Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



                                 నలుబది రెండవ సూక్తము

                  ఋషి - పురుకుత్స పుత్రుడు త్రపదస్యుడు. దేవత - 1-6 ఆత్మ;
                             7-10 ఇంద్రావరుణులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మేము క్షత్రియులము. సమస్త మానవులకు అధీశులము. మా రాజ్యము రెండు విధములది. సంపూర్ణ దేవగణములు మావారు. అట్లే సమస్త ప్రజలు మావారు. మేము రూపవంతులము. అంతికస్థ వరుణులము. దేవగణములు మా యజ్ఞమును పాలింతురు. మేము మానవులకు సహితము రాజులము.

    2. మేము రాజావరుణులము. దేవతలు మా కొఱకే అసుర విఘాతమగు శ్రేష్ఠ బలమును దాల్తురు. మేము రూపవంతులము. అంతికస్థ వరుణులము.

    3.మేము ఇంద్రావరుణులము. మా మహత్తు వలన విస్తీర్ణము; దురవగాహ్యము, సురూపములగు ద్యావా-పృథ్వులము మేమే. మేము విద్వాంసులము. సకల భూతజాతములను ప్రజాపతులవలె ప్రేరేపింతుము. మేము ద్యావాపృథ్వులను ధరింతుము.

    4. మేమే సేద్యమునకగు జలమును సేకరించినాము. ఉదకము, ఆదిత్యులకు నివాసభూతమగు ద్యులోకమును ఏర్పరచినాము. జలము నిమిత్తము అదితి పుత్రుడగు ఋతావా యజ్ఞవంతులము అయినాము. క్షితిజాది మూడు లోకములను ఏర్పరచినాము.

    5. మేము సుందర అశ్వవంతులము. సంగ్రామేచ్చగల నేతలు మమ్ము అనుసరింతురు. వారందరు కూడి యుద్ధములకు మమ్ము ఆహ్వానింతురు. మేము పరాభవించగల శక్తిగలవారలము. మేము యుద్ధమున దుమ్ములేపుదుము.

    6. మేము సకల సత్కార్యములు చేసినాము. అప్రతిహత దైవబల యుక్తులము. మమ్ము నివారించగలవాడు లేడు. మమ్ము సోమ సమూహము హృష్టులను చేయును. సమస్త ఉక్థలు హృష్టుపను చేయును. అప్పుడు అపార ద్యావాపృథ్వులు చలించును.

    7. వరుణా ! నీ పనులను సమస్త భూతజాతములు ఎరుగును. స్తోతా ! వరుణుని స్తుతింపుము.

    ఇంద్రా ! నీవు వృత్రాదులను వధించినావు. ప్రసిద్ధుడవయినావు. నీవు అచ్చన్నములగు నదులను విముక్తము చేసినావు.

    8. దుర్గహ పుత్రుడు పురుకుత్సుడు బంధితుడు అయినంత ఈ పృథ్వికి సప్తర్షులు పాలకులు అయినారు. వారు ఇంద్రావరుణుల అనుగ్రహమున పురుకుత్స పత్నితో యజ్ఞము చేయించి 'త్రసదస్యు' ను కలిగించినారు. త్రసదస్యుడు ఇంద్రునివంటి శత్రునాశకుడు. అతడు దేవతలకు ఊర్ధ్వభూతుడగు ఇంద్రునివంటి వాడు.

    9. ఇంద్రావరుణులారా ! ఋషులద్వారా ప్రేరితులరాలయిన పురుకుత్స పత్ని మీ ఉభయులను హవ్యములు స్తుతులద్వారా ప్రసన్నులను చేసినది. అప్పుడు మీరు ఆమెకు శత్రునాశకుడు, అర్ధిదేవరాజు త్రసదస్యుని దానము చేసినారు.

    10. ఇంద్రావరుణులారా ! మేము మిమ్ము స్తుతింతుము. ధనము ద్వారా పరితృప్తులమగుదుము. దేవగణములు హవ్యమున పరితృప్తులు కావలెను. గోగణములు తృణాదులతో పరితృప్తులు కావలెను. ఇంద్రావరుణులారా ! మీరు విశ్వహంతలు. మాకు సర్వదా ఆహింసిత ధనమును ప్రసాదించుడు.

