Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



                                   ఏబది ఎనిమిదవ సూక్తము

 ఋషి - వామదేవుడు, దేవతలు - వేరు వేరు ఛందస్సు - చివరిది జగతి మిగిలినవి త్రిష్టుప్.

    1. సముద్రమునుండి మధుమంతమగు ఊర్మి-తరంగము ఉద్భవించును. కిరణముల ద్వారా మానవుడు అమృతత్వముపొందును. ఘృతమునకు గల రహస్యనామము దేవతల జ్విగును. అమృతపు నాభి అగును. "ఘృతస్యనామగుహ్యం యదస్తి జిహ్వాదేవానామమృతస్య నాభిః"

    2. మేము యజమానులము. ఘృతమును ప్రశంసింతుము. ఈ యజ్ఞమున ఘృతమునకు నమస్కరింతుము. ధరింతుము. పరివృద్ధ దేవతలు ఈ స్తవమును ఆలకించవలెను. వేద చతుష్టయ రూపమగు శృంగ విశిష్టగౌరి వర్ణ దేవత ఈ జగత్తును నిర్వహించును. పాలించును.

    3. ఈ యజ్ఞాత్మక అగ్నికి నాలుగు శృంగములు ఉన్నవి. శృంగాత్ములగు నలుగురు దేవతలు ఉన్నారు. దీనికి సవనరూపమగు మూడు పాదములు ఉన్నవి. బ్రహ్మోదన, ప్రవశ్య స్వరూప మస్తకములు రెండు ఉన్నవి. చంధస్స్వరూపములగు ఏడు చేతులు ఉన్నవి. ఈ మంత్రములు కల్పము, బ్రాహ్మణము ద్వారా మూడు విధములుగా నిబ్ధమై ఉన్నవి. ఇవి అత్యంత శబ్దము చేయును. ఇవి మహా దేవతలు, మర్త్యుల మధ్య ప్రవేశించును.

    (1. యజ్ఞానికి సంబంధించిన అర్థము :- నాలుగు శృంగములు నాలుగు వేదములు. మూడు పాదములు ఉదయ, మధ్యందిన సాయం సవనములు. రెండు తలలు బ్రహ్మోదానము ప్రవర్గ్యము అను రెండు క్రతువులు. ఏడు చేతులు గాయత్ర్యాది ఏడు ఛందస్సులు. మూడువిధములు మంత్రము, కల్పము, బ్రాహ్మణము.

    2. యజ్ఞమునకే వర్తించు మరొక అర్థము :- నాలుగు శృంగములు హోత, ఉద్గాత, అధ్వర్యు బ్రహ్మ మూడు పాదములు ఋగ్యయజుస్సామ వేదములు. రెండు తలలు హవిర్దాన, ప్రవర్గ్య క్రతువులు, ఏడు చేతులు ఏడు ఛందస్సులు. మూడు విధములు ఉదయ, మధ్యాహ్న, సాయంసవనములు.

    3. ఆదిత్యునకు వర్తించు అర్థము :- నాలుగు శృంగములు నలుదిశలు. మూడు పాదములు ఉదయ, మధ్యాహ్న, సాయంత్రములు. రెండు తలలు రాత్రింబవళ్ళు. ఏడు చేతులు ఏడు కిరణములు లేకు ఆరు ఋతువులు 1 సంవత్సరము. మూడు బంధములు భూలోకము, ద్యులోకము, స్వర్గలోకము)

    4. పణులు గోవునందు మూడు పదార్థములను దాచి ఉంచినారు. దేవతలు వానిని అందుకున్నారు. ఇంద్రుడు పాలను సృష్టించినాడు. సూర్యుడు ఒకదానిని పెరుగును సృష్టించినాడు. కాంతిమంతుడగు అగ్ని, గమనశీలుడగు వాయువు ఘృతము అను పదార్థమును కల్పించినారు.

    5. అపరిమిత గతి విశిష్టమగు ఉదకము హృదయంగమ అంతరిక్షము నుండి క్రిందకు రాలును. ప్రతిబంధకారియగు శత్రువు దానిని చూడజాలడు. ఆ సమస్త ఘృతధారలను మేము చూడగలము. దాని మధ్యమున అగ్నిని సహితము చూడగలము.

    6. ఘృతధార ప్రీతిప్రదమగు నదివలె స్రవించును. ఈ సమస్త జలము హృదయాంతర్గత చిత్తము ద్వారా పూతమగును-పవిత్రమగును. వ్యాధునిముందునుండి మృగము పలాయనమైనట్లు ఘృత తరంగములు ప్రవహించును.

