Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    నేను : భగవంతునికి వెరవాలి. వెధవ సైతాను కు ఎందుకు భయపడడం? ఏమిటీ మీరన్నదియ? మీరు మనుషులా ?
    మౌల్వీ : (కాస్త కోపంతో ) అవును. మరేవరిని ?
    నేను : నాకు భూతంలా కనిపిస్తున్నారు. ఒంటరిగా ఈ మసీదులో ఉంటుంటే భయం కావడం లేదూ?"
    మౌల్వీ : మరేం చేయమంటారు? మాకు ఒంటరితనం అలవాటు.
    నేను : అందువల్లనే మీ ముఖం భయంకరంగా ఉంది. "ఒంటరితనం సగం పిచ్చి" అనే సామెత వినలేదూ?"
    మౌల్వీ : ఉన్నంతలో ఆనందంగా ఉన్నాం. మీ తాత్పర్యం (అభిప్రాయం) చెప్పండి.
    నేను : తాత్పర్యం పుస్తకాలు చూస్తే గాని తెలియదు. ప్రస్తుతానికి వట్టి చర్చ కానివ్వండి.
    మౌల్వీ : కిం?
    నేను : భోజనం.
    మౌల్వీ సాహెబ్ ను ఎంతో పరిహసించాను. కాని అప్పటికి ఆకలితో ప్రాణం పోతుంది. నోట మాట రావటం లేదు.
    రుస్వా : వారితో అంత పరిహాసాలు అడాల్సిన అవసరం ఏమొచ్చింది?
    ఉమ్రావ్ : ఓహో, ఆదా? ఆ మాట అడక్కండి. కొందరి ముఖాలే అలా ఉంటాయి. కారణం లేకుండానే నవ్వాలనిపిస్తుంది.
    ఉమ్రావ్ : అంతే ననుకోండి.
    రుస్వా : వారి వద్ద పరిహసించాలనిపించే విషయం ఏముంది ?
    ఉమ్రావ్ : ఏం చెప్పాలో అర్ధం కావడం లేదు. మనిషి వయసులో ఉన్నారు. రూపం కూడా అంత వికారంగా లేదు. ముఖం మీద వర్చస్సుంది. గడ్డం, అల్పత్వం, గొరిగించిన మీసాలు. ఎత్తైన టోపీ. వింతగా మాట్లాడుతారు. నోరు తెరచి వెంటనే మూసేస్తారు. కింది పెదవి విచిత్రంగా పైకి లేస్తుంది. దాంతో కత్తిరించిన గడ్డం తమాషాగా కనిపిస్తుంది. ముక్కు ముందుకు సాగుతుంది. ఏదో తింటూ మాట్లాడుతున్నట్లనిపిస్తుంది. నోట్లోది పడిపోతుందేమోనని వెంటనే నోరు మూస్తారు.
    రుస్వా : నిజంగానే తింటున్నారా?
    ఉమ్రావ్ : తినండం లేదు. నెమరువేస్తున్నారు.
    రుస్వా : ముల్లాల ముఖం తరచుగా అలాగే ఉంటుంటుంది. ఆ ముఖాలు చూస్తె  బుద్ది హీనునికి భయం కలుగుతుంది. బుద్ది మంతునికి నవ్వు వస్తుంది. అల్లాంటి ముఖాలు చూడడం నాకు సరదా.
    ఉమ్రావ్ : ఇంకా వినండి. వారు మాట్లాడ్డం లో ఒక విశేషం ఉంది. తరచుగా ముఖం తిప్పేసుకుంటుంటారు.
    రుస్వా : అది మర్యాద లక్షణం   మాట్లాడేప్పుడు తుంపర పడుతుండవచ్చు.
    ఉమ్రావ్ : నన్ను చెప్పనిస్తారా?
    రుస్వా : క్షమించాలి. అదిగో తెల్లారింది.
    ఉమ్రావ్ : కధ ఏమంటే నేను జేబులోంచి రూపాయి తీశాను.
                      సంభావన ఇస్తున్నాననుకొని మౌల్వీ గారు చప్పున చేయి చాచి "ఇదేమి అవసరం" అన్నారు.
    నేను చిరునవ్వు నవ్వి " అత్యవసరం. నాకు ఆకలిగా ఉంది. ఎవరినైనా పంపి తినడానికి ఏమైనా తెప్పించండి" అన్నాను.
    మౌల్వీ గారు నిరాశచెంది మాట మార్చారు. "అర్ధమైంది" అన్నారు. ఏమర్ధం అయింది. మట్టి. అర్ధమైతే రాయికావలసింది. అందుకే అన్నారు అవసరమేనని. "ఇక్కడి భోజనం పనికి రాదా ?" అడిగారు.
    నేను : ప్రస్తుతమా ? స్వపదార్ధమా ? పరపదార్దమా?
    మౌల్వీ : ఇప్పుడేమీ లేదు. నా శిష్యుడు భోజనం తెస్తాడు. మీరు భొంచేయండి.
    నేను : ఓపికకు ఓపిక వచ్చింది. రెండవదేమనగా పెద్దలు చెప్పగా విన్నాము "రామ్జాను షరీఫ్ గారు ఒక మాసము మాత్రము ప్రపంచమున విహరించుట కేగి మిగిలిన పదునొకండు మాసములు ఈ మసీదుననే తిష్టవేయుదురని.
    మౌల్వీ : ప్రస్తుతం ఏమీ లేదు. కాని నా శిష్యుడు భోజనం తెస్తూనే ఉండవచ్చు.
