Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
7. అగ్ని సంపదలను ఇచ్చువాడు. ధనములను ప్రసాదించువాడు. స్వర్గమును కలిగించువాడు. సోమమును రక్షించువాడు. బలములకు పుత్రుడు. నీటియందు విద్యుత్తుగా వెలుగువాడు.
అట్టి అగ్నిని హోతలు ప్రాతః కాలమున ప్రకాశింపచేయుచున్నారు.
8. శుభప్రదమగు కాంతులు గల అగ్నీ! యజమాని నేడు నీకు ఘృతము, పురోడాశము సమర్పించుచున్నాడు.
యువతమ అగ్నీ! ఆ యజమాని భక్తి యుక్తుడు. నీకు హవిస్సు అర్పించినవాడు. అతని మంచినివాసమునకు తగినంత ధనమును ఆర్జించుటకు ప్రోత్సహించుము.
9. అగ్నీ! ఆ యజమానిని సత్కర్మలకు ప్రోత్సహించుము. వేదపఠనమునకు ప్రోత్సహించుము. అతడు సూర్యుని యందు భక్తి కలవాడు అగును గాత. అగ్ని యందు భక్తి కలవాడు అగును గాత. అతడు పుట్టిన వారితో వర్థిల్లును గాక. పుట్టబోవు వారితో వర్ధిల్లును గాక.
10. అగ్నీ! నిన్ను నిత్యము ఆరాధించు యజమానులు కోరిన ధనమును పొందినారు. నిన్ను కూడి ఉంటున్న యజమానులు మరింత ధనము కోరుచు కర్మలను అనుష్ఠించి గోవులతో కూడిన కొట్టములు కలవారలైనారు.
11. అగ్ని దర్శనీయుడు. బంగారము వంటివాడు. దర్మర్షుడు. అతడు ఆయువును ఆశ్రయించ దలచినవాడై అనంత కాంతితో ప్రకాశించినాడు.
ఈ అగ్నిని ద్యులోక వాసులగు దేవతలు మంచి రేతస్సు కలవానిగా సృష్టించినారు. కావున అగ్ని రమృతో అభవత్ - అగ్ని అమరుడు అయినాడు.
మూడవ అనువాకము
1. అగ్నీ! నీవు అన్నములకు స్వామివి. మాకు వ్యాధి రహిత అన్నమును ప్రసాదించుము. హవిస్సులు అర్పించు యజమానిని దురితముల నుండి తరింపచేయుము. మా ప్రజలకు, పశువులకు బలము కలిగించుము.
2. అగ్నీ! దేవతలందరు ధీరులై నిన్ను ఊర్ధ్వ లోకముననే భజింతురు గాక. నీవు మాకు శివతముడవు అగుము. మమ్ము వెలుగులందు నిలుపుము.
3. అగ్నీ! శాంతములగు జ్వాలలచే ప్రకాశించుచు దేవ యజన స్థానములకు చేరుకొనుము. నీవు మహా కిరణముతో లోకములను వెలిగించుము. కాని ఆ కిరణములచే జనులను బాధించకుము.
4. ఋత్విగ్యజమానులారా! అగ్నిని సమిధలచే సేవించండి. ఘృతము సమర్పించి అతిథిని వలె ఉద్దీపింప చేయండి. అగ్నియందు హవిస్సులను హోమము చేయండి.
5. ఈ అగ్ని యజమాని ఆహ్వానమును ఆలకించును గాక. ఇతడు సూర్యుని వలె భాససమానుడై బృహద్రూపమున ప్రకాశించుచున్నాడు. సంగ్రామములందు విజయుడు అగుచున్నాడు.
దేవహితుడు, శివస్వరూపుడగు అగ్ని మా వద్దకు అతిథివలె వచ్చును గాత.
6. జలదేవతలారా! ఉఖాగ్ని మీద ఏర్పడిన భస్మమును తీసికొనండి. దానిని సుఖకరము, సుగంధయుక్త స్థలమున ఉంచండి.