    ఆలోచనామృతము

    1. తొలిసారిగా ఒక కులము క్షత్రియులు కనిపించినారు. వారు తమను దేవతలతో పోల్చుకున్నారు. కాని చివరి మంత్రములందు ఇంద్రావరుణులను కీర్తించినారు.

    2. దుర్గహుని పుత్రుడు పురుకుత్సుడు ఏదో ఒక కారణమున బందీ అయినాడు. పురుకుత్సుని భార్య 'పురుకుత్సాని' తనకు సంతానము ప్రసాదించమని సప్తర్షులను ప్రార్థించినది. సప్తర్షులు ఆమెకు ఇంద్రావరుణులను అర్చించమని సలహా ఇచ్చినారు. వారు ఆమెకు త్రసదస్యుని ప్రసాదించినారు.

    3. భర్తలేనపుడు ఆమె మరణించనక్కరలేదు. భార్యకు భర్తహక్కులన్నియు సంక్రమించినట్లు తోచుచున్నది.

    4. పురుకుత్సానికి యజ్ఞము చేయు హక్కు స్త్రీగా సంక్రమించినదా? భర్తలేనపుడు భర్త హక్కుగా సంక్రమించినదా ఆలోచించవలసి ఉన్నది.

                             నలుబది మూడవ సూక్తము

 ఋషి - సుహోత్రపుత్రులు పురమీహ్ల - అజమీహ్లులు దేవత- అశ్వినులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. యజ్ఞార్హులగు దేవతల మధ్య దీనిని ఎవడు ఆలకించును? ఏ దేవత వందనీయమగు ఈ స్తోత్రమును సేవించును? దేవతల నడుమ ఎవడు ఈ ప్రియతరము, ద్యుతిమంతము, హవ్యయుక్తమగు ఈ సూక్తమును హృదయమున ధరించగలవాడు?

    (అందుకు అశ్వినులు మాత్రమే అర్హులని భావము)

    2. ఏ దేవత మమ్ము సుఖవంతులను చేయును? ఏ దేవత మా యజ్ఞమున సకల దేవతలను మించి విచ్చేయును? ఎవని రథము వేగవంతము. అశ్వయుక్తము, శీఘ్రగామి అగును? సూర్యపుత్రి ఎవరిని సమ్మానించినది?

    (అశ్వినులే అని అర్థము)

    3. రేయి గడచిపోగా ఇంద్రుడు తనశక్తిని ప్రదర్శించును. గమనశీలురగు అశ్వినులారా ! అట్లే మీరు ఉభయులు అభిషంవ కాలమున విచ్చేయుడు. మీరు ఉభయులు ద్యులోకమునుంచి విచ్చేసినారు. మీరు దివ్యములగు శోభనగతులందు విశిష్టులు. మీరు చేసిన కార్యములు శ్రేష్టములు. వానిని మించినవి ఏవి?

    4. అశ్వినులారా ! మీతో సరితూగగల స్తుతి ఏది? ఏ స్తుతులతో ఆహ్వానించిన మీరు మావద్దకు రాగలరు? మీ మహా క్రోధమును సహించగలవాడెవ్వడు? మీరు మధురజల సృష్టికర్తలు. శత్రువినాశకులు. మాకు ఆశ్రయ దానము ప్రసాదించుడు. రక్షించుడు.

    5. అశ్వినీద్వయమా ! మీ రథము ద్యులోకమున నలువైపుల విస్తారముగ పర్యటించును. అది సముద్రమున మీకు అభిముఖముగా వచ్చును. మీ కొఱకు పండిన యవలతో కూడిన సోమరసము సిద్ధముగా ఉన్నది. మీరు మధుర జల సృష్టికర్తలు. శత్రు వినాశకులు. మీ కొఱకుగాను అధ్వర్యులు మధుర దుగ్ధ సహిత సోమరసము సిద్ధము చేయుచున్నారు.

    6. మేఘము లేక జలముల రసముతో మీ అశ్వములు తడసినవి. పక్షులవంటి మీ అశ్వములు దేదీప్యమానములయి పయనించును.

    అశ్వినులారా ! మీ రథము ప్రసిద్ధము. ఆ రథముపైననే సూర్యపుత్రి మిమ్ము వరించినది. అది శీఘ్రగామి రథము. అత్యంత కీర్తనీయము.

    7. అశ్వినీద్వయమా? ఈ యజ్ఞమున మీరు సదృశ మనస్కులు. మేము స్తుతుల ద్వారా మిమ్ము సంయుక్తులను చేయుదుము. అట్టి శోభన స్తుతి మాకు ఫలప్రదము కావలెను.

