Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    5. స్తుతియోగ్యములగు కిరణములు గోచరించినవి ! జగత్తునకు వర్షదారవలె ఉష జగమున వెలుగులు విరజిమ్మినది.

    6. కాంతిమతీ ఉషా ! నీవు జగములను వెలుగులతో నింపుము. వెలుగులతో చీకట్లను తరిమికొట్టుము. తదనంతరము విధిపూర్వకముగ హవిర్లక్షణ అన్నమును రక్షింపుము.

    7. ఉషా ! ఓ ఉషా ! నీవు దీప్తి తేజోయుక్తవగుము. నీ కిరణముల ద్వారా ద్యులోకమును, విశాలము ప్రియమగు అంతరిక్షమున వ్యాపింపుము.

                           ఏబది మూడవ సూక్తము

        ఋషి - వామదేవుడు  దేవత - సవిత, ఛందస్సు - జగతి.

    1. సవిత బలవంతుడు. బుద్ధిమంతుడు. ప్రేరకుడు. అతడు హవ్యదాతలగు యజమానులకు స్వేచ్చాపూర్వక ధనమును ప్రసాదించును. అట్టి వరణీయము, పూజ్యమగు ధనమును మాకు ప్రసాదించమని సవితను ప్రార్థింతుము. మహానుడగు సవిత అట్టి ధనమును మాకు నిత్యము ప్రసాదించవలెను.

    2. సవిత ద్యులోక సహితముగ సమస్త లోకములను ధరించును. ప్రజలకు ప్రకాశము, వృష్టి మున్నగువానిని ప్రసాదించి పాలించును. అతడు కవి. హిరణ్మయ కవచము ధరించువాడు. సవిత విచక్షణుడు. విఖ్యాతుడు. అట్లయ్యు జగములను వెలుగులతో నింపును. స్తుతి యోగ్యములగు ప్రభూత సుఖములను సృష్టించును.

    3. సవిత స్వతేజమున భూలోక, ద్యులోకములను నింపును. సత్కార్యములను ప్రశంసించును.అతడు ప్రతి దినము లోకములను పనులందు నియమించును. ప్రేరణ కలిగించును. అతడు సృజన కార్యములకుగాను తన బాహువులను ప్రసరింపచేయును. చేతులను చాచును.

    4. సవిత ఆహింసితుడయి లోకములను ప్రదీప్తములు చేయును. వ్రతములను రక్షించును. భూలోక ప్రజకొఱకు తన బాహవులను ప్రసరింప చేయును. ధృత వ్రత సవిత మహా జగత్తులకు ఈశ్వరుడగును.

    5. సవిత తన స్వంత మహిమతో అంతరిక్షత్రయమును వ్యాపించును. లోకత్రయమును వ్యాపించును. దీప్తిమంతులగు అగ్ని, వాయు, ఆదిత్యులను వ్యాపించును. మూడు ద్యులోకములను వ్యాపించును. మూడు పృథ్వులను వ్యాపించును.

    సవిద గ్నీష్మ, వర్ష, హిమ ఋతువుల ద్వారా మమ్ము అనుగ్రహ పూర్వకముగ రక్షించవలెను.

    (ద్యులోకత్రయము - ఇంద్ర, ప్రజాపతి, సత్యలోకములు మూడు అంతరిక్షత్రయము - వాయు, విజ్యుత్, వరుణములు పృథ్వులు క్షిత్యవాంతరభేదాత్ అని శాయణుడు)

    6. సవిత అనంత ధనశాలి. అతడు సర్వ కర్మకారకుడు. అతడే అందరకు ధ్యేయుడు. స్థావర జంగమాత్మక లోకములు అతని వశమందున్నవి.

    అట్టి సవిత మా పాపములను పరిహరించవలెను. ముల్లోకములందలి సుఖములు ప్రసాదించవలెను.

    7. సవిత ఋతువుల సహితుడయి విచ్చేయవలెను. మా గృహములను వర్థిల్ల చేయవలెను. మాకు పుత్ర పౌత్రాది యుక్తమగు అన్నము ప్రసాదించవలెను. అతడు రేయింబవళ్ళు మా విషయమున ప్రీతుడు కావలెను.

    సవిత మాకు అపత్యయుక్త ధనము దానము చేయవలెను.

                       ఏబది నాలుగవ సూక్తము

     ఋషి - వామదేవుడు, దేవత - సవిత, ఛందస్సు - జగతి, చివరిది త్రిష్టుప్.

