Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
6. ఇంద్రవాయువులారా ! సోమము అభిషుతమై ఉన్నది. మీరు దేవతల సహితులయి, ప్రియమనస్కులయి విచ్చేయుడు. హవ్య దాత యజమాని యజ్ఞశాలలో సోమపానము చేయండి.
7. ఇంద్రవాయువులారా ! ఈ యజ్ఞమునకు తాము విచ్చేయవలెను. ఈ యజ్ఞమున మీరు సోమపానము చేయుటకుగాను మీ అశ్వములు విముక్తములు కావలెను.
నలుబది ఏడవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రవాయువులు, ఛందస్సు - అనుష్టుప్.
1. వాయువా ! మేము వ్రతచర్యాదులతో పవిత్రులము అయినాము. ద్యులోకమునకు చేరకోరుచున్నాము. మధుర సోమరసపానమునకుగాను నిన్ను ప్రథమముగా ఆహ్వానించుచున్నాము. నీవు స్పృహణీయుడవు. నీవు 'నీయుదా' శ్వ వాహనమున సోమపానమునకు విచ్చేయుము.
2. వాయువా ! నీవు, ఇంద్రుడు గృహీత సోమపాన యోగ్యులు. నీరు పల్లమునకు పారునట్లు సోమరసము మీ ఉభయులవైపు సాగును. మీకు సోమము అట్లే లభించును.
3. వాయువా ! నీవు, ఇంద్రుడును, మీరు ఉభయులు బలములకు ప్రభువులు. పరాక్రమశాలురు. 'నియుద్' గణయుక్తులు. మీరు ఉభయులు ఒకే రథమును ఆరోహించి మాకు ఆశ్రయ ప్రదానమునకును, సోమపానమునకును ఇచటికి విచ్చేయుడు.
4. ఇంద్రవాయువులారా ! మీరు నేతలు. యజ్ఞవాహకులు. మేము మీకు హవి సమర్పించు యజమానులము. మీ వద్ద అనేకులు ఆశించు నియుద్గణములున్నవి. వానిని మాకు ప్రసాదించుడు.
నలుబది ఎనిమిదవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - వాయువు, ఛందస్సు - అనుష్టుప్.
1. వాయూ ! శత్రువులను వడికించు రాజువలె తొలుతనే నీకు సమర్పించిన సోమమును సేవింపుము. స్తోతలకు ధనము ప్రసాదించుము. నీవు సోమపానమునకుగాను ఆహ్లాదకర రథమున విచ్చేయుము "యాహిసుతస్యపీతయే"
2. వాయూ ! నీవు అభిశస్తిని నిశ్శేషముగ నియోగింతువు. నియుద్గణయుక్తుడవు. ఇంద్రుడు నీకు సారథి అగును. సోమపానమునకుగాను ఆహ్లాదకర రథమున విచ్చేయుము. "యాహిసుతస్యపీతయే"
3. వాయువా ! కృష్ణవర్ణ, వసువులకు ధాత్రి, విశ్వరూప ద్యావాపృథ్వులు మిమ్ము అనుసరించును. సోమపానమునకుగాను ఆహ్లాదకర రథమున విచ్చేయుము. "యాహిసుతస్యపీతయే"
4. వాయువా ! నీవేగము మనోవేగము. నీవు పరస్పర సంయుక్తుడవు. తొంబది తొమ్మిది అశ్వములుగల వాడవు. సోమపానమునకుగాను ఆహ్లాదకర రథమున విచ్చేయుము. "యాహిసుతస్యపీతయే"
5. వాయువా ! నీవు శతసంఖ్యక పోషణీయ అశ్వములను రథమునకు కట్టుము. లేదా సహస్ర సంఖ్యక అశ్వములను రథమునకు పూన్చుము. వాని సహితముగా నీ రథము వేగవంతమయి రావలెను.
నలుబది తొమ్మిదవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, బృహస్పతి; ఛందస్సు - గాయత్రి.
