Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
ముప్పది ఏడవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - ఋభువులు ఛందస్సు 1-4 త్రిష్టుప్, 5-8 అనుష్టుప్.
1. మనోహరములగు ఋభువులారా ! మీరు దినములను సుదినములు చేయుటకు మానవుల యజ్ఞములను వహింతురు. అట్లే దేవమార్గము ద్వారా మా యజ్ఞమునకు విచ్చేయుడు.
2. ఈ యజ్ఞము మీ హృదయములకు మనసులకు ప్రీతిదాయకము కావలెను. ఘృత మిశ్రితమగు సోమరసము మీ హృదయములకు చేరవలెను. అభిషుత సోమరసము మిమ్ము వరించుచున్నది. సోమరసము మిమ్ము సత్కర్మలకు ప్రోత్సహించవలెను.
3. వాజులారా ! ఋభువులారా ! సవన త్రయోపేత దేవతలకు హితకరమగునది సోమము. దానిని మీ కొఱకు సిద్ధము చేసినాము. సోమయుతులగు ప్రజల మధ్య మేము మనువువలె విశేష దీప్తిమంతులము అగుదుము. మీకు సోమము సమర్పింతుము.
4. ఋభువులారా ! మీ అశ్వములు బలమయినవి. మీ రథములు దీప్తిమంతములు. మీ దవడలు ఇనుమువంటి గట్టివి. మీరు అన్నవంతులు. దానవంతులు. మీరు ఇంద్రపుత్రులు. బలపుత్రులు. మీ హర్షమునకుగాను తృతీయ సవనము ఏర్పాటు చేయబడినది.
5. ఋభువులారా ! మేము అత్యంత బుద్ధిశాలి ధనమును ఆహ్వానించుచున్నాము. యుద్ధమున అత్యంత బలశాలి రక్షణను ఆహ్వానించుచున్నాము. దానశీలురు, అన్నవంతులు, ఇంద్రవంతులు, ఇంద్రియవంతులగు మిమ్ము సర్వదా ఆహ్వానించుచున్నాము.
6. ఋభువులారా ! మీరు, ఇంద్రుడు రక్షించినవాడు శ్రేష్ఠుడు అగును. అతడు కర్మవలన ధనవంతుడు అగును. అతడు యజ్ఞమున అశ్వవంతుడు అగును.
7. ఋభువులారా ! మాకు యజ్ఞమార్గము ప్రజ్ఞాపితము చేయుడు. మీరు మేధావులు. మీరు స్తుతులయినపుడు సమస్త దిశలను ఉత్తీర్ణము చేయు సమర్థులు అగుదురు.
8. వాజులారా ! ఋభువులారా ! ఇంద్రా ! అశ్వద్వయమా ! మేము మిమ్ము స్తుతించువారలము. మాకు ధనము దానము చేయుటకుగాను మీరు విశేష ధనమును, అశ్వములను తెండు.
ముప్పది ఎనిమిదవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - దధిక్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ద్యావాపృథ్వులారా ! 'త్రసదస్యుడు' దాత. రాజు అతడు మీవలన అనేక ధనములు పొందినాడు. యాచక మానవులకు దానము చేసినాడు. మీరు అతనికి అశ్వములను, పుత్రులను, దస్యులను, హతమార్చుటకు ఉగ్ర అస్త్రములను ప్రదానము చేసినారు.
2. గమనశీలుడు, శత్రునిరోధకుడు, సమస్త మానవ రక్షకుడు, సుందరగామి, దీప్తి విశిష్టుడు, శీఘ్రగామి, బలశాలియగు రాజువలె శత్రువినాశకుడగు దధిక్రుని ద్యావాపృథ్వులు ధరింతురు. (దధిక్ర-అశ్వరూగ్ని)
3. మానవులందరు సంతృప్తులయి దధిక్రుని స్తుతింతురు. అతడు పల్లమునకు పారెడి నీరు వంటి గమనశీలుడు. సంగ్రామాభిలాషి వంటి శూరుడు. కాలినడకన దిశలను లంఘించకోరువాడు. రథగామి. వాయువేగవంతుడు.
4. సంగ్రామమున ఏకత్రితమయిన శత్రువును నిరోధించునట్టివాడు, అత్యంత భోగవాసనలతో సమస్త దిశలందు సంచరించునట్టి వాడు, వేగముగా సాగువాడు, ఆవిర్భిత శక్తిమంతుడగు నట్టి స్తుతికారుడగు యజమాని శత్రువులందరిని తిరస్కరించజాలును.
