Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
4. సోమము పర్వతములందు పుట్టును. మత్తు కలిగించుటకు అభిషుతమగును. జలమున ప్రవృద్ధమగును. శ్యేనము వడిగా వచ్చి తన స్థానమును ఆక్రమించును. అట్లే సోమము తన స్ధానమును అధిష్టించును.
5. దేవతలచే ప్రార్ధించబడిన, శుభ్రఅన్నమును ఆవుపాడి రుచికరము చేయును. అట్లే సోమము ఋత్విక్కులచే అభిషవింపబడి వసతీవరజలమున పరిశుద్ధమగును.
6. తదుపరి అనుష్ఠాతలగు ఋత్విక్కులు యజ్ఞమందు ఈ మాదక సోమరసమును అమరత్వము కొరకు - అశ్వమునువలె అలంకరింతురు.
7. సోమమా! నీ మధుర రసధారలు రక్షణల కొరకు ఏర్పడినవి. వాటి సహితముగా దశాపవిత్రమున కూర్చుండుము.
8. సోమమా ! అభిషుతమైన నీవు మేషలోమము నుండి వెడలి, ఇంద్రుని పానపాత్ర నుండి సాగి నీ స్ధానమున క్షరితమగుము.
9. సోమమా! నీ వద్ద స్వాదిష్టమును, మేము కోరిన ధనము ఉన్నది. నీవు అంగిరుల సంతానముకు ఘృత, దుగ్ధములను వర్షించుము.
10. సూక్ష్మదర్శక, పాత్రస్ధిత, క్షరణశీల సోమము జలములందు పుట్టిన అన్నములను పెంచును. అందుకే అందరు ఎరుగుదురు.
11. ఈ సోమము ధనవర్షి. కామవర్షి, రాక్షస హంత. క్షరణశీల. సోమము హవిర్ధాత యజమానికి ధనము లిచ్చును.
12. సోమమా! అపారము, అశ్వ, గోయుక్తము, హర్షద, అభిలషణీయ ధనమును వర్షించుము.
13. అనేక స్తుతులు కలిగి, కార్యక్షమతగల సోమము మానవులచే శోధితమై సించితమగును.
14. సోమము. అపారరక్షావంతుడు, బహుధని. లోకనిర్మాత. క్రాంతకర్మ. మదకరుడు. అతడు ఇంద్రుని కొరకు క్షరితుడగును.
15. పక్షితన గూటికి చేరినట్లు - పాదుర్ఖూత, స్తుతసోమము ఈ యజ్ఞమున ఇంద్రుని కొరకు - తన స్ధానమునకు చేరును.
16. ఋత్విక్కులచే అభిషవించబడిన క్షరణశీల సోమము తనస్ధానమగు చమసములందు యుద్ధమునందువలె నిలుచును.
17. ఋషుల యజ్ఞరూప రథమునకు మూడు పృష్టములు మూడు బంధురములు ఏడు ఛందోరూప పగ్గములు కలవు. దేవతల వద్దకు చేరుటకు. ఋత్విక్కులు ఆ యజ్ఞరథమునకు సోమాశ్వములను పూన్చెదరు.
18. సోమరూప అశ్వము అభిషవించబడునది. ధనస్రష్ట. బలశాలి. వేగవంతము. అట్టి అశ్వమును యజ్ఞరూప సంగ్రామము కొరకు అలంకరించండి.
19.అభిషుత సోమము కలశమువైపు సాగుచు, సకల సంపదలను మా కొసంగుచు శత్రువులందలి శూరునివలె -నిర్భయముగా నిలుచును.
20. సోమమా! ఇంద్రాదులకు మత్తు కలిగించుటకు స్తోతలు నీ మధుర రసమును పిండుదురు.
21. ఋత్విక్కులారా! పేరుమాత్రమున దేవతలకు ప్రియమైనదియు - అత్యంత మధురమైన సోమరసమును ఇంద్రాదుల కొరకు దశాపవిత్రమున ఉంచండి.
22. ఋత్విక్కులు - మహా అన్నము కొరకు - ఎంతో మత్తునిచ్చు సోమపు రసధారను సిద్ధము చేయుదురు.
23. సోమమా! శోధితమవైన నీవు ఆరగించుటకుగాను ఆవు పాడిపదార్ధములను అందుకొందువు. అన్నదానము చేయుచు క్షరితమగుము.
24. సోమమా! నేను జమదగ్నిని. నిన్ను స్తుతించుచున్నాను. మాకు గోయుక్త, సర్వత్ర ప్రశంసనీయ ధనమును ప్రసాదించుము.
25. సోమమా! నీవు అతిముఖ్యుడవు. పూజ్యరక్షణలతో మా సుతుల మీద వర్షించుము. సకల స్తుతిరూప వచనముల మీద సహితము వర్షించుము.
26. సోమమా! నీవు లోక కంపకుడవు. మా వచనములను గ్రహించుము. ఆకాశమునుండి జలవర్షము కురించుము.