    నేను: పోనిండు . ఒప్పుకుందమెట్టులో భోజనము వచ్చునని. అయ్యది మీ మేతకే చాలదన్న మాకేమి దక్కు? ఎటులో ఇరువురము పొదుపుగా భుజింతమనిన నిరీక్షణ మృత్యువు వలె నున్నది. ఇరాఖు నుండి 'తిర్యాఖు వచ్చు వరకు ........
    మౌల్వీ : తామెంతో యోగ్యతగలవారుగా కనిపిస్తున్నారు.
    నేను : నా అల్ప బుద్దికి తాము అయోగ్యులుగా కనిపిస్తున్నారు.
    మౌల్వీ : నిజమే కాని .....
    నేను : ( మాటకు అడ్డు వచ్చి ) కాని ఇక్కడ పేగులు " అల్లా అల్లా!" అంటున్నాయి. తాము ఉపన్యాసం దంచుతున్నారు.
    మౌల్వీ : అయితే ఇప్పుడే తెస్తా.
    నేను : త్వరగా వెళ్ళండి.
              ఏడ్చుకుంటూ వెళ్ళి గంట గంటన్నరకు నాలుగు పులిరోట్టెలు, ఒక మట్టి గిన్నెలో వెధవ పులుసు తెచ్చాడు. చూడగానే వళ్ళు మండింది. మౌల్వీ గారి ముఖం చూచాను. అతడు అర్ధం చేసుకున్నది వేరు. వెంట పధ్నాలుగున్నర' కుచ్చాలు నా ముందుంచి "నాలుగు పైసల రొట్టెలు , పైసా కూర , దమ్మిడీ చిల్లర మార్చడంలో పోయింది. మిగిలింది మీ ముందుంది. ముందు లేక్కించుకోండి" అన్నారు. మరొకసారి మౌల్వీని చూశాను. కాని ఆకలి చెడ్డది. మూడు నాలుగు ముక్కలు తిని మౌల్విని చూచి "మౌల్వీగారూ ! ఈ పాడుపడ్డ ఊళ్ళో ఇదేనా దొరికేది ?" అడిగాను.
    మౌల్వీ : కాకుంటే లక్నో అనుకున్నారా మహమూద్ దుకాణం ఉండడానికి , రేయింబవళ్ళు పలావు దొరకడానికి?
    నేను : మిఠాయి దుకాణం అయినా ఉండవచ్చుగా!
    మౌల్వీ : మిఠాయి దుకాణమా ? ఇదిగో ఈ మసీదు కిందనే ఉంది.
    నేను : అయితే నాలుగు కోసులు వెళ్ళాల్సిన అవసరమేం ? రెండు జాములు వెళ్ళి తెచ్చారు. అదీ కుక్కలు తినేది.
    మౌల్వీ : అలా అనకండి. మనుషులే తింటారు.
    నేను : మీలాంటి మనుషులు తింటుండవచ్చు. ఈ పాచి పులిరోట్టెలు. నల్లని పులుసు.
    మౌల్వీ : నల్లగా ఉందా? లేదే , సరే అదే తెస్తాను. డబ్బు వృధా అయింది. నా డబ్బుతో తెచ్చిస్తాను.
    నేను బదులు చెప్పకముందే మౌల్వీగారు వెళ్ళిపోయారు. ఎప్పటిదో పాచి పులిసిపోయింది. తెచ్చి ముందుంచారు. హతిమ్ ను చంపి పుట్టినట్లు.
    ఏదో విధంగా నాలుగు రొట్టెలు మింగి ముంతెడు నీళ్ళు తాగాను. పులుసు అక్కడే వదిలేసి నుంచున్నాను. చిల్లర అక్కడే పడి ఉంది. నేను లేచింది చేయి కడుగుకోవడానికి. మౌల్వీ గారు వెళ్ళి పోతున్నాననుకొని "ఈ డబ్బులు - చిల్లర తీసికెళ్ళండి" అన్నారు.
    నేను : నా తరపున మసీదులో దీపం పెట్టండి.
    మూతి, చేతులు కడుగుకొని వచ్చి అక్కడే కూర్చున్నాను. మౌల్వీగారితో మాటలు సాగించాను. వారివల్ల నాకు కాన్పురులో చాల సౌఖ్యం లభించింది. వారి ద్వారా ఒక గది అద్దెకు తీసుకున్నాను. నవారు, మంచం, చాపలు , తెరలు ఇత్తడి గిన్నెలు వగైరా అవసరం అయిన సామానంతా కొన్నాను. ఒక దాసీని వంటకు, ఒకదాన్ని పై పనికి పెట్టుకున్నాను. మరో ఇద్దరు నౌకర్లను పెట్టుకొని హాయిగా ఉంటున్నాను. వాద్యగాళ్ళ కోసం అన్వేషణ సాగింది. రావడానికి చాలామంది వచ్చారు. కాని పసందు కాలేదు. చివరకు ఒక తబలా వాడు కనిపించాడు. అతడు ఖాలీఫాజీ వంశపు శిష్యుడు. అతనితో బాగా పరిచయం ఏర్పడింది. అతని ద్వారా ఇద్దరు సారంగీ వాదకులు దొరికారు. జాము , జామున్నర రాత్రి వరకూ పాటలు సాగాయి. లక్నో నుంచి వేశ్య వచ్చిందనే వార్త కాన్పూరం తటా వ్యాపించింది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.