Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1



    9. ఇంద్రా ! నీవు హర్యశ్వుడవు. ఉపజిహ్వికలను పురుగులను తిని, వల్మీకమందున్న ఉగ్రుపుత్రుని పుట్టనుండి వెలికి తీసినావు. లోన ఉన్నపుడు అంధుడగు ఉగ్ర పుత్రునకు బయటకి వచ్చినంత చూపువచ్చినది. అతడు సర్పమును స్పష్టముగా చూడగలిగినాడు. పురుగులు తిన్న అతని అవయవములను మరల సంధించినావు.

    10. ఇంద్రా ! నీవు ప్రాజ్ఞుడవు. సర్వజ్ఞుడవు. మానవులు వర్షాభిలాషులు. స్వయం సమృద్ధులు. వర్షసంబంధ కార్యములతో, నీవు, మానవులకు అనేక ఉపకారములు చేసినావు. వామదేవుడు అట్టి సకల సనాతన కార్యములను ఉల్లేఖించుచున్నాడు.

    11. ఇంద్రా ! నిన్ను పూర్వఋషులుస్తుతించినారు. మేము స్తుతించుచున్నాము. మా స్తుతులకు ప్రసన్నుడవగుము. జలములు నదిని పూరించునట్లు స్తోతల అన్నమును అభివృద్ధి పరచుము. హరి విశిష్ట ఇంద్రా ! మేము అభినవస్తుతులు రచించెదము. అందువలన మేము రథవంతులమయి సర్వదా నీ సేవ చేయగలము.

    ఈ మంత్రము 16-21, 17, 21 తిరిగి ఇచట పునరావృతమయినది.

                         ఇరువదవ సూక్తము

        ఋషి - వామదేవుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రా ! నీవు అభీష్ట ప్రదుడవు. తేజస్వివి. జనులకు ఆశ్రయ ప్రదానమునకుగాను దూరము నుండి రమ్ము. దగ్గరనుండి రమ్ము. ఇంద్రుడు సంగ్రామమున సంఘటితుడు అగును. శత్రువులను వధించును. అతడు వజ్రబాహువులు, మానవ పాలకులు, తేజస్వులగు మరుత్తుల కూడినవాడు.

    2. ఇంద్రుడు మాకు అభిముఖవర్తి. అతడు మాకు ఆశ్రయము, ధనముప్రదానము చేయవలెను. అందుకు అతడు అశ్వయుక్తుడయి మా వద్దకు రావలెను. ఇంద్రుడు వజ్రవంతుడు. ధనశాలి. మహామహుడు. అతడు యుద్ధమునకు వెళ్ళవలెను. మా యజ్ఞమునకు విచ్చేయవలెను.

    3. ఇంద్రా ! నీవు మాకు పురస్సరుడవగుము. మా యజ్ఞమునకు విచ్చేయుము. ఈ యజ్ఞమును భజింపుము.

    వజ్రధరా ! మేము నీ స్తోతలము. వ్యాధుడు మృగములను వేటాడినటులు మీ ద్వారా ధనము పొందుటకు యుద్ధమున జయము పొందవలెను.

    4. అన్నవంతుడవగు ఇంద్రా ! నీవు ప్రసన్న మనమున మా వద్దకు విచ్చేయుము. మా కోరికలను తీర్చుము. ఉత్తమ రూపము, అభిషుతము, మాదకమగు సోమపానము చేయుము. మధ్యందిన సవనమునకు విచ్చేయుము. మా స్తోత్రములను స్వీకరింపుము. సోమపానము చేయుము. హృష్టుడవు అగుము.

    5. ఇంద్రుడు ఫలవంతమగు వృక్షమువంటివాడు. ఆయుధ కుశలుడగు విజయునివంటివాడు. నూతన ఋషులచే వివిధ ప్రకారములుగ స్తుతించబడువాడు. పురుహూతుడు. స్త్రీ లోలుడు స్త్రీని ప్రశంసించిన రీతి మేము ఇంద్రుని స్తుతించెదము.

    6. ఇంద్రుడు పర్వతమువలె ప్రవృద్ధుడు. మహాహనుడు. తేజస్వి. శత్రువుల పరాభవకర్త. అందుకుగాను సనాతనకాలమున ఆవిర్భవించినవాడు. ఆ ఇంద్రుడు జలపూర్ణమగు పాత్రవలె తేజోపూర్ణమగు బృహత్ వజ్రమును ఆదరించును.

