Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
2. ఈ సోమము సూర్యుని వలె సమస్త లోకములను వీక్షించును. ముప్పది రాత్రింబవళ్లవైపు సాగును. ఇది స్వర్గము సప్తసింధులను చుట్టిఉన్నది.
3. శుద్ధిచేయబడు సోమము సూర్యునివలె సమస్త భువనముల మీద నిలుచును.
4. సోమమా ! నీవు ఇంద్రాభిలాషివి - శోధితుడవు. మా కొరకు గోయుక్త అన్నమును నలువైపుల వర్షించుము.
ఏబది అయిదవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. సోమమా! మాకు కావలసినన్ని యవలు, అన్నము ఇమ్ము. సకల సౌభాగ్యశాలి సంపదలు ఇమ్ము.
2. సోమమా! అన్నరూపమగు నీ స్తోత్రమును. నీ ప్రాదుర్భావమును పాడినాము. ఇప్పుడు నీవు ప్రసన్నదాయకములగు మా కుశలమీద ఆసీనుడ వగుము.
3. సోమమా! నీవు నాకు గోదాతవు - అశ్వదాతవు. కొరత రాజులందు అన్నముతో విచ్చేయుము.
4. సోమమా! నీవు అపరిమిత శత్రువిజేతవు. నిన్ను ఓడించగలవాడు లేడు. నీవు స్వయముగా శత్రువులను వధింతువు. క్షరితమగుము.
ఏబది ఆరవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వగత్
1. క్షిప్రకారి, దేవాభిలాషి సోమము దశాపవిత్రమున చేరి, రాక్షసులను నష్టపరిచి మాకు మరింత అన్నము ఇచ్చును.
2. సోమపు కర్మాభిలాషులను వందధారలకు ఇంద్రుని బంధుత్వము లభించినపుడు సోమము మాకు అన్నప్రదానము చేయును.
3. కన్య జారుని పిలిచినట్లు - పది అంగుళులు శబ్దము చేయుచు శోధించును. అది మా ధనలాభమునకును, ఇంద్రుని కొరకును అగును.
4. సోమమా! నీ ప్రియరసమును ఇంద్రుని కొరకును, విష్ణువు కొరకును క్షరితమొనర్చుము. కర్మనేతలను స్తుతికర్తలను పాపవిముక్తులను చేయుము.
ఏబది ఏడవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. ద్యులోకపు వర్షధార ప్రజకు అపార అన్నము కలిగించును. సోమమా! అట్లే నీధారలు అపార అన్నము కలిగించును.
2. హరితవర్ణసోమము దేవతల సకల ప్రియకార్యములను వీక్షించును. తన ఆయుధములతో రాక్షసులను హతమార్చును. యజ్ఞమునకు వచ్చును.
3. సుకృత సోమము మానవులచే శోధితమై, రాజువలెను, శ్యేనపక్షివలెను నిర్భయముగా వసతీవరజలమున కూర్చుండును.
4. సోమమా! నీవు క్షరితమగుచునే భూమి మీది సకల ధనములను మావద్దకు తెమ్ము.
ఏబది ఎనిమిదవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. దేవతలకు హర్షము కలిగించు సోమము స్తోతలను ఉద్ధరించుచు క్షరితమగును. అభిషుత, దేవాన్నరూపసోమము కురియును. హర్షదాతి సోమము క్షరితమగును.
2. సోమపు ధనప్రసవణ, ప్రకాశమాన ధార మానవులను రక్షించుట ఎరుగును. హర్షదాత సోమము స్తోతలను రక్షించుచు పరుగులిడును.
3.ధ్విస్ర, పురుసన్తి రాజులనుండి మాకు వేయి, వేయి ధనములు లభించినవి. హర్షదాత సోమము స్తోతలను తరింప చేయుచు పరుగులిడును.
4. ధ్విస్ర, పురుసన్తి రాజులనుండి మేము మూడువందలవేల వస్త్రములు పొందినాము. హర్షదాత సోమము స్తోతలను తరింప చేయుచు పరుగులిడును.
ఏబది తొమ్మిదవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. సోమమా! నీవు గోవులు, అశ్వములు, లోకములు, రమణీయ ధనమును జయించుచు క్షరితమగుము. పుత్రాది యుక్త రమణీయ ధనమును మా కొరకు తెమ్ము.
2. సోమమా! నీవు వసతీ వరజలమునుండి ప్రవహింపుము. కిరణములందు ప్రవహింపుము. ఓషధులమీద ప్రవహింపుము. శిలల మీద ప్రవహింపుము.
