Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    నేను : వెళ్ళను.
    ఖుర్షిద్ : మరెక్కడికి ?
    నేను : విధి తీసికెళ్ళిన చోటుకు.
    ఖుర్షిద్ : కొన్ని రోజులు ఉంటావుగా!
    నేను : ఉన్నానుగా.
    పదిహేను. ఇరవై రోజుల వరకూ కోటలో ఉన్నాను. రోజూ ఖుర్షీద్ కలిసేది. ఆవిడ ,మనసు అక్కడే లగ్నమైంది. నాకు భయంగా ఉంటుంది. చివరకు రాజావారికి విన్నవించాను.
    నేను : విముక్తికి అజ్ఞ అయినట్లేనా ?
    రాజా ; అయినట్లే. వెళ్ళాలని ఉందా?
    నేను : చిత్తం. దాసీకి శలవిప్పించండి . మళ్ళీ దర్శనం చేసుకుంటాను.
    రాజా : ఎటు వెళ్తారు ?
    నేను : కాన్పూరు.
    రాజా ; ఏం ? లక్నో వెళ్ళరా?
    నేను : హుజూర్! ఏ ముఖం పెట్టుకొని లక్నో వెళ్ళను? ఖానమ్ కు ముఖం ఎలా చూపించను ?
              తోటివారు నవ్వరా?
    ముందు లక్నో వెళ్ళాలనే అనుకున్నా. లక్నో వెళ్తానంటే రాజావారు విడుదల చేయకపోవచ్చునని రెండవ ఆలోచన వచ్చింది. ఎంచేతంటే ఖుర్షీద్ విషయం వెల్లడి అయితే ఖానమ్ గొడవ చేయవచ్చు.
    నా నిశ్చయం రాజావారిని సంతోషపరచింది.
    రాజా : అయితే లక్నో ఇంకెప్పుడూ వెళ్ళరా?
    నేను : లక్నో లో ఎవరున్నారు? ఆటపాటల వృత్తి . ఎక్కడున్నా ఎవరో ఒకరు ఆదరించేవారు. లభిస్తారు. ఖానమ్ చెరలో ఉండడం ఇష్టం లేదు. అందుకే గదా, సర్కార్! బయటపడింది.
             లక్నో వెళ్ళనని రాజావారికి హామీ ఇచ్చాను.
    మరుసటి రోజు రాజావారు శలవిచ్చారు. పది సవరసులు , ఒక శాలువ, మూడు ఎద్దుల సహితంగా రధము బహుమానంగా ఇచ్చారు. బండి మనిషి కాక ఇద్దరు మనుషులను వెంట పంపారు. ఉనావ్ కు బయలుదేరాను. అక్కడ సలార్  పూటకూళ్ళ ఇంట్లో దిగాను. రాజావారి మనుషులను పంపేశాను. బండి మనిషి మాత్రం ఉండిపోయాడు.
    సాయంకాలం నా గది ముందు కూర్చున్నాను. బాటసారులు వస్తున్నారు. పోతున్నారు. పూటకూళ్ళవారు అరుస్తున్నారు. "బాటసారులూ , ఇటు ఇటు . ఇల్లు ఊడ్చి శుభ్రంగా ఉంది. హుక్కా, నీరు తయారు . భోజన భాజనాలకు మంచి ఏర్పాట్లు. గుర్రాలకు వేపచెట్టు నీడ .......'
    ఇంతలో ఫైజలీ సైసు కనిపించాడు. గేట్లో నుంచే నన్ను చూచాడు. దగ్గరికి వచ్చి మాట్లాడాడు. నా విషయం అడిగాడు. చెప్పాను. నేను ఫైజలీ విషయం అడిగాను. నేను ఉనావ్ బయలుదేరిన వార్త అతనికి అందిందనీ , ఈ రాత్రి జామున్నరకు తప్పక వస్తాడని చెప్పాడు.
