Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
ఎందుకో గాని ఆరోజు బువాహుసేనీ కూడా మొండి కేత్తింది.
హుసేనీ : అంత ఉన్నదానివి అయితే ఇచ్చేయి.
నేను : సాయంకాలం ఇస్తాను.
హుసేనీ : అక్కడ వారు వచ్చి కూర్చుని ఉన్నారు. సాయంకాలం వరకూ ఎందుకాగుతారు?
ఈవిడ దగ్గర డబ్బెక్కడిది? ఈ నెపంతో బలవంతం చేస్తే ఒప్పుకుంటుంది అనుకున్నది. నా పెట్టెలో అప్పటికి ఎంత లేదన్నా వేయి, పదిహేను వందల వరకు సవరనులున్నాయి. జవహరి విషయం చెప్పాల్సిన అవసరం లేదు. కాని బువాహుసేనీ ముందు పెట్టె తెరవడం సబబు కాదు.
నేను : అయితే వెళ్ళి గంట తరవాత వచ్చి తీసికెళ్ళు.
హుసేనీ : గంటలో గ్రాహకులు వచ్చి తీసికెళ్ళు .
నేను : అవును . ఇస్తారు. నా ప్రాణం తీయకు. నా శరీరం బావుండలేదు.
హుసేనీ : ఏమి ? ఏమైంది ?
నేను : ఎమైందా ? జ్వరం వచ్చింట్లుంది . తలనొప్పి.
బువాహుసేనీ నొసలు మీద చేయి వేసి "వేడిగా ఏమీ లేదు. కచేరీ ఎల్లుండి. అల్లా దయవల్ల అప్పటికి బాగైపోతావు ' అన్నది.
ఆ మాటకు నేను బదులు చెప్పకముందే బువాహుసేనీ వెళ్ళిపోయింది. ఆమె వ్యవహారం నాకేమీ బాగనిపించలేదు. కోపం కూడా వచ్చింది. వీళ్ళకు మన రోగాలను గురించీ, నొప్పులను గురించి ఆలోచన లేనప్పుడు వీళ్ళతో ఉండడం ఎందుకు? అనుకున్నాను.
రుస్వా : అంతకుముందు అలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా ?
ఉమ్రావ్ : ఎప్పుడూ రాలేదు. ఏం ? ఎందుకలా అడిగారు ?
రుస్వా : ఫైజలీ ఆధారంగా నిలిచాడు. కాబట్టి ఈ ఆలోచన వచ్చి ఉంటుంది.
ఉమ్రావ్ : అందులో రహస్యం ఏముంది ?
రుస్వా : రహస్యం లేదు , సూక్ష్మం ఉంది.
రుస్వా : ఫైజలీ కి మాట ఇవ్వకముందే వెళ్లిపోవాలనే సంకల్పం మీకుంది. ఎలా వెళ్ళిపోవాలి అని నెపం కోసం మనసు వెతుకుతుంది.
ఉమ్రావ్ : అది కాదు వెళ్ళాలా ? వద్దా? అని సతమతం అవుతున్నాను. గోహర్ మిర్జా సమయం కాని సమయంలో వచ్చి కొంటెతనం చేయడం, బువాహుసేనీ బలవంతం నా సంకల్పాన్ని గట్టి పరచాయి. అయినా అప్పటికీ పూర్తిగా నిశ్చయించుకోలేదు. రాత్రికి ఫైజాలీని, అతని స్థితినీ చూచి స్థిరపరచుకున్నాను.
రుస్వా : కాదు. ముందే మీరు ఒక నిశ్చయానికి వచ్చేశారు. అందుకే గోహర్ మిర్జా కొంటెతనం, బువాహుసేనీ బలవంతమూ మీకు బాగనిపించలేదు. కాకుంటే అది మామూలే అయి ఉండాలి. మీకు సాధారణంగా ఇలాంటివి జరుగుతుంటాయి.
ఉమ్రావ్ : సరే ఒప్పుకున్నాను. అయినా నన్ను అడ్డేవారెవ్వరు? నిజం చెప్తున్నాను. వెళ్ళేప్పుడు ఎవరో "ఉమ్రావ్! వెళ్ళకు నా మాట విను " అని చెవిలో చెప్పినట్లు అనిపించింది. రెండు మూడు మెట్లు దిగిన తరవాత ఎవరో లాక్కొని పోతున్నట్లూ , ఒకరు వెళ్ళవద్దని చెప్పినట్లూ అనిపించింది. కాని వినలేదు. వెళ్ళిపోయాను.
