Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
సమహం ప్రజయా సం మయాప్రజా |
సమహగం రాయస్వోషేణ సం మయా రాయస్వోషః ||
1 - 6 - 6 - 6
రెండవ ప్రపాఠకము
మొదటి అనువాకము
1. ప్రథమ పాద విన్యాసమా! నీవు పాపములు హరింప చేయునట్టి విష్ణువు యొక్క పాదవిన్యాసము అగుచున్నావు. నీవు గాయత్రీ ఛందస్సును పరిగ్రహించుము. మేము ద్వేషించు శత్రువు ఇచటినుండి తొలగించబడినాడు. భూదేవతా రూపమగు ఈ ప్రదేశమును ఆక్రమించినావు.
ద్వితీయ పాద విన్యాసమా! నీవు మిథ్యా పవాదమును హరింప చేయునట్టి విష్ణువు యొక్క పాద విన్యాసము అగుచున్నావు. త్రిష్టుప్ ఛందస్సును పరిగ్రహింపుము. మేము ద్వేషించునట్టి శత్రువును ఇచటి నుండి తొలగించినాము. అంతరిక్షదేవతా రూపమగు ఈ ప్రదేశమును ఆక్రమించినావు.
తృతీయ పాద విన్యాసమా! నీవు అరాతీయులను నాశనము చేయు విష్ణువు యొక్క పాద విన్యాసము అగుచున్నావు. జగతీ ఛందస్సును పరిగ్రహించుము. మేము ద్వేషించు శత్రువు ఇచటి నుండి తొలగించబడినాడు. ద్యులోకదేవతా రూపమగు ఈ ప్రదేశమును ఆక్రమించినావు.
చతుర్ధపాద విన్యాసమా! శత్రుహంతయగు విష్ణువు యొక్క పాద విన్యాసము అగుచున్నావు. అనుష్టుప్ ఛందస్సును పరిగ్రహించుము. మేము ద్వేషించు శత్రువు ఇచటి నుండి తొలగించబడినాడు. దిగ్దేవతా రూపములగు ఈ ప్రదేశములను ఆక్రమించినావు.
2. అగ్ని పుట్టిన వెంటనే దీపించినాడు. జగములను ప్రకాశింపచేసినాడు. రోదసి యందు కాంతిచే స్వయముగా ప్రకాశించుచున్నాడు. సస్య శోషణమునకు నివారించుటకు ద్యులోకమేఘము గర్జించినట్లు ఈ అగ్ని మా దురితములను నివారించుటకై గర్జించునుగాక.
3. అగ్నీ! నీవు అభిముఖముగ మరలు స్వభావము కలవాడవు. మాకు ఆయువు, వర్చస్సు, మేధ, సంతానము, ధనము కలిగించుచు మావైపు మరలుము.
4. అంగ సౌష్ఠవము గల అగ్నీ! నీకు వందల ఆవృతులు, వేల ఉపావృతులు కలుగును గాక. వానిని లక్షల సంఖ్యగా పెంచుము. మాకు నష్టమైన ధనమును మరలి తెచ్చి ఇమ్ము. పూర్వము సంపాదించని ధనమును సహితము మాకు కలిగించుము.
5. అగ్నీ! క్షీరాది రసముతో కూడ మా వద్దకు మరలి రమ్ము. అన్నము, ఆయుష్యములతో మరల మరలి రమ్ము. మమ్ము మరల మరల చేయు పాపముల నుండి పాహి.
6. అగ్నీ! ధనము తీసికొని రమ్ము. నీరు సర్వ ప్రాణులు త్రాగునది. దానిని వృష్టిగా సస్యములపై కురిపించుము.
7. వరుణదేవా! తల మీద నీ పాశము ఉన్నది. దానిని పైకి లాగి తీసివేయుము. దానిని నాశము చేయుము. పాదముల వద్ద నీ పాశము ఉన్నది. దానిని క్రిందకు లాగి తీసివేయుము. నాశము చేయుము. నడుమునకు నీ పాశము ఉన్నది. దానిని తెంపివేయుము. నాశము చేయుము. అప్పుడు మేము పాపరహితులము అగుదుము. నీయొక్క కర్మను నిర్విఘ్నముగా కొనసాగించగలము.
8. అగ్నీ! నీవు ఉఖయందు ఉన్నావు. నిశ్చలముగా ఉన్నావు. స్థిరముగా ఉన్నావు. నిన్ను పైకి తీయుచున్నాను. జనులందరు నిన్ను కోరుకుందురు గాక. ఈ యజమానికి రాజ్యము నిమ్ము.
