Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
3. నేడు ఏ యజమాని ఎవడు ఇంద్రాది దేవతలను తన రక్షణకుగాను ప్రార్థించును? ఎవడు ఆదిత్యుని, అదితిని, జలమును ప్రార్థించును? ఎవని విషయమున అశ్వద్వయము, ఇంద్రుడు అగ్నిస్తుతులకు ప్రసన్నులు అగుదురు? వారు ఏ యజమాని అభిషవించిన సోమమును యథేచ్చగా పానము చేయుదురు?
4. ఇంద్రుడు మానవనేతల బంధువు. నేతలలో శ్రేష్ఠుడగునేత. అట్టి ఇంద్రునికొఱకు సోమము అభిషవించిన యజమానులకు హవిర్భర్త అగ్ని సుఖములను ప్రసాదించును. వారు చిరకాలము నుంచి ఉదయించుచున్న సూర్యుని దర్శింతురు.
5. ఇంద్రుని కొఱకు సోమాభిషవము చేయు యజమానిని అల్పశత్రువులుగాని అధిక శత్రువులుగాని బాధించరాదు. ఇంద్రమాత అదితి వారికి సుఖములు ప్రసాదించవలెను. శోభన యజ్ఞయాగములు చేయు యజమానులు ఇంద్రునకు ప్రియులు కావలెను. ఇంద్రుని స్తుతించగోరువారు ఇంద్రునకు ప్రియులుకావలెను. ఇంద్రునివద్దకు సాధుభావమున చేరువారు ఇంద్రునకు ప్రియులు కావలెను. సోమవంతుడగు యజమాని ఇంద్రునకు ప్రియుడు కావలెను.
6. ఇంద్రుని వద్దకు వెళ్లువాని, సోమాభిషవము చేయువాని పాక కార్యమును విక్రాంతుడగు ఇంద్రుడు స్వీకరించును. సోమాభిషవము చేయనివానికి ఇంద్రుడు విక్రాంతుడుకాడు. మిత్రుడుకాడు. బంధువుకాడు. ఇంద్రుని వద్దకు వెళ్ళనివానిని, ఇంద్రుని స్తుతించనివానిని ఇంద్రుడు హింసించును.
7. ఇంద్రుడు అభిషుత సోమపాయి. అతడు ధనికుడు. లోభి, వ్యాపారితో స్నేహము ఏర్పరచుకొనడు. వారి నిరర్థక ధనమును ఉద్ధరించడు - నష్టపరచును.
8. ఇంద్రుడు సోమాభిషకారి, హవ్యపాకకారి. యజమానులకు అసాధారణ బంధువగును.
9. ఉత్కృష్టులు, నికృష్టులు ఇంద్రుని ఆహ్వానింతురు. మధ్యములు ఇంద్రుని ఆహ్వానింతురు. నడచువారు ఇంద్రుని ఆహ్వానింతురు. నిలుచువారు ఇంద్రుని ఆహ్వానింతురు. గృహములందున్నవారు ఇంద్రుని ఆహ్వానింతురు. యుద్ధమునందున్నవారు ఇంద్రుని ఆహ్వానింతురు. అన్నమును కోరువారు సహితము ఇంద్రుని ఆహ్వానింతురు.
ఇరువది ఆరవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత 1-3 ఆత్మ, 4-7 శ్యేనము, ఛందస్సు - త్రిష్టుప్.
1. మేము ప్రజాపతులము. మేమే అందరిని ప్రేరేపించు సవితము. మేమే దీర్ఘతమా ఋషి పుత్రుడు, మేధావి, కక్షీవంత ఋషలము. మేమే అర్జునపుత్రుడు కుత్సుని తరింపచేసినాము. మేమే అశ్ననామక కవులము. నరులారా ! మమ్ము చక్కగా దర్శించుడు.
2. మేము ఆర్యునకు భూమి దానము చేసినాము. హవ్యదాతలగు మానవులకు సస్యాభివృద్ధి, వర్షము దానము చేసినాము. శబ్దించు జలములను ఉద్ధరించినాము. దేవ గణములు మా సంకల్పమును అనుసరింతురు.
