Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
4. యజమానులు బాధలలో ఉన్నపుడు ఇంద్రుని స్తుతింతురు. యజ్ఞములు చేతురు. దీప్తివంతులు అగుదురు. వారు ఏవిధముగా ఇంద్రుని ధనమును పొందుదురు? ద్యుతిమంతుడగు ఇంద్రుడు హవ్యము గ్రహించును. ప్రసన్నుడు అగును. అప్పుడు ఇంద్రుడు మా స్తుతులను విశేషరూపమున ఏల ఎరుంగును?
5. ద్యుతిమంతుడగు ఇంద్రుడు ఉషోదయముకాగా మానవుల బంధుత్వమును ఏల స్వీకరించును? హోతలు ఇంద్రునకు సుయోగ్యము. కమనీయమగు హవి సమర్పింతురు. వారి విషయమున ఇంద్రుడు ఎప్పుడు ఎట్లు తన బంధుత్వమును ప్రకటించును?
6. నీవు ఇంద్రుడవు. మేము యజమానులము. నీ మైత్రి శత్రుపరాభవకారి. స్తోతలముందు దానిని ప్రకటించుట ఎట్లు? ఎన్నడు మేము నీ భ్రాతృత్వ ప్రచారము చేయగలము? ఇంద్రుడు సుదర్శనుడు మంచి దర్శనముల వాడు. అతని ప్రయత్నము స్తోతల కళ్యాణమునకే అగును. ఇంద్రుని రూపము సూర్యునివలె గతిశీలము. అతీవ దర్శనీయము. ఇంద్రుని రూపము అందరి అభిలషణీయము.
7. రాక్షసి ద్రోహము చేయునది. హింసించునది. ఇంద్రుని గుర్తించనిది. దానిని హతమార్చుటకు ఇంద్రుడు పదునైన ఆయుధములకు మరింత పదునుపెట్టును. ఋణము సహితము మమ్ము ఉషఃకాలముననే బాధించును. ఇంద్రుడు ఋణవినాశకుడు. బలవంతుడు. అతడు అట్టి ఉషలను దూరమునుండియే అజ్ఞాతముగా పీడించును.
8. ఋతదేవుని వద్ద ఎంతో జలము ఉన్నది. అతని స్తుతి పాపములను నష్టపరచును. అతని బోధ యోగ్యము. దీప్తిమంతము. అది నరుల చెవిటి చెవులందు సహితము ప్రవేశించును.
("ఋతశభ్దేనేంద్రోవాదిత్యోవా సత్యంవా యజ్ఞోవా ఉచ్యతే" అని శాయణుడు. ఋత శబ్దము ఇంద్రుడు, ఆదిత్యుడు, సత్యము, యజ్ఞము అనబడును.)
9. ఋతదేవుడు వపుష్మంతుడు. బలవానుడు. ధర్త. ఆహ్లాదకుడు. ఇట్లు అతనికి నానారూపములు కలవు. జనులు ఋతదేవుని విశేష అన్నము కోరుదురు. ఋతదేవునిద్వారా గోవులు దక్షిణ రూపమున యజ్ఞమున ప్రవేశించును.
10. స్తోతలు ఋతదేవుని వశపరచుకొనుటకు అతనిని భజింతురు. అతని బలము శీఘ్రము. అది జలమును వాంఛించునది. విస్తీర్ణములు, దురవగాహములగు ద్యావాపృథ్వులు ఋతదేవునివే ! ప్రీతీనాయకులు. ఉత్కృష్టలు ద్యావాపృథ్వులు ఋతదేవునకుగాను పాలు పిదుకును.
11. 19వ సూక్తమునందలి 11వ మంత్రము పునరావృతము ఆ మంత్రమును చూడనగును.
ఇరువది నాలుగవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - ఇంద్రుడు ఛందస్సు -10 అనుష్టుప్ మిగిలినవి త్రిష్టుప్.
1. మాకు ధనము కావలెను. మాకు ఇంద్రుడు అభిముఖుడు కావలెను. అందుకు ఇంద్రుని ఎంతటి సుందర స్తుతులతో స్తుతించవలెను? ఇంద్రుడు వీరుడు. పశుపాలకుడు. అతడు మాకు శత్రువుల ధనము తెచ్చి ఇవ్వవలెను. యజమానులారా ! ఇంద్రుని స్తుతించుడు.