రుస్వా : ఆపిన బలవంతుడేవడో? అతని మాట మీరు వినలేదు. శిక్ష అనుభవించారు.
ఉమ్రావ్ : అర్ధమైంది. అది ఒక శక్తి . దుష్కార్యములు చేయవద్దని హెచ్చరించేది, సత్కార్యములు చేయవలసిందని ప్రోత్సహించేది.
రుస్వా : కదండీ . అది మీరన్న శక్తి కాదు. ఖానమ్ ఇంట్లో ఉండడం ఏమంత మంచి పని? చెడు. మంచిది కాదని తాము భావించినట్లు మీ మాటలను బట్టి తెలుస్తుంది. బహుశ పరిస్థితుల వత్తిడి వల్ల మీరు అలా చేసి ఉంటారు. కాని ఖానమ్ ఇంట్లో ఉన్నదాని కంటే ఒక మనిషి కట్టుకొని ఉండడం వేయి రెట్లు మేలు. వాస్తవం ఏమంటే, ఫైజాలీ ఉదార స్వభావం, అతని ప్రేమభావన మిమ్ములను అతని వెంట వెళ్ళవలసిందని ప్రోత్సహించాయి. ముఖాలు చూచి మనుషులను కనిపెట్టడంలో మీకున్న ఆసక్తి మిమ్ము అలా చేసి ఉంటుంది. ముఖ సాముద్రికంలో ప్రజ్ఞావంతులు అయిపోయారు.
అయిష్ బాగ్ జాతరలో మనుషుల ముఖాలు పరిశీలించిన వృత్తాంతం శ్రద్దగా విన్నాను. ఫైజాలీ చర్యలు మీ విషయంలో ప్రకటితం కాలేదు. అయినా అతని ముఖము, మాట, నడవడితో అతని వెంట వెళ్తే తప్పక ఏదో ప్రమాదం వాటిల్లుతుందని గ్రహించే ఉంటారు. కాని అతని తీపి మాటలు, ధనపు ఆశ మీ కళ్ళముందు ఒక తెర దించాయి. మీరు మానసికశాస్రం చదివి ఉంటే అతని వలలో పడి ఉండేవారు కాదు.
ఉమ్రావ్ : ఏదైనా పుస్తకం సూచించండి చదువుతాను.
ఖానమ్ ఇల్లు చౌకులో సురక్షిత ప్రదేశంలో ఉంది. పశ్చిమాన బజారు, ఉత్తర, దక్షిణదిశల్లో ఎత్తైన వేశ్యల ఇండ్లూ ఉన్నాయి. ఒక పక్క బీజాజాన్ ఇల్లు, రెండో పక్క హుసేనీ దాసీ ఇల్లూ ఉండేవి. వెనుక మీర్ హుసేన్ అలీగారి దివాణం. ఎటునుంచీ దొంగదూరే అవకాశం లేదు. ముగ్గురు మనుషులు రాత్రిళ్ళు కాపలా కాసేవారు. ఫైజలీ రాకపోకలు మొదలైననాటి నుండి ఒకడు పెద్ద దర్వాజా వద్ద ప్రత్యేకంగా కాపుండేవాడు. ఎంచేతనంటే ఫైజలీ చాల రాత్రికి వచ్చేవాడు. రాత్రి ఉండగానే వెళ్ళిపోయేవాడు. తలుపు తీయదానికీ , మళ్ళీ మూసి తాళం వేయడానికీ ప్రత్యేకంగా ఒకణ్ణి నియమించడం జరిగింది.
వాగ్దానం ప్రకారం ఫైజలీ రాత్రికి వచ్చాడు. కొంతసేపు ఎలా వెళ్ళాలా అని ఆలోచన సాగింది. ఇంతలో కావలివాడు అవులించాడు. వాడు మెలకువతో ఉన్నాడని గ్రహించి ఫైజలీ వాణ్ణి లోపలకు పిలిచాడు. "ఇదిగో రూపాయి. బహుమానం ఎప్పుడూ ఇవ్వలేదు నీకు. తలుపు దగ్గరేసి ఉంచు. మేము మేలుకునే ఉన్నాం. భయం లేదు " అన్నాడు.