3. మేము సోమపానమున ఉన్మత్తులమయి శంబరుని తొంబది తొమ్మిది నగరములను ధ్వంసము చేసినాము. యజ్ఞమున అతిథులను ఆదరించు దివోదాసుని రక్షించినాము. అప్పుడు అతని నివాసమునకుగాను దివోదాసునకు నూరు నగరములు ఇచ్చినాము.
4. మరుత్తులారా ! శ్యేనపక్షి పక్షులలో ప్రధానమయినది. అన్య శ్యేనములకన్న శీఘ్రగామి శ్యేనము ప్రధానతరము. సోమరూప హవ్యము దేవతలు సేవించునది. దానిని స్వర్గమునుండి మానవుల కొఱకు చక్రములులేని రథము - శ్యేనము తెచ్చినది.
5. శ్యేనము స్వర్గము నుండి సోమము తెచ్చునపుడు భయభీతమయినది. విస్తీర్ణ అంతరిక్షమున ఎగురునపుడు మనోవేగమున సాగినది. అది సోమమయ మధుర అన్నము వహించి సాగినది. సోమము ఈ లోకమునకు తెచ్చినందున 'సువర్ణ' అయినది. అందువలన ఈ లోకము తేజోవంతమయినది.
6. శ్యేనము దేవతల సహచరి. ఋగుగామి. ప్రశంసనీయగమన. అది స్తుతియోగ్యము, మాదకమగు సోమమును ద్యులోకమున గ్రహించునది. దృఢచిత్తమున సోమమును చేర్చినది.
7. శ్యేనపక్షి సహస్ర, అయుత సంఖ్యాక యజ్ఞసహితముగా సోమము గ్రహించినది. దానిని చేర్చినది. అట్లు తెచ్చిన సోమమును బహుకర్మావశిష్టుడు, ప్రాజ్ఞుడగు ఇంద్రుడు సేవించినాడు. సోమము సేవించుట వలన కలిగిన హర్షాతి రేకమున మూఢశత్రువులను వధించినాడు.
(సోమము స్వర్గము నుండి తేబడినదని గాథ. దానిని గాయత్రి శ్యేనరూపమున భూలోకమునకు తెచ్చినది. అందుకే శ్యేనము "సువర్ణ" అయినదని శాయణాచార్యులు)
ఇరువది ఏడవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - శ్యేనము ఛందస్సు - చివరిది శక్వర, మిగిలినవి త్రిష్టుప్.
1. గర్భమునందుండియే మేము, వామదేవుడు సమస్త దేవతల జన్మమును యథావిధిగా తెలిసికొన్నాము. పరమాత్మనుండియే సమస్త దేవతలు పుట్టినారు. అనేక లోహమయ శరీరములు మమ్ము రక్షించినవి. ఇప్పుడు మేము శ్యేనరూపులము. ఆవరణ రహిత ఆత్మను ఎరిగినాము. దేహమునుండి బయటపడుదుము. "శ్యేనోజవసానిరదీయమ్"
2. ఆ గర్భము మమ్ము పూర్తిగా అపహరించలేదు. మోహము కలిగించలేదు. మేము గర్భస్థ దుఃఖమును మా జ్ఞాన సామర్థ్యమున పరాజితము చేసినాము. అందరిని ప్రేరేపించు పరమాత్మ గర్భస్థ శత్రువులను వధించినాడు. వర్థమానుడయి గర్భమునందలి క్లేశకారక వాయువులను అతిక్రమించినాడు.
3. ద్యులోకమునుండి శ్యేనము సోమమును అపహరించినది. అధోముఖియై శబ్దము చేసినది. అప్పుడు సోమపాలకులు శ్యేనము నుండి సోమము గుంజుకున్నారు. అప్పుడు 'కృశానుడు' అను సోమపాలకుడు బాణమును ఎక్కుపెట్టినాడు. శ్యేనముపై విడిచినాడు. అప్పుడు శ్యేనము సోమము తెచ్చినది.
