Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
గోహర్ మిర్జా మోతీ సరస్సు ఒడ్డున తివాచీ పరిపించాడు. అక్కడే చెట్లల్లో అటు ఇటూ తిరిగాం. సాయంత్రం నుంచి రెండు గడియల రాత్రి దాకా జాతర లో తిరిగాం. ఇంటికి వెళ్ళడానికి మేనాలో ఎక్కాం. చూస్తె ఖుర్షిద్ మేనా ఖాళీగా కనిపించింది. ఎంత వెదికినా కనిపించలేదు. చివరకు నిరాశ చెంది ఇంటికి వచ్చాం. వినగానే ఖానమ్ నెత్తీ నోరు బాదుకుంది. ఇల్లంతా విచారంలో మునిగిపోయింది. నేను రాత్రంతా ఏడిచాను. ప్యారేసాహాబ్ ఇంటికి మనిషి వెళ్ళాడు. పాపం పరుగెత్తుకొని వచ్చాడు. తనకు ఏమాత్రం తెలియదనీ, తాను జాతరకు సైతం వెళ్ళలేదనీ , బెగమ్ శరీరం బాగా లేదనీ వెలబాట్లు విని అనుమానం కాస్తా తీరింది. కారణం ఏమంటే, పెళ్ళి తరవాత భార్యను విడిచి ఉండడం లేదు. చౌకు వైపు రావడం కూడా మానేశారు. రాత్రి అయితే ఇంటి నుంచి వెళ్లేవారే కాదు. ఖుర్షీద్ కనిపించలేదనే వార్త విని పూర్వప్రేమ గుర్తుకు వచ్చినట్లుంది . వచ్చేశారు.
ఖుర్షీద్ తప్పిపోయిన తరవాత నెల పదిహేను రోజులకు ఒక మహాశయుడు నా గదిలో అడుగు పెట్టాడు. పద్దతి పట్టణపు సొగసు గానిలా ఉంది. చామనచాయ. ఒక శాలువ నడుముకు, మరొకటి తలకూ కట్టుకున్నాడు. వచ్చి రత్నకంబళి మీద కూర్చున్నాడు. అతనిలో కాస్త అల్పత్వం కనిపించింది. వేశ్యల ఇండ్లకు ఎక్కువగా వెళ్ళినవానిలా లేడు. గదిలో నేను ఒక్కర్తేనే ఉన్నాను. బువాహుసేనీ ని పిలిచాను. ఆవిడ వచ్చింది. ఆవిడను చూచి అతను లేచి నుంచున్నాడు. సిగ్గుపడుతూ బువాహుసేనీ చేయి పట్టుకొని వేరుగా వెళ్ళి ఏదో మాట్లాడాడు. ఆ మాటల్లో కొన్ని వినిపించాయి. కొన్ని వినిపించలేదు. తరవాత బువాహుసేనీ ఖానమ్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ మాటలు జరిగాయి. చివరకు తేలిందేమంటే నెల డబ్బు ముందుగా ఇవ్వాలి. అతను నడుముకు కట్టి ఉన్న రూపాయల సంచీ తీశాడు. బువాహుసేనీ కొంగు చాచింది. గలగల మని రూపాయిలు కొంగులో పోశాడు.
బువాహుసేనీ : ఎన్ని ఉన్నాయి?
అతను : తెలియదు లెక్కించండి.
బువాహుసేనీ : నాకేం తెలుస్తుంది లెక్క?
అతను : డెబ్బై అయిదు ఉండవచ్చు. ఒకటి రెండు ఎక్కువ తక్కువా.
బువాహుసేనీ : అయ్యా! డెబ్బై అయిదంటే ఎన్ని?
అతను : మూడు ఇరవై లు పైన పదిహేను -- పాతిక తక్కువ నూరు.
బువాహుసేనీ : పాతిక తక్కువ నూరు. అంటే ఇది ఎన్ని రోజులకు ?
