Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
11. వనస్పతి అగ్నీ! నీవు దానశీలుడవు అగుము. దేవతలకు స్వయముగా మా హవిస్సులను అందించుము. సమస్త దురిత నివారకుడవగుచు హవిస్సులను వహింపుము.
12. జాతవేద, స్వాహా అగ్నులారా! ఇంద్రునకు హవ్యము స్వాహుతము చేయండి. విశ్వేదేవతలు ఈ హవిస్సును అందుకొందురుగాక.
13. హిరణ్యగర్భుడగు ప్రజాపతి ప్రాణిజాలము దేహము ధరించక మున్నే దేహము ధరించి ఉండెను. అతడు ఒక్కడే పుట్టినాడు. పుట్టబోవు సర్వజగత్తులకు స్వామి అయినాడు. అతడే విశాలమగు ద్యులోకమును, ఈ భూలోకమును వహించినాడు. కస్మైదేవాయ హవిషా విధేమ - అటువంటి దేవతకు హవిస్సు అర్పించుచున్నాము.
14. ఆ ప్రజాపతి ఒక్కడే. శ్వాస కలదియు, కనురెప్ప లార్పునదియు అగు సమస్త జగత్తునకు తన మహిమచే ప్రభువు అయినాడు. అతడే ద్విపాద, చతుష్పాద ప్రాణులను నియంత్రించగల సమర్ధుడు అగుచున్నాడు. "కస్మైదేవాయ హవిషా విధేమ".
15. అతడే - ఆ ప్రజాపతియే ఎల్లరకు ప్రాణము కల్పించువాడు. అతడే శక్తిని ఇచ్చువాడు. అతని ఆజ్ఞను సమస్తలోకములు శిరసావహించును. అతని శాసనమును దేవతలు అనుసరింతురు. అమృతము, మృత్యువు అతనికి ఛాయవంటివి. "కస్మై దేవాయ హవిషా విధేమ".
16. ఏ ప్రజాపతి మహిమ వలన హిమవత్పర్వతాదులు నిలిచి ఉన్నవో భూమి, సముద్రము ఎవని అధీనమందున్నవని చెప్పుచున్నారో - ఎవనికి ఈ దిశలన్నియు స్వాధీనములని చెప్పుచున్నారో ఎవని బాహువులు ధర్మాధర్మములగునో "కస్మై దేవాయ హవిషా విధేమ"
17. స్తంభించి, ప్రకాశించుచున్న ద్యావాపృథ్వులు తమను రక్షించమని ఏ ప్రజాపతిని మనసున ప్రార్థించినవో, సూర్యుడు ఏ ప్రజాపతి ఆజ్ఞచొప్పున ఉదయించుచున్నాడో " కస్మై దేవాయ హవిషా విధామ"
18. ఏ ప్రజాపతి ఉగ్రములగు ద్యావాపృథ్వులను దృఢపరచినాడో, ఎవడు పుణ్యవంతుల కొరకు స్వర్గమును ఏర్పరచినాడో, దుఃఖము లేని అంతరిక్షమును రజోగుణుల కొరకు ఎవడు నిర్మించిడో "కస్మై దేవాయ హవిషా విధేమ"
19. దక్షుని పుట్టించినవియు, చైతన్యవంతమగు అగ్నిని కన్నవియునగు జలములకు ఏ ప్రజాపతి అనుగ్రహమున మహద్విశ్వరూపము కలిగినదో, ఎవడు దేవతలకు జీవకారణమగు ప్రాణమును కలిగించినాడో "కస్మై దేవాయ హవిషా విధేమ"
20. ఎవడు దక్షుని పుట్టించినాడో, ఎవడు అగ్నిని కన్నాడో, ఎవడు జలములకు మహద్విశ్వరూపము కలిగించినాడో, ఎవడు దేవతలకు అధిపతి అయినాడో "కస్మై దేవాయ హవిషా విధేమ"
('కస్మై' కి 'తస్మై' అని అర్థము చెప్పిన ఆ దేవతకు హవిస్సులు అర్పింతుము అగును. కస్మైకి కస్మై అని అర్థము చెప్పిన అట్టి ఏ దేవతకు హవిస్సులు అర్పింతుము? అను ప్రశ్నార్థకము అగును.