    7. ఏటి నీరు పల్లమునకు పారును. అట్లే వాయువువలె వేగవంతమగు మహాఘృతధారలు ద్రుత వేగమున సాగును. మదించిన గుఱ్ఱము పరుగులు తీసినట్లు ఈ ఘృతరాశి పరిధి భేదము మరిచి తరంగములయి వర్థిల్లును.

    8. కళ్యాణియు, మందస్మితవదనయు అగు పత్ని ఏకైక చిత్తమయి పతి విషయమున ఆసక్తురాలయినట్లు ఘృతధార అగ్నినిగూర్చి సాగును. అది సమ్యగ్రూపమున దీప్తప్రదమయి సర్వత్ర వ్యాపించును. జాతవేద అగ్నిప్రీతుడయి ఈ సమస్తధారలను ఆశించును.

    9. బాలిక పతి వద్దకు చేరుటకు అలంకార విన్యాసము చేసినట్లు సకల ఘృతధారలు సాగుటను చూడగలము. సోమము అభిషుతమగు స్థలము లక్ష్యముగా యజ్ఞము విస్తృతమగు స్థలము లక్ష్యముగా ఘృతధారలు సాగును.

    10. ఋత్విక్కులారా ! గోవుల వద్దకు చేరుడు. వానిని చక్కగా స్తుతించుడు. మా యజమానులకుగాను అది స్తుతియోగ్యమగు ధనమును ధరించవలెను. మా ఈ యజ్ఞము దేవతలవద్దకు చేరవలెను. ఘృతధారలు మధుర భావమున సాగవలెను. "ఘృతస్యధారా మధుమత్పవన్తే"

    11. నీ యొక్క తేజము సముద్ర మధ్యమున బడబాగ్ని రూపమునను, అంతరిక్షమున సూర్యమండల రూపమునను, హృదయాంతరాళమున వైశ్వానర రూపమునను, అన్నమున ఆహార రూపమునను జల, సమూహమున విద్యుద్రూపమునను, సంగ్రామము శౌర్యరూపమునను ప్రతిష్టితమై ఉన్నది. సమస్త భూతజాతము అతని ఆధీనమున ఉన్నది. అందు ఘృత రూపమున స్థాపితమగు మధురరసము మాకు ప్రాప్తించును.

       (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకమున నాలుగవ మండలమున ఎనిమిదవ అధ్యాయము సమాప్తము)
   
                               లోకాస్సమస్తాస్సుఖినోభవంతు

           
                                 అయిదవ మండలము


    ఎనిమిదవ అధ్యాయము             మొదటి అనువాకము

        మొదటి సూక్తము     మండలద్రష్ట ఆత్రేయునకు నమస్కారము

    ఋషి - ఆత్రేయులు బుధగ విష్ఠిరులు ఉభయులు, దేవత - అగ్ని  ఛందస్సు - త్రిష్టుప్.

    1. ధేనువువలె ఆగమనకారిణి ఉష అవతరించినపుడు అగ్ని అధ్వర్యుల సమిధలనుండి ప్రవృద్ధమగును. అగ్ని శిఖాసమూహము. అద్భుతము. కొమ్మలు పెంచుకొని పెరుగు వృక్షమువలె అగ్ని అంతరిక్షాభిముఖముగ వర్థిల్లును.

    2. హోత అగు అగ్ని దేవతలను యజించుటకు ప్రవృద్ధుడగును. అగ్ని ప్రాతఃకాలమున ప్రసన్నమనస్కుడై ఊర్ధ్వాభిముఖుడయి వెలుగును. సమిద్ధ అగ్నియొక్క దీప్తిమంతమగు బలము దృగ్గోచరమగును. ఈవిధముగా ఆ మహాదేవర తమస్సు నుండి విముక్తుడగును. "మహాన్దేవ స్తమసోనిరమోఛి"

    3. అగ్ని సంఘాత్మక జగత్తుయొక్క రజ్జురూప అంధకారమును గ్రహించినపుడు ప్రదీప్తుడయి దీప్తకిరణములతో జగములను ప్రకాశవంతము చేయును. తదనంతరము ప్రవృద్ధ, అన్నాభిలాషిణి ఘృతధారాయుక్తుడై, ఉన్నతుడై, ఉపరి భాగమున వ్యాపించి ఘృతధారను జుహువు ద్వారా పానము చేయును.