అతను : పదిహేను రోజులకు. మిగతా పదిహేను రోజులది రేపిస్తాను. మొత్తం నూట యాబై బిళ్ళలు మీకు రేపు అందుతాయి.
"బిళ్ళలు" అనే మాట నాకు బాగనిపించలేదు. దాంతో అతను ఎలాంటివాడో తెలిసిపోయింది. కాని వేశ్యావృత్తి పరాధీనపు బ్రతుకు. ఏం చేయగలను ?
బువాహుసేనీ డబ్బు తీసుకొని ఖనమ్ దగ్గరికి వెళ్ళింది. ఎలా అంగీకరించిందో తెలియదు. ఖానమ్ . పెద్ద పెద్ద అమీర్ల దగ్గర కూడా డబ్బు విషయంలో ఒక్క నిముషం ఆలస్యం కానిచ్చేది కాదు. ఒకరోజంతా వేచి ఉండడానికి అంగీకరించింది.
తరవాత వారు నా గదిలో నిశావాసులైపోయారు. ఎప్పుడో జామురాత్రి తరవాత తలుపు తట్టినట్లు వినిపించింది. అతను వెంటనే లేచి కూర్చున్నాడు. "వెళ్తాను, మళ్ళీ రేపు రాత్రికి" అని అయిదు నవర్సులు, మూడు ఉంగరాలు ఇచ్చి వెళ్ళాడు. వాటిల్లో ఒకటి రత్వపుది , రెండవది వైడూర్యపుది" ఇది నీ కోసం. ఖానమ్ కి ఇవ్వవద్దు" అని చెప్పి ఇచ్చాడు. వ్రేళ్ళకు పెట్టుకొని చూచాడు. చాలా అందంగా ఉన్నాయి. పెట్టె తెరచి నవర్సులను, ఉంగరాలను 'చోర్ ఖానాలో వేసి మూసేశాను.
రెండవరోజు రాత్రికి వచ్చాడు. నేను విద్యాభ్యాసంలో ఉన్నాను. వచ్చి పక్కన కూర్చున్నాడు. వాద్యపువాళ్ళకు అయిదు రూపాయిలిచ్చాడు. ఉస్తాద్ జీ , సారంగి వారూ పొగడ్త సాగించారు. అతని నడుమునకు ఉన్న శాలువ కొట్టేయ్యాలని ఉస్తాద్ జీ ప్రయత్నం. నోరు తెరచి అడిగాడు. కానీ ఖాళీ. అతను ఇవ్వలేదు.
అతను : ఉస్తాద్ జీ! డబ్బు గిబ్బూ ఏది కావాలన్నా ఉంది. కాని ఈ శాలువ ఇవ్వలేను.
అది ఒక మిత్రుని గుర్తు.
ఉస్తాద్ జీ ముఖం మాడ్చుకున్నారు.
తరవాత చదువు ముగిసింది. బువాహుసేనీ కి మిగతా డెబ్భై అయిదు దూపాయలిచ్చి , తమ తరపున ఆవిడకు అయిదు రూపాయలు ఇచ్చాడు. ఆవిడ వెళ్ళిపోయింది. గదిలో మేమిద్దరమే ఉన్నాం.
అతను : రెండు నెలల క్రితం అయిష్ బాగ్ జాతరలో ....
నేను : అయితే రెండు నెలల తరవాతనా?
అతను : లక్నో లో లేను. బయట వెళ్ళాను. మళ్ళీ వెళ్ళాలి.
నేను బోగపుటక్కులు సాగించాను.
నేను : అయితే నన్ను వదిలి వెళ్ళిప
ోతారన్నమాట?
అతను : కాదు, త్వరలోనే వచ్చేస్తాను.
నేను : మీ ఇల్లెక్కడ ?
అతను : ఇల్లు ఫరుఖాబాదులో , లక్నో లో చాల పని ఉంటుంది. ఇక్కడే ఉంటాను. అప్పుడప్పుడు బయట వెళ్ళి వస్తుంటాను.
నేను : ఈ శాలువ ఎవరి గుర్తు?