5. బట్టలు దొంగిలించిన వానిపై మానవులు క్రోధితులు అగుదురు. అట్లే దధిక్రుని సంగ్రామమున చూచి శత్రువులు క్రోధింతురు. పక్షులు తమకన్న దిగువన ఎగురు ఆకలికొన్న డేగను చూచి పారిపోవును. అట్లే అన్నము, పశువుల గుంపులమీదకు పోవు దధిక్రుని చూచి మానవులు పారిపోదురు.
6. దధిక్రుడు అసురసేనలోనికి జొరబడదలచును. రథపంక్తుల సహితుడయి సాగును. అతడు అలంకృతుడు. మనుష్యులకు హితకర అశ్వమువలె శోభాయమానుడు. నోటిలోని కళ్లెమును కరచి పట్టును. తన పదఘట్టనలకు లేచిన ధూళితో దిశలను నింపును.
7. అశ్వము సహనశీలము. అన్నవంతము. సమరకార్యసాధకము. ఋజుగామి. వేగగామి. శత్రుసేవల మధ్యమున అతివేగముగ పరుగులు పెట్టును. దుమ్ములేపి భూమిమీద చల్లును.
8. దధిక్రుడు దీప్తిమంతుడు. శబ్దకారి. వజ్రమువలె హింసకారకుడు. యుద్దాభిలాషులు అతనిని చూచి గడగడలాడుదురు. అతడు నలువైపులనుంచి వేలమందిమీద ప్రహారము చేసినపుడు భయంకరుడు, దుర్వారుడు అగును.
9. దధిక్రుడు మానవుల కోరికలు తీర్చువాడు. వేగవంతుడు. అతని పరాభవ కారకమగు వేగమును శత్రునాశకమని నరులు నుతింతురు. అతడు వేల సేనలతో సాగును.
10. సూర్యుడు తన తేజమున జలములను ప్రసాదించును. అట్లే దధిక్ర దేవబలమున పంచాకృష్ణులను వర్థిల్లచేయును. శత సహస్రదాత, వేగవంతుడు, దధిక్రుడు మా స్తుతి వాక్యములను మధుర ఫలసంయుక్తము చేయవలెను.
(దేవ, మానవ, అసుర, రాక్షస, పితరులు పంచాకృష్ణులు)
ముప్పది తొమ్మిదవ సూక్తము
ఋషి-వామదేవుడు, దేవత-దధిక్రుడు ఛందస్సు - 1-5 త్రిష్టుప్, 6 అనుష్టుప్.
1. దధిక్ర శీఘ్రగామి. మేము త్వరత్వరగా అతనిని స్తుతింతుము. ద్యావాపృథ్వులవద్ద నిలిచి అతనికి తృణము అందింతుము. చీకట్లు తొలగించు ఉష మమ్ము రక్షించవలెను. మమ్ము సమస్త దురితములనుండి దాటించవలెను.
2. మేము యజ్ఞనిర్వాహకులము. అనేకులు ఆశించునట్టి, మహామహుడయినట్టి, కోరికలు తీర్చునట్టి దధిక్రుని మేము స్తుతింతుము. దీప్తిమంతుడగు అగ్నివంటి రక్షకుడు, మానవ ఉపకారకుడు. దధిక్రుని మిత్రావరుణులు ధరించవలెను.
3. ఉష ఉదయించగా, అగ్ని సమిద్ధముకాగా అశ్వరూప దధిక్రుని స్తుతించు యజమానిని మిత్రుడు, వరుణుడు, అదితి సహితుడై దధిక్రుడు నిష్పాపుని చేయును.
4. దధిక్ర అన్నసాధకుడు. బలసాధకుడు. మహామహుడు. స్తోతల కళ్యాణకారుడు. మేము అట్టివాని నామమును స్తుతింతుము. మాకు శుభములు కలిగించుటకు మేము వరుణుని, మిత్రుని, అగ్నిని వజ్రబాహు ఇంద్రుని ఆహ్వానించుచున్నాము.
5. యుద్ధ సన్నద్ధులు, యజ్ఞ ప్రారంభకులు ఉభయులు ఇంద్రునివలె దధిక్రుని ఆహ్వానింతురు. మిత్రావరుణులారా ! మానవులను ప్రోత్సహించు అశ్వరూప దధిక్రను మా కొఱకుగాను ధరించుడు.
