Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda
10. భూదేవి తన బుద్ధి కుశలతతోను, హస్తనైపుణ్యముతోను, దేహబలముతోను ఉఖను చేయునుగాక. తల్లి తన బిడ్డను ఒడిలో ఉంచుకున్నట్లు భూమాత ఈ అగ్నిని కర్మసమాప్తి పర్యంతము తన ఒడిలో ఉంచుకొనునుగాక.
11. మట్టిముద్దా! నీవు ఈ యజ్ఞమునకు తలవంటి దానవు అగుచున్నావు.
12. కృష్ణాజిన, పద్మపర్ణములారా! మీరు ఈ యజ్ఞమునకు పాదముల వంటి వారలు.
13. ఉఖా! నిన్ను వసువులు గాయత్రీ ఛందస్సు చేత - అంగిరసఋషులవలె - చేయుదురు గాక. నీవు పృథ్వీ రూపవు అగుచున్నావు.
రుద్రాస్త్యా కృణ్వన్తు త్రైష్టుభేనఛందస్కాఙ్గిరస్వ దన్తరిక్షమసి - నీవు అంతరిక్షరూపవు అగుచున్నావు.
ఆదిత్యాస్త్వాకృణ్వన్తు జాగతేన ఛందస్కాఙ్గిరస్వ ద్ద్యౌరసి - ద్యులోకరూపమవు అగుచున్నావు.
విశ్వేత్వా దేవా వైశ్వానరాః కృణ్వన్త్వానుష్టుభేవ ఛందస్కాఙ్గిరస్వద్దిశోసి - నీవు దిశారూపమవు అగుచున్నావు.
(పైమూడింటిలో ఛందస్సు తప్ప అర్థము తొలి పరిచ్చేదము వంటిదే. 2న త్రిష్టుప్, 3న జగతి, 4న అనుష్టుప్ చెప్పబడినవి.)
ఉఖా! నీవు గట్టిపడినావు. అధ్వర్యుడనగు నా కొరకును, యజమాని కొరకును సంతానము, ధనసమృద్ధి, పశుసంపద, బలము, బంధువులను కలిగించుము.
14. ఉఖాకందమునందలి రేఖా! నీవు భూరూపమగు ఉఖకు వడ్డాణమవు అగుచున్నావు.
15. ఉఖా! భూదేవి అంగిరసుల వలె పంక్తి ఛందస్సుతో నీ అడుగున రంధ్రము చేయునుగాత.
16. అదితి అగ్నిని నిలుపదగిన ఉఖను మట్టితో చేసినది. దానిని తనకు పుత్రుల వంటి కుమ్మరులకు - కాల్చుటకు - ఇచ్చినది.
ఆరవ అనువాకము
(పచ్చికుంపటిని కాల్చుట.)
1. ఉఖా! వసువులు గాయత్రీ ఛందస్సున అంగిరసుల వలె నిన్ను పొగచూరింతురుగాక.
త్రైష్టుభేన ఛందస్కాఙ్గిరస్వ దాదిత్యస్త్వా ధూపయన్తు.
జాగతేన ఛందస్కాఙ్గిరస్వద్విశ్వేత్వాదేవా వైశ్వానరా ధూపయన్తాం.
అనుష్టుభేనఛందస్కాఙ్గిరస్వదిన్ద్రస్త్వా ధూపయన్తు.
అఙ్గిరస్వద్విష్ణుస్త్వా ధూపయన్తు. అంగిరస్వ ద్వరుణస్త్వా ధూపయన్తు.
2. అవటప్రదేశమా! దేవతలందరిచే సేవించబడునట్టి అదితిదేవి భూమి పై భాగమున గల నిన్ను అంగిరసులవలె త్రవ్వునుగాక.
(అవటము - కుండలు కాల్చునట్టి ఆవము. ఇప్పుడు భూమిపైన పెట్టుచున్నారు. అప్పుడు భూమిలోన పెట్టినట్లున్నారు.)
3. ఉఖా! సకల దేవతలు అభిమానించు దేవపత్నులు నిన్ను భూమిమీద అంగిరసులవలె స్థాపింతురుగాక.
4. ఉఖా! దేవేరులు విద్యాభిమానులు. సకల దేవతలు అభిమానించువారు. వారు నిన్ను భూమి ఒడిలో - అంగిరసుల వలె చక్కగా కాల్చెదరుగాక.
సకల దేవతల అభిమానము గల ఛందోదేవేరులు భూమి ఒడియందు అంగిరసుల వలె నిన్ను పక్వమగునట్లు చేయుదురుగాక.
సప్త ఋత్విజులందు అభిమానము గల దేవతలు నిన్ను పక్వము చేయుదురుగాక.
దేవపత్నులు భూమి ఒడిలో నిన్ను అంగిరసులవలె పక్వమును పరీక్షింతురుగాక.
