Home » Dr Dasaradhi Rangacharya » Krishna Yajurveda



    12. అశ్వమా! నీవు కాలుపెట్టి భూమిని పరీక్షించుము. మానవ జ్ఞానమున మట్టిని నిశ్చయించుము. భూమిని అడిగి అగ్నియోగ్యమగు మట్టిని నిశ్చయించుము. మాకు తెలియపరచుము.

    13. అశ్వమా! ద్యులోకము నీ పృష్ఠము. పృథివి నీ నివాసస్థానము. అంతరిక్షము నీ జీవాత్మ. సముద్రము నీ జన్మస్థానము. చూపువలన యుద్ధపు శత్రువును గ్రహించుము. వారిని నీ కాలికింద త్రొక్కివేయుము.

    14. అశ్వమా! నీవు ధనమును ఇచ్చుదానవు. యజమాని భాగ్యమును వర్థిల్లచేయు దానవు. ఈ స్థలము నుండి జరుగుము.

    మేము ఈ నేలనుండి అగ్నిహేతువగు మట్టిని త్రవ్వనున్నాము. భూమి మమ్ము అనుగ్రహించునుగాత.

    15. అశ్వము ఆస్థలమునుండి జరిగినది. ఇది ధనమును, అన్నమును ఇచ్చునది. వేగవంతమైనది. ఇది ఖనన ప్రదేశము నుండి రాక్షసాదులను తొలగించినది.

    మేము దుఃఖరహితము, సుఖసహితమగు స్వర్గమును చేర దలచిన వారలమై అగ్నికి తగిన ఈ నేలను త్రవ్వుచున్నాము.

    16. నేను యజమానివి. ఇవి ప్రకాశవంతములు, మధురములగు జలములు. వీనిని సంతానము, ఆరోగ్యము కొరకు ఈ ప్రదేశమున చల్లుచున్నాను. ఆ జలము వలన ఇచట ఫలవంతములగు ఓషధులు మొలుచునుగాక.

    17. అగ్ని సమస్తలోకములందు నివాసము కలవాడు. తిర్యక్ ప్రమాణమున విశాలుడు. కాలప్రభావమున ప్రౌఢుడు. సకల విధ అన్నములు కలవాడు. అట్టి అగ్నిని మనసున ధ్యానించుచున్నాము. ఆజ్యమున జ్వలింపచేయుచున్నాము.

    18. ఈ అగ్ని మానవులకు ఆశ్రయణీయుడు. మరువలేని రూపము కలవాడు. తాకుటకు ఆశక్యుడు. నేయి త్రాగి వళ్లు పెంచినవాడు. అత్యంతహృష్టుడు.

    అగ్నీ! నిన్ను మంత్రములతో కూడిన నేతితో తడుపుచున్నాము. మంచి మనస్సుతో ఘృతమును సేవింపుము.

    19. అగ్ని అన్నపతి. విద్వాంసుడు. హవిస్సులు స్వీకరించువాడు. యజమానికి రత్నములు ఇచ్చువాడు.

    20. అగ్నీ! నీవు సాహసివి. మాకు కోరిన ఫలములను ఇచ్చువాడవు. విప్రుడవు. శత్రువులకు భీకర రూపుడవు. రాక్షస భేదకుడవు. అట్టి నిన్ను సర్వత్ర ఆరాధించుచున్నాము.

    21. అగ్నీ! నీవు స్వర్గము కొరకు జాయసే - పుట్టుచున్నావు. తడినేలను పొడి చేయుటకు జాయసే. ఉదకముల నుండి జాయసే. రాతి రాపిడికి జాయసే. అరణ్యములందు జాయసే.

    అగ్నీ! నీవు సర్వజనపాలకుడవు. నీవు పావకుడవై జాయసే.    

                                        మూడవ అనువాకము

    1. అగ్నీ! నేను సవిత అనుజ్ఞచే అశ్వినుల బాహువులతోను, పూషహస్తములతోను నీ కొరకుగాను మట్టిని అంగిరస ఋషుల వలె త్రవ్వుచున్నాను.

    2. అగ్నీ! నీవు భూమి మీద ఉన్నవాడవు. జ్యోతిష్మంతుడవు. నిరంతరము కిరణములచే ప్రకాశించువాడవు. హింసించనివాడవు. ప్రజలకొరకును, శాంతికొరకును పాంసుయోగ్యుడవగు నిన్ను అంగిరసులవలె త్రవ్వుచున్నాను.

    3. కమల పత్రమా! నీవు నీటిమీద ఉండు దానవు. విశాలవు. అవినాశ్యవు. వర్థిల్లుదానవు. పూజనీయవు. అగ్ని స్థానమగు మట్టిని భరించగలదానవు. ఆకాశమంతటి దానవు. మరింత వర్థిల్లుము.

    (తామరాకును దొప్పగా చేసి అందు మట్టిని నింపుదురు.)