    1. సవిత ఉదయించినాడు. మనము త్వరత్వరగా అతనికి నమస్కరింతము. అతనిని ఇప్పుడు తృతీయ సవనమున స్తోతలుస్తుతించవలెను. సవిత మానవులకు రత్నదానము చేయును. అతడు మేము చేయు ఈ యజ్ఞమునకు రావలెను. మాకు శ్రేష్ఠమగు ధనము ప్రసాదించవలెను.

    2. సవితా ! తొలుత యజ్ఞాహం దేవులకుగాను అమృతత్వ సాధన భూతమగు సోమపు ఉత్కృష్ట భాగమును ఉత్పన్నము చేయుము. అనంతరము హవ్యదాతను ప్రకాశింప చేయుము. అట్లే పితృ, పుత్ర, పౌత్రాదులకు జీవన దానము చేయుము.

    3. సవితా ! అజ్ఞానవశమునగాని, దౌర్బల్యమునగాని బలశాలురమయిగాని, ప్రమాదవశమునగాని, ఐశ్వర్య గర్వమునగాని, పరిజన గర్వమునగాని, నీ విషయమునను దేవతల విషయమునను, మానవుల విషయమునను అపరాధము చేసి ఉన్నచో ఈ యజ్ఞము అట్టి మా పాపములను తొలగింపుము.

    4. సవిత కర్మములు కార్యములు హింసా యోగ్యములు కావు. ఏలనన అతడు విశ్వభువనములను భరించువాడగును. అతడు అంగుళి విశిష్టుడయి పృథ్విని విస్తరించుటను ప్రేరేపించును. అట్లే ద్యులోక విస్తీర్ణమునకు ప్రేరకుడగును. సవిత ఈ కర్మము వాస్తవముగ అవధ్యము.

    5. "సత్యమస్యతత్" సవితా ! పరమైశ్వర్యవంతుడగు ఇంద్రుడు మా అందరకు పూజనీయుడు. నీవు మమ్ము పర్వతములకన్న ఉన్నతులను చేయుము. యజమానులందరకు గ్రామ, నగరాదులు అందింపుము. వారు నీ ఆజ్ఞను అనుసరించి ప్రవర్తింతురు. నీ ఆదేశమును అనుసరించి నిలుతురు.

    6. సవితా ! నీ కొఱకు నిత్యము ముమ్మారు సౌభాగ్యజనక సోమమును అభిషవించు యజమానికి నీవు, ఇంద్రుడు, ద్యావాపృథ్వులు, జలవిశిష్ట సింధువు, దేవతలు, ఆదిత్యులు, అదితి సుఖములు ప్రసాదించవలెను. మాకును సుఖములు ప్రసాదించవలెను.

                            ఏబది అయిదవ సూక్తము

 ఋషి - వామదేవుడు, దేవత - విశ్వదేవతలు  ఛందస్సు- 1-7 త్రిష్టుప్, 8-10 గాయత్రి.

    1. వసువులారా ! మీలో త్రాత ఎవడగును? ఎవడు దుఃఖములను నివారించును? ఓ అఖండనీయ ద్యావాపృథ్వులారా ! మమురక్షింపుడు. వరుణా, మిత్రా ! మీరు ఉభయులు మమ్ము పరాభవకారులగు మానవులనుండి రక్షింపుడు. దేవతలారా ! యజ్ఞమునందు మీలో ఏ దేవత ధనము ప్రసాదించువాడగును? 

    2. ఏ దేవత స్తోతలకు పురాతన స్థానము ప్రదానముచేయునో, ఏ దేవత దుఃఖనివారకుడగునో; ఏ దేవత అమూఢుడగునో, ఏ దేవత అంధకారములను నాశనము చేయునో అతడే విధాత అగును. నిత్యాభీష్ట ఫలప్రదాత అగును. సత్య కర్మావశిష్టుడు అగును. దర్శనీయుడగును. శోభిల్లచేయువాడగును.

    3. సర్వజనుల గమ్యమగు దేవమాత అదితిని సింధువును స్వస్తిదేవిని స్నేహము కొఱకుగాను మంత్రములతో స్తుతింతుము. ద్యావాపృథ్వులు మమ్ము విశేష రూపమున పాలించవలెను. అందుకుగాను వారిని స్తుతింతుము. ఉష, అహోరాత్ర్యాభిమాన దేవతలు మాకు అభిమతములు ప్రసాదించవలెను.