5. మిత్రదేవా! ఈ ఉఖను కాల్చుము. దీనిని పగులనీకుము. దీనిని కాపాడవలసినదని నీకు ఇచ్చుచున్నాను.
6. ఈ ఉఖ మహిమలందు ద్యులోకము వంటిది. వినుటకు భూమి వంటిది. దీనిని మహాకీర్తివంతుడగు మిత్రుడు అందుకున్నాడు.
7. సూర్యదేవుడు సకలమానవులకు జీవనాధారము. అతనికి అందరు వినదగినంత కీర్తి కలదు. అట్టి సూర్యుడు ఈ ఉఖను పక్వము చేయునుగాత. ఉఖ ఎంతో కీర్తి కలది. ధనమునొసంగునది.
8. సవితా దేవత సుందర హస్తములు, సుందర అంగుళులు, సుందర బాహువులు కలవాడు. ఉఖా! అతడు నిన్ను తనశక్తిచే అవటము నుంచి పైకి తేవలెను.
9. ఉఖా! నీవు భూమి మీద భంగపడని దానవు అగుము. సకల దిశలందు నిండిపొమ్ము. ఉత్తిష్ఠ - లెమ్ము. గట్టిపడుము. నిలువుగా నిలువుము. స్థిరముగా నిలువుము.
10. ఉఖా! వసువులు నిన్ను గాయత్రీ ఛందస్సుచే అంగిరసులవలె తడుపుదురుగాక. రుద్రులు నిన్ను త్రిష్టుప్ ఛందస్సుచే అంగిరసులవలె తడుపుదురుగాక. ఆదిత్యులు నిన్ను జగతీ ఛందస్సుచే అంగిరసులవలె తడుపుదురు గాక. విశ్వేదేవతలు నిన్ను అనుష్టుప్ ఛందస్సుచే అంగిరసులవలె తడుపుదురుగాక.
ఏడవ అనువాకము
1. సంవత్సరములు, ఋతువులు, మాసములు, పక్షములు, ఋషులు వీరందరు సత్యవంతులు. అగ్నీ! వారందరు వారి సత్యవాక్కులచే నిన్ను వర్థిల్లచేయుదురు గాక. వారు కలిగించిన అభ్యుదయమున ద్యులోక తేజస్సును ప్రకాశింపచేయుము. భూమి మీద సమస్త దిక్కులను వెలిగించుము.
2. అగ్నీ! నీవు స్వయముగా వెలుగొందుము. ఈ యజమానుని యజ్ఞమునకు ప్రోత్సహించుము. ఇతనికి సౌభాగ్యము కలిగించుటకు ఉత్తిష్ఠ.
అగ్నీ! నిన్ను ఆరాధించువారికి బాధలు కలుగకుండవలెను. బ్రాహ్మణులు కీర్తివంతులు కావలెను. నిన్ను ఆరాధించని వారికి కీర్తి కలుగకుండవలెను.
3. అగ్నీ! మేము నిన్ను ఆరాధించువారలము. మా అపరాధములు మన్నించుటకు శాంతము వహించుము. మా శత్రువులను పరిమార్చుము. పాపములను మాన్పుము. మా ఇంటప్రమాదము కలిగించకుము. అప్రమత్తుడవగుము.
4. అగ్నీ! ఈ ఇంటినే సంపదలచే నింపుము. పూర్వము నిన్ను ఆరాధించిన వారున్నారు. వారు మమ్ము నిరాకరించకుండవలెను. నిన్ను నిరాకరించకుండవలెను.
అగ్నీ! నీ క్షాత్రము సుస్థిరము అగునుగాక. నిన్ను పూజించు వారికి బాధలు కలుగకుండునుగాక. వారు వర్థిల్లుదురుగాక.
5. అగ్నీ! నీవు బలవంతుడవు. మా ఆయువులకు శుభంకరములు చేయుము. రక్షింపుము. మిత్రులమైన మమ్ము నిలుపుటకు యత్నింపుము. మా బంధువుల మధ్యన ఉండుము. ఈ భూమి మీది రాజులచే యజ్ఞములు చేయించుము.
6. అగ్నీ! దురితములను అతిసహస్వ - పూర్తిగా నాశము చేయుము. వ్యాధులను అతిసహస్వ. అజ్ఞానమును అతిసహస్వ. శత్రువులను అతిసహస్వ. వేయేల సమస్త దురితములను సహస్వ. తదుపరి మాకు వీరులగు పుత్రులను, ధనమును ప్రసాదించుము.
7. అగ్నీ! నిన్ను హింసించగలవారు లేరు. నీవు పుట్టుకతోనే లోకములు తెలిసినవాడవు. హింసింపబడని వాడవు. వివిధ ప్రకాశములు కలవాడవు. బలశాలివి. నీవు ఇచ్చోట వెలుగులు చిమ్ముము.