27. కవిసోమమా ! నీ మహిమ వలన లోకములు నిలిచి ఉన్నవి. సకల నదులు నీ ఆజ్ఞను పాలించుచున్నవి.
28. సోమమా! ఆకాశమునందలి జల ధారవలె - నీ శుక్లవర్ణధార విరిసిన దశాపవిత్రమువైపు నడుచును.
29. ఋత్విక్కులారా ! ఉగ్ర, బలకారక, ధనపతి, ధనదాత సోమమును ఇంద్రునకు సమర్పించండి.
30. సత్య, క్రాంతకర్మ, రక్షణశీల సోమము మా స్తోత్రములకు శక్తి నిచ్చుచు దశాపవిత్రమునకు చేరును.
అరువది మూడవ సూక్తము
ఋషి - కాశ్యప నిధ్రువుడు,దేవత - పవమాన , ఛందస్సు - గాయత్రి
1. సోమమా! మాకు బహుసంఖ్యక, శోభన బల ద్రవ్యము నంపుము. అన్నము ప్రసాదించుము.
2. సోమమా! నీవు ఎంతో మత్తునిత్తువు. నీవు ఇంద్రునకు అన్నమును, బలమును సమకూర్తువు. చమసములందు చేరుదువు.
3. ఇంద్ర, విష్ణు, వాయువుల కొరకు అభిషుతమై ద్రోణకలశమునకు వెళ్లు సోమము అత్యంత మధురము.
4. పింగళవర్ణ, క్షిప్రకారి సోమము జలధారలతో చేయబడును. సోమము రాక్షసుల వైపు సాగును.
5. ఇంద్రుని వర్ధిల్ల చేయుచు, జలమును తెచ్చుచు. సర్వమంగళములు కలిగించుచు, కృపణులను నాశము చేయుచు సోమము సాగును.
6. పింగళవర్ణ, అభిషుత సోమము ఇంద్రునివైపు నుండి తన స్ధానమునకు చేరును.
7. సోమమా! మానవులకు ఉపయుక్తమగు జలమును కురిపించినావు. నీ తేజస్సుతో సూర్యుని వెలిగించినావు. అట్లే మాకొరకు ప్రవహింపుము.
8. సోమము మానవుల కొరకును, అంతరిక్షమున సూర్యుని నడకకును, అశ్వములను పూన్చును.
9. సోమము ఇంద్రుని పేరు పలుకుచు, దశదిశలకు సాగుటకు సూర్యునకు అశ్వములను పూన్చుము.
10. స్తోతలారా! వాయువు, ఇంద్రుని కొరకు అభిషుతమయిన మదకర సోమమును అభిషవస్ధలము నుండి మేషలోమముపై పరిషించితము చేయండి.
11. క్షరణశీల సోమమా! హింసక శత్రువులు నాశము చేయలేనిదియు, శత్రువునకు దుర్లభమగు ధనమును మాకు ప్రసాదించుము.
(ఈ ధనము జ్ఞానము కావచ్చును)
12. నీవు మాకు అనేక అశ్వ, గోయుక్త ధనమును అందించుము. బలమును, అన్నమును ప్రసాదించుము.
13. సూర్యుని వంటి తేజస్సు గలిగి, శిలలచే అభిషుత సోమము ద్రోణకలశమున చేరి క్షరితమగును.
14. అభిషుత దీప్త సోమము శ్రేష్ఠయజమానుల గృహములందు గోయుక్త అన్నమును జలధారల రూపమున వర్షించును.
15. వజ్రధర ఇంద్రుని కొరకు సోమము పిండబడి. పెరుగుతో కలసి దశాపవిత్రమున చేరి క్షరితమగును.
16.సోమమా! నీ రసము అత్యంత మధురము. దేవతలు కోరునట్టిది. దానిని - మా ధనము కొరకు దశాపవిత్రమునకు ప్రవహింప చేయుము.
17. హరితవర్ణ, బలశాలి, మదకర, క్షరణశీల సోమమును - ఋత్విక్కులు ఇంద్రుని కొరకు - వసతీవరి జలమున పరిశుద్ధము చేయుదురు.
18. సోమమా! సువర్ణ, అశ్వ, పుత్రాదియుక్త ధనమును మాకు పంచి పెట్టుము. పశుయుక్త అన్నమును మా కొరకు తెమ్ము.
19. ఋత్విక్కులారా ! ఇది యద్దమువంటి కాలము. యుద్ధకామి. అత్యంతమధుర సోమమును దశాపవిత్రమున, మేషలోమముపై సించితము చేయండి.
20. ఋత్విక్కులు రక్షణాభిలాషులు. విప్రులు. వారు తమ అంగుళులతో మార్జనీయ, క్రాంతకర్మ సోమమును శోధింతురు. సోమము శబ్దించుచు పడును.
