Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6


 

                                     10

    ఖానమ్ దగ్గరున్న వేశ్యల్లో నేను తప్ప మిగిలిన వారంతా అందకత్తెలే. అయినా ఖుర్షీదును మించినవారు మాత్రం లేరు. ఆమె అప్సర , పసిడిచాయ , బ్రహ్మ స్వయంగా తీర్చిదిద్దినట్లున్న ముక్కు ముఖమూ , విశాల నేత్రాలు, కాలు , సేతులు వెలుగు మూసలోంచి తీసినట్లుంటాయి. గుండ్రని ముంజేతులు, చక్కని భుజాలు, ఆకసం నుంచి దిగి వచ్చిన అప్సరలా ఉంటుంది. ఏ బట్ట కట్టినా అద్దినట్లుంటుంది. ఆ అందం , ఆ ఆకర్షణ, ఆ ముగ్ధత్వం, ఒక్క చూపుతో ఆజన్మాంతం దాసులైపోవాల్సిందే. సభలో కూర్చుంటే కొవ్వొత్తి వెలిగినట్లుంటుంది. వందల మంది వేశ్యలున్నా దృష్టి ఆమె మీదనే పడుతుంది. కాని అందానికి తగిన గీత లేదు. అదృష్టాన్ని నిందించడం ఎందుకు? స్వయంగా జీవితం నాశనం చేసుకుంది. వాస్తవానికి ఆమె వేశ్య కాదగింది కాదు. "బెస్వాడ" జమీందారు కూతురు. ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. జమీందారు కూతురని. ఉత్తమురాలు. అందానికి ఆటపట్టు. తనను ఎవడూ ప్రేమించడనుకుంటుంది. అది ఆమె పిచ్చి, పిచ్చి కాకుంటే ఆమెను చూచి ప్రేమించని వాడెవ్వడు? దాసానుదాసుడు కానివాడేవ్వడు? ముందు ప్యారేసాహెబ్ తో వలపు కలిగింది. వేల రూపాయలు వెచ్చించాడు. ఆవిడంటే ప్రాణాలిచ్చేవాడు. ఖుర్షిద్ కూడా బాగానే వదిలించింది. తనను ప్రేమిస్తున్నాడని తెలిసిం తరవాత తను ప్రేమించింది . ఒక్కరోజు రావడం ఆలస్యం అయితే తిండి మానేసేది. ఏడుస్తూ కూర్చునేది. మేమంతా చెప్పాం "ఖుర్షిద్! ఏమిటి పిచ్చి? మగవానికి విశ్వాసం ఉండదు. నువ్వు అతన్ని ప్రేమించావు. అంతే! పెండ్లీ గిండ్లీ కాలేదుగా. ఇలాగే చేశావో చెడిపోతావు. తరవాత విచారించి ప్రయోజనం లేదు" అని. ప్యారేసాహేబ్ కూ తెలిసిపోయింది. ఖుర్షిద్ ప్రేమిస్తుందని, ఏడిపించసాగాడు. వస్తే రాత్రింబవళ్ళు ఉండిపోయేవాడు. రాకుంటే రావడమే మానేసేవాడు. ఖుర్షిద్ ఏడ్చేది. మొత్తుకునేది. తిండి తినేది కాదు. విచిత్రంగా ఉండేది ఆమె స్థితి. ఖానమ్ ఖుర్షిద్ ను అసహ్వించుకుంది. రావడం మానేసింది. తిండి ఆపేసింది. పనివాళ్ళకు జీతాలు నిలిపేసింది.
    ఆ అందంతో పాటు గుండెలో వలపు ఎవడు నింపాడో అర్ధం కాలేదు. ఎవరికో ఒకనికి పెళ్లామయితే బావుండేది. వాడు రోజూ ఆవిడ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకునేవాడు. ఖుర్షిద్ కాలి కొనగోటికి చాలదు బిస్మిల్లా. పైగా ఆ టెక్కు, అ నిక్కు, ఆ గర్వం అల్లాకే తెలియాలి. మౌల్వీ గారి విషయం విన్నారుగా! మిగతా విటులతో కూడా ఆమె వ్యవహారం అంతే. అసలు సంగతి ఆవిడకు తాను ధనవంతురాలనని గర్వం. వాస్తవానికి