Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    ఏడవ అధ్యాయము            నాలుగవ అనువాకము

                    ముప్పది మూడవ సూక్తము

      ఋషి - వామదేవుడు, దేవత - ఋభువులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మేము యజమానులము. ఋభువులవద్దకు దూతవలె స్తుతివాక్యమును పంపుదుము. మేము వారిని సోమ ఉపస్తరణకుగాను పాడి ఆవును యాచింతుము. ఋభువులు వాయువు వంటి గమనము కలవారు. వారు లోకోపకార కార్యములు చేయువారు. వారు వేగవంతమగు అశ్వముపై క్షణమాత్రమున అంతరిక్షమున వ్యాపించగలరు.

    2. ఋభువులు తలిదండ్రులకు పరిచర్యలు చేసినారు. వారిని యువకులను చేసినారు. చమస నిర్మాణాది అన్యకార్యములను చేసినారు. సన్మానితులు అయినారు. వారికి ఇంద్రాది దేవతల మైత్రీలాభము కలిగినది. ఋభుగణములు ధీరులు. ప్రకట మనస్కులు. వారు యజమానుల కొఱకు పుష్టిని దాల్తురు.

    3. ఋభువుల తలిదండ్రులు ఎండిన పుల్లలవలె జీర్ణశరీరులు అయినారు. మంచము పట్టినారు. అట్టివారిని ఋభువులు నిత్యయవ్వనులను చేసినారు. 'వాజ', 'విభు' 'ఋభువులు' లు ఇంద్ర సహితులయి సోమపానము చేయవలెను. మా యజ్ఞము రక్షించవలెను.

    4. ఋభువులు సంవత్సర పర్యంతము చనిపోయిన గోవును కాపాడినారు. ఆ గోవు మాంసమును సంవత్సర పర్యంతము అవయవ యుక్తము చేసినారు. సంవత్సర పర్యంతము దాని శరీర సౌందర్యమును రక్షించినారు. ఈ సకల కార్యముల వలన వారికి దైవత్వము లభించినది.

    5. "ఒక చమసామును రెండు చేతము" పెద్ద ఋభువు అన్నాడు. రెండవవాడు విభు "మూడు చేతము" అన్నాడు. చివరివాడు వాజుడు "నాలుగు విధముల చేతము" అన్నాడు. ఋభువుల గురువు "త్వష్ట". అతడు ఋభువులారా చతుష్కరణరూప విద్యను అంగీకరించినాడు.

    6. మనుష్య రూప ఋభువులు సత్యము పలికినారు. ఏలననగా వారు పలికినదే అయినది. అప్పుడు ఋభువులకు తృతీయ సవనగత సుధలో భాగము లభించినది. ఎండవలె దీప్తిమంతములగు నాలుగు చమసములను త్వష్ట చూచినాడు. వాటిని కోరినాడు. అంగీకరించినవాడు.

    7. సూర్యుని గృహము దాగనిది. ఋభుగణములు ఆర్ద్రనుండి వర్షకారకములగు పన్నెండు నక్షత్రములందు సూర్యగృహమున సుఖముగా నివసించినారు. అప్పుడు వారు వర్షము కలిగించినారు. చేలను సస్యశ్యామలము చేసినారు. నదులను ప్రవహింప చేసినారు. జలరహిత స్థలములందును ఓషధులు ఫలించినవి. దిగువన నీరు చేరినది.

    8. ఋభువులు సుచక్రము మరియు చక్రవిశిష్టమగు రథమును నిర్మించినారు. విశ్వప్రేరకము, బహురూప ధేనువును ఉత్పన్నము చేసినారు.

    9. ఋభువుల అశ్వ, రథాది నిర్మాణకార్యమును దేవతలు ఆమోదించినారు. ఇంద్రాది దేవతలు వారి కార్యములకుగాను వారికి వరములు ఇచ్చినారు. ప్రసన్నులు అయినారు. శోభన వ్యవహారి కనిష్ఠ 'వాజుడు' దేవతలందరికి బంధువయినాడు. జ్యేష్ఠ 'ఋభువు' ఇంద్రునకు బంధువయినాడు. మధ్యవాడు 'విభుడు' వరుణుని బంధువయినాడు.

