Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయే త్సర్వ విఘ్నోప శాంతయే
ఆంధ్ర వచన ఋగ్వేద సహింత
ఏడవ అష్టకము
తొమ్మిదవ మండలము
మొదటి అధ్యాయము
రెండవ అనువాకము నలుబది నాలుగవ సూక్తము
ఋషి - అంగిరస ఆయాస్యుడు, దేవత - పవమాన సోమము, చందస్సు - గాయత్రి.
ఓం ప్రణఇందో మహేతన ఊర్మినబిబ్ర దర్లసి |
అభిదేవాఁఅయాస్య
1. సోమమా! మాకు మహా ధనము ఇచ్చుటకు వచ్చెదవు. అయాస్య ఋషి నీ తరంగములను వహించును. దేవతలను పూజించుటకు సాగును.
2. క్రాంతికర్మ సోమమును స్తుతించుటకుగాను విప్రస్తోతలు యజ్ఞమున నియమించబడినారు. సోమధార దూరదేశము వరకు వ్యాపించును.
3. జాగరణశీల విచక్షణ సోమము అభిషుతమగును. దేవతలవైపు సాగును. దశాపవిత్రమునకు చేరును.
4. సోమమా! కుశలుగల ఋత్విక్కులు నీకు పరిచర్యలు చేయుదురు. మా కొరకు అన్నము కోరుము. హింసారహిత యజ్ఞమును చక్కగా నిర్వహించుము. తదుపరి క్షరితమగుము.
5. విప్రులు సోమమును వాయువు భగుని వద్దకు పంపుదురు. సోమము నిత్యవర్థకము. సోమము మాకు దేవతల వద్దగల ధనమును అందించవలెను.
6. సోమమా! నీవు కర్మప్రాపకుడవు. పుణ్యలోకముల మార్గము తెలిసినవాడవు. మాకు ధనలాభము కలుగుటకు మహాబలమును అన్నము జయించుము.
నలుబది అయిదవ సూక్తము
ఋష్యాదులు పూర్వమువలె
1. సోమమా! నీవు నేతలకు దర్శకుడవు. దేవయజ్ఞమందు ఇంద్రుని ఉన్మత్తు పానమునకును, సుఖము కొరకును క్షరితమగుము.
2. సోమమా! నీవు మాకు దూతకార్యము నిర్వర్తించుము. ఇంద్రుని కొరకు త్రాగబడుదువు. మా కొరకు దేవతల వద్దనుంచి శ్రేష్ఠధనము తెమ్ము.
3. సోమమా! మత్తునకుగాను రక్తవర్ణముగల నీయందు పాలు మున్నగునవి కలుపుదుము. మా కొరకు ధనముల ద్వారములు తెరువుము.
4. పయనసమయమున అశ్వము రథమున చేరినట్లు సోమము దశాపవిత్రమున చేరి దేవతల మధ్యకు చేరును.
5. దశాపవిత్రము దాటి సోమము జలక్రీడలాడునపుడు ప్రియబంధు స్తోతలు ముక్త కంఠమున స్తుతింతురు. వచనములతో గుణకీర్తనము చేయుదురు.
6. సోమమా! పానము చేసినంత విచక్షణస్తోతకు శోభనబలము ప్రసాదించురీతి ధారగా పడుము.
నలుబది ఆరవ సూక్తము
ఋష్యాదయః పూర్వవత్
1. అభిషవ ప్రస్తరముల మీద ప్రవృద్ధమైన సోమము కార్యపరాయణ అశ్వమువలె క్షరితమగును.
2. తండ్రి చేత అలంకరించబడిన కన్య తన స్వామి వద్దకు చేరినట్లు - సోమము వాయువు వద్దకు చేరును.
3. ఉజ్వలములను అన్నవంతములగు సోమములన్నియు ప్రస్తర ఫలక ద్వయమున అభిషుతమై యజ్ఞమూలమున ఇంద్రుని ప్రసన్నము చేయును.
4. కళ్యాణహస్తములుగల ఋత్విక్కులారా ! శుక్లవర్ణ సోమమును అందుకొనండి. సోమమును దుగ్ధాదులతో సంస్కరించండి.
5. శత్రుధనమును జయించు సోమమా! నీవు కోరికల దారులు తెలిసినవాడవు. మాకు మహా ధనమును ప్రసాదించువాడవు. క్షరితుడవగుము.