6. జయశీలుడు, వ్యాపకుడు, వేగవంతుడగు దధిక్రుని మేము స్తుతింతుము. అతడు మా చక్షురాది ఇంద్రియములను సుగంధ విశిష్టము చేయవలెను. అతడు మా ఆయువును పెంచవలెను.
నలుబదవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - దధిక్రుడు ఛందస్సు - మొదటిది త్రిష్టుప్, మిగిలినవి జగతి.
1. మేము మరల మరల దధిక్రుని స్తుతింతుము. సంపూర్ణ ఉష మమ్ము కర్మలకు ప్రేరేపించవలెను. మేము జలము, అగ్ని, ఉష, సూర్య, బృహస్పతి, అంగిర గోత్రోత్పన్న జిష్ణువును స్తుతింతుము.
(జిష్ణువు జయశీలుడని దయానందుడు, దేవత అని శాయణుడు)
2. దధిక్రుడు గమనశీలుడు. భరణకుశలుడు. గోవుల ప్రేరకుడు. పరిచారకులతో నివసించువాడు అతడు అభిలషణీయమగు ఉషఃకాలమున అన్నమును వాంఛించవలెను. శీఘ్రగామి, సత్యశీలుడు, వేగవంతుడు, దధిక్రుడు అన్నమును, బలమును, స్వర్గమును ఉత్పత్తి చేయవలెను.
3. పక్షులు పక్షులగతిని అనుసరించును. అట్లే వేగవంతులగు జనులు-త్వరయుక్తుడు, ఆకాంక్షవంతుడగు దధిక్రుని గతిని అనుసరింతురు. శ్యేన పక్షివలె ధృతగామి, త్రాణకారి దధిక్రుని స్థానమును నలువైపుల నుండి ఏకత్రులయి అందరు అన్నము కొఱకు సాగుదురు.
4. అశ్వరూప దధిక్రుడు కంఠప్రదేశమున, కక్ష ప్రదేశమున, ముఖప్రదేశమున బద్ధుడయి పాదచారిగ శీఘ్రగమనమున సాగును. దధిక్ర అధిక బలవంతుడయి యజ్ఞాభిముఖ కుటిల మార్గమును అనుసరించి సర్వత్ర సంచరించును.
5. హంస-ఆదిత్యుడు-దీప్త ఆకాశమున నిలుచును. వసువు, వాయువు అంతరిక్షమున నిలుచును. హోత-వేదికాగ్ని-గార్హపత్య రూపమున నిలుచును. పూజ్యుడయి గృహమున పాక సాధనాగ్ని నిలుచును.
ఋతము మానవుల మధ్య నిలుచును. వరించ తగిన స్థానమున నిలుచును. యజ్ఞస్థలమున నిలుచును. అంతరిక్షమున నిలుచును.
ఋతము జలములందు, రశ్ములందు, సత్యమునందు, పర్వతములందు ఉత్పన్నమగును.
"నృషద్వర సదృశసద్వ్యోమ సదబ్జా గోజాఋతజా అద్రిజా ఋతమ్"
("సర్వే దృశ్యత్వేన సత్యజాతః నహ్యసావింద్రాదివత్ పరోక్షోభవతి. యద్వా ఉదకేషు వైద్యుత రూపేణవ్కావ రూపేణవాజాతః" అని శాయణుడు. సత్యము సర్వదర్శనీయమై జనించినది. ఇంద్రాదులవలె ఇది పరోక్షముకాదు. ఇది జలాదులందు విద్యుత్తు మున్నగు రూపమున జనించును.)
"సత్యాజ్ఞాతః" అని దయానందుడు. సత్యము నుండి పుట్టినది.
(ఇక్కడ ఒక విశేషము మనోగోచరమగుచున్నది. ఋతము ఋతమునుండియే జన్మించుచున్నది ! ఋతమునకు తగిన అన్య జన్మస్థానము గోచరించదు. ఇది మదీయ ఆలోచనము)
నలుబది ఒకటవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రావరుణులు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రావరుణులారా ! అగ్ని అమరుడగు హోత. అతనివలె హవిర్యుక్త స్తోత్రముగలవాడెవ్వడు? మీ ఉభయులను గ్రహప్రాప్తుడెవ్వడు? అట్టి స్తోత్రము మా వలన అభిహితమయి, ప్రజ్ఞోపేతమయి, హవిర్యుక్తమయి మీకు హృదయంగమము కావలెను.
