Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    బండి ఒడ్డుకు చేరిం తరవాత మళ్ళీ కట్లు కట్టారు. బండి కడిగారు. నేను మళ్ళీ బండి ఎక్కాను. అప్పటికి రెండు జాములైంది. నాకు బాగా ఆకలి వేస్తుంది. బండి మెల్లగా నడుస్తుంది. గుడారం ఎక్కడా కంటికి కనిపించలేదు. నాలుగు కోసుల తరవాత ఒక ఊరి బయటి తోట వచ్చింది. అక్కడ చిన్న చిన్న డేరాలు వేసి ఉన్నాయి. కట్టివేసిన గుర్రాలున్నాయి. మనుషులూ ఇటూ అటూ తిరుగుతున్నారు. కొందరు వంటలు చేస్తున్నారు. మా బండి ఇక్కడికి వచ్చి ఆగిపోయింది. మా వెంట ఉన్న ఆశ్వికులను చూచి ఒకడు ఎదురుగా వచ్చాడు. ఫజలలీ చెవిలో ఏదో చెప్పాడు. ఫైజలీ దగ్గరికి గుర్రాన్ని నడిపించాడు. వారిద్దరూ ఏదో మాట్లాడుకున్నారు.
    ఫైజలీ : మంచిది చూతాం. భోజనాలు కానివ్వండి.
    ఫజలలీ : అన్నాలు తినే వ్యవధి లేదు. కదలాలి.
    ఫైజలీ : మంచిది, డేరాలు పెరికి, గుర్రాలకు జీనులు కట్టండి. మనం భోజనాలు చేతాం.
    నేను బండి దిగాను. మామిడి చెట్టు కింద గుడ్డ పరచబడింది. కూర గిన్నెలు తెచ్చి పెట్టారు. రొట్టెల మడతలున్న పళ్ళాలు వచ్చాయి. నేను, ఫైజలీ , ఫజలలీ ముగ్గురం కలసి బోజనాలు చేశాం. భోజనాల సమయంలో ముఖాల మీద ఆతురత లక్షణాలు కనిపించినా హస్యంగానే గడిచింది.
    భోజనాలు పూర్తి అయ్యేవరకు గుడారాలు పెరికి గుర్రాల మీద వేశారు. జీనులు కట్టబడినాయి.
    బిడారు కదిలింది.
    రెండు మూడు కోసులు వెళ్ళి ఉంటాం. ఆశ్వికులు , పదాతులు చుట్టేశారు. ఇటు కూడా సిద్దంగా ఉన్నారు. రెండు వైపుల నుంచి తుపాకులు ప్రేలాయి. ఆ సంగ్రామంలో ఫైజలీ నా బండి చుట్టూ పట్లలోనే ఉన్నాడు. బండ్లో కూర్చొని నేను భగవంతుని ప్రార్ధిస్తున్నాను. ఎడద చేతిలో ఎగురుతుంది. కల్లోలం. అప్పుడప్పుడు తెర జరిపి చూస్తున్నాను. అదిగో వాడు చచ్చే. ఇదిగో వీడు కూలే. ఉభయ పక్షాల్లో చాలామందికి గాయాలు తగిలాయి. మావెంట యాభై , అరవై మంది ఉంటె రాజా ధ్యానసింగ్ మనుషులు అనేకులు ఉన్నారు. ఒక్కొక్కని మీద పది పది మంది పడ్డారు. ఫజలలీ, ఫైజలీ అదను కనిపెట్టి తప్పుకున్నారు. పది పన్నెండు మంది పట్టుబడ్డారు. వారిలో నేను కూడా ఉన్నాను.

                                   14


    బండివాడు కాళ్ళు వేళ్ళు పట్టుకొని విడుదల అయినాడు. గాయపడిన ఆశ్వికులను శవాలలో వదిలేసి ప్రాణాలు దక్కించుకొని బరెలీకి వెళ్ళిపోయాడు. కోట అక్కడికి నాలుగైదు కోసులుంటుంది. కొంతదూరం సాగిన తరవాత రాజాగారి మనుషులు మరి కొందరు కలిశారు. రాజావారు గుర్రం మీద ఉన్నారు. మేము వారి ముందుకు వెళ్ళాం.
