిత్తం. నివాసం లక్నోలోనే.
    వారు : లక్నోలో ఉండడం. మా గురువుగారిని ఎరుగకపోవడం?
    నేను : పేరున్న లక్నో కవులందరినీ ఎరుగుదును. ఇక గురువుల విషయం చెప్పాలా? కాస్త పేరున్న శిష్యుల కవితలూ విన్నాను. వారి పేరేమిటో చెప్పండి. కవి నామంతో పరిచయం లేదు.
    వారు : పేరు చెప్పి ప్రయోజనం ఏమి ? వారి కవి నామం నలుదిశలా ప్రఖ్యాతమే. మీకు తెలియకపోవచ్చు. పోనివ్వండి.
    నేను : క్షమించండి. కవుల పరిచయం గలదాన్నే. తమ గురువుల విషయంలో తామలా చెప్పుకోవడమూ సబబే. పేరు శలవివ్వండి. గుర్తుపడ్తానేమో?
    వారు : మీర్ హాషమ్ అలీ సాహబ్ షారఖ్.
    నేను : "పేరు పరిచయమైన దానిలాగే ఉంది. " అని ఆలోచించాను. అల్లా! ఈ మీర్  హషమ్ అలీ సాహబ్ ఎవరు? చివరకు వారి మీద కాలి కలిగింది . "మీ గురువు గారు శోకకవిత కూడా చదువుతారు కదూ ?" అడిగాను.
    వారు : చిత్తం . శోక కవితలో కూడా వారిని మించినవారు లేరు.
    నేను : చక్కగా శలవిచ్చారు. మీర్ సాహెబ్, మిర్జా సాబ్ ను కూడా మించినవారా ?
    వారు : వారితో సరి తూగేవారు.
    నేను : శోకగీతాలు ఎవరివి చదువుతారు?
    వారు : ఇతరులవి చదవడమేం ఖర్మ ? స్వయంగా రచిస్తారు. ఈమధ్య ఇరవై ఏడవ రజ్జబ్ కు సరికొత్త శోకగీతం చదివారు. చాల ప్రఖ్యాతమైంది.
    నేను : తమకు జ్ఞాపకం ఉండవచ్చు.
    వారు : మొత్తం గుర్తులేదు. ఖడ్గాన్ని కీర్తిస్తూ ఒక చరణం రచించారు. అది నాకే కాదు. పట్నం అందరి నోటికి వస్తుంది. కలం విరిచేశారనుకొండి.
    నేను : దయతో సాయించండి. నేనూ ఆనందిస్తాను.
              వెలుగు ఓర నుండి వజ్రపు ఖడ్గం వెడలింది.
    వారు : ఈ చరణపు ఖ్యాతి దూరదూర ప్రాంతాలకు వ్యాపించింది. మిగతా చరణాలు నేను చదువుతా వినండి. ఎంత అందమైన కవిత !
    నేను : (ఉబ్బిపోయి) చిత్తం. తామీ కవిత లక్నో లో విని ఉంటారు.
    వారు : అదే నేనన్నది. లక్నోవాసులు . పైగా కవితా పరిచయం గలవారు. హజ్రత్ షారాఖ్ పేరు వినకపోవడం ఏమిటి? ఆశ్చర్యం . ఇప్పుడు అర్ధమైంది హస్యమని.
    మీ గురువుగారు చచ్చి మరొకజన్మ ఎత్తినా ఇలాంటిది వ్రాయలేదు. ఇది యశశ్శరీరులు మిర్జా దబీర్ సాహబ్ కవిత' అందామని నోటిదాకా వచ్చింది కాని ఎందుకు పోనీ అని మింగేశాను.
    రుస్వా : తెలివిగా ప్రవర్తించారు. అది కాస్త చెప్పి ఉంటే వాడి కూట్లో మన్ను పడేది. మీర్ హాషమ్ అలీ షారఖ్ మాత్రమేనా ఎందరో మహానుభావులు ఉన్నారు ఇలాంటివాళ్ళు. ఇంకొకరి కవిత తమ పేరా చదివేస్తారు. కొద్ది రోజుల క్రితపు విషయం . ఒక పెద్ద మనిషి నా మిత్రుని కవితల చిత్తుప్రతి దొంగిలించాడు. దక్షిణ హైదరాబాదు లో వినిపిస్తూ తిరిగాడు. గొప్పగొప్పవారు శ్లాఘించారు. కాని కనిపెట్టేవారు కనిపెట్టేశారు. లక్నోకు ఉత్తరాలు వచ్చాయి. అసలు కవికి తెలియపరచడం జరిగింది. వారు నవ్వి ఊరుకున్నారు. అల్లాంటి మహాశయులు లక్నోను ఎంత అప్రతిష్టలపాలు చేశారంటే -- పేరుతొ గాని , కవి పేరుతొ గాని లక్నో అని వ్రాసుకోవడానికి సిగ్గు కలుగుతుంది. చదువు సంధ్యలకు నాలుగురోజులు లక్నోలో ఉండి లక్నవీలు అయిపోతారు. అంతటితో బాముకునేదేమి? ఏం ప్రయోజనం అబద్దాలతో ?
    ఉమ్రావ్ : అవును. చాలామంది తమ లాభం కోసం లక్నోను వాడుకుంటారు. కాన్పూరులో సరిగ్గా నా పరిస్థితి అదే.
    ఆ రోజుల్లో రైళ్ళు లేవు. లక్నోవాళ్ళు బయటి ప్రాంతాలకు వెళ్లేవారేకాదు. ఎక్కడెక్కడి నుంచో జనులు ఇక్కడికే వచ్చి, తమ విద్యనూ ప్రదర్శించి అర్హతలను బట్టి కీర్తి పొందేవారు. డిల్లీ పాడుపడి లక్నో వృద్ది చెందింది.
    రుస్వా : సరిగ్గా అదే స్థితి నేటి దక్కనుది. లక్నో పాడుబడింది. దక్కను వృద్ది చెందింది. నేను వెళ్ళలేదు. విన్నాను. లక్నో వారి వీధులకు వీదులే ఏర్పడ్డయని.
    ఉమ్రావ్ : లక్నో వాణ్ణని విర్రవీగే వాడితో చెప్పండి. ముందు తన భాష బాగుచేసుకొమ్మని .
    రుస్వా : వాహ్! ఎంత బాగా చెప్పారు. మాట ఎలాగో వస్తుంది. కాని తీరు రాదు.
    