1. ఇంద్ర బృహస్పతులారా ! ఇది ప్రియమగు సోమరూపహవి. దీనిని మేము మీ ఉభయుల నోళ్లకు అందింతుము. మేము మీకు ఉక్థము, మాదక సోమరసము సమర్పింతుము.
2. ఇంద్ర బృహస్పతులారా ! మీ పానమునకు, మీకు హర్షమునకు మనోహరమగు సోమము విధిపూర్వకముగ సమర్పించబడుచున్నది.
3. సోమపాయులగు ఇంద్ర బృహస్పతులారా ! మీరు సోమపానమునకుగాను మా యజ్ఞగృహమునకు విచ్చేయుడు.
4. ఇంద్ర బృహస్పతులారా ! మీరు మాకు శతసంఖ్యక గోయుక్తము, సహస్ర సంఖ్యక అశ్వయుక్తమగు ధనమును దానము చేయుడు.
5. ఇంద్ర బృహస్పతులారా ! సోమము అభిషుతము అయినది. మేము స్తుతుల ద్వారా మిమ్ము సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.
6. ఇంద్ర బృహస్పతులారా ! మీరు హవ్యదాత అగు యజమాని గృహమున సోమపానము చేయుడు. అతని గృహమున నివసించి తృప్తులు అగుడు.
ఏబదవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - ఇంద్ర బృహస్పతులు ఛందస్సు 10 జగతి మిగిలినవి త్రిష్టుప్.
1. బృహస్పతి యజ్ఞపాలకుడు. అతడు స్వబలమున పృథివి దశదిశలను స్తంభింప చేసినాడు. అతడు శబ్దము ద్వారా మూడు స్థానములందు వర్తమానుడయి ఉన్నాడు. అట్టి ఆహ్లాదకుడు, జిహ్వావిశిష్టుడగు బృహస్పతిని పురాతనులు ద్యుతిమంతులగు మేధావులు పురోభాగమున ప్రతిష్ఠించినారు.
2. బృహస్పతీ ! నీవు విశాల యజ్ఞవంతుడవు. నీ గమనము శత్రువులను వడికించును. నిన్ను సంతృప్తుని చేయువారలకు నీవు ఫలప్రదుడవు. వర్థశీలుడవు. అహింసితుడవయి వారి విస్తీర్ణ యజ్ఞమును రక్షింతువు.
3. బృహస్పతీ ! అత్యంత దూరవర్తి స్వర్గనామక ఉత్కృష్ట స్థానమునుండి నీ అశ్వములు యజ్ఞస్థానమునకు వచ్చి విశ్రమించును. జలగిరి సరస్సు నలువైపుల నుండి నీరు ప్రవహించినట్లు నీకు నలువైపుల స్తుతులు, ప్రస్తదాభిషుత మధుర సోమరసము కదలాడుచుండును.
4. మంత్రాభిమానియగు బృహస్పతి మహాన్ ఆదిత్యుని నిరతిశయ ఆకాశమున తొలిసారి ప్రకాశమానుడు అయినపుడు అపుడు సప్తఛందోమయ ముఖవిశిష్టమై, బహుప్రకారముల సంభూతమై, శబ్దయుక్తమై, గమనశీలమైన తేజోవిశిష్టుడయిన బృహస్పతి అంధకారమును పటాపంచలు చేసినారు.
5. బృహస్పతి దీప్తియుక్తము, స్తుతిశాలియగు అంగిరాగణములతో కలిసి శబ్దము ద్వారా బలనామక అసురుని నష్టపరచినాడు. అతడు తన శబ్ద ప్రభావమున భోగప్రదాత్రులు, హవ్య ప్రేరకములగు గోవులను వెలికి తీసినాడు.
6. మేము మాకు పాలకుడు, సర్వదేవతా స్వరూపుడు, అభీష్ట వరదుడగు బృహస్పతిని యజ్ఞము ద్వారా, హవ్యముద్వారా, స్తుతులద్వారా పరిచర్యలు చేయుదుము. అందువలన బృహస్పతి మమ్ము సుపుత్రవంతులను, వీర్యవంతులను ధనస్వాములను చేయవలెను.