6. పది అంగుళులు - శోధనీయ క్షరణశీల మదకర సోమమును - ఇంద్రుని కొరకు దశాపవిత్రమున శోధించును.
నలుబది ఏడవ సూక్తము
ఋషి - భ్వగుపుత్ర కవి, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. శోభన అభిషవాది క్రియల ద్వారా ఈ సోమము దేవతల కొరకు వృద్ధిచెందినది. ఆనందమున ఆబోతువలె అరుచును.
2. ఈ సోమపు అసురనాశక కర్మలకు మేమే కారకులము. బలశాలి సోమము ఋణవిమోచన కార్యము కూడ చేయును.
3. ఇంద్రుని మంత్రము ఆవిర్భవించినపుడు - ఇంద్రునకు ప్రియతమ రసము బలశాలి వజ్రమువలె అవధ్య - సోమము మాకు అపారధనదాత అగును.
4. క్రాంతకర్మ సోమము అంగుళులతో శుద్ధము చేయబడి స్వయముగా విప్రుల కొరకు ఇంద్రుని రమణీయ ధనము అందుకొనును.
5. సోమమా ! యుద్ధభూమికి వెళ్లు అశ్వములకు గడ్డి అందించినట్లు యుద్దమున శత్రువును గెలిచినవారికి ధనము అందింతువు.
నలుబది ఎనిమిదవ సూక్తము
ఋష్యాదయః పూర్వవత్
1. సోమమా! నీవు ద్యులోక వాసివి. ధనమునకు, శుభములకు కారకుడవు. మేము నిన్ను పూజింతుము. ధనము యాచింతుము.
2. సోమమా! నీవు పరాక్రమ శత్రువినాశకుడవు. ప్రశంసనీయుడవు. ఆనందకరుడవు. అనేక శత్రుపుర ధ్వంసకుడవు. మేము నిన్ను యచింతుము.
3. శోభన కర్మల సోమమా! నీవు ధనములకు సామ్రాట్టువు. అందువలననే శ్యేనము నిన్ను సులభముగా స్వర్గము నుండి చేర్చినది.
4. జలవర్షకులు, యజ్ఞసంరక్షకులు, స్వర్గస్థసమస్త దేవతలకు సమముగా శ్యేనపక్షి స్వర్గము నుండి సోమము తెచ్చినది.
5. కర్మముల సూక్ష్మదర్శకుడు, యజమానుల అభీష్టప్రదాత, స్వబల ప్రయోగకారి సోమము ప్రశంసనీయమగు తన మహత్వమును చేరుకొనును.
నలుబది తొమ్మిదవ సూక్తము
ఋష్యాదయః పూర్వవత్
1. సోమమా! మా కొరకు అంతరిక్షమునుండి నలుదిశల వర్షము కలిగించుము. ద్యులోకమునుండి జలతరంగములు పంపుము. అక్షయ అన్నమహా భండారములను అవతరింప చేయుము.
2. సోమమా! శత్రుదేశమున పుట్టిన ఆవులు ఈలోకమునకు - మా ఇంటికి చేరురీతి ధారగా క్షరింపుము.
3. సోమమా! యజ్ఞములందు నీవు అత్యంత దేవాభిలాషివి. మా కొరకు ఘృతధారతో క్షరితుడవగుము.
4. సోమమా! నీవు మా అన్నము కొరకు కుశమయ దశాపవిత్రమును ధారగా అందుకొనుము. నీ నడకల సవ్వడిని దేవతలు వినవలెను.
5. రాక్షసులను వధించుచు, తన దీప్తమును పూర్వమువలె ప్రదీప్తము చేయుచు క్షరణశీల సోమము ప్రవహించును.
ఏబదవ సూక్తము
ఋషి - అంగిరస ఉచథ్యుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. సోమమా! నీ వేగము సముద్ర తరంగ వేగమువలె ఉన్నది. నీ శబ్దము విల్లువిడిచిన బాణమువలె ఉన్నది.
2. నీవు ఉన్నత కుశమయ దశాపవిత్రమునకు వెళ్లుదువు. అప్పుడు నీ ఉత్పత్తి జరుగును. ఆసమయమున యజ్ఞాభిలాషి యజమాని నోటినుండి - ఋక్, యజు , సామ మూడు వచనములు వెలువడును.