    4. ప్రాణుల నేత్రము సూర్యాభిముఖియై సంచరించును. అట్లే యజమానుల మానసములు అగ్నికి అభిముఖములై సంచరించును. విరూప ద్యావాపృథ్వులు ఉషాసహితులయి అగ్నిని ఉత్పన్నము చేసినపుడు శ్వేతవర్ణుడగు వాజీ స్వరూపాగ్ని ప్రాతఃకాలమున ఉద్భవించును.

    5. ఉత్పాదనీయ అగ్ని ఉదయమున ప్రాదుర్భూతమగును. అప్పుడు అగ్ని దీప్తిరూపుడు అగును. బంధుభూత రమణీయ సప్తవర్ణములు ధరించిన అగ్ని యాగయోగ్యుడయి ప్రత్యేక గృహమందు ప్రవేశించును.

    6. హోతయు, యష్టవ్యుడగు అగ్ని భూమాతయొడిలో ఆజ్యాది సుగంధయుక్త వేదీరూప స్థానమున ప్రతిష్టితుడు అగును. అగ్ని పుత్రుడు, కవి, బహుస్థాన విశిష్ఠుడు, యజ్ఞవంతుడు సకలమును భరించువాడు అగును. అగ్ని యజమానుల మధ్య సమిద్దుడయి నిలుచును.

    7. హోత అగ్ని ద్యావాపృథ్వులను ఉదకము ద్వారా విస్తరింప చేయును. అతడు మేధావి. యజ్ఞఫల సాధకుడు. యజమానులు అగ్నిని ఆలస్యము చేయక స్తుతులద్వారా సుతింతురు. యజమానులు అన్నవంతుడగు అగ్నిని ఘృతము సమర్పించి నిత్యము పరిచర్యలు చేయుదురు.

    8. అగ్ని సమ్మాననీయుడు. తన స్థానమున పూజనీయుడు అగును. అగ్ని శాంత మనస్కుడు. కవులు అతనిని స్తుతింతురు. అతడు మాకు అతిథివంటి పూజనీయుడు. శుభంకరుడు. అతని శిఖలు అపరివార్యములు. అగ్ని అభీష్ట ఫలప్రదాయకుడు. బలశాలి.

    అగ్నీ ! నిన్నుకాక నీవు అన్యసమస్త జనులను పరాస్తులను చేయగలవు.

    9. నీవు యజ్ఞము స్వీకరింతువు. యజ్ఞ, కర్తముందు సుందర రూపమున ఆవిర్భవింతువు. వెంటనే అతనిని అతిక్రమించి ఇతరులవైపు సాగెదవు.

    అగ్నీ ! నీవు స్తుతియోగ్యుడవు. దీప్తికరుడవు. విశిష్ట దీప్తిమంతుడవు. ప్రాణులకు ప్రియతముడవు. మానవులకు అతిథివలె పూజనీయుడవు.

    10. యువతమ అగ్నీ ! మానవులు నిన్ను దగ్గరినుండియు, దూరమునుండియు పూజింతురు. నిన్ను అధికముగ స్తుతించినవాని స్తుతులను మాత్రమే నీవు గ్రహింతువు.

    అగ్నీ ! నీవు ప్రసాదించు సుఖము బృహంతము, మహంతము, స్తుతియోగ్యము అగును.

    11. దీప్తిమంతమగు అగ్నీ ! నేడు నీవు వెలుగుల రథమున దేవతల సహితుడవయి అధిరోహింపుము. నీవు మార్గము తెలిసినవాడవు. విశాల అంతరిక్షమునుండి నీవు దేవతలను ఈ స్థానమునకు తోడ్కొని వచ్చెదవు.

    12. మేము అత్రివంశీయులము. మేధావి, పవిత్రుడు. అభీష్టవర్షి, యువకుడగు అగ్నిని ఉద్దేశించి వందన యోగ్య స్తోత్రములను ఉచ్ఛరింతుము. గవిష్ఠర ఋషి ఆకాశమున దీప్తమానుడు, విస్తీర్ణగతి విశిష్టుడు, ఆదిత్యాగ్నిని ఉద్దేశించి నమస్కారయుక్త స్తోత్రమును ఉచ్ఛరించుచున్నాడు.

                                   రెండవ సూక్తము

 ఋషి - ఆత్రేయ పుత్రులు జానుడు, వృత్రుడు, దేవత-అగ్ని  ఛందస్సు 1-11 త్రిష్టుప్, 12 శక్వరీ.