2. వృత్రుని ఇంద్రుడు వధించవలెను. అందుకు అతనికి సంగ్రామము నుండి ఆహ్వానము అందినది. ఇంద్రుడు స్తుతియోగ్యుడు. అందముగా స్తుతించిన యజమానులకు ధనమును ఇచ్చును. అందుకు అతడు సత్యధనుడు అగును. యజమాని స్తోత్రాభిలాషి. ధనాభిలాషి. ధనవంతుడు ఇంద్రుడు యజమానికి ధనదానము చేయును.
3. మానవులు యుద్ధమున ఇంద్రునే ఆహ్వానింతురు. యజమానులు తపస్సు చేయుదురు. దేహమును క్షీణింప చేతురు. ఇంద్రునే తమ రక్షకునిగా భావింతురు. యజమానులు స్తోతలు పరస్పరము కలిసెదరు. వారు పుత్ర పౌత్ర లాభమునకుగాను ఇంద్రుని దరికి చేరుదురు.
4. ఇంద్రా ! నీవు బలవంతుడవు. మానవులు నాలుగు దిశలందు వ్యాపించి ఉన్నారు. వారు జలలాభమునకుగాను కూడుదురు. యజ్ఞము చేయుదురు. యుద్ధము చేయువారు కూడుదురు. అప్పుడు అందరు ఇంద్రునినే అభిలషింతురు.
5. అప్పుడు ఒకడు బలవంతుడగు ఇంద్రుని పూజించును. ఒకడు ఇంద్రునకు పురోడాశము సమర్పించును. అంతట సోమాభిషవము చేయు యజమాని అనభిషవ యజమానిని వేరుచేయును. అప్పుడు ఒకడు అభీష్టవర్షి ఇంద్రుని గురించి యజ్ఞము చేయ తలపెట్టును.
6. ఇంద్రుడు సోమాభిలాషి. స్వర్గలోక స్థితుడు. ఇంద్రుని కొఱకు అభిషవము చేయు వారికి అతడు ధనదానము చేయును. ఏకాంత చిత్తమున ఇంద్రుని అభిలషించువారు ఉన్నారు. సోమాభిషవము చేయు యజమానులు ఉన్నారు. ఇంద్రుడు అట్టి వారితో స్నేహము చేయును.
("సద్రీచీనేన సంగతేనమనసా" అని ఏకాంత చిత్తమున అని అర్థము. మానసిక ఏకాగ్రతను గురించి ఇచటనే ప్రబోధించినాడు. ఇది తొలిసారి. ఇంతకుముందు కనిపించలేదు.)
3వ మంత్రమున తపస్సు దేహమును క్షీణింప చేయుటను గురించియు తొలిసారి చెప్పినాడు. ఇది కర్మము నుండి జ్ఞానమునకు దారివలె కనిపించుచున్నది.
7. ఒకడు ఇంద్రుని కొఱకు సోమాభిషవము చేయును. ఒకడు పురోడాశము సమర్పించును. ఒకడు పేలాలకు వేపదగిన యవలను వేపును. ఒకడు స్తుతించును. ఇంద్రుడు అట్టి యజమానుల కోరికలు తీరునంతటి బలమును ప్రసాదించును.
8. శత్రుహింసక స్వామి ఇంద్రుడు శత్రువులను గుర్తించినపుడు, ఇంద్రుడు దీర్ఘసంగ్రామమున వ్యాపించి ఉన్నపుడు, ఇంద్రపత్ని సోమాభిషవ కర్త ఋత్వికునిద్వారా సోమపానము చేయుటకు ఉత్సాహము కనబరచు ఇంద్రుని యజ్ఞగృహమునకు ఆహ్వానించును.
9. ఒకనికి అధిక పుణ్యమునకు అల్పధనము లభించును. అతడు కొన్నవానివద్దకు వెళ్లును. నేను అమ్మలేదు. నాకు మిగిలిన ధనము ఇవ్వవలసినది అని అడుగును. కొన్నవాడు చాల ఇచ్చినాను అని అల్పమూల్యమును పెంచి ఇవ్వడు. సమర్థుడు కాని అసమర్థుడు కాని ఖరీదు చేసినప్పటి మాట నిలిచి ఉండును.