    అది విని నా గుండె వేగంగా కొట్టుకుంది. తోటలో జరిగిన సంఘటన తరవాత అతడంటే నాకు అయిష్టత ఏర్పడింది. ఉనావ్ లో ఫైజలీ ప్రాణం మీద కూర్చున్నాడు. మాములు మాటలు జరిగాయి. తరవాత ఉనావ్ నుంచి బయలుదేరే ప్రస్తావన వచ్చింది. సంభాషణ చాలాసేపు సాగింది. బండివాన్ని పంపించి వేయాలని, సైసువాడు బండి తోలుతడనీ, అతను స్వయంగా గుర్రాన్ని చూచుకుంటాడనీ నిర్ణయం జరిగింది. బండి పూటకూళ్ళవాని దగ్గర వదిలేయాలనీ, రాత్రే గంగ దాటి వెళ్ళిపోవాలని నిశ్చయించాడు. ఏం చేయను? ఫైజలీ అధీనంలో ఉన్నాను. అతడు చెప్పినట్లు వినాల్సి వచ్చింది. సలార్ ను పిలిచాడు. పక్కకు తీసికెళ్ళి చాలాసేపు మాట్లాడాడు. సుమారు అర్ధరాత్రికి తనతో పాటు నన్ను గుర్రం మీద కూర్చుండబెట్టుకున్నాడు. సత్రం వదిలి వెళ్ళిపోయాం. అయిదారు కోసుల నడక. నడుములు విరిగిపోయినాయి. ఎలాగో అలా గంగానది ఒడ్డుకు చేరాం. కష్టంగా పడవ దొరికింది. నది దాటాం. ఉదయానికి కాన్పూరు చేరాం. నన్ను లాఠీ మహలు లో దింపి ఫైజలీ ఇల్లు చూడడానికి వెళ్ళాడు. కొద్దిసేపట్లో తిరిగి వచ్చి "ఇక్కడ ఉండడం క్షేమం కాదు ఇల్లు కుదిరించాను . అక్కడికి నడువు" అని డోలీ మాట్లాడాడు.
    కొద్దిసేపట్లో ఒక ఇంటికి వచ్చేశాం. ఒక వాసరా ఉంది. రెండు మంచాలు పడి ఉన్నాయి. చాప పరచి ఉంది. దాని మీద ఒక హుక్కా గొట్టం పడి ఉంది. దాన్ని చూడగానే అసహ్యం కలిగింది. ఇంటి స్థితి చూస్తే భయం భయంగా ఉంది. కొంతసేపు ఉండి "బజారుకు వెళ్ళి తినేందుకు ఏమైనా తెస్తాను" అన్నాడు ఫైజాలి." మంచిది, త్వరగా రావాలి" అన్నాను నేను. ఫైజలి బజారుకు వెళ్ళిపోయాడు. ఒంటరిగా కూర్చున్నాను.
    బజారుకు వెళ్ళిన పైజాలీ ఇవ్వాళ రాడు, రేపు రాడు. గడియ రెండు గడియలు , జాము రెండు జాములు. ఎంతని చెప్పను? పగలు గడిచింది .సాయంకాలం కావచ్చింది. ఉనావ్ లో సాయంకాలం ఎప్పుడో తిన్నతిండి. రాత్రి గుర్రపుస్వారీ. నిద్ర మబ్బు. ఉదయం నుంచి మొఖాన చారెడు నీళ్ళు పడలేదు. ఆకలితో ప్రాణం పోతుంది. సూర్యుడు అస్తమించాడు. చీకటి పడింది. రాత్రి అయింది. భగవాన్! ఏమి చేయాలి! అంత పెద్ద ఇల్లు అవురావురంటుంది. ఆ గదిలోంచి ఎవడో వచ్చినట్లూ, ముందటి వసారాలో ఎవరో తిరుగుతున్నట్లూ అనిపిస్తుంది. ఏదో ధనధన చప్పుడు, ఎవరో మెట్లు దోగి వెళ్ళిపోతున్నారు. రెండు జాముల రాత్రి అయింది. గోడల ,మీద   , కప్పు మీద కనిపించిన వెన్నెల మాయం అయింది. చీకట్లు చుట్టూ కున్నాయి. దుప్పటి ముఖం మీద కప్పుకొని పడుకున్నాను.