    ఓ రమణీయ అన్నవంతులగు అశ్వినులారా ! మీరు స్తోతలను రక్షింపుడు. మీ వద్దకు చేరినంతనే మా అభిలాషలు పూర్ణములగును. ఫలించును.

                              నలుబది నాలుగవ సూక్తము

  ఋషి - సుహోత్రద్వయము పురుమీహ్ల - అజమీహ్లులు దేవత - అశ్వినులు,
                                   ఛందస్సు - త్రిష్టుప్.

    1. అశ్వినులారా ! మీ రథము విఖ్యాత వేగవంతము. గోసంగతము లేక గోప్రదము. మేము ఈ రోజు అట్టి మీ రథమును ఆహ్వానించుచున్నాము. అది సూర్యపుత్రికను ధరించిన రథము. దాని ఆసనము కాష్ఠ బంధురము. అది స్తుతివాహకము. విశాలము. ధనవంతము.

    2. అశ్వినీ కుమారులారా ! మీరు దేవతలు. మీరు మీ కార్యములద్వారా ప్రసిద్దులయిన సౌభాగ్యవంతులు. మీ ఉభయుల దేహములు సోమరస భరితములు. మీ రథమును మహశ్వములు మహస్తుతులు వహించును.

    3. సోమదాత అగు యజమాని తన రక్షణకొఱకు మీ సోమపానముకొఱకు తన యజ్ఞసంపూర్తికి తన మానమర్యాదలకుగాను అశ్వినులారా ! మిమ్మే స్తుతించును. ప్రతివాడు మిమ్ము తన యజ్ఞమునకు ఆహ్వానించును. మీకు నమస్కరించును.

    4. నాసత్యద్వయమా? మీరు ఇద్దరే కాని బహువిధులు. ఈ యజ్ఞమునకు హిరణ్మయ రథమున విచ్చేయుడు. మధుర సోమరస పానము చేయుడు. మీకు పరిచర్యలు చేయు మాకు రమణీయ ధనము ప్రసాదించుడు.

    5. అశ్వినులారా ! మీ రథము శోభనావర్తనము. హిరణ్మయము. దానిమీద మీరు ద్యులోకము నుండి భూలోకమునుండి మావైపునకు విచ్చేయుడు. మిమ్ముకోరుకొను ఇతర యజమానులు మిమ్ము నిలుపరాదు. అడ్డిగించరాదు. అందుకే అంతకుముందే మా స్తుతులను సమర్పించుకున్నాము.

    6. అశ్వినులారా ! మీరు మా ఉభయులకు పురుమీహ్ల-అజమీహ్లులకు బహుపుత్రయుక్త అనేక ధనములను ప్రసాదించుడు. పురుమీహ్లుని ఋత్విక్కులు స్తోత్రములద్వారా మిమ్ము పొందినారు. అజమీహ్లుని ఋత్విక్కులు సహితము ఆ స్తుతులందు కలిపినారు.

    7. అశ్వినీద్వయమా! ఈ యజ్ఞమున మీరు సదృశ మనస్కులు. మేము స్తుతుల ద్వారా మిమ్ము సంయుక్తులను చేయుదుము. అట్టి శోభన స్తుతి మాకు ఫలప్రదము కావలెను.

    ఓ రమణీయ అన్నవంతులగు అశ్వినులారా ! మీరు స్తోతలను రక్షింపుడు. మీ వద్దకు చేరినంతనే మా అభిలాషలు పూర్ణములగును. ఫలించును.

                              నలుబది అయిదవ సూక్తము

     ఋషి - వామదేవుడు, దేవత - అశ్వినులు, ఛందస్సు - 1-6 జగతి, 7 త్రిష్టుప్.
   
    1. ప్రకాశవంతుడగు ఆదిత్యుడు ఉదయించును. అశ్వినులారా ! మీ రథము నలువైపులసంచరించును. మీ రథము నిర్ణీత స్థలమున ఆదిత్యునితో కలియును. మీ రథమున మిథునీభూతమగు త్రివిధ-అశన, పాన, ఖాద్య అన్నములు ఉన్నవి. సోమరస పూర్ణమగు చతుర్థ చర్మమయ పాత్ర శోభిల్లును.