అతను : ఎవరిదీ కాదు.
నేను : వాహ్ ! అర్ధమైంది. అది మీ ప్రియురాలి గుర్తు.
అతను : కాదు. నీతోడు. నాకెవరూ లేరు. అన్నీ నువ్వే.
నేను : అయితే ఇచ్చేయండి.
అతను : ఇవ్వలేను.
నేను భరించలేకపోయాను. ఇంతలో మరకతాలు, గల పెద్ద పెద్ద ముత్యాల హారము, వజ్రాలు తాపిన మురుగుల జత , రెండు బంగారపు ఉంగరాలు నాముందు ఉంచాడు. వాతాన్నిమ్తిని తీసుకొని పెట్టెలో పెట్టి మూసేశాను. వేల రూపాయలు ఇలా ఇచ్చేస్తున్నాడు. కాని ఆ శాలువ ఎందుకు ఇవ్వడు? మహా అయితే అది అయిదు వందల ఖరీదు చేస్తుంది. పట్టుపట్టి సాధించాల్సిందిగా కనిపించలేదు.
అతని పేరు పైజలీ. జాము, జామున్నర రాత్రికి, ఒక్కొక్కప్పుడు అర్ధరాత్రికి వచ్చేవాడు. జామురాత్రి ఉండగా లేచి వెళ్ళిపోయేవాడు. తరచుగా తలుపు తట్టిన శబ్దం గాని, ఈల గాని వినిపించేది. అది వినిపించగానే ఫైజాలీ వెళ్ళి పోయేవాడు. నెలా పదిహేను రోజులు గడిచాయి. నా పెట్టె ఆభరణాలతో నిండిపోయింది. నవర్సులు, రూపాయలు లెక్కలేవు. ఖానమ్ , బువాహుసేనీ తెలియని పది పన్నెండు వేల సొమ్ము నా దగ్గర కూడింది.
ఫైజాలీ విషయంలో నాకు ఇష్టం గానీ, అయిష్టం గానీ లేదు. అయిష్టత కలగాల్సిన అవసరం ఏమి? అతడే మంత అనాకారి కాడు. రెండవది డబ్బు విచిత్రం అయింది. వారు వచ్చేవరకూ తలుపు వైపే నా చూపుండేది. ఇప్పుడు గోహర్ మిర్జా పగటి పూట మాత్రం వస్తున్నాడు. రాత్రి వచ్చేవాళ్ళకు కూడా నేను ఒకరికి కట్టుబడిపోయానని అర్ధం అయింది. కాబట్టి త్వరగానే వెళ్ళిపోయేవారు. తిష్ట వేసుకుని కూర్చునేవారిని ఏదో ఒక నెపంతో పంపించేదాన్ని.
ఖుర్షిద్ కోసం గాలించడం జరిగింది. కాని జాడ తెలియలేదు. ఈలోగా ఫైజాలీకి నామీద ప్రేమ కలిగింది. అతడు దాన్ని అనేక విధాల వ్యక్తం చేశాడు. తొలుత గోహర్ మిర్జా ను వలచి ఉండలేకపోయినట్లేయితే ఫైజాలీ ని ప్రేమించేదాన్నే. అతనికే హృదయం అర్పించేదాన్ని. అయినా అతనిని రంజింపచేయడంలో కొంత రానీయలేదు. ప్రేమిస్తున్నాని పైజాలీ ని మోసగించాను. పాపం, నమ్మాడు. వలలో చిక్కాడు. అతడు రహస్యంగా నాకు ఇచ్చింది ఇతరులకు తెలియదు. ఖానమ్ , బువాహుసేనీ ఆదేశం ప్రకారం కొన్ని కోరవలసివచ్చేది. అది తీర్చడం కూడా తన విధిగా భావించేవాడు. అతనికి డబ్బంటే లెక్కలేదు. రాకుమారులలో గానీ, అమీర్లలో గాని అలాంటి మనిషి కనిపించలేదు.