    1. కొడుకునుకనగల వయసున ఉన్నతల్లి రథచక్రముల క్రిందనలిగిన తనపుత్రుని దాచినది. తండ్రికి ఇవ్వలేదు. జనులు అతని హింసితరూపమును చూడలేక పోయినారు. కాని అరణిస్థానమున స్థాపితుడు అయినపుడు మరల అతనిని చూడ కలిగినాడు.

    (ఇది అగ్నిని ప్రజ్వలింప చేయుటకు సంబంధించిన గుహ్యమంత్రము.)

    ఇందు తల్లి రెండు కఱ్ఱముక్కల అరణి అగును. అందున వెలిగిన నిప్పురవ్వలు పుత్రుడు అగును. యజమాని తండ్రి. అగ్ని వెంటనే అతనికి అందదు. అది ప్రజ్వరిల్లినపుడే అతడు దర్శించగలడు.

    శాయణాచార్యుడు. సాత్యాయన బ్రహ్మణము నుండి ఒక వృత్తాంతమును ఉదాహరించినాడు.

    అదియు అగ్నికి సంబంధించినదేయగును :- 

    ఇక్ష్యాకు వంశమున త్రివష్ణుని కుమారుడు త్రయారుణుడు ఉన్నాడు. అతని పురోహితుడు జారునిపుత్రుడు వృశుడు.

    ఒకనాడు రాజు, పురోహితుడు ఒకే రథమున వెళ్లుచున్నారు. పురోహితుడు రథము నడుపుచున్నాడు. రథచక్రముల క్రిందపడి ఒక బ్రాహ్మణ బాలుడు హతుడయినాడు.

    బాలుని హత్యకు బాధ్యత రథపు యజమాని రాజుది అగునా? రథము నడిపిన పురోహితుని అగునా? అని వివాదము తలెత్తినది. ఇక్ష్యాకుల పరిషత్తు పురోహితునిదే నేరముగా నిర్ణయించినది. "సృషి ర్వర్శ సామ్నా కుమారముద జీవయుత్" ఆ ఋషి వర్ణసామ్నమను మంత్రమున ఆ బాలుని బ్రతికించినాడు.

    బాలుని బ్రతికించినాడుకాని వృశర్షి కోపించినాడు. అప్పటి నుండి ఇక్ష్వాకుల గృహములందును యజ్ఞవాటికలందును అగ్ని వెలుగుట నిలిచిపోయినది. అది గ్రహించిన ఇక్ష్వాకులు పురోహితుని ప్రార్థించినారు. ప్రసన్నుని చేసినారు.

    వృశర్షి ప్రసన్నుడయినాడు. అతడు తిరిగి వర్ణసామ్న మంత్రముననే ఇక్ష్వాకులకు అగ్నిని అందించినాడు.

    2. ఓ యువతి ! నీవు పిశాచివై ఏ కుమారుని గ్రహించినావు? పూజనీయమగు అరణి ఇతనిని కలిగించినది. అనేక సంవత్సరములు అరణి గర్భము వర్థిల్లినది. తదనంతరము అరణితల్లి జన్మ నిచ్చిన పుత్రుని మేము చూచినాము.

    3. మేము సమీప ప్రదేశము హిరణ్యదంతుడు, ప్రదీప్తవర్ణుడు, ఆయుధ స్థానీయుడు, జ్వాలానిర్మాత అగ్నిని దర్శించినాము. మేము వృశుడను అగ్నికి సర్వతోవ్యాప్తము, అవినాశమగు స్తోత్రమును సమర్పించినాము. పరమైశ్వర్యయుక్తుడగు అగ్నిని నమ్మని, అతనిని స్తుతించని ఇంద్రుడు మమ్ము ఏమి చేయగలడు?

    (ఇంద్రుడు అగ్నిని మించిన సమర్థుడు కాడని)

    4. నేను వృశుడను గోసమూహమువలె క్షేత్రమున నిగూఢ భావమున సంచరించునట్టియు, అనేకవిధముల స్వయం శోభాయమానమైనట్టియు అగ్నిని దర్శించినాను. నేను దర్శించినట్టి అగ్ని పిశాచములు ఆక్రమించినకాలపు నిర్వీర్య జ్వాలను ధరించడు. ఆ అగ్ని అనేకమారులు ఆవిర్భవించును. అతని వృద్ధజ్వాల యువతివలె ఉండును.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.