Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    6. ఇంద్రా ! 'ఏతశు'ని కొఱకు యుద్ధమున సూర్యుని హింసించినావు. ఆ యుద్ధమున 'ఏతశు' ని రక్షించినావు.

    7. ఇంద్రా ! ఆవరించిన అంధకారమును హతమార్చినావు. తదనంతరము నీవు క్రోధవంతుడవు అయినావా? ఈ అంతరిక్షమున, పట్టపగలు, నీవు దాసుపుత్రుడు వృత్రుని వధించినావు.

    8. ఇంద్రా ! నీవు బలమును సమర్థయుక్తము చేసినావు. హననాభిలాషిణి, ద్యులోక దుహిత ఉషను వధించినావు.

    9. ఇంద్రా ! నీవు ద్యులోక దుహిత, పూజనీయ ఉషను పిండికొట్టినావు.

    10. అభీష్టవర్షీ ! ఇంద్రా ! నీవు ఉష శకటమును భగ్నపరచినావు. అప్పుడు ఉష భీతిల్లినది. విరిగిన రథమునుంచి దూకినది.

    11. ఇంద్రుడు చూర్ణము చేసిన ఉష రథము 'విపాశ' నదీతీరమున కూలినది. శకటము విరిగిపడగా ఉష దూరదేశమునకు పారిపోయినది.

    12. ఇంద్రా ! నీవు నీ బుద్ధిబలమున సమస్త జలములను ప్రవహించు నదులను భూమిమీద స్థాపించినావు.

    13. ఇంద్రా ! నీవు వర్షకారివి. నీవు 'శుష్ణు' ని నగరములను ధ్వంసము చేసినావు. అతని ధనమును దోచినావు.

    14. ఇంద్రా ! నీవు 'కులితర' పుత్రుడు దాసుడగు శంబరుని అనేకపర్వతముల మీదినుంచి బోర్లపడవేసి చంపినావు.

    15. ఇంద్రా ! చక్రపు చతుర్దిక్ స్థిత శంకువలె ఉండిన 'విర్చి' దాసుని చతుర్థిక్ స్థిత అయిదువందల వేల సంఖ్యగల అనుచరులను విశేషరూపమున వధించినావు.

    16. శతక్రతువగు ఇంద్రుడు 'అగ్రు' పుత్రుడు 'పరావృతు'ని స్తోత్ర భాగస్వామిని చేసినాడు.

    17. యయాతి శాపమున అనభిషక్తులయిన ప్రసిద్ధరాజులు 'యదు, తుర్వసు' లను శచీపతి, విద్వాంసుడగు ఇంద్రుడు అభిషేక యోగ్యులను చేసినాడు.

    18. ఇంద్రా ! నీవు 'సరయు' నదికి ఆవల ఉండు ఆర్యత్వాభిమాని 'అర్ణ', 'చిత్రరథ' నామక రాజులను వధించినావు.

    (ఆర్యత్వాభిమానినౌ సన్తావపి ఇంద్ర విషయభక్తిశ్రద్ధా రహితా విద్యర్థః అని శాయణుడు. ఆర్యత్వ అభిమానులే అయినప్పటికి ఇంద్రుని విషయమున భక్తిశ్రద్ధలు లేనివారని అర్థము)

    19. వృత్రహంతా ! బంధువులు సహితము వదులుకున్న గ్రుడ్డి, కుంటివానికి కళ్లు, కాళ్లు ప్రసాదించినావు. నీవు ప్రసాదించిన సుఖమును నివారించగలవాడు లేడు.

    20. ఇంద్రుడు హవ్యదాత, యజమాని దివోదాసునకు శంబరుని పాషాణ నిర్మిత శతసంఖ్యాక నగరములను ఇచ్చినాడు.

    21. ఇంద్రుడు దభీతికొఱకుగాను తన స్వశక్తితో ముప్పదివేల రాక్షసులను ఆయుధములతో హతమార్చినాడు.

    22. ఇంద్రా ! నీవు ఈ సమస్త శత్రువులను పరాజితులను చేసినావు. శత్రుహింసక ఇంద్రా ! నీవు గోవులను పాలించువాడవు. నీవు యజమానులందరకు సమానముగ ప్రఖ్యాతుడవు.

    23. ఇంద్రా ! నీవు నీ బలమును సమర్థయుక్తము చేసినావు. అందువలన నేటికిని ఎవ్వడును నీ బలమును బాధించలేడు.

    (సామర్థ్యములేని బలము నిరర్థకము అనుచున్నాడు)

    24. శత్రు వినాశక ఇంద్రా ! అర్యమ నీకు మనోహర ధనమును దానము చేయవలెను. దంతహీన పూష నీకు మనోహర ధనమును దానము చేయవలెను. భగుడు నీకు మనోహర ధనమును దానము చేయవలెను.


                            ముప్పది ఒకటవ సూక్తము

 ఋషి - వామదేవుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు -3 పాదివిచ్, మిగిలినవి గాయత్రి.