    రాజా : లక్నో నుంచి వచ్చిన బీబీ ఈమేనా ?
    నేను : హుజూర్! నేరాస్తురాలినే . కాని ఆడదానికి కుట్ర, మోసం తెలియవు. ఇదంతా నాకేం తెలుసు ?
    రాజా : ఇప్పుడు తమ నిర్దోషిత్వాన్ని నిరూపించడానికి ప్రయత్నించకండి. నేరం రుజువైంది. అడిగిన ప్రశ్నలకు జవాబివ్వండి.
    నేను : అజ్ఞ
    రాజా : లక్నోలో ఇల్లెక్కడ ?
    నేను : టక్సాల్ లో .
    రాజా ( మనుషులకు సంజ్ఞ చేసి ) పక్క పల్లె నుంచి బండి తేండి. పల్లె బోగం వాళ్ళు కారు, రాత్రంతా ఎగిరి ఎగిరి పది కోసులు ఊరేగింపు వెంట తిరగడానికి. ఈమె లక్నో వేశ్య .
    నేను : సర్కారును అల్లా రక్షించుగాక!
               మనుషులు బండి  తెచ్చారు. బండి ఎక్కాను. పట్టుబడి కట్టివేయబడిన మిగతావారు మావెంట నడిచారు.
    కోటకు చేరాం. వాళ్ళను ఎక్కడికి పంపారో తెలియదు. నన్ను కోటలోకి పిలిచారు. ఉండడానికి మంచి వసతి కల్పించారు. ఇల్లు శుభ్రంగా ఉంది. ఇద్దరు సేవకులు నియమించబడినారు. చక్కని భోజనం వచ్చింది. పూరీలు, కచోరీలు, మిఠాయిలు రకరకాల ఊరగాయలు, లక్నో నుంచి బయలుదేరిన తరవాత ఇవ్వాళ మంచి భోజనం లభించింది. మర్నాడు ఉదయం భైదీలను లక్నో పంపారని తెలిసింది. జాము పొద్దెక్కిన తరవాత రాజావారు కబురంపారు.
    రాజా : మీరు విముక్తులైనారు. ఫైజూ, ఫజాలలీ ఇద్దరూ దుర్మర్గులనీ రుజువయింది. పట్టుబడినవాళ్ళను లక్నో పంపాం. అక్కడ వారు శిక్ష అనుభవిస్తారు. వాస్తవంగా మీ దోషం ఏమీ లేదు. కాని ఇకముందు ఇలాంటి వాళ్ళతో స్నేహం చేయకండి. ఇష్టమైతే మూడు నాలుగు రోజులు ఇక్కడే ఉండండి. మీరు శ్రావ్యంగా పాడుతారని విన్నాం.
    రాజావారి దగ్గర లక్నో వేశ్య ఉందనే నసీబన్ మాట గుర్తుకు వచ్చి " ప్రభువులకు ఎలా తెలిసింది?" అని అడిగాను.
    లక్నో నుంచి వచ్చిన వేశ్యను పిలిపించారు. లక్నో వేశ్య ఎవరు? ఖుర్షీద్ జాన్ ! ఖుర్షీద్ జాన్ పరిగెత్తి వచ్చి నన్ను చుట్టేసింది. ఇద్దరమూ ఏడిచాం. రాజావారి భయంతో వెంటనే విడిపోయి వారి ముందు కూర్చున్నాం. వాద్యగాళ్ళు పిలువబడినారు. విముక్తి కలిగిందని గ్రహించి ఒక గజల్ చెప్పాను. చాల చరణాలు చెప్పాను. అన్నీ గుర్తు లేవు. జ్ఞాపకం ఉన్నవి వినిపిస్తాను. రాజావారు, సభికులు ప్రతి చరణాన్ని మెచ్చుకున్నారు. ఆనందంలో మునిగిపోయారు. గజల్ ఇది :

        వలపు వేటకాని చెరనుండి విముక్తి కలుగు
        పాటలరాణి బుల్బులికి విముక్తి కలుగు
        నీవు వీడిన నీ కురులు వీడబోవు
        వలపు వంతల చిక్కిన విముక్తుడగునే?