3. క్షరణశీల, క్రాంతి కర్మ సోమమా! రాక్షసులు కలిగించిన ఉపద్రవములను దూరము చేయుము. ఈ దర్భల మీద కూర్చుండుము.
4. పవమాన సోమమా! యజమానులకు సమస్తము సమకూర్చుము. నీవు పుట్టుకతోనే పూజనీయుడవు. సకల శత్రువులను నీ తేజమున అణచివేసెదవు.
అరువదవ సూక్తము
ఋషి - కాశ్యపవత్సారస్యుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - 3
ఉష్ణిక్ మిగిలినవి గాయత్రి.
1. స్తోతలారా! సూక్ష్మదర్శక, సహస్రచక్షు, సంస్కర్త సోమమును గాయత్రీసామమున స్తుతించండి.
2. సోమమా ! నీవు బహుదర్శన, బహుభరణ, అభంగు తమవు. ఋత్విక్కులు నిన్ను మేషలోమమున జల్లింతురు.
3. క్షరణశీల సోమము మేష లోమము నుండి సాగి, ద్రోణ కలశమున పడి ఇంద్రుని హృదయమున ఆసీనుడగును.
4. బహుదర్శిసోమమా! ఇంద్రుని ఆరాధనకుగాను నీవు చక్కగా క్షరితమగుము. మాకు పుత్రాది యుక్త ధనము ప్రసాదించుము.
(శ్రీమదాంద్ర వచన ఋగ్వేదసంహిత ఏడవ అష్టకము తొమ్మిదవ మండలమున రెండవ అనువాకము సమాప్తము.)
మూడవ అనువాకము అరువది ఒకటవ సూక్తము
ఋషి - అంగిరస అమహీయుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు గాయత్రి.
1. యుద్ధమున తొంబది తొమ్మిది శత్రుపురములను ధ్వంసము చేసినట్టి రసముతో ఇంద్రుని పానమునకు ప్రవహింపుము.
2. ఆ సోమరసము ఒకేఒక్కరోజున శంబరుని శత్రుపురముల ప్రభువును - సత్యకర్ముడగు దివోదాసునాకు వశపరచినది. తదుపరి అదే సోమరసము దివోదాసు శత్రువులు తుర్వస, యదువులను వశపరచుకున్నది.
3. సోమమా! నీవు అశ్వదాతవు. బహు గో, అశ్వ, హిరణ్యయక్త ధనమును పంచిపెట్టుము.
4. సోమమా! క్షరణ శీలము, దశాపవిత్రమును ఆర్ద్రము చేయు నీ స్నేహము కొరకు ప్రార్థించుచున్నాము.
5. సోమమా! నీ తరంగములు దశాపవిత్రపు నలుదిశలందు పడుచున్నవి. అవి మాకు సుఖములను ప్రసాదించవలెను.
6. సోమమా! నీవు సమస్త విశ్వమునకు ఈశ్వరుడవు. "ఈశానః సోమ విశ్వతః" అభిషుత, శోధిత సోమమా! మాకు ధనమును, పుత్రాదియుక్త అన్నమును కొనితెమ్ము.
7. సోమమునకు మాతలు నదులు - "సిన్ధుమాతారమ్." ఈ సోమమును పడి అంగుళులు మార్జించును. ఆ సోమము అదితి పుత్రులతో కలసి ఉండును.
8. అభిషుత సోమము దశాపవిత్రమును ఇంద్రునితోను, వాయువుతోను, సూర్యకిరణములతోను కలసి ఉండును.
9. సోమమా! నీవు మధుర రసమవు. కళ్యాణరూపుడవు. అభిషుతడవు. నీవు భగ, వాయు, పూష, మిత్ర. వరుణుల కొరకు క్షరితమగుము.
10. నీ అన్నము ద్యులోకమున పుట్టినది. నీవగు ప్రవృద్ధ సుఖములు, ప్రచుర అన్నము భూమి మీద ఉన్నవి- "ఉగ్రం శర్మామహిశ్రవః"
11. ఈ సోమపుసాయమున మేము సకల మానవుల అన్నములను ఉపార్జింతుము. భాగస్వాములము కాదలచినపుడు భాగములు చేయుదుము.
12. పవమాన సోమమా! నీవు అభిషుతమై మాకు పూజనీయులగు ఇంద్ర, వరుణ, మరుత్తుల కొరకు క్షరితమగుము.
13. సోమము సమ్యక్ ప్రాదుర్భూతము. వసతీవరిద్వారా ప్రేరితము. శత్రుభంజకము. దుగ్ధాదులచే సంస్కృతము. అట్టి సోమము వద్దకు ఇంద్రాది దేవతలు వచ్చెదరు.