జలములారా! మీరు సుపత్నులు. తల్లులు. ఈ అగ్నిని పోషించండి. తల్లి బిడ్డను వలె ఈ అగ్నిని సాకండి.
7. అగ్నీ! నీ బలము ఉదకములందున్నది. నీవు ఓషధులను అనుసరించు చున్నావు. అరణుల గర్భమందు ఉంటున్నావు. అటువంటి వాడవగుచు మరల మరల జన్మించుచున్నావు.
8. అగ్నీ! నీవు ఓషధులకు గర్భమవు, వనస్పతులకు గర్భమవు. జలములకు గర్భమవు అగుచున్నావు.
9. అగ్నీ! నీవు భస్మముతో సహ అందుకు కారణమగు భూమిని, నీటిని చేరుకొనుము. నీకు తల్లులైన నీటితోనూ, నేలతోను కలసి జ్యోతిష్మంతుడవై తిరిగి ఉఖయందు ఆసీనుడవు అగుము.
10. అగ్నీ! నీ స్వస్థానమగు భూమిని, నీటిని మరల చేరుకొనుము. తల్లి ఒడి వంటి ఉఖ యందు మరల శాంతుడవై శయనించుము.
11. పునరూర్జా నివర్తస్వ | పునరగ్న ఇష్క్కాయుషా.
12. సహ రయ్యా నివర్తస్వాగ్నే పిన్వస్వ ధారయా | విశ్వప్స్రియా విశ్వతస్పరి.
(ఒకటవ అనువాకపు 5,6 మంత్రములు పునరావృతములు.)
13. అగ్నీ! నిన్ను ఆదిత్యులు, రుద్రులు, వసువులు మరల ప్రజ్వలింపచేయుదురు గాక. బ్రాహ్మణులు యజ్ఞములందు నిన్ను మరల ప్రజ్వలింపచేయుదురు గాక. నీవు ఆజ్యముచే సంతుష్టుడవగును. మా తనువులను వృద్ధినొందించుము.
సత్యాః సన్తు యజమానస్యకామాః - యజమాని కోరికలు నిజమగును గాక.
14. అగ్నీ! నీవు అన్నవంతుడవు. యువతముడవు. మమ్ము వర్థిల్ల చేయునదియు, మేము ఆదరమున ఆర్జించినదియు నగు స్తుతివాక్కును గ్రహించుము. ఒకడు నిన్ను ఎక్కువుగా నుతించుచున్నాడు. ఒకడు ఉచితముగా నుతించుచున్నాడు. నిన్ను అభినందించు నేను మాత్రము నీ తనువునకు నమస్కరించుచున్నాను.
15. అగ్నీ! నీవు విద్వాంసుడవు. అన్నవంతుడవు. అన్న ప్రదుడవు. మా కోరికలు తెలిసికొనుము. మా విషయమున శత్రుకృతములను వేరు చేయుము.
నాలుగవ అనువాకము
1. యమభటులారా! మీరు పురాతనులు అయినను, నూతనులు అయినను, మీరందరు ఈ స్థలము నుండి తొలగిపొండి. దూరముగా వెళ్లండి. దగ్గరలో ఉండకుండ వెళ్లండి. ఈ స్థానమును యముడు మాకు ఇచ్చినాడు. పితరులు మాకు ఇచ్చినారు.
2. సికతా స్వరూపమా! నీవు అగ్నికి భస్మస్థానము అగుచున్నావు. ధూళి స్థానము అగుచున్నావు.
3. ఊషర స్వరూపమా! నీవు సంజ్ఞానము అగుచున్నావు. కోరికలను తీర్చగల దానవు అగుచున్నావు. మా కోరికలను తీర్చుము.
4. సికత ఉషరములారా! మీ తనువులు మీకు ప్రియములు. అవి పరస్పరము కలసికొనును గాత. మీ హృదయములు మీకు ప్రియములు. అవి పరస్పరము కలసికొనును గాత. మీ ఆత్మలు మీకు ప్రియములు. అవి పరస్పరము కలసి కొనును గాక. నా తనువు నాకు ప్రియము అగును గాక.