        వలపుబంది పై వ్యాధుడు కనులేర్రజేసే
        ఇచ్చలేకున్నను మాకు విముక్తి కలిగె
        వెటగానికి నాజూకు టేడద పడదు
        ఎట్లో బాధలు బందికి విముక్తి కలిగె
         ఇహపు వ్యధలే కావు ; వేల దుఃఖాలు కలవు
        బ్రతుకు చెరనుండి ఎవనికి విముక్తి కలుగు?
        నూత్న వధువులన్న కన్ను కుట్టదెల
        ప్రియుని బంధమ్ము నుండి విముక్తి కలుగ
        వలపు వంతల నుండి విముక్తి ఎడ ? 'అదా'
        ఎవడు బాధల బంధవిముక్తుడయ్యె?
    మకుటం విని రాజావారు "'ఆదా' ఎవరి కులం పేరు ?" అని అడిగారు. "వీరిదే" అని ఖుర్షిద్ చెప్పగా రాజావారు చాల సంతోషించారు.
    రాజా : ఈ విషయం తెలుస్తే విడుదల చేసేవాళ్ళం కాము.
    నేను : గజల్ విని ప్రభువులు గ్రహించి ఉండాలి, మాకూ ఆ విషయమే విచారంగా ఉందని, కాని ప్రభువుల ఫర్మానా వెలువడింది. ఈ దాసీ విముక్తురాలైంది.
    సభ ముగిసింది. రాజావారు భోజన గృహానికి వెళ్ళిపోయారు. ఖుర్షీద్, నేనూ మాట్లాడుకున్నాం.
    ఖుర్షీద్ : చూడు అక్కా! ఇందులో నా తప్పేమీ లేదు. రాజావారికి , ఖానమ్ కు చాలారోజులు మంతనాలు సాగాయి. వీరు చాలాసార్లు పిలిపించారు. ఖానమ్ నిరాకరించింది. చివరకు అయిష్ బాగ్ జాతరలో మనుషులను పెట్టేశారు. బలవంతంగా నన్ను పట్టి తెచ్చారు. అప్పన్నించి ఇక్కడే ఉన్నాను. నాకిక్కడ సర్వసౌఖ్యాలూ ఉన్నాయి.
    నేను : ఈ పల్లె జనంతో పొద్దు ఎలా గడుస్తుంది?
    ఖుర్షీద్ : అది నిజమే. కాని నీకు నా ప్రవృత్తి తెలుసు. రోజూ ఒక కొత్తవాని దగ్గరికి వేళ్ళడమంత నీచం ఏదీ లేదు. అక్కడ అదే చేయవలసివచ్చేది. ఖానమ్ సంగతి తెలిసిందేగా! ఇక్కడంటావా. ఒక్క రాజావారితోనే పరిచయం. ఇక్కడ అంతా నా అజ్ఞా బద్దులే. రెండవది ఇది నా జన్మ భూమి. ఇక్కడ ప్రతిదీ నాకు మంచిగా కనిపిస్తుంది.
    నేను : అయితే లక్నో వెళ్ళే ఉద్దేశ్యం లేదంటావు ?
    ఖుర్షీద్ : క్షమించు. ఇక్కడ హాయిగా ఉన్నాను. నువ్వు కూడా ఇక్కడే ఉండిపోకూడదు?
    నేను : ఇక్కడ మాత్రం ఉండను. వేరే కారణాలు ఉన్నాయి.
    ఖుర్షీద్ : లక్నో వెళ్తావా ?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.