14. ఇంద్రునకు హృదయంగమమగు సోమమునే మా స్తుతులు వర్ధిల్లచేయును. పాలిచ్చు తల్లులు పిల్లలనువలె - ఈ స్తుతులు సోమమును కోరును.
15. సోమమా! మా గోవులకు సుఖము కలిగించుము. మాకు విశేష అన్నము ప్రసాదించుము. శుభ్రజలములను పెంచుము. "వర్ధాసముద్రము ముక్ధ్యమ్."
16. క్షరితమగుచునే సోమము వైశ్వానరజ్యోతిని ద్యులోక చిత్రమును విస్తరింప చేయుటకు వజ్రసమమగా సృష్టించినది.
17. దీప్యమాన సోమమా! క్షరణశీలమగు నీ రాక్షస శూన్య, మాదక రసము మేషలోమమువైపు సాగును.
18. పవమాన సోమమా! ప్రవృద్ధము, దీప్తశాలియగు నీ రసము క్షరితమై, బ్రహ్మాండమంతట వ్యాపించి దృష్టిగోచరమగును.
19. సోమమా! నీ యొక్క రసము దేవకామి -రాక్షస హంత - ప్రార్ధనీయ మదకర అట్టి రసము అన్నముతో క్షరితమగుము.
20. సోమమా! నీవు శత్రువగు వృత్రుని వధించినావు - "జఘ్నిర్వత్రమ మత్రమం." నీవు నిత్యము యుద్ధమును ఆశ్రయింతువు. నీవు గోదాతవు. అశ్వదాతవు.
21. సోమమా! నీవు రుచికరములగు పాలతో కలియుము. గరుడ పక్షివలె వేగముగ సాగుము. నీ స్ధానమును అలంకరించుము. శోభిల్లుము.
22. వృత్రుడు జలసమూహములను నిరోధించినపుడు, వృత్ర వధవిషయమున ఇంద్రుని రక్షించినావు. అట్టి నీవే ఇప్పుడు క్షరితుడవగుము.
23. సేచక, క్షరణశీల సోమమా! కళ్యాణ పుత్రులము, అంగిరస అమహేయులము శత్రువు ధనమును జయించవలెను. మా స్తుతులను వర్ధిల్లచేయుము.
24. నీ రక్షణలతో మేము శత్రువులను నాశము చేయుదుము. మా పనుల విషయమున నీవు అప్రమత్తుడవగుము.
25. హింసక శత్రువులను, అదాతలను వధించుచు ఇంద్ర స్ధానమును చేరి క్షరితమగుము.
26. పవమానసోమమా! మా కొరకు మహాధనము తెమ్ము. శత్రువులను హతమార్చుము. పుత్రాదియుక్త కీర్తి నొసంగుము.
27. సోమమా! నీ శోధన సమయమున మాకు ధనము నివ్వ దలచినను, ఖాద్యము నివ్వదలచినను అప్పుడు నిన్ను వందల మంది శత్రువులు కూడ నివారించజాలరు.
28. సోమమా! అభిషుత, సేవకుడవగు నీవు లోకములందు మమ్ము యశస్వులను చేయుము. సకల శత్రువులను చంపుము.
29. సోమమా ! ఇది యజ్ఞము. ఇందు మాకు నీ బంధుత్వము లభించవలెను. అందువలన శ్రేష్ఠ అన్నమున మేము పుష్టికలవారలమగుదుము. అప్పుడు శత్రువులను యధేష్టముగా సంహరించెదము.
30. సోమమా! నీ ఆయుధములు అతి భయంకరములు. తీక్షములు. శత్రుసంహారకములు. వాటి నీడన మమ్ము శత్రుపరాజయ అవమానము నుండి రక్షింపుము.
అరువది రెండవ సూక్తము
ఋషి - భార్గవ జమదగ్ని, దేవత - పవమానసోమము, ఛందస్సు -గాయత్రి.
1. సోమము సకల సౌభాగ్యములను మా కొసంగును. అందుకే దశాపవిత్రమున త్వరత్వరగా ఆవిర్భవింపచేయబడును.
2. బలవంత సోమము పాపములను నష్టపరచుచు మా పుత్రులను, అశ్వములను సుఖవంతులను చేయుచు దశాపవిత్రమున ఆవిర్భవించును.
3. మాకు గోవులనిచ్చుచు - ధనములు ప్రసాదించుచు - అన్నములు అందించుచు సోమము మాస్తుతుల దిశగా వచ్చును.