    10. ఋభువులు అశ్వద్వయమును ప్రజ్ఞవలనను స్తుతులద్వారాను ఉత్సాహపరచినారు. ఆ అశ్వద్వయమును ఇంద్రుని రథమునకు జతచేసినారు. అట్టి ఋభువులు మాకు శుభములు కాంక్షించవలెను. మిత్రులవలె ధనము, బలము గోవులు మున్నగు ధనమును ప్రసాదించవలెను.

    11. ఋభువులారా ! మీరు చమసాదులను నిర్మించినారు. అందుకు దేవతలు సంతసించినారు. తృతీయ సవనమున మీకు సోమపానమును, అందువలన కలుగు హర్షమును ప్రసాదించినారు. దేవతలు తేజోయుక్తులనుకాక మరొకరిని మన్నించరు. ఈ తృతీయ సవనమున నిశ్చయముగా మాకు ధనము దానము చేయుడు. 


                          ముప్పది నాలుగవ సూక్తము

      ఋషి - వామదేవుడు దేవత - ఋభువులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఋభు, విభు, వాజ, ఇంద్రులారా ! రత్నదానము చేయుటకుగాను మీరు మా యజ్ఞమునకు విచ్చేయుడు. నేడు వాగ్దేవి మీకు సోమాభిషవ సంబంధ ప్రీతిని ప్రదానము చేయనున్నది. కావున మీకు సోమజనిత హర్షము కలుగును.

    2. ఋభువులారా ! మీరు అన్నమువలన శోభించువారు. ముందు మానవులుగా జన్మించినారు. అనంతరము మీకు దేవత్వము ప్రాప్తించినది. ఇప్పుడు మీరు దేవతల సహితముగా ఆనందించుడు. హర్షకారకమగు సోమము, స్తుతులు మీ కొఱకు ఏకత్రితమైనవి. మీరు మా కొఱకు పుత్ర, పౌత్ర విశిష్ట ధనమును ప్రేరేపించుడు.

    ఋభువులారా ! ఈ యజ్ఞము మీ కొఱకు చేయబడుచున్నది. మీరు మానవులవలె దీప్తిశాలురయి యజ్ఞమునకు విచ్చేయుడు. సోమము మీవద్దకు చేరును. మీరు ప్రథమ ఉపాస్యులు "అగ్రియోతవాజాః"

    3. ఋభువులారా ! మీ అనుగ్రహమున ఈ తృతీయ సవనము రత్నదానయోగ్యుడు, పరిచర్యకారి, హవ్యదాత యజమాని కొఱకు కావలెను. ఈ తృతీయ సవనమున మీ హర్షోల్లాసమునకుగాను విశేషసోమము సమర్పించుచున్నాము. మీరు ఆ సోమమును పానము చేయగలరు.

    4. ఋభువులారా ! మీరు నేతలు. మహా ధనమును స్తుతించుచు మా వద్దకు విచ్చేయుడు. దివసాంతమున కొత్తగా ఈనిన ఆవులు ఇంటిదోవ పట్టును. అట్లే తృతీయ సవనమున ఈ సోమరసము పానము కొఱకు మీ వద్దకు చేరును.

    5. బలవంతులారా ! మిమ్ము స్తోత్రముల ద్వారమున ఆహ్వానించుచున్నాము. ఈ యజ్ఞమునకు విచ్చేయుడు. మీరు ఇంద్ర సంబంధులు, మేధావులు. ఇంద్ర సహితులయి ప్రీతులగుదురు. మీరు ఇంద్రసహితులయి రత్నదానము చేయుచు, మధుర సోమరస పానము చేయండి.

    6. ఇంద్రా ! నీవు వరుణుని వెంట సోమప్రీతి యుక్తుడయి సోమపానము చేయుము. స్తుతి యోగ్యుడవగు ఇంద్రా ! నీవు మరుత్తులవెంట ప్రథమ పానకారులు, రత్నదాతలు ఋభువుల వెంట, దేవ పత్నుల వెంట సోమపానము చేయుము.

    7. ఋభువులారా ! ఆదిత్యులతోకలసి ఆనందించుడు. పర్వములందు అర్చమాన దేవనిశేషుల వెంట దేవతల హితకరుడు సవితవెంట రత్నదాతలు నద్యాభిమానులగు దేవతలతో కలిసి ఆనందించండి.