    4. కృష్ణాజిన, కమల పత్రములారా! మీరు అచ్చిద్రులు. మూసుకొనగలవారు. సుఖములను ఇచ్చువారు. కవచముల వలె రక్షించువారు. మట్టిని కప్పి ఉంచండి. అగ్నిహేతువగు మృత్తికను భరించండి.

    5. కృష్ణాజిన, కమల పత్రములారా! మీరు స్వర్గము నెరింగిన వారు. మట్టిని కట్టుటకు తగినవారు. నిరంతరము ప్రకాశించు అగ్నిహేతువగు మట్టిని మీ ఉదరములందు ధరించండి. ఉరము వంటి రూపమున దానిని కప్పి పెట్టండి.

    6. ఖననప్రదేశమా! నీయందు దుమ్ము కలదు. నీవు సమస్తములగు ఉఖారూపములను భరించుదానవు.

    అగ్నీ! అథర్వుడు అను ఋషి నిన్ను తొలుత మధించినాడు.

    7. అగ్నీ! శిరసువలె ప్రశస్తమును, విశ్వమును వహించునదియునగు తామరాకు మీద అథర్వుడు నిన్ను చక్కగా మధించినాడు.

    8. అగ్నీ! అథర్వుని పుత్రుడు దధ్యంగుడు. శత్రుహంతవు. త్రిపురాంతకుడవగు నిన్ను అతడు చక్కగా మధించినాడు.

    9. అగ్నీ! నీవు తస్కర సంహారకుడవు. అన్ని యుద్ధములందు ధనంజయుడవు. నిన్ను 'పాథ్యుడు' చక్కగా మధించి జ్వలింపచేసినాడు.

    10. అగ్నీ! నీవు హోమ నిష్పాదకుడవు. అభిజ్ఞుడవు. నీ స్థానము ఉత్తరవేది అగును. నీవు అచట ఆసీనుడవు అగుము. యజ్ఞమును సుకృతములందు స్థాపించుము. నీవు దేవతలకు ప్రియుడవు. దేవతలకు హవిస్సులు అర్పించుచున్నావు. యజమానికి దీర్ఘాయువు ప్రసాదించుము.

    11. అగ్ని దేవతలను ఆహ్వానించువాడు. నివాసములు తెలిసినవాడు. దీప్తిమంతుడు. హవిర్దాత. ఎంతో నిపుణుడు. కర్మ రక్షకుడు. వసిష్ఠుడు, వేల కొలది హవిస్సుల పాలకుడు. శుచి జిహ్వుడు. అట్టి అగ్ని ఉత్తర వేది యందు ఆసీనుడు అయినాడు.

    12. అగ్నీ! నీవు ఈ తామరాకు నందు నిలువుము. నీవు మహామహుడవు. దేవతల వద్దకు వెళ్లువాడవు. యజ్ఞార్హుడవు. ప్రదీప్తుడవగుము.

    అగ్నీ! ఉగ్రరూపము కానిదియు, కాంచదగినదియునగు పొగను మాత్రము కలిగించుము.

    13. అగ్నీ! నీవు జయశీలుడవు. హితకారులకు హితకారివి. అడవులందు రోషరహితుడవు. ప్రభాతమున ఉదయించుము. రత్నసమములగు ఏడు జ్వాలలతో అలంకరించుకొని యజమానుల గృహములన్నింట వసింపుము.

                                        నాలుగవ అనువాకము

    1. భూమీ! ఖనన స్థానమున నీవు పొంగిన రొమ్మువలె పైకి లేచి ఉన్నావు. అల్పముగ ఉన్నావు. నిన్ను అంతరిక్షమునందలి వాయువు శుభ్రము చేయునుగాక. దేవతలందు ప్రాణభావమున సంచరించునట్టి వాయువునకు, దేవి వగు నీకును స్వాహా.

    2. అగ్నీ! నీవు సుజాతవు. ఈ కృష్ణాజినము కాంతి వంతము. సుఖప్రదము. స్వర్గసదృశము. నీవు దానిని ధరించుము. విశ్వరూప కృష్ణాజిన వస్త్రమును దాల్చుము.

    3. అగ్నీ! నీవు చక్కని యాగ నిర్వాహకుడవు. ఉత్తిష్ఠ. దేవతలవంటి కృపగలవాడనై మమ్ము పాలించుము. తేజస్సు, కాంతుల నీను కిరణములతో - కీర్తివంతుడవై - ప్రజలను వీక్షించుటకు ఆయాహి - విచ్చేయుము.

    4. అగ్నీ! మమ్ము రక్షించుటకుగాను సూర్యుని వలె ఆకసమున ఉండుము. అచట ఉండియే మాకు అన్నదాత వగుము. మేము ఋత్విక్కులు, వారి మంత్రములచే నిన్ను బహువిధములగ ఆహ్వానించుచున్నాము.

    5. అగ్నీ! నీవు పూజనీయుడవు. ఓషధులకు జఠరాగ్ని రూపమవు. ద్యావాపృథ్వుల కడుపున పుట్టినవాడవు. అనేక కాంతుల పసివాడవు. చీకట్లు పోగొట్టుటకు పుట్టినావు. తల్లుల కొరకు ఏడ్చు బిడ్డల వలె - తల్లులగు ఓషధుల కొరకు ఏడ్చుచు సాగుము.