కావలి " మక్కా" సలాము చేసి వెళ్ళిపోయాడు. "పద పోదాం" అన్నాడు ఫైజలీ . సొమ్ముల పెట్టె మొదలే తెప్పించేశాను. రెండు జతల బట్టలు మూట కట్టించాను. అది చంకన పెట్టుకొని అక్బరీ దర్వాజా వైపున నడిచాను. బానిసల సంత దగ్గర ఎద్దుల బండి సిద్దంగా ఉంది. ఇద్దరమూ అందులో కూర్చున్నాం. "హిండో లాకేనాకా ' దాటి కొంతదూరం వెళ్ళగానే ఫైజలీ గుర్రాన్ని తీసుకొని సైసువాడు కలిశాడు. అతడూ మా బండి వెంట వచ్చాడు. ఉదయానికి మోహన్ లాల్ గంజ్ చేరాం. అక్కడ సత్రంలో మధ్యాహ్నం వరకు మకాం. పూట కూళ్ల అవ్వతో వండించుకు తిన్నాం.
ఉప్పులేనిది మినప్పప్పు చప్పన
సుంత సైతం లేదు నేతివాసన
మూడో రోజు రాయ్ బరేలీ చేరాం. అక్కడ ప్రయాణానికి తగిన బట్టలు కొన్నాడు. లక్నో నుంచి తెచ్చిన బట్టలు విప్పి మూట కట్టాను.
లక్నో నుంచి వచ్చిన ఎద్దుల బండి రాయ్ బరేలీ నుండి తిరిగిపోయింది. అక్కడ మరొక బండి బాడుగకు తీసుకొని లాల్ గంజ్ వైపు సాగాం. అది రాయ్ బరేలికి తొమ్మిది పదికోసుల దూరంలో ఉంది. సాయంకాలం అవుతుండగా ఆ వూరు చేరాం. ఆరాత్రి సత్రంలో మకాం. అవసరమైన సామాగ్రి తేవడానికి ఫైజలీ బజారుకు వెళ్ళాడు. మేము విడిసిన గదికి దగ్గర్లో ఉన్న మరొక గదిలో ఒక పల్లెటూరి బోగంది దిగింది. పేరు నసీబస్. నగలు, బట్టలు బాగున్నాయి. కావడానికి పల్లేదే అయినా భాష బాగుంది. మాట తీరు బోగంవాళ్ళలా ఉంది. నేను ఆమెతో చాలాసేపు మాట్లాడాను.
నసీబన్ : ఎక్కడి నుంచి వస్తున్నారు?
నేను : ఫైజాబాదు నుంచి .
నసీబన్ : ఫైజాబాదు లో నా చెల్లెలుంది. బహుశ మీకు తెలిసి ఉండవచ్చు.
నేను : ( నేనూ వేశ్యనని గుర్తు పట్టేసింది) నాకేం తెలుసు?
నసీబన్ : పైజాబాదులో మమ్ములను ఎరుగని వారు లేరు.
నేను : చాలా కాలం నుంచి వీరి ఇంట్లోనే ఉంటున్నాను. వీరు లక్నో లో ఉంటారు. నేను కూడా ఎక్కువాగా అక్కడే ఉంటున్నాను.
నసీబన్ : పుట్టిల్లు ఫైజాబాదేనా?
(ఈవిడ చెప్పేది నిజం. కాని జవాబు ఏం చెప్పాలి ?)
నేను : అవును, పుట్టడం ఫైజాబాదులోనే. చిన్నతనం నుంచి బయటనే ఉంటున్నాను.
నసీబన్ : అయితే ఫైజాబాదు లో ఎవరినీ ఎరుగవు ?
నేను : ఎరుగను .
నసీబన్ : ఇటు ఎందుకు వచ్చినట్లు?
నేను : వీరి వెంట
నసీబన్ : వెళ్ళడం ఎక్కడికి ?
నేను : ఉనావ్.
నసీబన్ : లక్నో మీది నుంచి వచ్చారా ?