    8. ఋభువులారా ! మీరు రథ నిర్మాణాది కార్యములతో అశ్వద్వయమును ప్రీతిల్ల చేసినారు. మీ తలిదండ్రులను యవ్వనులను చేసినారు. గోవును, అశ్వమును నిర్మించినారు. దేవతల కొఱకు 'అంసత్రా', కవచమును సిద్ధముచేసినారు. ద్యావాపృథ్వులను విడగొట్టినారు. మీరు వ్యాప్తులు, నేతలు, సుందర అపత్యప్రాప్తి సాధనరూప. కార్యములు నిర్వహించినారు.

    9. ఋభువులారా ! సోమపానమునకు మీరే ప్రథమ స్థానము.

    10. ఋభువులు గోవిశిష్టులు. అన్నవిశిష్టులు. పుత్ర పౌత్ర విశిష్టులు. నివాసయోగ్య గృహాది ధనయుక్తులు. బహు అన్నవంతులు, ధనప్రశంసకులు. ప్రథమ సోమపానకారులు. వారు తృప్తి చెందవలెను. మాకు ధనదానము చేయవలెను.

    11. ఋభువులారా ! మీరు వెళ్లిపోవద్దు. మీకు అలసట కలుగనీయుము. మీరు ఆనందితులగుడు. రమణీయ ధనదానము చేయుటకుగాను ఈ యజ్ఞమున ఇంద్రసహితులయి హృష్టులు కండు. మరుత్తులతోను, అన్యోన్య దీప్తిమంత దేవతల సహితులయి హృష్టులు కండు.

                          ముప్పది అయిదవ సూక్తము

        ఋషి - వామదేవుడు దేవత - ఋభువులు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. బలపుత్రులు, సుధన్వపుత్రులగు ఋభువులారా ! మీరందరు ఈ తృతీయ సవనమునకు విచ్చేయుడు. వెనుకాడరాదు. ఈ సవనమున మాదకసోమము రత్నదాత ఇంద్రుని పిదప మీవద్దకు చేరవలెను.

    2. ఋభువులారా ! మీరు కార్యము సాధించు తలంపున మీ హస్త నైపుణ్యమున ఒక చమసమును చతుర్థ (నాలుగు)గా చేసినారు. అభిషుత సోమపానము చేసినారు. మీ రత్నదానము ఈ తృతీయ సవనమున నన్ను చేరవలెను.

    3. ఋభువులారా ! మీరు చమసమును చతుర్థము చేసినారు. అప్పుడు "మిత్రమా ! అగ్నీ ! అనుగ్రహించుము" అన్నారు. అంతట అగ్ని అన్నారు :-

    "వాజగణమా ! ఋభుగణమా ! మీరు హస్తకుశలురు, మీరు అమరత్వ స్వర్గ మార్గమున పయనించుడు"

    4. ఋభువులు తమ హస్త కౌశలమున చమసమును నాలుగు చేసినారు. ఆ చమసము అటువంటిది? ఋత్విక్కులారా ! హర్షమునకుగాను సోమాభిషము చేయుడు. ఋభువులారా ! మీరు మధుర సోమరసపానము చేయుడు.

    5. ఋభువులారా ! మీరు రమణీయ సోమవంతులు. మీరు కర్మద్వారా మాతాపితరులను యవ్వనులను చేసినారు. కర్మ ద్వారా చమసమును దేవపాన యోగ్యము చేసినారు. కర్మ ద్వారా శీఘ్రగామి ఇంద్రునకు అశ్వద్వయమును సమకూర్చినారు.

    6. ఋభువులారా ! మీరు అన్నవంతులు. మీకు హర్షము కలిగించుటకుగాను యజమాని సాయంత్రము తీవ్ర సోమమును అభిషవించును. మీరు దానిని స్వీకరించుడు. హృష్టులు కండు. యజమానికి బహుపుత్రయుక్త ధనమును సమకూర్చుడు.

    7. హరి విశిష్ట ఇంద్రా ! ఉదయ సవనమున అభిషుత సోమపానము చేయుము. మధ్యాహ్న సవనము కేవలము నీదే అగును. శోభన కర్మల వలన నీవు మైత్రి చేసిన రత్నదాతలగు ఋభువులవెంట సాయం సవనమున సోమపానము చేయుము.