    1. సర్వదా వర్థమానుడవు, పూజనీయుడవు, మిత్రభూషితుడవగు ఇంద్రా ! ఏ తర్పణము నిన్ను మాకు అభిముఖముగా తీసికొనిరాగలదు? ఎట్టి ప్రజ్ఞాయుత శ్రేష్ఠ కర్మ నిన్ను మాకు అభిముఖముగా తీసికొని వచ్చును?

    2. ఇంద్రా ! పూజనీయము, సత్యభూతము, హర్షకారక సోమములందు ఏ సోమరసము నిన్ను శత్రుధనము నష్టపరచుటకు సన్నద్ధము చేయును?

    3. ఇంద్రా ! నీవు స్నేహ స్వరూపులగు స్తోతలకు రక్షకుడవు. నీవు అనేక రక్షణలయుక్తుడవయి మాముందునకు విచ్చేయుము.

    4. ఇంద్రా ! మేము నీ అనుయాయులము. నీవు మానవుల స్తుతులకు ప్రసన్నుడవు అగుము. మా వద్దకు వృత్తాకార చక్రమువలె విచ్చేయుము.

    5. ఇంద్రా ! నీవు యజ్ఞమునకు నీ స్థానమును తెలిసి విచ్చేతువు. మేము సూర్యసహితముగ నిన్ను భజింతుము.

    6. ఇంద్రా ! మేము రచించిన స్తుతులు చేసిన సత్కర్మలు ముందునీకు చెందును. అనంతరము సూర్యునకు చెందును.

    7. ఇంద్రా ! నీవు కర్మపాలకుడవు. జనులు నిన్ను ధనవంతుడవు, స్తోతలకు అభీష్టప్రదుడవు, దీప్తిమంతుడవు అందురు.

    8. ఇంద్రా ! స్తుతికర్తలు సోమాభిషవ కర్తలగు యజమానులకు క్షణమాత్రమున ధనప్రదానము చేతువు.

    9. ఇంద్రా ! బాధక రాక్షసాదులు నీ "శతంచనరాధః" శతపరిమిత ధనమును నివారించజాలరు. శత్రువులను హింసించు నీ బలమును నివారించజాలరు.

    10. ఇంద్రా ! నీ శతసంఖ్యాక, సహస్రసంఖ్యాక రక్షణలు నీ అభిమానము మమ్ము రక్షించవలెను.

    11. ఇంద్రా ! నీవు ఈ యజ్ఞమున మమ్ము నీ మిత్రులను అవినాశ్యము, దీప్తిమంతమగు ధనమునకు భాగస్వాములను చేయుము.

    12. ఇంద్రా ! నీవు నిత్యము మమ్ము మహాధనము ద్వారా రక్షింపుము. నీ సమస్త రక్షణలతో రక్షింపుము.

    13. ఇంద్రా ! నీవు శూరునివలె నూతన రక్షణద్వారా మా గోవులను, గోవుల నివాస స్థానములను వర్థిల్లచేయుము.

    14. శత్రునివారకము, దీప్తిమంతము, వినాశరహితము, గోయుక్తము, అశ్వయుక్తమగు ఇంద్రుని రథము సర్వత్ర సంచరించవలెను. ఆ రథ సహితముగా, ఇంద్రా ! మమ్ము రక్షింపుము.

    15. సర్వప్రేరక ఆదిత్యా ! నీవు సేచన సమర్థమగు ద్యులోకమును ఉపరితలమున స్థాపించినావు. అట్లే దేవతలలో మా యశస్సును ఉన్నతము చేయుము.

                         ముప్పది రెండవ సూక్తము

  ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, అతని అశ్వద్వయము, ఛందస్సు - గాయత్రి.

    1. ఇంద్రా ! నీవు ఘనుడవు. శత్రుహింసకుడవు. నీవు త్వరత్వరగా మావద్దకు విచ్చేయుము. మహారక్షణల యుక్తుడవయి మా వద్దకు విచ్చేయుము.

    2. ఇంద్రా ! నీవు పూజనీయుడవు. భ్రమణశీలుడవు. మాకు అభీష్ట ప్రదాతవు. విచిత్ర కర్మ యుక్తులు జనులు. వారి రక్షణకుగాను నీవు ధనమును ప్రసాదించుము.

    3. ఇంద్రా ! నీ సాంగత్యముగల కొద్దిమంది యజమానుల ఉత్పాతకారకులు, వర్థమానులగు శత్రువులను నీ బలమున నష్టపరతువు.

    4. ఇంద్రా ! మేము యజమానులము. నీ సాంగత్యముగలవారలము. మేము నిన్ను అత్యధికముగా స్తుతింతుము. నీవు మా అందరిని విశేషరూపమున రక్షింపుము.

    5. వజ్రధర ఇంద్రా ! నీవు మనోహరము, అనిందితము, అప్రతిహతమగు రక్షణలతో మావద్దకు విచ్చేయుము.

    6. ఇంద్రా ! మేము నీవంటి గోయుక్త దేవతల సఖులము. విశేష అన్నమునకుగాను నీతో కూడుదుము.