మానవ మాత్రుడు పరాత్పరుని ఇంతవరకు తెలిసికొనలేదనియు, తెలిసికొనలేడనియు నా అభిప్రాయము. అది మానవ జాతికి ఏనాటికిని ప్రశ్నార్థకమే!
జీవితము ప్రశ్న. మరణము ప్రశ్న. ప్రకృతి ప్రశ్న. పరలోకము ప్రశ్న. సమస్తము ప్రశ్నయే! ఇన్ని కోట్ల సంవత్సరములలో మనిషి సాధించినాను అనుకొను సమాధానములు సహితము ప్రశ్నార్థకములే. అందుకే పోతన:
ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై
యెవ్వని యందు డిందు బరమేశ్వరుడెవ్వడు మూలకారణం
బెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము దాన యైనవా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదన్
అన్నాడు.)
తొమ్మిదవ అనువాకము
1. అనుష్ఠానమునకు ప్రేరణ కలిగించు అగ్నికి స్వాహా. మనస్సునకు. మేధకు ప్రేరణ కలిగించు అగ్నికి స్వాహా, చిత్తమునకు, జ్ఞానమునకు ప్రేరణ కలిగించు అగ్నికి స్వాహా. వాక్కునకు, విధృతికి ప్రేరణ కలిగించు అగ్నికి స్వాహా. మానవులకు జనకుడైన ప్రజాపతికి స్వాహా. వైశ్వానరాగ్నికి స్వాహా.
విశ్వాత్మకుడు, జగన్నాథుడు అగు దేవుని అనుగ్రహమును మరణము గల మానవుడు యాచించవలెను. విశ్వాత్మకుడు, ధనములకు నియంత యగు వానిని స్తుతించి యజ్ఞము కొరకు ధనమును యాచించవలెను - స్వాహా.
2. ఉఖా! నీవు పగులకుము. పగిలిన అతుకుకొనుము. నీవు చీలకము. చీలిన అతుక్కొనుము. పగులకుండ గట్టిపడుము. చీలకుండ గట్టిపడుము. తల్లివంటి ఉఖా! నీవును, అగ్నియు కలసి ఈ యజ్ఞమును జరిపించండి.
3. భూదేవి రూపమగు ఉఖా! యజమాని నిమిత్తము గట్టిపడుము. మాయ అంతటి తొందరగా అన్నము కలిగించుటకు ఏర్పడినదానవు. జుష్టం దేవానా మిదమస్తు - దేవతలు ఈ హవ్యమును సేవింతురుగాక. బాధించకము. ఈ యజ్ఞము జరుపగ లెమ్ము.
4. సూర్యదేవా! ఈ ఉఖను కాల్చుము. ఇది పగులకుండుటకు గాను దీనిని నీ చేతిలో పెట్టుచున్నాను.
5. ఈ అగ్ని వృక్షములు ఆహారముగా కలవాడు. ఘృతమును ఆహారముగా తనయందు ఉంచుకున్నవాడు. దేవతలను ఆహ్వానించువాడు. వరేణ్యుడు. బలపుత్రుడు. అద్భుతుడు.
6. అగ్నీ! నీవు శ్రేష్ఠుడవు. ఈ కర్మకు అధిష్ఠాతవు. మేము కనిష్ఠులము. ఎదురుగా వచ్చి మమ్ము మా బంధువులను రక్షించుము.
7. అగ్నీ! నీవు రోహిదశ్వుడవు. భూమికి అర్హుడవు. యజమానులకు ప్రియతముడవు. నీవు దూర దేశము నుండి మాకు ఇచ్చుటకు రమ్ము. శత్రువును లంఘించి రమ్ము.