                                    15


        కాలమహిమ వర్ణింప నేపరితరము
        సంయోగ వియోగము లిటనైజము!

    విడిపోయినవారు కలుస్తారు. అదీ ఎప్పుడో విడిపోయినవారు. కలుస్తారనే ఆశ సహితం లేనివారు కూడా కలుస్తారు. ఒకనాటి సంగతి. కాన్పూరుకు వచ్చి ఆరు నెలలై ఉంటుంది. నా కీర్తి బాగా వ్యాపించింది. వీధుల్లో, గొందుల్లో నేను పాడిన పాటలే వినిపిస్తున్నాయి. రాత్రిళ్ళు చాలామంది వస్తున్నారు. వేసవికాలం , పగలు రెండు గంటల సమయం. మంచంలో పడుకొని ఉన్నాను. దాసీది వంటింట్లో గుర్రు పెడుతుంది. పనివాడు గది అవతల కూర్చొని పంఖా త్రాడు లాగుతున్నాడు. వట్టి వ్రేళ్ళ తడికలు ఎండిపోయాయి. నీళ్ళు చల్లడానికి మనిషిని పిలుద్దామనుకుంటుండగానే వీధిలో మాటలు వినిపించాయి. "లక్నో నుంచి వచ్చిన వేశ్య గది ఇదేనా ?" అని అడిగింది . కోమటి దుర్గ "అవును అదే" అని చెప్పింది. తరవాత "గుమ్మం ప్రవేశించింది. ఎరుపు రంగు , ముడుతల ముఖం , ముగ్గు బుట్ట తల, వంగిన నడుము , తెల్లని మల్మలు ముసుగు , చొక్కా వదులు పైజమా, చేతులకు మందమైన వెండి కడియాలు, వ్రేళ్ళకు ఉంగరాలు , చేతిలో కర్ర , వణకుతూ వగరుస్తూ పచ్చి కూర్చుంది. పది పన్నెండు సంవత్సరాల నల్లని కుర్రాడు వెంట వచ్చాడు. వాడు నుంచున్నాడు.
    వృద్దురాలు : లక్నో నుంచి వచ్చింది నువ్వేనా ?
    నేను : చిత్తం.
    ఈ మాట అని మంచం దిగివచ్చి పాన్దాన్ ముందుకు నెట్టి హుక్కా తేవలసిందని మనిషితో కేకవేసి చెప్పాను.
    వృద్దురాలు : మా బేగమ్ నిన్ను జ్ఞాపకం చేసింది. కొడుకు జన్మదినం. జనానాలో గోష్ఠి , నీ కచేరి ఏర్పాటు చేశారు.
    నేను : బేగం గారికి నేనెలా తెలుసు ?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.