7. బృహస్పతిని చక్కగా పోషించువాడును, అతనిని ప్రథమ హవ్యగ్రాహిగా గ్రహించి పూజించువాడును, నమస్కరించువాడును అగునట్టి రాజు తన బలపరాక్రమమున, శత్రువును పరిభూతునిచేసి నిలుచును.
8.ఎవని వద్దకు అతడు బృహస్పతి ప్రథమ గమనము చేయునో అతడు సుతృప్తుడయి స్వగృహమున నివసించును. అతని కొఱకు భూమి సర్వకాలములందు ఫలించును. ప్రజలు స్వయముగా అతనివద్ద అవనతులు అగుదురు.
9.ఎవడు రక్షణ కుశలుడు, ధన రహితుడగు బృహస్పతికి ధనదానము చేయునో అట్టివాడు అప్రతిహతుడయి శత్రువుల, ప్రజల ధనములను గెలిచి మహామహుడు అగును. దేవతలు అతనినే రక్షింతురు.
10. బృహస్పతీ ! నీవును ఇంద్రుడును ఈ యజ్ఞమున హృష్టులగుడు. యజమానులకు ధనదానము చేయుడు. సర్వవ్యాపకమగు సోమము మీ దేహములందు ప్రవేశించవలెను. మీరివురు మాకు పుత్ర, పౌత్రాది యుక్తమగు ధనమును దానము చేయుడు.
11. ఇంద్ర బృహస్పతులారా ! మీరు మమ్ము వర్థిల్ల చేయుడు. మా విషయమున మీ ఉభయుల అనుగ్రహము ఒకే సమయమున ఒకేరీతిగా ఉండవలెను. మీరు ఉభయులు మా యజ్ఞమును రక్షింపుడు. మా స్తుతులు ఆలకించుడు. జాగృతులయి స్తోతల శత్రువులతో యుద్ధ మొనరించుడు.
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత, మూడవ అష్టకము, నాల్గవమండలమున ఏడవ అధ్యాయము సమాప్తము)
ఎనిమిదవ అధ్యాయము ఏబది ఒకటవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - ఉష, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఉషను మేము నుతింతుము. ఆమె సర్వప్రసిద్ధ. అత్యంత ప్రభూత. కాంతివంతమగు పూర్వదిశయందు అవతరించును. అంధకార మధ్యమున వెలువడును.
ఉష ఆదిత్య దుహిత, దీప్తిమతి. యజమానుల గమన కార్యమున వాస్తవముగ సామర్థ్యయుక్త కావలెను.
2. ఉష యజ్ఞమందలి యూపస్తంభమువలె శోభాయమాన, ఉష విచిత్ర, ఉష పూర్వదిశయందు వ్యాపించి నిలుచును. అంధకారము బాధాజనకము. ఉష అంధకార కవాటములను బంధించును. ఉష దీప్తము, పవిత్రము, ప్రకాశవంతము అగును.
3. ఉష చీకట్లను చెదరగొట్టునది. ధనవతి. భోజ్యదాత అగు యజమానికి సోమాధి ధనప్రదానము చేయుటకు ఆతురపడును.
ఇది అత్యంత గాఢాంధకారము. ఈ అంధకార మధ్యమున వర్తకులవంటి అదాతృగుణులు, అప్రబుద్ధ భావమున గాఢనిద్రలో నిమగ్నులు కావలెను.
"పణయః ససన్త్వ బుధ్యమానాస్తవ సోవిమధ్యే"
4. ద్యోతిమానులగు ఉషలారా ! మీరు సప్తఛందోయుక్తముఖులగు, నవగ్వ, దశగ్వ అంగిరులను మీ రథముద్వారా ధనవంతులను ప్రదీప్తులను చేసినారు.
ధనవంతులగు ఉషలారా ! మీదగు ఆ రథము పురాతనముగాని, నవీనముగాని ఆ రథము మా యజ్ఞ గృహమునకు తరలి రావలెను.
5. ఉషలారా ! మీరు ద్యుతిమతులు. ద్విపాత్రులు, చతుష్పాత్తులను మేలుకొల్పుదురు. వారిని తమ కార్యములకు ఉపక్రమింప చేయుదురు.