    7. ఇంద్రా ! నీవు ఒక్కడవే గోయుక్త అన్నమునకు స్వామివి. కావున మాకు అశేష అన్నము ప్రసాదించుము.

    8. స్తుతియోగ్యుడవగు ఇంద్రా ! నీవు స్తుతుడవు అగుదువు. స్తోతలకు ధనము ప్రసాదించవలెను అనుకొందువు. అప్పుడు ఏ ఒక్కడు దానిని అడ్డజాలడు.

    9. ఇంద్రా ! నీవే లక్ష్యముగా గోతమ నామక ఋషి-తనకు విశేష అన్నము, ధనమునకుగాను స్తుతివాక్యముల ద్వారా నిన్ను స్తుతించినాడు.

    10. ఇంద్రా ! నీవు సోమపానము చేతువు. హృష్టుడవగుదువు. అసురుల సమస్త నగరములకు చేరుదువు. వానిని భగ్నము చేయుదువు. ఇంద్రా ! స్తోతలమగు మేము అదిగో అదే నీ వీర్యమును కీర్తింతుము.

    11. ఇంద్రా ! నీవు స్తుతియోగ్యుడవు. నీవు విశేష బలమును ప్రదర్శించినావు. ప్రాజ్ఞులు సోమాభిషవానంతరము అట్టి నీయొక్క విశేషబలములను సంకీర్తన చేయుదురు.

    12. ఇంద్రా ! గోతమగణములు స్తోత్రవాహకులు. వారు స్తోత్రముల ద్వారా నిన్ను వర్థిల్లసేతురు. వారికి పుత్ర, పౌత్రాదియుక్తమగు అన్నమును దానము చేయుము.

    13. ఇంద్రా ! నీవు సర్వ యజమానులకు సామాన్య దేవతవు. అయినను స్తోతలము నిన్ను ఆహ్వానింతుము.

    14. నివాసప్రద ఇంద్రా ! మాయజమానుల అభిముఖముగా విచ్చేయుము. నీవు సోమరూప అన్నమున హృష్టుడవగుము.

    15. ఇంద్రా ! మేము నీ స్తోతలము. మా స్తోత్రములు నిన్ను మా వద్దకు తేవలెను. నీ అశ్వద్వయమును మాకు అభిముఖముగా తిప్పుము.

    16. ఇంద్రా ! నీవు మా పురోడాశమును భక్షింపుము. స్త్రీ లోలుడు స్త్రీల మాటలనే సేవించును. అట్లే నీవు మా స్తుతి వాక్యములను సేవింపుము.

    17. మేము స్తోతలము. ఇంద్రుని వద్దకు చేరినాము. శిక్షితములు, శీఘ్రగాములు, సహస్రసంఖ్యాక అశ్వములను యాచించుచున్నాము. శతసంఖ్యాక సోమకలశములను యాచించుచున్నాము. అపరిమిత కలశ యజ్ఞమును యాచించుచున్నాము.

    18. ఇంద్రా ! మేము నీ శత-సహస్ర సంఖ్యాక గోవులను మావైపు మళ్లింతుము. మాకు ధనము నీవద్ద నుంచే రావలెను.

    19. ఇంద్రా ! మేము నీనుంచి నూరుకుండల బంగారము తీసికొందుము. శత్రుహింసక ఇంద్రా ! నీవు సహస్రప్రదుడవు అగుదువు.

    20. ఇంద్రా ! నీవు బహుప్రదుడవు. నీవు మాకు మరింత ధనము దానము చేయుము. అల్పధనము ఇవ్వకుము. నీవు మాకు విశేష ధనము ఇవ్వ ఇచ్చగింతువు. కావున నీవు విశేష ధనము తీసికొని రమ్ము.

    21. వృత్రహంత ఇంద్రా ! నీవు బహుప్రదుడవు. అనేకమంది యజమానులలో విఖ్యాతుడవు. నీవు మమ్ము ధనభాగస్వాములను చేయుము.

    22. ప్రాజ్ఞుడవగు ఇంద్రా ! మేము నీ పింగళ వర్ణ అశ్వద్వయమును ప్రశంసింతుము. గోప్రదా ! నీవు స్తోతలను నష్టపరచవు. నీవు నీ అశ్వద్వయమున మా గోవులను నష్టపరచకుము.

    23. ఇంద్రా ! నీ అశ్వద్వయము దృఢము, నవము, క్షుద్రద్రుమాఖ్య స్థానమున నిలిచిన అందమయిన సాలభంజికలవంటిది. నీ పింగళవర్ణ అశ్వద్వయము యజ్ఞమున శోభిల్లును.

    24. ఇంద్రా ! మేము ఎద్దులబండి మీద వెళ్లినను, పాదచారులమయినను నీ అహింసక పింగళవర్ణ అశ్వద్వయము మాకు శుభంకరము కావలెను.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకము, నాల్గవ మండలమున ఆరవ అధ్యాయము సమాప్తము)




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.