8. అగ్నీ! నీవు లోకములు తెలిసిన వాడవు. ఈ ఉఖ నీకు తల్లి వంటిది. ఆమె ఒడిలో ఉండుము. దానిని నీదీప్తిచే తపింప చేయుము. సంతాపమున తపింప చేయకుము. ఈ ఉఖలోన చేరి నిర్మలముగ ప్రకాశింపుము.
9. అగ్నీ! నీవు ఉఖలోన నీ స్వస్థానమందు దీపించుము. జాతవేదాగ్నీ! నీవు ఉఖయందు తేజోరూపుడవై జ్వలించుము. శివోభవ - సుఖకరుడవు అగుము.
10. అగ్నీ! నీవు నా కొరకు శాంతుడవై కుంపటి యందుండును. అందరికొరకు శాంతమూర్తివై ఉండుము. సర్వ దిశలను శాంతింపచేసి నీ స్వస్థానమగు కుంపటియందు కూర్చుండుము.
పదవ అనువాకము
1. అగ్నీ! నేను నీ యందు పుల్లలు వేయుచున్నాను. అవన్నియు నీకు ఘృతము అగునుగాక. నీవు వానిని ఆరగించుము.
2. అగ్నీ! అల్పజ్వాలల పుల్లలు, చీమలు పట్టిన పుల్లలు నీకు ఘృతము అగును గాత. యువతమాగ్నీ! దానిని భక్షించుము.
3. అగ్నీ! మేము నీకు దగ్గరి వారలము. అందువలన అన్నము, ధనము కలవారలము అయినాము. అశ్వశాల యందలి గుర్రములకు నిత్యము నిరంతరాయముగ గడ్డి వేయుదుము కదా! అట్లే నీకు సమిధలను సమర్పించుచున్నాము. బాధలు లేని వారలమై ఉన్నాము.
4. అగ్ని కుంపటి బొడ్డున మండువాడు. సమిధలచే సంతోషించువాడు. మహా స్తుతులు కలవాడు. యాగహేతువు. జేత. యుద్ధములందు అగ్రభాగమున ఉండువాడు. మా అపరాధములను సహించువాడు. అట్టివానిని మాకు మహా ధనసమృద్ధి కల్గించుమని ఆహ్వానించుచున్నాము.
5. అగ్నీ! పరసేనలు మా మీదకు వచ్చుచున్నవి. అవి బలయుతములు. మమ్ము అంతటను పీడించుచున్నవి. ఇంకను గుప్తచోరులు, ప్రకటచోరులు మమ్ము బాధించుచున్నారు. వారినందరను నీ నీటిలో వేయుచున్నాను.
6. భగవాన్ అగ్నీ! నీ మునిపళ్లచే మల్లిమ్ములను దొంగలను, కోరలచే ప్రకటచోరులను, దవడపళ్లచే గుప్తచోరులను, మరల బ్రతుకకుండ నమిలి మ్రింగుము.
7. గ్రామములందును, అరణ్యములందున మల్లిమ్ములు గుప్తచోరులు, ప్రకటచోరులు ఉన్నారు. అంతేకాక పొదలందు హింసించు మృగములున్నవి. వానిని అన్నింటినీ అగ్నీ! నీ దంతములందు పెట్టుచున్నాను.
8. శత్రువులు నాలుగు విధములు. దానము చేయు ధనము లభించియు దానము చేయనివాడు అరాతి. పనిని చెడగొట్టువాడు ద్వేషి. నోటిమాటలతో బాధించువాడు నిందకుడు. చంపగోరువాడు హంతకుడు. అగ్నీ! వీరినందరను చూర్ణము చేయుము.
9. అగ్నీ! నా బ్రాహ్మణ్యము సన్మార్గవర్తి అగునుగాక. నా మేధాశక్తియు, శరీరబలమును స్వకార్యక్షమములు అగును గాక. నేను పురోహితునిగా ఉన్న క్షత్రియుని క్షాత్రము జయశీలము అగును గాత.
10. మా ఇరువురి బాహు బలమును పెంచు చున్నాను. వర్చస్సును, బలమును వర్థిల్లచేయు చున్నాను. నా మంత్రశక్తిచే శత్రుబలమును క్షీణింపచేయుచున్నాను. స్వకీయులను వృద్ధి చెందించుచున్నాను.