5. ఇంద్రుడు గార్హా పత్యాగ్నియందు కోరిక గల వాడై సోమపానము చేసినాడు. అట్టి గార్హ పత్యాగ్ని ప్రస్తుతము ఇటుకలచే చీయమానుడు అగుచున్నాడు. అగ్నీ! అశ్వము వలె వేగవంతుడవై వేల కొలది ధనమును ఇవ్వగలవాడవు. అట్లని యజమాని నిన్ను స్తుతించుచున్నాడు.
6. ఇష్టకారూప అగ్నీ! నీవు ద్యులోక జలమును అభిముఖముగా పొందుచున్నావు. ఈ స్థానములందున్న దేవతలను అభిముఖముగా హవిస్సులు అందుకొనుమని పలుకుచున్నావు. సూర్య మండలపు పైనను, క్రిందను ఉన్నటువంటి జలములను చేర్చుకొని ఇచటికి రాగలవు.
7. యాగ నిష్పన్నుడవగు అగ్నీ! నీ తేజస్సు దివి యందున్నది. భువి యందున్నది. ఓషధులందున్నది. జలము అందున్నది. అంతరిక్షము నందంతటను వ్యాపించిన నీ తేజస్సు అర్ణవమంత అయి నరులకు చెందుచున్నది.
8. అగ్ని రూపములగు ఇష్టకలు మట్టిలో పుట్టినవి. మంచి మనస్సుగలవి. ప్రీతిపాత్రములు. రోగ రహితములు. అభీష్టప్రాప్తి హేతువులు. అవి ఆహుతములగు హవిస్సులను సేవించును గాక.
9. అగ్నీ! ఈ యజమాని కొరకు ప్రశంసనీయుడు, దర్శనీయుడు, అవిచ్చిన్నుడగు పశుప్రదాతను చూపుము. మాకు ఔరసుడును, వీరుడును అగు పుత్రుని ప్రసాదించుము. నీవు మా విషయమున అనుగ్రహవంతుడవు అగుదువు గాక.
10. అగ్నీ! ఈ ఇష్టక నీకు ఉత్పత్తి స్థానమగును. ఇది ఋతు కాలీన స్త్రీపురుష సంగమము వంటిది. నీవు నీజన్మ స్థానమును తెలిసికొనుము. పెరుగుము. అప్పుడు మాకు ధనసమృద్ధి కలిగించుము.
11. ఇష్టకా! నీవు సుఖసమార్జకవు. దేవతల అభిమానము కలదానవు. అంగిరసులు స్థాపించిన ఇష్టక వలె స్థిరముగా ఉండుము.
12. ఇష్టకా! నీవు సర్వత్ర సుఖసమార్జకవు. దేవతల అభిమానము కలదానవు. అంగిరసులు స్థాపించిన ఇష్టకవలె స్థిరముగా ఉండుము.
13. ఇష్టకా! అవశిష్టమును పూరించుము. ఛిద్రమును పూరింపుము. శాంతముగా నిలువుము. ఇది ఇంద్ర, అగ్ని, బృహస్పతులు నీకొరకు ఏర్పరచిన స్థానము.
14. యజమాని యొక్క జన్మ స్వర్గమును ప్రకాశింప చేయునది. ఈ ఇష్టకల జన్మకు యజమానియే కారణము. ఇవి దేవతా సంబంధులు. ప్రజారూపములు. గో సదృశములు. అన్నము కలిగించునవి. అవి ప్రాతస్సవనాదులందు సోమమును వండుచున్నవి.
అయిదవ అనువాకము
1. అగ్నులారా! మీరు పరస్పరము సంప్రీతి కలవారలు. దీపించుచున్న వారలు. సౌమనస్యులు. అన్నమును, రసపదార్థములను ఏర్పరచ గలవారు. మీరిద్దరు గార్హ పత్య ఉఖాగ్నులు కలసి మెలసి ఉండండి. చక్కగా యజ్ఞ నిష్పన్నము చేయండి.