    4. ఆర్యమ, వరుణుడు యజ్ఞమార్గమును జ్ఞాపితము చేసినారు. హవిర్లక్షణ అన్నములకు పతియగు అగ్ని సుఖకర మార్గము కనబరచినాడు. ఇంద్రుని విష్ణువును సుందరస్తుతుల స్తుతించినాము. వారు మాకు పుత్ర పౌత్రాదియుక్తము, బలసంపన్నము రమణీయమగు సుఖములు ప్రసాదించవలెను.

    5. ఇంద్ర సఖులగు పర్వతములను, మరుద్గణములను, భగుని మమ్ము రక్షించమని యాచించుచున్నాము. స్వామియగు వరుణుడు జనసంబంధములగు పాపములనుండి మమ్ము రక్షించవలెను. మిత్రుడు మిత్రభావమున మమ్ము కాపాడవలెను.

    6. ఓ ద్యావాపృథ్విరూప దేవీద్వయమా ! ధనాభిలాషి సముద్ర మధ్యమునకు చేరుటకుగాను సముద్రమును స్తుతించినట్లు మేము మా అభిలషిత కార్యలాభమునకుగాను అహిబుధ్న్యనామక దేవత సహితముగా మిమ్ము స్తుతింతుము. దేవగణములు దీప్తి ధ్వనియుక్తములగు నదులను విముక్తములు చేయవలెను.

    7. దేవమాత అదితి అన్యదేవతల సహితముగా మమ్ము పాలించవలెను. త్రాత ఇంద్రుడు అప్రమత్తుడయి మమ్ము పాలింపవలెను. మిత్రుడు, వరుణుడు, అగ్నియొక్క సోమాది రూప సముచ్చిత అన్నమును మేము హింసింపజాలము. కాని అనుష్ఠానముల ద్వారా వర్థిల్ల చేయగలము.

    8. అగ్ని ధనములకు ఈశ్వరుడు. మహా సౌభాగ్యములకు ఈశ్వరుడు. అందువలన అగ్ని మాకు ధనము సౌభాగ్యము ప్రసాదించవలెను.

    9. ఉషా ! నీవు ధనవతివి. సత్యరూప వచనాభిమానివి. మాకు అత్యంత రమణీయ ధనమును దానము చేయుము.

    10. సవిత, భగుడు, వరుణుడు, మిత్రుడు, ఆర్యమ ఇంద్రుడు ధనసహితులయి విచ్చేయవలెను. ఆ సకల ధనములను మాకు అందించవలెను.

                                 ఏబది ఆరవ సూక్తము

 ఋషి - వామదేవుడు, దేవత - ద్యావాపృథ్వులు ఛందస్సు - 1- 4 త్రిష్టుప్ 5-7 గాయత్రి

    1. ద్యావాపృథ్వులు మహిమాన్వితులు. శ్రేష్ఠులు. వారు ఈ యజ్ఞమునకు విచ్చేయవలెను. దీప్తికర మంత్ర సోమాదియుక్తలు అయి దీప్తివిశిష్టులు కావలెను.

    సేచనకారి పర్జన్యుడు విస్తీర్ణములు. మహరింతములగు ద్యావాపృథ్వులను స్థాపించి ప్రథమానులు, గమనశీలురగు మరుత్తులతో కలిసి సర్వత్ర శబ్దము చేయును.

    2. ద్యావాపృథ్వులు యజనయోగ్యులు. అహింసకులు. అభీష్టవర్షులు. సత్యశీలలు. ద్రోహరహితలు. దేవతల ఉత్పాదకులు. యజ్ఞనిర్వాహకులు. వారు యష్టవ్యదేవతల సహితలయి దీప్తికర మంత్ర, హవిర్లక్షణ అన్నయుక్తలు కావలెను.

    3.ఎవడు ఈ ద్యావాపృథ్వులను సృష్టించినాడో ఏధీమంతుడు విస్తీర్ణములు, అవిచలములు, సురూపలు, ఆధార రహితులగు ద్యావాపృథ్వులను సమ్యగ్రూపమున, కుశల కర్మద్వారా పరిచలింప చేసినాడో. అతడే సకల భువన శుభంకరుడు, శోభాయ మానుడు.