ఉషలారా ! యజ్ఞమునకు సాగు అశ్వములద్వారా క్షణమాత్రమున సమస్త భువనములను పరిభ్రమించుడు.
6. ఏ ఉషల కొఱకు ఋభువులు చమసాదులను నిర్మించినారో ఆ సనాతన ఉష ఏది? దీప్తములు, నిత్యనూతనములు, సమానరూప విశిష్టలగు ఉషలు తమ దీప్తితో ప్రకాశించినపుడు జ్ఞాతములుకావు. అదెట్లనగా ఉషలు సర్వదినములందు ఏకరూప సదృశలగుదురు. అందువలన ఇది 'పురాతన ఉష' ఇది 'నవీన ఉష' అని గుర్తింపనలవి కాదు.
7. యజ్ఞకర్తలు ఉషలను ఉక్థలు, స్తోత్రములు, వస్త్రములు ఉచ్చరించి, స్తుతించి శీఘ్ర ధనలాభము పొందినారు. అట్టి శుభంకరములగు ఉషలు అనాదికాలమునుండి అరుదెంచి ధనదానము చేయవలెను.
ఉషలు యజ్ఞముల కొఱకు అవతరించినవి. అవి సత్యఫల ప్రదాతలు "ఋతజాత సత్యాః"
8. ఉషలు ఏకరూప విశిష్టలు. సమాన విఖ్యాతలు అది అంతరిక్షమున ఏకమాత్ర ప్రదేశము నుండి వెలువడి సర్వత్ర సంచరించును. ద్యుతిమతులగు ఉషలు యజ్ఞ గృహమున ప్రవేశించి జలసృష్టి కారిణులగు రశ్ములవలె స్తుతింపబడుదురు.
9. ఉషలు సమానములు. ఏకరూప విశిష్టలు. అపరిమితలు. దీప్తలు. పరిశుద్ధలు. అవి కాంతిమంతములగు దేహములతో వ్యక్తలగుదురు. అవి అత్యంత మహా అంధకారములను దాచి ప్రకాశములుగా సంచరించును.
10. ఓ ద్యుతిమంతులగు ఆదిత్య దుహితలారా ! మీరు మాకు పుత్ర, పౌత్రాది యుక్తమగు ధనము ప్రసాదించుడు.
దేవేరులారా ! మా సుఖలాభమునకుగాను మిమ్ము మేము అర్థింతుము. అందువలన మేము పుత్రపౌత్రాది యుక్తధనస్వాములను కావలెను.
11. ఓ ద్యుతిమంతులగు ఆదిత్య దుహితలారా ! మేము యజ్ఞ ప్రజ్ఞాపకులము. మేము జనులమధ్య కీర్తివంతులము, అన్నస్వాములము కావలెనని మిమ్ము ప్రార్థించుచున్నాము.
ద్యులోకము, ద్యుతిమతి పృథివి యశోవంతములు కావలెను.
ఏబది రెండవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - ఉష, ఛందస్సు - గాయత్రి
1. అదిగో ఆదిత్య దుహిత ఉష దృశ్యమానమయినది.
ఉష స్తుత, ప్రాణుల నేత్రము. సుందర ఫలముల ఉత్పాదయిత్రి. తనకు భగినీ స్వరూపయగు రాత్రి పర్యవసానకాలమున చీకట్లను చెదరగొట్టును.
2. ఉష అశ్వమువలె మనోహర, దీప్తిమతి. రశ్మిమాత. యజ్ఞవతి. ఉష అశ్వద్వయ సహితముగా స్తుతించబడును.
3. ఉషా ! నీవు అశ్వినీద్వయమునకు బంధువవు. రశ్ములకు తల్లివి. ధనములకు ఈశ్వరివి.
4. హే సత్యవచన ఉషా ! నీవు శత్రువులను వేరు చేయుము. మాకు సంజ్ఞాదానము చేయుము. మేము నిన్ను స్తుతించి ప్రభోదితను చేతుము.