మీ మనసులను సమాకరమ్ - కలుపుచున్నాను. వ్రతములను కలుపుచున్నాను. చిత్తములను సమాకరమ్.
2. ఉభయాగ్ని స్వరూపమా! నీవు మమ్ము విశేషముగ పోషించుము. యజమానికి అన్నమును, రస పదార్థమును ప్రసాదించుము.
3. ఉభయాగ్ని స్వరూపమా! నీవు ధూళి కలవాడవు. ధనము కలవాడవు. సకల దిశలను శాంతములను చేయుము. ఈ కుండము నీకు స్వస్థానమగును. ఇందు ఉండుము.
4. ఉభాయాగ్నులారా! మీరు మా విషయమున సహమానసులు, సహనివాసులు కండు. పాప రహితులు కండు. యజ్ఞమును, యజమానిని బాధించకండి. నేటి ఈ యజ్ఞమందు మా కొరకుగాను శాంతులు కండు.
5. తల్లి బిడ్డను ధరించినట్లు మట్టి ఉభ పురీషాగ్నిని తన గర్భమున ధరించినది. సర్వ దేవతలను, ఋతువులను తన యందు గలవాడును, విశ్వకర్మయగు ప్రజాపతి ఈ ఉఖను శిక్య పాశము నుండి విముక్తి గలిగించునుగాత.
6. చీకటి వంటి పొగ పోయినంత అగ్ని నిర్మల తేజమున ప్రకాశించును. అది ద్వేషించు వారిని దాటి మా వద్దకు వచ్చి మమ్ము సంతోష పరచునుగాక. విశ్వానరాగ్నీ! నీ శిక్యము ఆహుతమగునుగాక.
7. నిరృతిదేవతా! నీవు విశ్వరూపయుక్తవు. నీకు నమస్కారము. ఇనుప బంధము నుండి మమ్ము విడిపించుము. నీవు నిప్పు, నేలతో కలిసిన దానవగుచు యజమానిని స్వర్గమునకు ఎక్కించుము.
8. యజమానీ! నీ మెడకు నిరృతిదేవి విడిపించ సాధ్యము కాని పాశమును కట్టినది. దానిని నేను విడదీయుచున్నాను. అందువలన నీకు నీ ఆయువు మధ్య భాగము నందు మాత్రమే విముక్తి కలిగినట్లు కాదు. నీవు సర్వ ప్రతి బంధముల నుండి బయట పడినవాడవై చిరంజీవివి అగుచున్నావు. అన్నము తినగలవాడవగుము.
9. నిరృతీ దేవీ! నీరూపము ఉగ్రము. యజమానికి బంధన విముక్తి కలిగించుటకు నీ నోటి యందు ఆహుతులు అర్పించుచున్నాను. నిన్ను పామరులగు వారు భూమినిగా భావించుచున్నారు. నేను మాత్రము నిన్ను సంపూర్ణముగా నిరృతి దేవినిగా గ్రహించుచున్నాను.
10. నిరృతీ దేవీ! నేను సోమయాగము, హవిర్యజ్ఞము చేయుచున్నాను. నన్ను అనుగ్రహించుము. ప్రచ్చన్న, ప్రకటచోరులను పట్టుకొనుము. ఇతరులను అనుగ్రహించకుము. ఇదే నీకు నమస్కరించుచున్నాను.
11. నిరృతి విదుషీమణి. లోకములలందలి ప్రచ్చన్న, ప్రకట చోరుల శిరస్సులను ఆమె తన చేత పట్టి 'నీ అపరాధమును గమనించినాను' అనును, అటువంటి నిరృతికి నేను నమస్కరించుచున్నాను. మంచి మాటలు చెప్పి - తండ్రి బిడ్డను వలె - లాలించుచున్నాను.