    తెల్లవారి పరిస్థితి ,మరీ అధ్వాన్నంగా ఉంది. అపుడు లక్నో విలువ తెలిసింది. భగవంతుడా! ఎలాంటి కష్టాలు తెచ్చి పెట్టావురా అనుకున్నాను. లక్నో సౌఖ్యం, విశ్రాంతి, ఆ గది గుర్తుకు వచ్చాయి. కనుసైగలను బట్టి మనుషులు హుక్కా, తాంబూలం , అన్నం నీరు అన్నీ తెచ్చేవారు. ముఖం తిప్పిన వైపునకు అందించేవారు. సారాంశం ఏమంటే ఇవాళ రెండు జాముల వరకు ఫైజలీ రాలేదు. ఈ దశలో శీలంగం ఆడది ఉండి ఉంటే ఉక్కిరిబిక్కిరి అయి చచ్చేది. నేనేమీ పొడిచి వచ్చానని కాదు. అయినా వందల పురుషుల్లో కూర్చున్నదాన్ని కాన్పురులో కాకున్నా లక్నోలో అనేక గొందులు ఎరుగుదును. ఇక్కడ కూడా బజారు చూచాను. కాళీ కొంపలో కూర్చుండలేక లేచి గొళ్ళెం తీసి బయటపడ్డాను. పది, ఇరవై అడుగులు వేశానో లేదో సర్కారు దుస్తులు గల ఒక వ్యక్తీ గుర్రం మీద కనిపించాడు. అతని వెంట పది, పదిహేను మంది జవాను లున్నారు. బేడీలు వేయబడిన ఫైజలీ వారి మధ్య నడుస్తున్నాడు. ఆ దృశ్యం చూచి స్తబ్దురాలినై పోయాను. నిలిచిపోయాను. ఇరుకు గొంది కనిపించింది. అందులోనే ఒక మసీదు ఉంది. దేవుని ఇల్లే ఉత్తమం అనుకున్నాను. అక్కడే కొంతసేపు గడపడం మంచిదనుకున్నాను. తలుపు తెరచి ఉంది. లోనికి వెళ్ళాను. ఒక మౌల్వీ గారు ఎడురైనారు. తల నున్నగా ఉంది. నీలిరంగు బట్ట కట్టుకొని ఎండలో పచారు చేస్తున్నారు. ముందు నేను కానుక వేయడానికి వచ్చాననుకున్నారు. సంతోషించారు. నేను వెళ్ళి ముంగిలిలో కాళ్ళు చాచి కూర్చున్నాను. దగ్గరకు వచ్చి "అమ్మాయీ! ఇక్కడేం పని?" అని అడిగారు.
    నేను : భగవంతుని ఇల్లని వచ్చాను. కొద్ది సేపు కూర్చుంటాను. మీకు అంతగా సహించకుంటే ఇప్పుడే వెళ్ళిపోతాను.
    నా కలుపుగోలుతనము, మనోరంజకమైన ఉపన్యాసం గారడిలా పనిచేశాయి. ఇంక జవాబేం చెపుతారు. బిక్కు ముఖం వేసి అటూ ఇటూ చూచారు. ఉచ్చులో పడ్డారని అర్ధం చేసుకున్నాను.
    మౌల్వీ : అయితే ఎక్కణ్ణుంచి తమ రాక?
    నేను : ఎక్కణ్ణుంచైనా ప్రస్తుతం ఇక్కడే ఉండాలని ఉంది.
    మౌల్వీ : (బెదిరి) మసీడులోనా ?
    నేను : కాదండీ. మీ గదిలో.
    మౌల్వీ : లాహూర్ వలాఖువతా (పాపము శమించుగాక)
    నేను : అయ్యో! మౌల్వీ సాహెబ్! మీరు తప్ప ఎవరున్నారు నాకు?
    మౌల్వీ: నేను ఒంటరిని. అందుకే "మసీదులో మీకేం పని ?" అని అడిగాను.
    నేను : బాగుంది. భలే ! మీరుంటే మరొకరు ఉండకూడదా ఏం? మసీదులో మాకేమీ పనిలేదు కాని మీకేం పని ?
    మౌల్వీ : పిల్లలకు చదువు చెపుతాను.
    నేను : నేను మీకు పాఠాలు చెపుతాను.
    మౌల్వీ : లాహుల్ వలా ఖువతా.
    నేను : లాహుల్ వలా ఖువతా. తెపా లాహుల్ ఎందుకు చదువుతారు? సైతాను మీ వెంట పడిందా?
    మౌల్వీ : సైతాను మానవునికి శత్రువు. దానికి భయపడాలి.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.