    8. ఋభువులారా ! మీరు సత్కార్యములు చేసి దేవతలయినారు. శ్రేనమువలె ద్యులోకమున నిలవండి. ధనదానము చేయండి. సుధన్వ పుత్రులారా ! మీరు అమరులు. "సుధన్వానా అభవత్కా మృతాసః"

    9. సుహస్తులగు ఋభువులారా ! తృతీయ సవనము సోమదాన యుక్తము. మీరు దానిని మీ శోభన కర్మయుక్తము చేసి అలంకరించుడు. విచ్చేయుడు. ఉన్మత్త ఇంద్రియములతో అభిషుత సోమపానము చేయుడు. "మదేభిరిన్ద్రియేభిః పిబధ్వమ్"

                             ముప్పది ఆరవ సూక్తము

 ఋషి - వామదేవుడు, దేవత- ఋభువులు ఛందస్సు - 9 త్రిష్టుప్, మిగిలినవి జగతి.

    1. ఋభువులారా ! మీ కార్యములు స్తుతియోగ్యములు. మీరు అశ్వినులకు రథము ఇచ్చినారు. అది మూడు చక్రములది. గుఱ్ఱములు, పగ్గములు లేక అంతరిక్షమున విహరించును. అది ఘనకార్యము. దానివలనను రథ నిర్మాణ రూప మహత్కార్యము వలనను మీ దేవత్వము ప్రఖ్యాతమయినది.

    2. ఋభువులారా ! మీరు నిర్మల అంతఃకరణులు. మీరు మీ ఆలోచనతో సువర్తన చక్రముగల అకుటిల రథమును నిర్మించినారు. మేము, మిమ్ము సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.

    3. వాజ, ఋభు, విభువులారా ! మీ వృద్ధులు, జీర్ణ దేహులగు మాతా పితరులను నిత్యయవ్వనులను సంచలనశీలురను చేసినారు. మీ యొక్క ఆ మహాత్మ్యము దేవతలలో ప్రఖ్యాతమయినది.

    4. ఋభువులారా ! మీరు ఒక్క చమసమును నాలుగు భాగములుగా విభజించినారు. గోవును చర్మమున పూరించినారు. అందువలననే మీరు దేవతలందు అమరత్వము పొందినారు. మీ ఈ కార్యములు ప్రశంసనీయములు.

    5. వాజులతో ఋభువులు విఖ్యాతులు. వారు సృష్టించిన ధనము ప్రధానము. అధిక అన్న విశిష్టము. ఆ ధనము ఋభువులవద్ద నుండి మా వద్దకు రావలెను. ఋభువులు చేసిన రథము యజ్ఞమున విశేషరూపమున ప్రశంసనీయము.

    6. వాజి, విభు, ఋభువులు రక్షించినవాడు బలవంతుడు, రణకుశలుడు అగును. అతడు ఋషియై స్తుతియుక్తుడు అగును. శూరుడయి శత్రువులను జయించును. యుద్ధమున దుర్దర్శుడు అగును. ధనము, పుష్టి, పుత్ర పౌత్రాదులు కలవాడు అగును.

    7. ఋభువులారా ! మీరు అత్యుత్కృష్ట దర్శనీయ రూపములు ధరింతురు. మేము మీ కొఱకు యోగ్యమగు స్తవమును రచించినాము. మీరు దీనిని స్వీకరించుడు. మీరు ధీమంతులు. కవులు. జ్ఞానవంతులు. స్తోత్రములను మేము మీకు నివేదింతుము.

    8. ఋభువులారా ! మా స్తుతుల కొఱకుగాను మీరు మానవులకు హితకరములగు సమస్త పదార్థములను తెలిసికొని వానిని పూరింపుడు. మాకు దీప్తిమంతము, బలవర్థకము మరియు బలవంతుడైన శత్రుశోషకమగు ధనమును, అన్నమును సమకూర్చుము.

    9. ఋభువులారా ! మీరు మా యజ్ఞమునకు ప్రీతి పూర్వకముగ విచ్చేయుడు. మాకు పుత్ర,పౌత్రాదులను, యజ్ఞధనమును, భృత్యాదియుక్త యశస్సంపదను సమకూర్చుడు. మేము ఇతరులను అతిక్రమించగల రమణీయ అన్నమును ప్రసాదించుడు.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.