    7. ఇంద్రా ! నీవు జన్మించినావు. అంతే. నిన్ను నివారించువాడు లేకుండినాడు. నీవు యజ్ఞములకు ధనము ప్రసాదించినావు. దానిని నాశము చేయువాడు లేకుండినాడు. నీవు బలశాలివి. తేజస్వివి. పురుహూతుడవు. అభీష్ట వర్షివి. నీవు మాకు ధనము ప్రసాదించుము.

    8. ఇంద్రా ! నీవు ప్రజల ధనములను, గృహములను పర్యవేక్షింతువు. అసురులు నిరోధించిన గోసమూహములను విముక్తములను చేయుదువు. బోధన విషయమున ప్రజల నేతవు, శాసకుడవు. యుద్ధమున ప్రహారకుడవు. నీవు అనంత ధనవంతుడవు అగుము.

    9. ఇంద్రుడు తన ప్రజ్ఞాబలమున మాటి మాటికి కర్మ సమూహములను సమకూర్చును. అందువలన అతడు ప్రాజ్ఞుడు, విజ్ఞానబలుడు, అశేష కీర్తి సంపన్నుడు అయినాడు. అతడు యజమానుల బహుళ పాపములను నష్టపరచును. స్తోతలకు ధనప్రదానము చేయును.

    10. ఇంద్రా ! నీవు మమ్ము హింసించకుము. మాకు పోషకుడవు అగుము. నీవు విశేష ధనము హవ్యదాతకు అందింతువు. దానిని తెచ్చి మాకు ప్రసాదించుము. మేము నిన్ను స్తుతింతుము. ఇది నూతనము, దానయోగ్యము, ప్రశస్తమగు ఉక్థ. దీనితో మేము నిన్ను విశేషరూపమున కీర్తింతుము.

    11. 19వ సూక్తమునందలి 11వ మంత్రము పునరావృతము ఆ మంత్రమును చూడనగును.

                             ఇరువది ఒకటవ సూక్తము

        ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఎవడు విశేష బలసంపన్నుడో, ఎవడు సూర్యునివలె పరాభవ సమర్థ బలమును పోషించునో అతడు మావద్దకు రావలెను. మమ్ము రక్షించవలెను. పరాక్రమవంతుడు. ప్రవృద్దుడగు ఇంద్రుడు మాతో పాటు హృష్టుడు కావలెను.

    2. యజ్ఞార్హ సామ్రాట్టువలె పరాభవకారకులు, త్రాతలు, శత్రువుల పరాభవ కర్తలు, విశేష కీర్తిశాలురు, అతిశయ ధనశాలులు, ఇంద్రునకు బలభూతులు మరుత్తులు. స్తోతలారా ! అటువంటి మరుత్తులను ఈ యజ్ఞమున స్తుతించుడు.

    3. ఇంద్రుడు మాకు ఆశ్రయము ఇచ్చుటకుగాను మరుత్తుల సహితుడయి స్వర్గలోకమునుంచి, భూలోకమునుండి, అంతరిక్షమునుండి, జలములనుండి, ఆదిత్యలోకమునుండి, దూరదేశమునుండి, జలస్థానమగు మేఘలోకమునుండి ఇచ్చటకి విచ్చేయవలెను.

    4. ఇంద్రుడు స్థూలము మఱియు భారమగు ధనములకు అధిపతి. ప్రాణరూప బలమున శత్రుసేనను జయించగలవాడు. ప్రగల్భుడు. స్తోతలకు ధనదాత. యజ్ఞస్థలమున మేము ఆ ఇంద్రుని స్తుతించెదము.

    5. ఇంద్రుడు అఖిల లోకములను స్తంభింపజేసి యజ్ఞార్హము, గర్జనశీల ధ్వనిని ఉత్పన్నము చేయును. హవ్యము అందుకొనును. వర్షము కలిగించి, అన్నదానము చేయును. అలంకారయోగ్యమగు ఉక్థలలో స్తూయమానుడు. అట్టి ఇంద్రుని యజ్ఞగృహమునకు హోతలు ఆహ్వానింతురు.