4. అశ్వద్వయము ఇంద్ర విశిష్ట దేశమునుండి భుజ్యుని అపహరించినట్లు ఋజుగామి శ్యేనము ఇంద్రరక్షిత మహాద్యులోకమునుండి సోమము అపహరించినది. అప్పటి యుద్ధమున కృశానుని అస్త్రము తగిలి గమనశీల పక్షి యొక్క ఒక మధ్యస్థిత - పతనశీల పక్షము రాలినది.
5. ఇప్పుడు విక్రవంతుడగు ఇంద్రుడు - శుభపాత్రస్థితము, గవ్యమిశ్రితము, తృప్తికారకము, సారసమిన్వితము, అధ్వర్యులద్వారా ప్రదత్తమగు సోమ లక్షణ అన్నమును, మధుర సోమరసమును హర్షార్ధియై ఇంద్రుడు ముందే పానము చేయవలెను.
ఆలోచనామృతము
1. 18వ సూక్తమున గర్భస్థుడగు వామదేవుని సంవాదమువంటిదే ఈ సూక్తమునందలి సంవాదము.
ఇది జ్ఞానరూపమున ఆత్మను విముక్తము చేయుట అని ఒక వ్యాఖ్య. అన్ని బంగారు బంధములను వదిలించుకొని బయటపడుట.
ఇది ఒక రకపు యోగ ప్రక్రియవలె ఉన్నది. ఉదానప్రాణము శ్యేనవేగమున బయల్వెడలుట. ఆవిధముగ మరొక దేహమున ప్రవేశించుట.
2. గర్భస్థ మోహమును జయించినాము అన్నాడు. అదియు జ్ఞానము. ఒక ఐతిహ్యము గుర్తుకు వచ్చినది. శఠగోపయతి జన్మించగనే మోహవాయువు, శఠము వీచినదట. ఆ సద్యోజాత శిశువు శఠమును కోపించినాడట. అది అతనిని అంటలేదు. సహజ రో దనము లేని బిడ్డను తలిదండ్రులు చింతచెట్టు తొఱ్ఱలో వేసినారు. అక్కడనే పెద్దవాడయిన శఠగోపయతి నాలాయిర ద్రావిడవేదమగు తిరువాయ్ మొళి పాడినారు.
పూర్వజన్మ విషయమున విశ్వాసము ఉన్నవారికి ఇది అంతవింతగా తోచదు.
శ్రీశుకుడు జన్మతోనే యోగి అయినాడు.
భౌతికముగ ఆలోచించిన ప్రసవవేదనను నివారించుటకు జరిగిన నిరంతర ప్రయత్నమున నిది ఒక మజిలీకావచ్చును.
3. శ్యేనగాధ గరుడుని అమృతాపహరణ గాధకు మూలమువలె కనిపించుచున్నది.
ఇరవది ఎనిమిదవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, సోముడు; ఛందస్సు - త్రిష్టుప్.
1. సోమా ! ఇంద్రుడు నీతో మైత్రి చేసినాడు. ఇంద్రుడు నీ సాయమున నరులకొఱకు జలమును ప్రవహింపచేసినాడు. వృత్రుని వధించినాడు. సింధుజలములను ప్రేరేపించినాడు. వృత్రుని నిరోధించిన జలములను విముక్తము చేసినాడు.
2. సోమా ! సూర్యుని ద్విచక్ర రథము బృహత్ అంతరిక్షమున ఉండును. ఇంద్రుడు నీ సాయమున సూర్యుని రథపు ఒక చక్రమును బలవంతముగా విరిచినాడు. మరొక చక్రమును అపహరించినాడు.
3. సోమా ! నీ సాయమున ఇంద్రుడు మధ్యాహ్నమునకుముందే శత్రువులను సంహరించినాడు. అగ్ని అనేకమంది శత్రువులను కాల్చినది. రక్షణలేని దుర్గమ స్థానమునుండి సాగు వ్యక్తిని దొంగలు హతమార్తురు. అట్లే ఇంద్రుడు అనేక వేల శత్రు సేనను హతమార్చినాడు.
4. ఇంద్రా ! నీవు దస్యులను సకల సద్గుణ రహితులను చేయుదువు. కర్మహీనులను గర్హింతువు. ఇంద్ర సోములారా ! మీరు శత్రువులను బాధించుడు. వారిని వధించుడు. వారిని వధించుటకుగాను ప్రజల పూజలు గ్రహించండి.