అగ్నీ! మా యందలి ఆశలను, భయములను నివారింపుము. ఈ కర్మయందు వర్థిల్లచేయుము. పరిపాహి - పరిపాలించుము.
8. అగ్నీ! నీవు బృహస్పతి, సవితల సదృశుడవు. ఈ యజమాని బుద్ధిని పెంచుము. ఇతడు మొదటినుంచి నిశిత బుద్ధి కలవాడే. అయినను నియంత్రించుము. ఇతనికి మహాసౌభాగ్యము కలిగించి వర్థిల్లచేయుము. సకల దేవతలు ఇతని యోగ్యతకు మోదింతురుగాక.
9. బృహస్పతి సదృశ అగ్నీ! మాకు స్వర్గమున చిరనివాసము కల్పించదలచినావు. యముని సంబంధములగు పాపములను విముక్తి కలిగించినావు. ఇక మాకు పరలోక చింతలేనేలేదు.
అగ్నీ! అశ్వినులు దేవతలకు వైద్యులు కదా! వారితో చెప్పుము. వారు ఇతనినుండి మృత్యువును పరిహరింతురుగాక.
10. మేము తమస్సును మ్రింగిన మహాజ్యోతిని సర్వత్ర దర్శించుచున్నాము. దేవతలందు సూర్యరూపమున ఉన్న మహా తేజస్సును చేరుకున్నాము.
ఎనిమిదవ అనువాకము
1. అగ్ని సుముఖుడు. పుత్రుని వంటి హితకారి. అతని దేవతలు సమిన్నామకులు. వారు మాకు శ్రేయస్సు కలిగించుటకు ఉద్యుక్తులు అగుదురుగాత. జ్వాలా రూపములు భాస్వరములు. అతిశయ దీప్తికలవి. అవి సుఖప్రదములు అగునుగాక.
2. తనూనపాత్ - శరీరపాలకుడగు- అగ్ని ప్రాణములను ఇచ్చువాడు. విశ్వము తెలిసినవాడు. దర్శనమిచ్చువాడు. దేవతలందు శ్రేష్ఠుడు. అతడు హవిస్సులను ఘృతముతో పూరించునుగాక.
3. నరాశంస - నరులచే కీర్తించబడు - అగ్ని సుకృతుడు. ద్యోతమానుడు. కర్మవిషయమున ప్రేరణ కలిగించువాడు. సర్వదురిత నివారకుడు. అతడు మధుర ఘృతమున సంతృప్తుడు అగుచున్నాడు. ఈ యజ్ఞమును జరిపించుచున్నాడు.
4. ఈడాన - స్తుతిప్రియుడగు - అగ్ని బలసంపన్నుడు. యజ్ఞములను అందుకొనుటకు సాగువాడు. అతనికి జుహువుతో ఆజ్యము అర్పింతుము. సంస్కరింతుము. సేవింతుము.
5. బర్హి - స్తుతిరూప ఋక్కులుకోరు - అగ్ని మహిమాన్వితుడు. పూజనీయుడు. ప్రాణులను నిలబెట్టువాడు. జ్ఞాని. యజమానికి ద్రవ్యములు ఇచ్చువాడు.
6. ద్వారః దేవీఅభి - స్త్రీమూర్తిఅగు అగ్ని - విస్తీర్ణగతులు కలది. తేజస్విని. యజమానులు ఈ అగ్నికి యజ్ఞములందు హవిస్సులు సమర్పించుచున్నారు.
7. ఉషసానక్తా - ఉషః కాల రాత్రిరూపములగు - అగ్నులు ద్యులోకస్థమూర్తులు. అవి పరస్పరము మైత్రీభావము కలిగిఉండవలెను. మా యజ్ఞప్రదేశములను హింసారహితముగ రక్షించవలెను.
8. దైవ్యాహోతార - దేవతలకు హోతయగు - అగ్ని జ్వాలాయుతుడు. పైకి ఎగయుచున్న జ్వాలలు గల మా అగ్నిని గుణరహితము కాకుండ చూచునుగాత. మా యజ్ఞమును శుభప్రదము చేయునుగాత.
9. ఇడ, సరస్వతి, భారతి అను ముగ్గురు స్త్రీ దేవతల పేర్లుగల అగ్ని మహిమాన్వితుడు. ఆ అగ్నులు ఈ యజ్ఞమును చేరుకొందురుగాక.
10. త్వష్టయను అగ్ని మాకు త్వరగా లభించునట్టిదియు, అద్భుతమైనదియు, జనులచే ప్రశంసించ బడునదియు, పుత్రులు గలదియు, ధనపుష్టి గలదియు, సర్వబంధువులకు ఆశ్రయభూత మగునట్టిదియు నగు సంపదను ప్రసాదించునుగాక.