21. సోమదేవా ! విప్రులగు ఋత్విక్కులు - కోరికలు తీర్చునదియు, ప్రేరణ కలిగించు సోమమును అంగుళులతోను. ఋద్ధితోను - జలధార ద్వారా పంపుదురు.
22. దీప్తిమంత సోమమా! క్షరితమగుము. నీ మదకర రసము - ఆసక్తుడగు ఇంద్రుని వద్దకు - చేరవలెను. ధారక రసముతో వాయువును అందుకొనుము.
23. క్షరణశీల సోమమా! నీవు శత్రుధనమును పూర్తిగా నష్టపరతువు. స్నేహశీలివై కలశమున ప్రవేశించుము.
24. సోమమా ! నీవు మదకరమవు. శత్రుహంతవు. మాకు బుద్ధి ప్రసాదించుచు సాగుదువు. దేవతలు లేరనువారిని, దేవద్వేషులను హతమార్చుము.
25. ఉజ్వల, దీప్త, క్షరణశీల సోమము సకల స్తుతులను ఆకర్షించుచు, ఋత్విక్కులచే కల్పించ బడును.
26. క్షిప్రగామ, శోభన, పవమాన, దీప్త, సకల శత్రుహరణ సోమము ఉత్పన్నమగును.
27. క్షరణశీల సోమమును ద్యులోకమున, పృథ్వియొక్క ఉన్నత స్థానమున, యజ్ఞప్రదేశము లందు ఉత్పత్తిచేయుదురు.
28. సుకర్మ సోమమా! ధారారూపమున ప్రవహింపుము. సకల శత్రువులను, రాక్షసులను హతమార్పుము.
29. సోమమా! రాక్షసులను హతమార్చుచు, వివదించుచు మాకు దీప్తివంతమును, శ్రేష్ఠమునగు ధనము నిమ్ము.
30. దీప్తసోమమా! ఆకాశము, భూమియందు ఉత్పన్నమై, స్వీకరణీయములైన ధనములను మాకు ప్రసాదించుము.
అరువది నాలుగవ సూక్తము
ఋషి - మారీచ కాశ్యపుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి
1. సోమమా! నీవు వర్షకుడవు. దీప్తిమంతుడవు. వర్షించుటయే నీ పని. మానవులకు, దేవతలకు ఉపయోగపడు కార్యములు చేయువాడవు.
2. కోరికలు తీర్చు సోమమా! నీ బలము వర్షశీలము. నీ పని వర్షశీలము. నీ యొక్క రసము వర్షశీలము. "సత్యంవృషన్పృహేదసి, సత్యముగా అన్నివిధముల వర్షించువాడవు".
3. సోమమా! నీవుఅశ్వమువలె ధ్వనింతువు. మాకు పశువులను, అశ్వములను ప్రదానము చేయుము. మా కొరకు ధనపు ద్వారములు తెరువుము "దురోవృధి"
4. బలశాలి, ఉజ్వల, వేగవంత సోమము సృష్టి కలిగించినది. అది గోవులు, అశ్వములు పుత్రులను ఇచ్చుటకు చేయబడినది.
5. యాజ్ఞికులు సోమమును సుశోభితము చేయుదురు. రెండు చేతులతో పరిమార్జింతురు. సోమము మేషలోమమున క్షరితమగును.
7. విశ్వదర్శక, క్షరణశీల సోమమా! సూర్యకిరణములవలె వెలుగొందు నీ ధారల నిర్మాణము జరుగుచున్నది.
8. రసశాలిసోమమా! నిన్ను ధ్యానించు మాకు అంతరిక్షమునందలి సకల రూపములను, నానా విధ ధనములను ప్రసాదించుము.
9. సోమమా! నీ యొక్క రసము సూర్యసమానమై దశాపవిత్రమును అధిరోహించునపుడు అదేమార్గమున సాగు నీవు నినదింతువు.
10. ప్రజ్ఞాపక, దేవప్రియ సోమము క్రాంతకర్మలగు స్తోతల స్తుతులతో క్షరితమగును. రథికుడు అశ్వమును నడిపిన రీతి సోమము తరంగములను కదిలించును.
11. సోమమా! నీ తరంగములు దేవాభిలాషిణులై యజ్ఞతరంగములవలె క్షరితములగును.
12. సోమమా! నీవు దేవాభిలాషివి. అత్యంత మాదకుడవు ఇంద్రుని పానము కొరకు దశాపవిత్రమున క్షరితమగుము.
13. సోమమా! ఋత్విక్కులచే శోధితుడవగుము. మాకు అన్నము కలిగించుటకు క్షరితమగుము. రుచికర అన్నములతో పాటు గోవులవైపు సాగుము.
14. స్తుత్య, హరితవర్ణసోమమా! నీవు పాలతో చేయబడుదువు. శోధితుడవై యజమానికి ధనము, అన్నము అందించుము.