10. మా ఇంద్రుని పది ఆవులు ఇచ్చి ఎవడు ఖరీదు చేయును? ఇంద్రుడు శత్రువులను వధించినంత నా ఇంద్రుని నాకు అప్పగించవలెను.
11. 19వ సూక్తమునందలి 11వ మంత్రము పునరావృతము దానిని చూడగలరు.
ఆలోచనామృతము
1. మానవ చరిత్రకు ఆద్యంతములు లేవు. ఇది కాలము సహితముగా నిరంతరము సాగుచునే ఉండును. ఈ చరిత్ర గమనమున మానవుడు ఒకప్పుడు పురోగతుడగును. మరొకపుడు తిరోగతుడగును.
మానవ గమనమునకు నిర్దిష్ట బిందువులేదు. కావున పురోగమన తిరోగమనములను స్పష్టముగా చెప్పజాలము. అప్పుడు గమనముసాపేక్షమగును. అప్పటి స్థితిని బట్టి వెనుకకా? ముందునకా? అని కాని అది కూడ నిర్దిష్టముకాదు. మానవ జీవితము ఏకముఖము కాదు. ఇది బహు ముఖీనము. ఆర్థికము, పారమార్థికము, సామాజికము ఇట్లు లెక్కలేనన్ని? అందు ఎందున సాపేక్షముగ ముందడుగ వెనకడుగు నిర్ణయించుట మానవులకు అసాధ్యము.
ధనమున్నవానికి శాంతి, శాంతి ఉన్నవానికి ధనము కరవగును. ఇది సూచన మాత్రమే ! పరిపూర్ణత ప్రకృతికిలేదు కావున జీవితమునకు లేదు.
సృష్టిలోనయినను, అతీతముగా అయినను పరమేశ్వరుడు ఒక్కడే పరిపూర్ణుడు.
అయినను మానవుని గమనము నిలువదు ! దానికి నిర్దిష్ట లక్ష్యములు ఉండవు. అది ఉన్నది అనుకొనుట భ్రమ ! జీవితమే ఒక భ్రమ కదా !
2. ఈ సూత్రము మూడవ మంత్రము "రిరిక్వాసంస్తవః కృణ్వత" అన్నాడు. అనిన శరీరమును క్షీణింప చేసికొని తపస్సు చేయుట అని అర్థము.
మానవునకు ప్రధానమయినది కర్మ, పని. పనిలేనిది మానవుడు మనజాలడు. పని తరువాత అవసరమయినది యజ్ఞము, ప్రయత్నము.
కర్మకాండ అని పేరొందిన ఒక విధి విధాన యజ్ఞము మానవులకు సౌఖ్యములు సమకూర్చుటకు ఏర్పడినది. ఇది భగవధారాధనము.
యజ్ఞమునకు సాధనసంపద సమకూర్చువాడొకడు. అతడు యజమాని. యజ్ఞమును జరిపించువాడొకడు. అతడు ఋత్విక్కు.
యజమానికి కర్మకాండతోగాని, ఋత్విక్కునకు సాధన సామగ్రితోకాని సంబంధములేదు.
తపస్సు అటువంటిది కాదు. సంపూర్ణ స్వప్రయత్నయుక్తము. దీనికి చేయువాడు. చేయించువాడు ఉండరు.
స్వసంకల్పము స్వప్రయత్నము ఇచట దేహమే యజ్ఞభూమి. సంకల్పమే ఋత్విక్కు. ఇది జ్ఞానమునకు మార్గము కావచ్చును.
3. "ఋతము" ఇది వేదమున అతిప్రధాన పదము. దీనిని దయానంద సరస్వతి "సత్యము" గను. శాయణాచార్యులు యజ్ఞముగను వ్యాఖ్యానించినారు.
23-8 మంత్రమున వచ్చిన ఋతమునకు శాయణుడు "ఋతశబ్దేనేంద్రోవా దిత్యోవా సత్యంవా యజ్ఞోవా ఉచ్యతే" అని అనేక అర్థములను చెప్పినాడు.
