Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
రుస్వా : పుక్కెపు సొమ్ముకు వెనకా ముందేమీ? అలాంటి గుండె ఇంకొకనికి ఎలా వస్తుంది?
ఉమ్రావ్ : పుక్కపు సొమ్మేం ?
రుస్వా : కాకుంటే తల్లి మెడలోంచి తెచ్చిస్తాడా?
ఉమ్రావ్ : ఏమో? మీకేం తెలుసు ?
12
రాత్రిళ్ళు వచ్చేవాళ్లలో పన్నామల్ చౌదరీ ఒకడు. రెండు గంటలు కూర్చొని వెళ్ళిపోయేవారు. నలుగురిలో కూర్చోడమే వారికి సరదా. మర్యాద సరిగా జరుగుతూ ఉండిన పక్షంలో వచ్చేపోయేవారి విషయంలో పట్టింపులేదు. నెలకు రొక్కం రెండువందలిచ్చేవారు. ఫైజలీ తో పరిచయం కలిగిన తరవాత వారి రాకపోకలు తగ్గాయి. ప్రతి రోజు పత్తా ఉండేవారు కారు. వచ్చినా చిన్నబుచ్చుకొని కూర్చునేవారు.
పన్నామల్: నీదాకా రాలేదా ?
నేను : ఏమి?
పన్నామల్: ఇంట్లో దొంగతనం జరిగింది. ఎన్నో తరాల ఆర్జన ఊడ్చుకు'పోయింది.
నేను : (ఉలికిపడి) ఏమీ? దొంగతనమే ! ఎంత సొమ్ము పోయింది ?
పన్నామల్ : అంతా పోయింది. మిగిలిందేమి? రెండు లక్షల జవహారీ మాయమైంది.
మనసులో నవ్వుకున్నాను. నవ్వెందుకంటే తండ్రి చన్నామల్ కోటీశ్వరుడని ప్రతీతి. రెండు లక్షల పెద్ద మొత్తమే కాని అయన విషయంలో కాదు. ఒకరకంగా ముఖం పెట్టి విచారం వ్యక్తపరచాను.
పన్నామల్ : ఇవ్వాల రేపు పట్నంలో దొంగతనాలు ఎక్కువ అయినాయి. నవాబు - 'మలికే అలమ్ ' ఇంట్లో దొంగతనం జరిగింది. గుడ్డి దర్భారుగా ఉంది. బయటి నుంచి దొంగలు వచ్చారని వినికిడి. పాపం, మిర్జా అలీబేగ్ ఆశ్చర్యపడుతున్నాడు. పట్టణంలో దొంగలందరినీ పిలిచారు. అయినా జాడ తెలియలేదు. వారంతా చెవులు పట్టుకొని ఇది మా పని కాదని చెప్పారు.
పన్నామల్ వచ్చిన రెండవ రోజు గదిలో కూర్చొని ఉన్నాను. చౌకులో గొడవ జరిగింది. నేను 'చిల్మను దగ్గరికి వచ్చి చూస్తె గందరగోళంగా ఉంది. జనసమర్ధం ఎక్కువగా ఉంది.
ఒకడు : చివారకు పట్టు పడ్డాడుగా!
రెండోవాడు : కొత్వాల్ అంటే ఇలా ఉండాలి.
మూడోవాడు : అన్నా! ఏమన్నా సొమ్ము దొరికిందా ?
నాలుగోవాడు : చాలా దొరికింది. అయినా దొరకాల్సింది చాలా ఉంది.
ఐదోవాడు : మియాఁ ఫైజునూ త్రాడు కట్టి తీసుకొని రావడం నా కళ్ళతో చూచాను. వెంట సిపాయీ లున్నారు. జనపు తోక్కిడికి దుమ్ము లేస్తుంది. మియాఁఫైజు ముఖం మీద కండువా వేసుకున్నాడు. ముఖం కనిపించలేదు. ఇది మధ్యాహ్నపు వృత్తాంతం.
మాములుగానే జామురాత్రికి ఫైజలీ వచ్చాడు. రావడం రావడమే బయట వెళ్తూనామని, ఎల్లుండి వస్తామని చెప్పాడు. "చూడు ఉమ్రావ్ జాన్! నేను నీకిచ్చిన దానిని గురించి ఎవరికీ వెల్లడించవద్దు. బువాహుసేనీకి గాని , ఖానమ్ కు గాని చూపవద్దు. నీవే వాడుకో. ఎల్లుండి తప్పక వస్తా. సరేగాని కొద్దిరోజులు మావెంట వస్తావా?" అడిగాడు.
నేను : నేను పరాధీననని మీకు తెలిసిందేగా ? ఖానమ్ గారి అధీనంలోనిదాన్ని . ఆవిడను అడగండి. ఆవిడ ఇష్టపడితే నాకేమీ అభ్యంతరం లేదు.
ఫైజలీ : మీకు విశ్వాసం ఉండదనే మాట నిజం. నేను నీవంటే ప్రాణలిస్తాను. నీవేమో ఇలాంటి నీరసపు జవాబు చెపుతావా? మంచిది. బువాహుసేనీని పిలుపు.
బువాహుసేనీని పిలిచాను. ఆమె వచ్చింది.
పైజలీ" ఈవిడ కొద్దిరోజులు మావెంట రావడానికి వీలుంటుందా?
హుసేనీ : ఎక్కడికి ?
ఫైజలీ : ఫరుఖాబాదు . నేను మాములు మనిషినేమీ కాదు. అక్కడ నా జాగీరు ఉంది.
