Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

    నేను : అవును.
    నసీబన్ : చక్కని తోవ వదిలి ఇటేందుకు వచ్చావు ? నృపత్ గంజ్ నుంచి ఉనావ్ వెళ్ళాల్సింది.
    నేను : వీరికి రాయ్ బరేలీలో పని ఉంది.
    నసీబన్ : ఇటు తోవలేమీ బాగా లేవు. దొంగల భయానికి రాకపోకలు నిలిచిపోయాయి.  పుల్యా అడవిలో వందల మందిని దోచుకున్నారు. ఉనావ్ కు అటు నుంచే వెళ్ళాలి. ఉన్నది ముగ్గురు. అందులో ఒక ఆడది. ఆమెలో నగలు కూడా ఉన్నాయి. అక్కడ పెళ్ళి వాళ్ళనే దోచేస్తారు.
    నేను : నొసటి వ్రాత ఏం చేస్తాం ?
    నసీబన్ : గట్టి గుండెదానివే.
    నేను : మరేం చేయను ?
    తరవాత ఆ మాట, ఈ మాట మాట్లాడాం. అవి అంత ముఖ్యం అయినవి కావు. నాకు జ్ఞాపకమూ లేదు. " ఆ నువ్వెక్కడికి ?" అని అడిగాను.
    నసీబన్ : మేము యాచన (గదాయీ) కు బయలుదేరాం.
    నేను : అర్ధం కాలేదు.
    నసీబన్ : ఏమీ గదాయీ తెలియదూ ? యెంత పతివ్రతవు!
    నేను : నాకేం తెలుసు అక్కా ? "గదాయీ " బిచ్చమెత్తడాన్ని అంటారు.
    నసీబన్ : మా పగవాళ్ళు బిచ్చమెత్తుకొనీ.
    నేను : నాకు తెలియదు "గదాయీ " దేన్నంటారో?
    నసీబన్ : ఏడాది కొకసారి ఇల్లు విడిచి మేము పల్లె పల్లె తిరుగుతాం. అమీర్లు, నవాబుల ఇండ్లలో దిగుతాం. వారు మా అదృష్టాన్ని బట్టి ఏదో ఒకటి ఇస్తారు. ఒకచోట కచేరి జరుగుతుంది. ఒకచోట జరగదు.
    నేను : అయితే దాన్ని "గదాయీ " అంటారు.
    నసీబన్ : ఆ ఇప్పుడు అర్ధమైందా ?
    నేను : ఇక్కడ ఎవరైనా అమీరు దగ్గరికి వచ్చారా?
    నసీబన్ : ఇక్కడికి దగ్గర్లో రాజా శంభూ ధ్యాన్ సింగ్ కోట ఉంది. అక్కడికి వెళ్ళాను. వారికి మహారాజు ఫర్మానా అందింది. బందిపోటు విషయంలో బందోబస్తు చేయవలసిందని, వారు ఆ పనిలో వెళ్ళిపోయారు. చాలారోజులు ఉన్నాను. తుదకు విసిగి వచ్చేశాను. ఇక్కడికి రెండు కేసుల్లో 'సమర్ యహా" అనే ఊరుంది. అక్కడ పిన్ని ఉంటుంది. ఆవిడ దగ్గరికి వెళ్తాను.
    నేను : అక్కణ్నుంచి?
    నసీబన్ : అక్కడనే ఉంటాను. రాజాగారు వచ్చిన తరవాత కోటకు వెళ్తాను. ఇంకా చాలామంది వారి కోసం అక్కడే మకాం వేసి ఉన్నారు.
    నేను : రాజాగారికి ఆటపాటల్లో అభిరుచి ఉందా?
    నసీబన్ : ఉండేది.
    నేను : ఏమి? ఇప్పుడేమైంది ?
    నసీబన్ : లక్నో నుంచి ఒక వేశ్యను తెచ్చి పెట్టుకున్నారు. అప్పటి నుంచి మమ్ములను లెక్కే చేయడం లేదు.
    నేను : ఆ వేశ్య పేరేమి ?
    నసీబన్ : గుర్తు లేదు. ముఖం చూశాను. ఎర్రగా ఉంటుంది. ముక్కూ ముఖం బాగానే ఉంటాయి.
    నేను : బాగా పాడుతుందా ?
    నసీబన్ : మన్ను. పాట గీటా రాదు. ఏదో కొద్దిగా ఆడుతుంది. రాజాగారు ఆవిడ చేతి బొంగరం.
    నేను : ఆవిడ వచ్చి ఎంతకాలం అయింది ?
    నసీబన్ : ఆరు నెలలు అయి ఉంటుంది .
                 రాత్రికి  ఫైజాలీతో దోవ బాగులేదనే విషయం చెప్పాను. " ధైర్యంగా ఉండు. కట్టుదిట్టాలు చేశాం." అన్నాడు.