    6. ఇంద్రుని స్తుతించు అభిలాషగలవారు, యజమాని గృహమున నివసించువారు, స్తుతి సహితులయి ఇంద్రుని వద్దకు వెళ్లినపుడు ఇంద్రుడు విచ్చేయువలెను. ఇంద్రుడు మాకు యుద్ధమున సహకరించవలెను. అతడు యజమానులకు హోత. అతని క్రోధము దుస్తరము. "ఆదురోషాః"

    7. ఇంద్రుడు జగత్ భర్త. ప్రజాపతి పుత్రుడు. అభీష్ట వరదుడు. అట్టి ఇంద్రుని బలము స్తోత్రకారుడగు యజమానిని రక్షించుము. ఆ బలము స్తోత్రకారుడగు యజమానిని రక్షించును. ఆ బలము యజమాని హృదయ కుహరమును, కర్మములందును నిలిచి ఉండును. యజమాని అభీష్టప్రాప్తికి, అతని ఆనందమునకుగాను వాస్తవముగా ఆ బలము ఉత్పన్నమయినది. ఇంద్రుని బలము యజమానిని సర్వదా పాలించును.

    8. ఇంద్రుడు మేఘద్వారములను అపావృతము చేసినాడు. తెరచినాడు. జలవేగమును జలసమూహముల ద్వారా పూరించినాడు. అందువలననే ఇంద్రునకు అన్నదానము చేసిన యజమాని ఇంట "గౌరమృగము" గవయ యుగము చేరును.

    (గవయస్య గవయ మృగస్యచ అని శాయణుడు)

    9. ఇంద్రా ! నీ హస్తద్వయము కళ్యాణకారకము, సత్కర్మ అనుష్ఠాన కర్త. నీహస్తద్వయము యజమానికి ధనప్రదానము చేయును.

    ఇంద్రా ! నీ స్థితి ఎట్టిది? ఏల నీవు మమ్ముల సంతృప్తులను చేయవు? మాకు ధనము ప్రసాదించుటకు నీవు ఏల హృష్టుడవు కావు?

    10. ఈవిధముగా స్తుతించబడిన సత్యవంతుడు, ధనవంతుడు, వృత్రహంత ఇంద్రుడు యజమానులకు ధనము ప్రసాదించును. ఇంద్రా ! మా స్తుతులకుగాను ధనదానము చేయుము. అది మాకు దివ్యాన్న భక్షణకు ఉపయోగపడవలెను.

    11. 19వ సూక్తమునందలి 11వ మంత్రము పునరావృతము. ఆ మంత్రమును చూడనగును.

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకము నాల్గవ మండలము, ఆరవ అధ్యాయమున
                              రెండవ అనువాకము సమాప్తము)

    మూడవ అనువాకము             ఇరువది రెండవ సూక్తము

        ఋషి - వామదేవుడు, దేవత- ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. ఇంద్రుడు మహాబలవంతుడు. మేము సమర్పించు హవిరన్నము స్వీకరించును. అతడు ధనవంతుడు. వజ్రముధరించును. బలయుక్తుడు అగును. విచ్చేయుము. ఇంద్రుడు హవ్యము, స్తోతము, సోమము, ఉక్థ స్వీకరించును.

    2. ఇంద్రుడు అభీష్టవర్షి. అతని బాహువులందు వజ్రము ఉన్నది. అది వర్షకారకము. చతుర్థారావశిష్టము. అతడు దానిని శత్రువుల మీదకు విసరును. ఇంద్రుడు ఉగ్రుడు. నేతృ శ్రేష్ఠుడు. కర్మవంతుడు. ఆచ్చాదనకారిణి అగు 'పురుష్ణి' నదిని ఇంద్రుడు సేవించును. అతడు 'పురుష్ణి' నది భిన్న భిన్న ప్రదేశములను స్నేహమునకుగాను సంయుతము చేయును.

    3. ఇంద్రుడు దీప్తిమంతుడు. దాతృశ్రేష్ఠుడు. పుట్టుకతోనే విశేష అన్నవంతుడు బలవంతుడు. ఇంద్రుడు ఉభయబాహువులందు వజ్రము ధరించినాడు. దాని బలమున ద్యులోక భూలోకములను గడగడలాడించినాడు.