9. ఉఖ యందలి ఈ అగ్ని చీకట్లను చీల్చువాడు. కాంతి వంతమగు దేహము వాడు. అతడు పెరిగి పెరిగి ఉషస్సు ఎదుట నిలిచినాడు. అతడు తన తేజస్సున చీకట్ల డొక్క నుంచి బయట పడినాడు. అతడు లోకము లన్నింటి'ని వెలుగులందు నింపినాడు.
10. సీద త్వం మాతురస్యాః ఉపస్థే విశ్వాన్యగ్నే వయునాని విద్వాన్ | మైనామర్చిషా సా తపస్కాభి శూశుచ్కోన్తరస్యాగ్ం శుక్ర జ్యోతిర్విభాహి.
11. అంతరగ్నే రుచా త్వముఖాయై సదనేస్వే | తస్యాస్త్వగ్ం హరసా తపఞ్జాతవేదః శివో భవ.
12. శివో భూత్వా మహ్య మగ్నే థోసీద శివస్త్వమ్ | శివాః కృత్వా దిశః సర్వాః స్వాం యోనిమిహాసదః
(వచనాను వాదమునకు మొదటి ప్రపాఠకపు 9 వ అనువాకము నందలి 8,9,10 చూడండి.)
13. అగ్ని శత్రుహింసకుడు. శుచిస్థానవాసి. నివాసము కల్పించువాడు. అంతరిక్షమున ధూమరూపపు వాడు. హోత. వేదియందుండు వాడు. యజమాని ఇంట అతిథిగా ఉండువాడు. నరులందు జఠరాగ్నిగా ఉండువాడు. యజ్ఞము లందుండు వాడు. ఆకసమున ఉండువాడు. నీట పుట్టువాడు. గోవులందు పుట్టువాడు. అద్రులందు పుట్టువాడు. యజ్ఞమునందు పుట్టినవాడు.
అంతటి అగ్ని ఈ బృహత్ యజ్ఞమును జరిపించును గాక.
రెండవ అనువాకము.
1. అగ్ని తొలుత ద్యులోకము మీద అవతరించినాడు. రెండవసారి మానవలోకము మీద ఆవిర్భవించినాడు. మూడవసారి సముద్ర గర్భమున జన్మించినాడు. అగ్ని ఈ మూడు జన్మలందును నరులందు అనుగ్రహము కలవాడు అయినాడు.
కావున నరులు అగ్నిని దీపింప చేయవలెను. జరా పర్యంతము చిత్తశుద్ధితో అగ్నిని ఆరాధించవలెను.
2. అగ్నీ! నీకు సంబంధించిన మూడు రూపములను తెలిసికొన దలచినాము. నీవు నిలుచు స్థానములను ఎరుంగ తలచినాము. నీయొక్క గోప్య నామములను గ్రహించ దలచినాము. నీవు ఏ ప్రదేశము నుండి వృష్టి రూపమున పుట్టినావో దానిని దర్శించదలచినాను.
3. నేను యజమానిని. కర్మయందు శ్రద్ధ కలవాడను. మంత్రమును స్పష్టముగా ఉచ్చరించగలవాడను.
అగ్నీ! నీవు ద్యులోకమున తేజోరూపమున, భూలోకమున యజ్ఞరూపమున, సముద్రము నందు బడబానల రూపమున ఉన్నవాడవు. నిన్ను నేను దీపింపచేయుచున్నాను.
మహామహులగు యజమానులు యజ్ఞవేది యందు నిన్ను సంతోష పరచుచున్నారు.
4. ఆక్రన్దదగ్నిః స్తన యన్నివద్యౌః క్షామా దేరిహద్వీరుధః సమఞ్జన్ | సద్యో జజ్ఞానో విహీమిద్దో అఖ్యదా రోదసీ భానునా భాత్యన్తః |
(మొదటి అనువాకము 2వ మంత్రము చూడండి.)
5. అగ్ని అనుగ్రహమూర్తి. పావకుడు యాగరహితములను మెచ్చనివాడు. సుమేధ. అమరుడు. అట్టి అగ్ని నరులందు ప్రవేశపెట్టబడినాడు.
అగ్ని కంటిని బాధించని పొగలను పుట్టించుచున్నాడు. అవి పైకిలేచి, నిర్మలములై, ద్యులోకమున వ్యాపించుచున్నవి.
6. అగ్ని లోకములు తెలిసినవాడు. సముద్రగర్భమున ఉన్నవాడు. అతడు పుట్టినంతనే ద్యావాభూములను వెలుగులతో నింపినాడు.
పంచజనులు అగ్నిని యజించినారు. అప్పుడు ఆహుతులు అందుకొని పైకి పోవు అగ్ని పర్వతముల వంటి మేఘములను చీల్చినాడు.