    2. ఉష ఉదయించును. అశ్వినులారా ! అప్పుడు త్రివిధ అన్నయుక్తము, సోమ రసోపేతము, అశ్వయుక్తమగు మీ రథము నలుదిశల వ్యాపించిన అంధకారమును దూరము చేయును. సూర్యునివలె వెలుగులను విరజిమ్ముచు ఎదురుగా సాగును.

    3. అశ్వినులారా ! మీ నోళ్లు సోమపాన యోగ్యములు. మీరు ఉభయులు మీ నోళ్లతో సోమరస పానము చేయుడు. సోమరస పానమునకుగాను ప్రియమగు మీ రథమును సన్నద్ధము చేయుడు. ఆ రథము మీద యజమాని గృహమునకు విచ్చేయుడు. మీగమన మార్గమును సోమరస శోభితము చేయుడు. మీరు సోమపూర్ణ చర్మమయ పాత్రను ధరించుడు.

    4. మీ అశ్వములు శీఘ్రగాములు. మాధుర్యయుక్తములు. ద్రోహ రహితములు. హిరణ్మయములు. పక్షి విశిష్టములువహనశీలములు ఉషఃకాలమున జాగరణ కారకులు. జలప్రేరకులు. హర్షయుక్తములు. సోమస్పర్శములు. తేనెటీగ తేనెవద్దకు ఏగురీతి మీ అశ్వములమీద మావద్దకు వచ్చెదరు.

    5. కర్మలుచేయు అధ్వర్యుగణము అభిమంత్రిత జలమున హస్తశోధనము చేయుచు, ప్రస్తరఖండమున మధుయుక్తసోమమును అభిషవింతురు. అప్పుడు యజ్ఞసాధనభూతము, సోమవంతములగు గార్హపత్యాది అగ్నులు ఏకత్రితమయి నివాసకారి అశ్వద్వయము అహరహము స్తుతించును.

    6. సమీపమందు ప్రసరించు కిరణములు దినకారణమున అంధకారమును ధ్వంసముచేసి సూర్యునివలె వెలుగులను విరజిమ్మును. సూర్యుడు అశ్వయోజన చేసిసాగును. అశ్వినీద్వయమా! మీరు ఇరువురు సోమరస సహితులయి సూర్యుని అనుసరించి సమస్త పథములను పాలించుడు.

    7. అశ్వినీ కుమారులారా ! మేము యజ్ఞము చేయువారలము. మిమ్ము స్తుతించుచున్నాము. మీ రథము సుందర అశ్వద్వయ యుక్తము. నిత్య తరుణము. అది మిమ్ము క్షణమాత్రమున ముల్లోకములు సంచరింప చేయగలది. ఆ రథము పైననే మీరు హవ్యయుక్తము, అతివాహి, భోగప్రదమగు యజ్ఞమునకు విచ్చేయుడు.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత, మూడవ అష్టకము, నాల్గవ మండలమునాలుగవ అనువాకము సమాప్తము)


    అయిదవ అనువాకము             నలుబది ఆరవ సూక్తము

    ఋషి - వామదేవుడు, దేవత - ఇంద్రవాయువులు, ఛందస్సు - గాయత్రి.

    1. వాయువా ! స్వర్గప్రాపక యజ్ఞమున అభిషుత సోమరసమును సర్వప్రథమముగా పానము చేయుము. ఏలననగా నీవు పూర్వపా, వగుదువు "పూర్వపా అసి"

    2. వాయూ ! నీవు నియుద్వంతుడవు. ఇంద్రుడు నీకు సారథి అగును. పరిమితములుకాని మా కోరికలను తీర్చుటకు విచ్చేయుము. నీవు అభిషుత సోమము సేవింపుము.

    3. ఇంద్రవాయువులారా ! మీరు సహస్రసంఖ్యాక అశ్వవంతులు. త్వరపడండి. సోమపానమునకు విచ్చేయండి.

    4. ఇంద్రవాయువులారా ! మీ రథము హిరణ్మయము. నివాసాధారము. కాష్ఠయుక్తము. ద్యులోకస్పర్శము. శోభస్కరము. యజ్ఞశీలము. మీరు అట్టి రథమును అధిరోహింపుడు.

    5. ఇంద్రవాయువులారా ! విశాల బలసంపన్నమగు మీ రథమున హవ్యదాత యజమానివద్దకు విచ్చేయుడు. యజ్ఞమునకు విచ్చేయుడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.