11. ఇది స్వర్ణాభరణము. ఇది దర్శనీయము. ఆయువులు పెంచునది. ఎంతో దీప్తి కలది. ప్రకాశించునది. అగ్ని వంటిది. హవిస్సులచే అమరము అయినది. దీనిని ద్యులోకము నందలి దేవతలు మంచి బలము గల దానిగా చేసినారు.
(ఇది యజమాని ధరించవలసిన ఆభరణము.)
12. సూర్యుడు విద్వాంసుడు. శ్రేష్ఠుడు. సమస్త రూపములను ప్రకాశింప చేయువాడు. ద్విపద, చతుష్పాత్తులకు క్షేమము కలిగించువాడు. అతడు స్వర్గమును ప్రకాశింపచేసినాడు. ఉషః కాలము దాటినంత మరింత ప్రకాశించినాడు.
13. రాత్రియు, పగలును సమనస్కలై, విలక్షణ రూపలై, అనుకూలములై కన్న ఒక అగ్ని శిశువును యజమానికి ఇచ్చినవి.
శిశువగు ఆ అగ్ని ద్యావాపృథ్వులను, అంతరిక్షమును విశేషముగ ప్రకాశింపచేయుచున్నాడు. ధనము ప్రసాదించునట్టి దేవతలు ఈ అగ్నిని ఆశ్రయించినారు.
14. అగ్నీ! నీవు గరుత్మంతుని వంటి వాడవు, పక్షి స్వరూపుడవు అగుచున్నావు.
త్రిపృత్ సామము నీకు శిరము, గాయత్రీ సామము నేత్రములు, పంచదశాదిస్తోమము జీవాత్మ, వామదేవ్యము తనువు, బృహత్ రథంతరము పక్షములు, యజ్ఞాయాజ్ఞికము పృచ్చము, ఛందస్సులు అవయవములు, ధిష్టి యములు శఫలు, యజుస్సులు నామములు, శఫము ఆసీనమగు స్థానము అగుచున్నవి.
(అగ్నిని పక్షిగా దర్శించినాడు.)
15. అగ్నీ! నీవు గరుడుని వలె పక్షిరూపుడవు అగుచున్నావు. ఆకసమునకు ఎగురుము. స్వర్గమునకు చేరుము.
పదకొండవ అనువాకము
1. అగ్నీ! నీవు అధ్వరమునకు చేరుకున్నావు. అధ్వరము దేవతలను చేరుకున్నది.
2. సోమదేవా! యజమాని నీకు హవిస్సులు అర్పించుచున్నావు. నీవు అతనికి సుఖములు కలిగించి, రక్షించుచున్నావు. అట్టి రక్షణలతోనే మాకు రక్షకుడవగుము.
3. "అగ్నిర్మూర్దా" అనునది పురోను వాక్య. 'భువో యజ్ఞస్య' అనునది యాజ్య.
4. "త్వంనః సోమ విశ్వతః" అనునది పురోను వాక్య. "యాతే ధామాని" అనునది యాజ్య.
5. సవితృదేవత మా బుద్ధులకు ప్రేరణ కలిగించుచున్నాడు. అట్టి సవితృదేవత యొక్క వరేణ్యమగు తేజస్సును ధ్యానించుచున్నాము.
6. ఇంద్రియములే 'నేను' అనునది భ్రాంతి. అది గట్టిది. వదలదు. అందువలన జ్ఞానమునకు దీనత్వము కలుగును. ఇంద్రియములు ఎరుగవు. అందువలన దేవతల విషయమున పాపములు చేసినాము. సవితృదేవా! మేము దేవతల, మానవుల, కర్మల విషయమున పాపరహితులము అగునట్లు చేయుము. సత్కార్యములకు ప్రేరణ కలిగించుము.