    6. చక్కగా నడుచునట్టి గార్ద భమా! అగ్నికి కారణమగు మట్టిని మోయవలసిన దానవు. నిలకడగా ఉండుము. బలము, వేగము కలదానవు. అన్నము కలిగించుము. నీ వీపు విశాలము. మట్టికి సుఖాపనమవగుము.

    7. అగ్నీ! నీవు ప్రాణిజాలము కొరకు శాంతుడవు అగుము. ద్యావాపృథ్వులను గూర్చి శోకించకుము. అంతరిక్షమును గూర్చి శోకించకుము. వనస్పతులను గూర్చి శోకించకుము.

    8. గుర్రము సకిలించుచు ముందు నడచునుగాక. మట్టిని మోయునట్టి గమనశీలయగు గాడిద అనుసరించునుగాక. అది ఆయువున కన్న ముందు మరణించకుండునుగాక.

    9. అశ్వ, గార్దభములారా! మీలో గాడిద సంతోషముగ ఓండ్ర పెట్టుచు, రథము వలె మట్టిని మోయుచు సాగుచున్నది. అది దూతవలె వడిగా నడచుచు అగ్ని హేతువగు మృత్తును వహించునుగాక.

    10. అగ్ని జలగర్భ. సముద్రజాత. వర్షప్రదాత. అట్టి అగ్నికి సంబంధించిన మట్టిని గార్దభము వహించునుగాక. అగ్నీ! పుట్టుకల కొరకును, భూమి, స్వర్గమును గూర్చియు విచ్చేయుము.

    11. ఓషధులారా! అదిగో మీకు ఎదురుగా శాంతమూర్తి అగు అగ్ని అరుదెంచుచున్నాడు. అతనిని స్వీకరించండి. వ్యాధులు శత్రుసదృశములు. వానిని పోగొట్టు అగ్ని మీ యందు ఉండునుగాక. మానుండి దుష్ట బుద్ధిని పోగొట్టునుగాక.

    12. ఓషధులారా! మీరు పుష్పవంతలు. ఫలవంతలు. అగ్ని మీలో చేరినది. ఆనందించండి. ఈ అగ్ని మీకు ఋతుకాలీనమును, గర్భయోగ్య స్థానమును సమకూర్చినాడు.

                                         అయిదవ అనువాకము

                                       (ఉఖా - కుంపటి - నిర్మాణము.)

    1. అగ్నీ! నీమ మహా బలవంతుడవు. దీపించువాడవు. శత్రువులను, రాక్షసులను, వ్యాధులను మిక్కిలి బాధించుము. నీవు సుఖములు కలిగించువాడవు. గొప్పవాడవు. సులభముగ ఆహ్వానించ తగినవాడవు. మేము నీ పరిచర్యలందు సుఖింతుము.

    2. జలమా! నీవు సుఖములు కలిగించుము. మాకు నీ రసానుభవము కలిగించుము. రమణీయమగు నీ దర్శనము కలిగించుము.

    3. నీ వద్ద శాంతము, సుఖకరమగు రసము ఉన్నది. తల్లి బిడ్డకు పాలిచ్చునట్లు నీవు మాకు ఈ కర్మయందు ఆ రసమును అందించుము.

    4. ఏ రసము మీకు సంతృప్తి కలిగించుచున్నదో దానిని మాకు ప్రసాదించండి. జలములారా! మీరు మమ్ము ప్రజోత్పాదకులను చేయండి.

    5. మిత్రదేవత మరింత మట్టిని నీటితోను అర్మకలాపాదికముతోను కలిపినాడు. ఉఖను నిర్మించినాడు. అది విశ్వానరుడగు అగ్నిని అందరి గృహములందు స్థాపించినది.

    6. అగ్నీ! నిన్ను ప్రజల కొరకును, రోగములు కలుగకుండుటకును ముట్టించుచున్నాను. సర్వదేవతలు అంగిరసులవలె నిన్ను పుట్టింతురుగాక.

    7. రుద్రులు మట్టిని చక్కగా మర్దించి కుంపటి చేసినారు. వారు అందు మహాజ్యోతియగు అగ్నిని స్థాపించినారు. రుద్రులచే స్థాపించబడినట్టి అగ్ని భాసమానమై, నిరంతరము దీపించుచు దేవతలందు ప్రకాశించుచున్నది.

    8. ధీరులగు రుద్రులచేతను, వసువుల చేతను కర్మయోగ్యమగు మట్టి చక్కగా కలుపబడినది. సినీవాలి ఆ మట్టిని మృదువుగా చేసి ఉఖను నిర్మించునుగాక

    9. సినీవాలి మంచి వెంట్రుకల కొప్పుకలది. కురీర అలంకారము గలది. శయనించుటకు అనువగు అవయవములు కలది.

    భూదేవీ! సినీవాలి తన హస్తములచే ఉఖను నీకు అర్పించునుగాక.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.