ఋతము "సత్యము" అని నా అభిప్రాయము. సత్యము అనిన నిజము చెప్పుట మాత్రముకాదు. 'సత్' ఉన్నది. అసత్ లేనిది. సదసద్వివేకము ఉన్నది లేనిది వీటిని గురించిన జ్ఞానము.
సకల చరాచర ప్రపంచము అసత్. ఉండునదికాది. వచ్చిపోవునది. దీనికి స్థిరత్వము. శాశ్వతము లేదు.
'సత్' ఉన్నది. శాశ్వతమైనది. పరమాత్మ స్వరూపము.
అర్థము జీవితమును ఎరుగుట. పరమార్థము పరాత్పరుని ఎరుగుట.
పరాత్పరుడు ఎవడు? అదియే మానవులకు ఎన్నటికి తెలియనిది. ప్రస్తుతము మనము విశ్వసించినవాడే ఈశ్వరుడు. ఇది విశ్వాసము మాత్రమే !
మానవుని ఆలోచనకు గోచరించని ఒక మహా పదార్థము పరమాత్మ. పరమేశ్వరుడు. పరంధాముడు. అతడే 'ఋత్'
కావున ఋతమే సర్వమునకు కారణము అని చెప్పినాడు.
ఋతము భౌతికము కాదు.
4. 24-9,10 విపణి మార్కెట్ ను గురించి వివరించినవి.
ఒక పదార్థమునకు వ్యాపారి స్వల్ప మూల్యము ఇచ్చును. స్వల్ప మూల్యము ఇచ్చువాడే వ్యాపారి. ఉత్పత్తిదారునకు లేదా వినియోగదారునకు "మూల్యము" తెలియదు. మోసపోవువాడే ఉత్పత్తిదారుడు, వినియోగదారుడు.
అమ్మిన వాడు అసలు విషయము తెలిసికొని కొన్నవాని వద్దకు వెళ్లును. అతడు నిబంధన వల్లించును. "విప్రదుహన్తి యథోక్తం క్రియకాలే తద్వై లభ్యతే" అని శాయణ వ్యాఖ్య. కొనుగోలు జరిగినప్పటిమాటయే నిశ్చయము అననుకాని అణుమాత్రము ఎక్కువ ఇవ్వడు.
ఇది ఎంతటి జీవిత సత్యము ! దీనికి వేదకాలమునుండి కంప్యూటర్ కాలము వరకు మార్పులేదు !! అందుకే అది వేదము అయినది.
10వ మంత్రమున 'కొనుగోలు' కానిది 'అద్దె' వంటిది ఏదో చెప్పబడినది. ఇంద్రుడు సంకేతము మాత్రమే. ఒక వ్యక్తి లేక పదార్థమును అవసరమునకుగాను ద్రవ్యము ఇచ్చి తీసికొని అవసరము తీరిన వెనుక అప్పగించుట LEASE వంటిది ! అది వేదమున ఉన్నది !!
ఇరువది అయిదవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. హితకరుడు, దేవతాభిలాషి, కోరికలుగల మానవుడు ఎవడు ఇంద్రునితో మైత్రి కోరును? సోమాభిషవకారియగు ఏ వ్యక్తి అగ్నిని ప్రజ్వలింపజేసి ఇంద్రుని మహా ఆశ్రయ లాభము కొఱకు స్తుతించును?
2. ఎవడు ఏ యజమాని స్తుతి వాక్యముల ద్వారా సోమార్హుడగు ఇంద్రునిముందు అవనతుడు అగును? ఎవడు ఇంద్రుని స్తుతించగోరును? ఎవడు ఇంద్రుడు దానముచేసిన గోవులను అందుకొనును? ఎవడు ఇంద్రుని సాహచర్యము వాంఛించును? ఎవడు ఇంద్రుని స్నేహము కోరును? ఎవడు ఇంద్రుని భ్రాతృభావమును వాంఛించును? ఎవడు క్రాంతదర్శనుడగు ఇంద్రుని ఆశ్రయము కొఱకు ప్రార్థించును?