7. సరస్వతి ప్రియ వాక్యములకు ప్రేరణ కలిగించునది. సుమతుల మగు మమ్ము గ్రహించునది. ఆ సరస్వతి ఈ యజ్ఞమును చేయించుచున్నది.
8. సరస్వతి వీరులను, పాలకులను చేయునది. కమనీయ. విచిత్ర జీవము కలది. వీరులను పాలించునది. ఛందస్సులతో కూడినది.
సరస్వతి యజమానిని అనుగ్రహించవలెను. అతని స్తోత్రములు విని అతనికి అవిచ్చిన్న రక్షణలను, అన్యులు నివారించలేని సుఖములను ప్రసాదించవలెను.
9. పూషదేవత మమ్ము రక్షించుటకు వెనుక ఉండును గాత. అశ్వములను రక్షించును గాక. మాకు ధనము నొసంగును గాత.
10. పూషదేవా! నీ స్వరూపము శుద్ధము. అది అనేక ప్రకారములది. నీ పూజనము బహువిధములది. నీవు కలిగించు అహస్సు, రాత్రియు నానా రూపములు కలవి. నీవు మాత్రము ఆకాశము వలె ఏక రూపవు అగుచున్నావు.
అన్నవంతుడవగు పూషా! మా చిత్త వృత్తులను కాపాడుచున్నావు. ఈ యజ్ఞమునందు నీవు మాకు ప్రసాదించు ఫలము భద్రమగును గాక.
11. మరుత్తులు తమ మహిమచే వృద్ధిచెందిన వారు. స్వర్గమును చేరినారు. వారు యజమాని కొరకు స్వర్గమున గొప్ప స్థానమును ఏర్పరచినారు.
కోరికలు తీర్చునట్టి మరుత్సంబంధ యజ్ఞమును విష్ణువు పాలించినాడు. ఆ యజ్ఞము నందు మరుత్తులు - చెట్టు కొమ్మల మీద పిట్టల వలె - కూర్చున్నారు.
12. ఋత్విగ్యజమానులారా! మీరు మరుత్తుల బలముతో వైరి బలములను విరిచినారు. మరుత్తులు హవిస్సు కోరువారు. శీఘ్రగాములు. స్వాధీన బల సంపన్నులు. వారిని వివిధ అర్చనలతో సేవించండి.
చూడండి ఈ భూమి మరుత్తుల యజ్ఞము కొరకు కంపించుచున్నది. అగ్నీ! ఈ ఆశ్చర్యమును పరికించుము.
13. "విశ్వేదేవా ఋతావృధః" అనునది పురోను వాక్య. "విశ్వేదేవాః శృణుత" అనునది యాజ్య
14. ద్యావాపృథ్వులు ఫలసాధకమును, స్వర్గమును అంటునట్టిదియునగు ఈ యజ్ఞమును నేడు దేవతలకు అందించెదరు గాక.
15. ద్యావాపృథ్వులు తొలుత పుట్టినవి. తలిదండ్రుల వంటివి. యజ్ఞమునందు నవీన మంత్రముల చేత వానిని స్తుతించండి.
ద్యావాపృథ్వులారా! మీ యజ్ఞగృహము పూజనీయము. మీరు దేవతలతో కూడి మా వద్దకు విచ్చేయండి.
16. యజమానీ! అగ్నిని ప్రజ్వలింప చేయుము. మరణము లేని అగ్నిని స్తుతించుము. మా హవిస్సులను దేవతలకు అందించమని ప్రార్థించుము.
17. అగ్ని హవ్యవాహనుడు. అమరుడు. అనుగ్రహ బుద్ధికలవాడు. దేవదూత. మానవహితకారి. అతడు దయ గలవాడై ఇచటికి వచ్చును గాక.
"శంనోభమన్తు వాజినః" పురోను వాక్య "వాజే వాజ్కేవత వాజినః" యాజ్య.
శ్రీమదాంధ్ర వచన కృష్ణ యజుర్వేదీయ తైత్తిరీయ సంహిత
నాలుగవ కాండము నందలి మొదటి ప్రపాఠకము సమాప్తము.