సోమ, ఇంద్రులు అశ్వసమూహములను, గో సమూహములను దానము చేసినారు. పణులు దాచిపెట్టిన గోసమూహములను, భూమిని, మీ బలమున విముక్తము చేసినారు. ధనయుక్తులగు ఇంద్రసోములారా ! మీరు ఉభయులు శత్రుహింసకులు. మీరు ఈ విధముగా చేసిన సకల కార్యములు 'సత్యము' అగును.
ఇరువది తొమ్మిదవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రా ! నీవు మోదవంతుడవు, స్వామివి. శత్రువులే నిన్ను స్తుతింతురు. నీవు సత్యధనమవు. మేము నిన్ను స్తుతించుచున్నాము. మమ్ము రక్షించుటకు, అన్నయుక్తులను చేయుటకు అశ్వసహితుడవయి, అనేక యజ్ఞములకు విచ్చేయుము.
2. ఇంద్రుడు మానవహితకారి. సర్వజ్ఞుడు. సుందర అశ్వవంతుడు. నిర్భయుడు. అతనిని సోమాభిషవకారులు ఆహ్వానింతురు. అప్పుడు అతడు యజ్ఞమునకు రావలెను. ఇంద్రుని సోమాభిషవకారులు స్తుతింతురు. అతడు వీర మరుత్తుల యుక్తుడయి హృష్టుడు అగును.
3. స్తోతలారా ! ఇంద్రుని పరిపూర్ణుని చేయవలసి ఉన్నది. సంతృప్తుని చేయవలసి ఉన్నది. అందుకుగాను ఇంద్రుని చెవిన పడునట్లు స్తోత్రములు సకల దిశలందు ఉచ్ఛరించుడు. సోమరసమున తడిసిన బలవంతుడగు ఇంద్రుడు మా ధనమునకుగాను శోభన తీర్థములను భయరహితములను చేయును.
4. ఇంద్రుడు వజ్రబాహువు. అతని వశమున వందల, వేల అశ్వములు ఉన్నవి. అతడు వానిని రథము నడుపుటకు సిద్ధము చేయును. యాచకుడు, మేధావి. ఆహ్లాదకారి, స్తవకారియగు యజమానిని రక్షించుటకు సాగును.
5. ఇంద్రా ! నీవు ధనికుడవు. దీప్తివిశిష్టుడవు. స్తుతియోగ్యుడవు. అన్నవిశిష్టుడవు. మేము నీ స్తోతలము. మేము నీ రక్షణలందు ఉన్నాము. మేము మేధావులము. నీవు ధన దానము చేయునపుడు నిన్ను భజింతుము.
ముప్పదవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - ఇంద్రుడు, ఉష ఛందస్సు - 8, 24 అనుష్టుప్,
మిగిలినవి గాయత్రి.
1. వృత్రనాశక ఇంద్రా ! లోకమున నిన్ను మించిన ఉత్కృష్టుడుగాని ప్రశస్తుడుగాని లేడు. నీవలె లోకమున ప్రసిద్ధుడు అయినవాడు మరొకడు లేడు.
2. ఇంద్రా ! సర్వత్ర వ్యాప్త చక్రము శకటమును అనుసరించును. అట్లే ప్రజలు నిన్ను అనుసరించెదరు. నీవు నిజముగా గొప్పవాడవు. గుణముల వలన ప్రఖ్యాతుడవు.
3. జయముకోరిన సమస్తదేవతలు బలరూపమున నీ సాయము పొందినారు. అసురులతో యుద్ధము చేసినారు. అందుకొఱకే రాత్రింబవళ్ళు నీవు శత్రువును వధించినావు.
4. ఇంద్రా ! నీవు యుద్ధమున యుద్ధకారి 'కుత్సుడు' అతని సహాయకులకొఱకు గాను సూర్యుని రథచక్రమును అపహరించినావు.
5. ఇంద్రా ! నీవు యుద్ధమున ఒంటరిగా దేవతలను బాధించు సకల రాక్షసులతో యుద్ధము చేసినావు. హింసకులను వధించినావు.