ప్రస్తుతానికి రెండు నెలల అక్కడ ఉంటాను. ఖానమ్ గారు అంగీకరిస్తే రెండు నెలల డబ్బు ముందుగానే ఇస్తాను. కొంత ఎక్కువగా ఇవ్వమన్నా ఇస్తాను.
హుసేనీ : ఖానమ్ ఒప్పుకుంటుందని నాకు నమ్మకం లేదు.
పైజలీ: అయినా అడుగు.
బువాహుసేనీ ఖానమ్ దగ్గరికి వెళ్ళింది.
నావరకు బువాహుసేనీని ఖానమ్ వద్దకు పంపడం వలన ప్రయోజనం లేదని తెలుసు. ఆవిడ అంగీకరించదు. ఈ వ్యక్తీ ఇక్కడే ఇంతగా ఆదరిస్తున్నాడు. వాళ్ళ ఊరికి వెళ్తే ఎంత ఆదరించాలి ? నేనిలా అనుకుంటూ ఉండగానే బువాహుసేనీ వచ్చి బయట వెళ్ళడం ఏమాత్రం సాధ్య పడదని చెప్పింది.
ఫైజలీ : రెండింతలు డబ్బిచ్చాను.
హుసేనీ : నాలుగింతలు ఇచ్చినా సాధ్యపడదు అని చెప్పింది.
ఫైజలీ : పోనీ , ఏం చేస్తాం ......!
బువాహుసేనీ వెళ్ళిపోయింది. ఫైజలీ కళ్ళల్లోంచి టపటప కన్నీరు రాలింది. అతని స్థితి చూచి జాలి కలిగింది. ప్రేమికుల అవిశ్వాసాన్ని గురించి కధల్లో గాధల్లో చదివినప్పుడు నాకు విచారం కలిగేది. ఇతని వెంట వెళ్ళకుంటే నేను విశ్వాసం లేనిదానననీ , కృతఘ్నురాలననీ అనడంలో సందేహం లేదు. అతని వెంట వెళ్ళిపోవాల్సిందేనని నిశ్చయించుకున్నాను.
నేను : నేనూ వస్తాను.
ఫైజలీ : వస్తావా?
నేను : ఎవరేమన్నా వచ్చేదే!
ఫైజలీ : ఎలా ?
నేను : రహస్యంగా.
ఫైజలీ : అయితే నిన్ను తీసుకెళ్ళడానికి ఎల్లుండి జామురాత్రి ఉండగా వస్తాను . మోసగించవద్దు సుమా.
నేను : నా ఇష్టంతో వస్తానన్నాను . మాట ఇచ్చాను. చూడండీ నా మాట కూడా.
ఫైజలీ : మంచిది చూతాం.
ఆ రాత్రి ఫైజలీ జామున్నరరాత్రి ఉండగా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయినా తరవాత ఆలోచించాను. మాట ఇచ్చాను గాని వెళ్ళడమా మానడమా అని. ఫైజలీ ప్రేమ నా వాగ్దానం జ్ఞాపకం వచ్చాయి. వెళ్ళాలనుకున్నాను. ఇంతట్లో ఎవరో అడ్డు పెడుతున్నట్లునిపించింది. ఏమో ! ఏమి అవుతుందో ? ఎలా తెలుసు ?
ఆలోచనలతోనే తెల్లవారింది. ఏ నిశ్చయానికి రాలేదు. పగలంతా ఇవే ఆలోచనలు మనసులో ముసలాయి. అదృష్టవశాత్తు ఆ రాత్రి ఎవరూ రాలేదు. గదిలో ఒంటరితనం. ఆలోచనలు. చివరకు కన్ను మలిగింది. పొద్దెక్కే దాకా నిద్రలోనే ఉన్నాను. గోహర్ మిర్జా వచ్చి లేపాడు. నాకది బాగనిపించలేదు. పగలంతా ఏదో చిరాకు. ఏమాట మీదనో బువాహుసేనీతో తగాదా జరిగింది. ఆ జ్ఞాపకం వచ్చింది. కచేరీకి ఎక్కణ్ణుంచొ పిలుపు వచ్చింది. "వెళ్తావా?" అని బువాహుసేనీ అడిగింది. అపుడు నాకు తలనొప్పిగా ఉండింది. వెళ్ళనని కచ్చితంగా చెప్పేశాను ." బాగుంది , ఆహ్వానం వచ్చినపుడు నిరాకరిస్తే ఎలా? ఈ వృత్తిలో ఉండి ఇంకేం చేస్తావు?" అన్నది బువాహుసేనీ. "వెళ్ళను. వెళ్ళను . వెళ్ళను ." "వాళ్ళు ప్రత్యేకంగా నీ పాట కోరి వచ్చారు. ఖానమ్ మాట ఇచ్చింది. డబ్బు కూడా తీసుకుంది. తరవాత నీ ఇష్టం" అన్నది. "నేను వెళ్ళను డబ్బు వాపసు చెయ్యండి." అన్నాను.
బువాహుసేనీ : నీవేమీ తెలియనిదానివా ? ఖానమ్ గారు డబ్బు తీసుకున్న తరువాత వాపసు ఇవ్వడం అంటూ ఉంటుందా?"
నేను : ఎవరు ఎలా చస్తేనేం ? ఖానమ్ గారు డబ్బివ్వకుంటే నేను ఇస్తాను.
హుసేనీ : ఓహో! డబ్బు గలదానివి అయిపోయావు. తే, ఇచ్చేస్తాను.
నేను : ఎంత ?
హుసేనీ ; వంద .
నేను : వంద తీసుకుంటావా ? ప్రాణం తీసుకుంటావా ?