    4. మహామహుడగు ఇంద్రుడు జన్మించగనే సమస్త పర్వతములు అనేక సముద్రములు, ద్యులోకము, పృథ్వి అతని భయమునకు గడగడలాడినవి. బలవంతుడగు ఇంద్రుడు గతిశీలుడయిన సూర్యుని తలిదండ్రులు ద్యావాపృథ్వులను భరించినాడు. ఇంద్రునివలె ప్రేరితమయిన వాయువు మానవునివలె ధ్వనిచేయును.

    5. ఇంద్రా ! నీవు మహానుభావుడవు ప్రగల్భుడవు. శూరుడవు. నీ కార్యములు గొప్పవి. సమస్త సవనములందు స్తుతియోగ్యుడవు. సమస్త లోకములను భరించగలవాడవు. ఘర్షణశీల వజ్రము ధరించినావు. బలపూర్వకముగా 'అహి' ని వధించినావు.

    6. ఇంద్రా ! నీవు అధిక బలశాలివి. నీ సకల కర్మలు సునిశ్చితముగా సత్యములు. నీవు అభీష్ట వర్షివి. నీభయముననే ఆవులు తమ పొదుగులందు పాలను రక్షించుచున్నవి. నదులు నీ భయముననే వేగముగా ప్రవహించుచున్నవి.

    7. ఇంద్రా ! నీవు హర్యశ్వవంతుడవు. వృత్రుడు చాలకాలము నదులను బంధించి ఉంచినాడు. నీవు అట్టి నదులను విముక్తము చేసినావు. అప్పుడే ప్రసిద్ధ ద్యుతిమతులగు నదులను నీవు రక్షించినావు. అందుకు నదులు నిన్ను కీర్తించినవి.

    8. హర్షజనక సోమము పిండబడినది. అది స్పందమానము. ఆ సోమము ఇంద్రుని వద్దకు చేరవలెను. వడిగల గుఱ్ఱమును కళ్లెము పట్టి ప్రేరేపింతురు. అట్లే దీప్తిమంతమగు స్తోత్రమును ప్రేరేపింపుము.

    9. సహనశీలుడవగు ఇంద్రా ! నీ బలము ప్రశస్తము అది శత్రు పరాభవ కారకము. ప్రవృద్ధము. అట్టి బలమును మాకు ప్రసాదించుము. మాకు ప్రసాదించుము. చంపదగిన శత్రువులను మాకు అప్పగింపుము. హింసకులగు మానవుల అస్త్రములను నష్టపరచుము.

    10. ఇంద్రా ! నీవు మా స్తుతులను వినిపించుకొనుము. మాకు వివిధ ప్రకార అన్నములను ప్రసాదించుము. సమస్త బుద్ధులను ప్రేరేపించుము. మాకు గోదాతవు అగుము.

    11. 19వ సూక్తమునందలి 11వ మంత్రము పునరావృతము ఆ మంత్రమును చూడనగును.

   
                       ఇరువది మూడవ సూక్తము

        ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.

    1. మా స్తుతి మహా ఇంద్రుని ఎట్లు వర్థిల్ల చేయును? ఏ హోత యజ్ఞమునకు ఇంద్రుడు ప్రీతుడుయి విచ్చేయగలడు? ఇంద్రుడు సోమరసమును ఆస్వాదించును. అన్నమును వాంఛించుచు, సేవించుచు ఏ యజమానికి ప్రదానము చేయుటకు ప్రదీప్త ధనమును గ్రహించును.

    2. ఎంతటి వీరుడు ఇంద్రునితో సోమపానము చేయగలడు? ఎవడు ఇంద్రుని అనుగ్రహ పాత్రుడు కాగలడు? ఎప్పుడు ఇంద్రుని విచిత్రధన వితరణ జరుగును? ఎప్పుడు ఈ స్తోతలు యజమానిని వర్థిల్లచేయుటకు రక్షాయుక్తులు అగుదురు? కంకణము కట్టుకుందురు.

    3. ఇంద్రా ! నీవు పరమ ఐశ్వర్యయుక్తుడవు. అట్లయి స్తోతల కథాగానమును ఏల విందువు? స్తోత్రములు విందువు సరి, స్తోతలగు హోతల రక్షణ కథను ఏల యోచింతువు? ఇంద్రుని సనాతన దానము ఎయ్యది? ఆదానము ఇంద్రుని స్తోతల కోరికలు తీర్చునది అని ఎందుకు అందురు?




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.