                                                                13


    రెండవరోజు వేకువన బయలుదేరాం. నసీబన్ బండి మా వెనక ఉంది. నసీబన్ నేనూ మాట్లాడుకుంటున్నాం. కొంతదూరం వెళ్ళిన తరవాత సమర్ యహా వచ్చింది. నసీబన్ మాకు దూరం నుంచి ఆ ఊరు చూపింది. బాట పక్కన పొలాలున్నాయి. కొందరు కన్యలు నీరు పెడ్తున్నారు. కొందరు పొలంలో పనిచేస్తున్నారు. చీరకట్టిన బలిష్టమైన ఒక స్త్రీ దున్నుతుంది. నసీబన్ వాళ్ళను చూపి అంతా వేశ్యలని చెప్పింది. మంచి వృత్తే అనుకున్నాను. మగవాళ్ళ కంటే ఎక్కువ కష్టపడుతున్నారు. వేశ్యలేందుకు కావలసివచ్చిందో అర్ధం కాలేదు. వీళ్ళ ముఖాలు మాత్రం కష్టపుపనులకు తగి ఉన్నాయి. లక్నోలో తిరిగి అమ్మే పిడకల వాళ్ళలానూ, పాలు పెరుగు అమ్మేవాళ్ళలానూ ఉన్నారు. నసీబన్ ఇక్కడి నుంచి విడిపోయింది.
    రెండు కోసలు పోయిన తరవాత ఒక పల్లం వచ్చింది. అక్కడక్కడ అడవి, పెద్దపెద్ద గుహలు, ఎదురుగా ఏటి ఒడ్డు కనిపించాయి. రెండు వైపుల దూరం వరకు దట్టమైన చెట్ల బారులు. అక్కడికి చేరేవరకు బాగా పొద్దెక్కింది. ఈ బాటన మేము తప్ప ఎవరూ కనిపించలేదు. నలువైపులా శూన్యం. నిశ్శబ్దం. ఏటి దరికి వచ్చాం. నేను వారిస్తున్నా ఫైజలీ గుర్రాన్ని ముందుకు సాగించాడు. చూస్తూ చూస్తుండగానే చాలా దూరం వెళ్ళిపోయాడు. తరవాత గుర్రం కనిపించలేదు.
    మా బండి సాగుతుంది. సైసువాడు గుర్రం వెనక పరిగెత్తాడు. మిగిలింది నేను, బండి మనిషి, ఇంతలో పది, పదిహేను మంది పల్లీయిలు బండి వైపు పరిగేత్తుకొని వస్తున్నట్లు కనిపించింది. రక్షించమని మనసులో భగవంతుని వేడుకున్నాను. క్షణంలో పల్లీయిలు వచ్చి బండి చుట్టేశారు. అందరి చేతుల్లోనూ కత్తులూ, కటార్లు ఉన్నాయి. భుజాలకు తుపాకులు వ్రేలాడుతున్నాయి.
    పల్లీయుడు : (బండి వానితో ) అపు బండిని, ఎవరున్నారు బండ్లో ?
    బండి మనిషి : రావడం బరేలీ నుంచి. ఉనావ్ దాకా బాడుగ చేసుకున్నారు.
    పల్లీయుడు : అపు బండిని.
    బండి మనిషి : ఎందుకాపాలి? ఖాన్ సాహెబ్ జనానా ఉంది.
    పల్లీయుడు : వెంట మగవారెవరూ లేరా ?
    బండి మనిషి ; ముందుకు సాగిపోయారు. వస్తూ ఉండవచ్చు.
    పల్లీయుడు :" దిగు బీబీ బండ్లో నుంచి.
    ఒకడు : పరదా తీసి లాగండి . బోగందేగా పరదా ఏమిటి ?
    ఒక పల్లెవాడు ముందుకు వచ్చి తెర తీసి నన్ను దింపాడు. ముగ్గురు మనుషులు నన్ను చుట్టేశారు. ఇంతలో నదివైపు దుమ్ము లేచింది. గుర్రాల డెక్కల ధ్వని వినిపించింది. గుర్రాలు దగ్గరికి వచ్చాయి. ముందు ఫైజలీ గుర్రం కనిపించింది. వెనుక మరో పదిహేను మంది గుర్రాల వాళ్ళున్నారు. గుర్రాలను చూడగానే పల్లెవాళ్ళు తుపాకులు పేల్చారు. ఇద్దరు గుర్రాలవాళ్ళు పడిపోయారు. గుర్రాల వాళ్ళు నెత్తి మీదికి వచ్చేశారు. ఒరల్లోంచి కత్తులు బయటికి వచ్చాయి. వీళ్ళు కూడా కత్తులు లాగారు. ఒకటి రెండు దాడులలోనే పల్లెవాళ్ళు ముగ్గురు గాయపడి పడిపోయారు. ఆశ్వికుడు కూడా ఒకడు పడిపోయాడు. పల్లెవాళ్ళు పారిపోయారు.
    నేను మళ్ళీ బండి ఎక్కాను. గాయపడిన ఆశ్వికునికి కట్లు కట్టి బండి ఎక్కించారు. బండి సాగింది. ఆశ్వికులు బండికి ఇరువైపుల ఇద్దరు , వెనుక కొందరు, ముందు కొందరు నడిచారు.
    ఫైజలీ : (సహచరునితో) భాయీ! లక్నో నుంచి బయటపడ్డం కుదరలేదు. కష్టంగా ప్రాణాలతో వచ్చేశాను ఎలాగో.
    ఫజలలీ : విలాసాల్లో పడిపోయాననవు.
    ఫైజలీ : అవును. నువ్వు అంతకన్నా ఏమంటావు ?
    ఫజలలీ : అనడమేమీ ? వెంటనే ఉందిగా ! వదినగారిని మేము చూడరాదా?
    ఫైజలీ : మీ ముందు తెర ఏమి? చూడండి .
    ఫజలలీ: గుడారం చేరిం తరవాత చూస్తాను.
    ఇంతలో బండి ఏటిఒడ్డుకు చేరింది. ఒద్దు చాలా మిట్టగా ఉంది. నేను దిగి నడవాల్సివచ్చింది. కష్టంగా బండి గట్టెక్కింది. బండి కుదుపునకు గాయపడిన ఆశ్వికుని గాయాలు విచ్చుకున్నాయి. బండి నిండా రక్తం.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.