2.ఇంద్రావరుణులారా ! మీరు ప్రసిద్ధులు. మీకు హవిరన్నము అర్పించి మీ స్నేహము, బంధుత్వము కోరు మానవుడు పాపములను నశింపచేయును. సంగ్రామమున శత్రువును నాశనము చేయును. మహారక్షణల ద్వారా ప్రఖ్యాతుడవగును.
3. ప్రసిద్ధులగు ఇంద్రావరుణులారా ! మీరు స్తోతలకు రమణీయ ధనదాతలు కావలెను. మీరు ఉభయులు యజమాని మిత్రులు కావలెను. మీరు అందించిన అభిషుత సోమము స్వీకరించవలెను. మీరు అన్నవంతులు, హృష్టులు కావలెను. ధనదాతలు కావలెను.
4. ఇంద్రావరుణులారా ! మీరు ఉగ్రులు. మీరు ఈ శత్రువుమీద దీప్తము, అత్యంత తేజోవంతమగు వజ్రమును విసరుడు. ఈ శత్రువు మాకు దుర్దమనీయుడు, కఠినుడు హింసకుడు అయినాడు. వానిమీద పరాభవ కరమగు మీ బలమును ప్రయోగించుడు.
5. ఇంద్రావరుణులారా ! వృషభము ధేనువునకు ప్రియము చేయును. అట్లే ఈ స్తుతులు మిమ్ము ప్రీతులను చేయును. గడ్డి మున్నగునవి తిని సహస్రధారా మహిమాన్విత గోవు పాలిచ్చును. అట్లే స్తోత్రరూప ధేనువు. మా కోరికల పాలను ప్రసాదించవలెను.
6. ఇంద్రా వరుణులారా ! మీరు రాత్రులందు మాకు రక్షకులు కండు. శత్రువులను హింసించుటకు విచ్చేయుడు. అందువలన మాకు పుత్ర, పౌత్ర లాభము ఉద్వర భూలాభము కలుగవలెను. చిరంజీవులము కావలెను. మాకు సంతానోత్పత్తి శక్తి కలుగవలెను.
7. ఇంద్రావరుణులారా ! మేము మిమ్ము గోలాభము, ప్రాచీన రక్షణకోరి మీవద్ద మిమ్ములను ప్రార్థించుచున్నాము. మీరు క్షమతాశీలురు, బంధుస్వరూపులు. శూరులు. అత్యంత పూజ్యులు. మేము మిమ్ము. సుఖములను ప్రసాదించు తండ్రివలె సఖ్యము, స్నేహము ప్రార్థించుచున్నాము.
8. ఇంద్రావరుణులారా ! మీరు శుభంకర ఫలములను ప్రసాదించువారు. యోద్ధ యుద్దమును కోరును. అట్లే రత్నాభిలాషులగు స్తోత్రములు మిమ్ముకోరును. రక్షాలాభము కొఱకు మీ వద్దకు చేరును. పెరుగు మున్నగునవి సమకూర్చుటకు గోవు సోమము వద్ద ఉండును. అట్లే మా ఆంతరిక స్తుతులు మీ వద్ద నిలుచును.
9. ధనలాభము కొఱకు సేవకులు ధనికులవద్దకు చేరుదురు. అట్లే ధనలాభము కోరునట్టి మాస్తుతులు ఇంద్రా వరుణులను చేరును. భిక్షకస్త్రీలవలె అన్నము అడుగుచు ఇంద్రుని వద్దకు చేరవలెను.
10. ఇంద్రావరుణులు గమనశీలురు కావలెను. నూతన రక్షణయుక్తులు కావలెను. మాముందుకు అశ్వములను, ధనములను పంపవలెను. అప్పుడు మేము అప్రయత్నముగా అశ్వసమూహములకు, రథసమూహములకు, పుష్టి, నిశ్చల ధనములకు స్వాములము అగుదుము.
11. మహా మహులగు ఇంద్రావరుణులారా ! మీరు మహా రక్షణలతో విచ్చేయుడు. అన్న ప్రాపకమునకుగాను శత్రువుల ఆయుధములు క్రీడించు యుద్ధములందు మీ ఉభయుల అనుగ్రహమున జయించగలము.