3. దేవతలకు ప్రియము, హరిత వర్ణము, ప్రస్తర అభిషుతము. మధుర రసనిష్యందమగు సోమమును ఋత్విక్కులు మేషలోమము పై ఉంచుదురు.
4. మిక్కిలి మత్తు కలిగించు క్రాంతి కర్మ సోమమా! పూజ్య ఇంద్రుని ఉదరమున చేరుటకు దశాపవిత్రమును దాటి ఇంద్రుని ముందు క్షరితమగుము.
5. సోమమా! నీవు ఎంతో మత్తు కలిగింతువు. రుచికరమగు పాలతో కలియుము. ఇంద్రుని కొరకు క్షరితమవగుము.
ఏబది ఒకటవ సూక్తము
ఋష్యాదయః పూర్వవత్
1. పురోహితులారా! సోమమును రాళ్లతో అభిషవించండి. దశాపవిత్రమున ప్రవేశపెట్టండి. ఇంద్రుని పానము కొరకు పరిశుద్ధము చేయండి.
2. అధ్వర్యులారా! అత్యంత మధురము, ద్యులోక అమృతము, శ్రేష్ఠసోమమును వజ్రధర ఇంద్రునకు అర్పించండి.
3. మదకర, క్షరణశీల సోమమా! నీ అన్నమును ఇంద్రాది దేవతలు, మరుద్గణములు వ్యాపింపచేయుదురు.
4. సోమమా! అభిషుతమావై, దేవతలను వర్థిల్లచేసి, కోరికలు తీర్చి, వెంటనే మత్తు, రక్షణలు కలిగించి స్తోత వద్దకు చేరుదువు.
5. విచక్షణ సోమమా! అభిషుతమగుము. దశాపవిత్రము వైపుసాగుము. మా అన్నమును, కీర్తిని రక్షించుము.
ఏబది రెండవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. దీప్త, ధనదాత సోమమా! అన్నసహితముగా మా బలమును పెంచుము. అభిషుతమై దశాపవిత్రమున పడుము.
2. సోమమా! నీ ధారలు దేవతలను ప్రసన్నులను చేయును. అవి విస్తృతమగును. పాతభాగము, మేషలోమమునుండి దశాపవిత్రమునకు సాగును.
3. సోమమా! చరు, వంటి ఖాద్యమును మాకిమ్ము. ఇవ్వ దగిన వానిని ఇమ్ము. నీవు దంపుడుకు పారుదువు. కావున శిలాప్రహారము నుండి బయట పడుము.
4. అనేకులు ఆహ్వానించు సోమమా! మమ్ము యుద్ధమునకు పిలుచు శత్రువు బలమును దూరము చేయుము.
5. సోమమా ! నీవు ధనదాతవు. మమ్ము రక్షించుటకు నీ ధారలను ప్రవహింప చేయుము.
ఏబది మూడవ సూక్తము
ఋషి - కాశ్యప ఆవత్సారుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. రాళ్లనుండి పుట్టిన సోమమా! రాక్షసులను చంపు నీ వడి పెరిగినది. స్పర్ధించు శత్రుసేనలు మమ్ము బాధించుచున్నవి. వానిని నిలుపుము.
2. నీవు స్వబలమున శత్రువులను నాశము చేయ సమర్థుడవు. శత్రువు రథమున ధనము దాచినాడు. నేను నిర్భయముగా - ఆ ధనము కొరకు నిన్ను స్తుతింతును.
3. సోమమా! క్షరణ శీలమగు నీ తేజమగు దుర్బుద్ధులగు రాక్షసులు తాళజాలరు. నీతో యుద్ధము చేయవలెననుకున్న వానిని ధ్వంసము చేయుము.
4. మత్తు కలిగించు, హరితవర్ణ, బలశాలి సోమమును ఋత్విక్కులు ఇంద్రుని కొరకు వసతీవరజలమున చేర్చుదురు.
ఏబది నాలుగవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. ఈ సోమరసము ప్రాచీనము. ప్రకాశమానము. దీప్తము అపారము. ఇది కర్మఫలదాత కవులు ఈ రసమును పిండుదురు.