    4. హే ద్యావా పృథ్వులారా ! మీరు పరస్పర సంగతులు అగుడు. మాకు అన్నదానము చేయు అభిలాష కలవారలు కండు. విస్తీర్ణలు, వ్యాప్త్రలు, యాగ యోగ్యులయి మాకు పత్నీయుక్త మహా గృహమును ప్రసాదించుడు. మమ్ము రక్తింపుడు. మేము మా కర్మబలమున రథములను, దాసులను పొందగలము.

    5. ద్యుతిమతులగు ద్యావాపృథ్వులారా ! మీరు పరిశుద్ధులు. మీ కొఱకు మేము మహాస్తుతులను సేకరింతుము. మిమ్ము ప్రశంసించుటకు మేము మీదరి చేరుదుము.

    6. దేవేరులారా ! మీరు ఉభయులు మీ స్వరూపము మరియు బలముల ద్వారా పరస్పరము పరిశీలించుకొనుడు. శోభాయమానులు అగుడు. సర్వదా యజ్ఞములు నిర్వహింపుడు.

    7. మహాద్యావా పృథ్వులారా ! మిత్రభూతులగు స్తోతల అభీష్టములు తీర్చండి. అన్నమును విభజించియు, పూరించియు యజ్ఞపు నలుదిక్కుల ఉపవిష్టులుకండు.

                             ఏబది ఏడవ సూక్తము

 ఋషి - వామదేవుడు, దేవత - వేరు వేరు ఛందస్సు 4,6,7 అవష్టుప్ -5 ఉష్ణిక్,
                                    మిగిలినవి త్రిష్టుప్.

    1. మేము యజమానులము. బంధు సదృశ క్షేత్రపతి దేవతల సహితులమయి క్షేత్రములను జయింతుము. వారు మా గోవులకు, అశ్వములకు పుష్టిని ప్రసాదించవలెను. ఆ దేవతలు మాకు మేము కోరిన దాతవ్యమగు ధనములిచ్చి మమ్ము సుఖవంతులను చేయవలెను.   

    2. క్షేత్రపతీ ! గోవు దుగ్ధములను ప్రసాదించినట్లు నీవు మాకు మధుష్రావి, సుపవిత్ర, ఘృతతుల్య మాధుర్యయుక్త జలములను దానము చేయుము. యజ్ఞస్వామివయి మమ్ము సుఖవంతులను చేయుము.

    3. వ్రీహి, పయుంగాది ఓషధులు మాకు మధుయుక్తములు కావలెను. మూడు ద్యులోకములు, జలసమూహములు, అంతరిక్షము మాకు మధుయుక్తములు కావలెను. మేము శత్రువుల ద్వారా హింసించబడక క్షేత్రపతిని అనుసరింతుము.

    4. బలీవర్ణ గణములు సుఖములను వహించవలెను. మనుష్యగణములు సుఖ పూర్వకముగ కృషికార్యము చేయవలెను. లాంగలములు సుఖపూర్వకముగ కర్షించవలెను. ప్రగహసమూహము సుఖపూర్వకముగ నిలిచి ఉండవలెను. ప్రతదులు సుఖములకు ప్రేరణ కావలెను.

    5. శున సేరులారా ! మీరు మా యీ స్తుతిని పరిగ్రహింపుడు. మీరు ద్యులోకమున సృష్టించిన జలములతోనే పృథ్విని సిక్తము చేయుడు.

    (శునసిరులు ఇంద్రవాయువులని శాయణుడు "శునింద్రః సేరోవాయుః అని)

    6. సౌభాగ్యవతివగు సీతా ! నీవు మాకు అభిముఖివగుము. మేము నిన్ను స్తుతింతుము. నీవు మాకు సుందరధనమును, సుందర ఫలములను ప్రసాదించుము. అందుకే నీకు మేము నమస్కరింతుము.

    (సీతా-భూమి కర్ణిఇకా అని దయానందుడు అనగా నాగేటిచాలు)

    7. ఇంద్రుడు సీతాధార కర్రను పట్టవలెను. పూష ఆ సీతను నియంత్రించవలెను. ఉదకవతి ద్యౌ సంవత్సరపు ఉత్తరమున సస్యములను పితుకవలెను.

    8. నాగలి సుఖముగా భూమిని దున్నవలెను. రక్షక గణములు బలీవర్ది సహితముగా విచ్చేయవలెను. పర్జన్యుడు మధుర జలమున భూమిని తడుపవలెను. శునసౌరులు మాకు సుఖములు ప్రసాదించవలెను.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.