డబ్బు కూడా అపారంగా ఉండేది. ఎవరినీ లెక్క చేసేది కాదు. ఖుర్షీద్ మీద అనేక ఆశలు పెట్టుకున్నది ఖానమ్. ఆవిడలో వేశ్యత్వం ఉంటే వాస్తవంగా లక్షలు గడించాలిసింది. ఆ అందానికి తగిన గొంతు లేదు. నాట్యంలో వట్టి మొద్దు. ముందు ముందు చాల కచేరీలు వచ్చాయి. ఆటపాటలో అట్టే పరిజ్ఞానం లేదని తెలిసి ఎవరూ పిలవలేదు. వచ్చేవాడల్లా ఆవిడ అందానికి మురిసి వచ్చేవాడు. వచ్చినవాడల్లా ఆవిడంటే పడి చచ్చేవాడు. ఈ మహారాణి ముడుచుక్కుర్చునేది. ఆమెను వలపుదేవత ఆవహించింది. ఎవరితోనూ ఉల్లాసంగా ఉండేది కాదు. జనం రావడం మానేశారు. మిగిలింది ఒక్క ప్యారేసాహాబ్ మాత్రమే. విచిత్రం చూడండి. ప్యారేసాహాబ్ తండ్రి రాజాగ్రహానికి గురియైనాడు. ఇల్లు జప్తు అయింది. జాగీరు లాక్కోబడింది. పాపం, చితికిపోయాడు. అయినా ఖుర్షీద్ ప్రేమ మాత్రం తగ్గలేదు. ఇంట్లో ఉంచుకొమ్మని పట్టుపట్టింది. తండ్రి కోప్పడతాడని ప్యారేసాహేబ్ అందుకు అంగీకరించలేదు. ఖుర్షీద్ ఆశలు అడియాసాలైనాయి.
    ఖుర్షీద్ మెత్తని మనిషి. మోసగించి వందలు కాజేసేవారు జనం. ఫకీర్లు, సాధువులు అంటే ఆమెకు చాల భక్తీ. ఒకనాడు ఒక స్వాములవారు విచ్చేశారు. వారిదగ్గర ఒకటిని రెండు చేసే మహిమ ఉండేది. ఖుర్షీద్ తన గాజులు సొమ్ములు తీసి ఇచ్చింది. ఫకీరు మహాశయుడు పచ్చి కుండ తెప్పించాడు. దానిలో నల్ల నువ్వులు నింపించి ఆభరణాలన్నీ అందులో పెట్టించాడు. మూతవేసి పట్టుబట్ట మూతికి కట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళేప్పుడు ఈరోజు విప్పవద్దనీ తెల్లవారి విప్పాలని చెప్పిపోయాడు. ఉదయం మూత తీస్తే నల్లనువ్వులు మాత్రమే మిగిలాయి.
    ఒక గోసాయి నోట్లోంచి నల్ల నాగు పడగ తీసి, ఎల్లుండి ఇది నిన్ను కాటు వేస్తుంది అన్నాడు. ఖుర్షిద్ దుద్దులు తీసి ఇచ్చేసింది. ఆమెకు కోపం వచ్చేదే కాదు. అలాంటి స్త్రీ సంసారుల్లో కూడా ఉండడం కష్టం. కాని ఒకరోజు ఆ కోపం వచ్చింది. ఆరోజు ప్యారేసాహేబ్ పెండ్లి బట్టలు ముక్కలు ముక్కలుగా చించేసింది. రెండు రోజులు ఏడ్చింది. ఎంతమంది చెప్పినా వినలేదు. జ్వరం వచ్చింది. రెండు నెలలు మంచం పట్టింది. ఎముకల గూడు అయిపొయింది. వైద్యులు క్షయ అన్నారు. అల్లా దయ వల్ల రెండు నెలల్లో బాగై పోయింది. ప్యారేసాహేబ్ తో బంధం తెగిపోయింది. తరువాత చాలామందితో పరిచయం కలిగింది. కాని ఎవరితోనూ మనసు కలువలేదు. అన్ని లాంచనంగా జరిగేవి. మనసులు కలువలేదు.

                                                                 11


    శ్రావణమాసపు సాయంకాలం , వర్షం కురిసి వెలిసింది. చౌకులోని మిద్దెల మీదా ఎత్తైన గోడల మీద అక్కడక్కడ ఎండ పొడచూపింది. పశ్చిమ దిశన సంధ్యారాగం పరచుకుంది. తెల్లబట్టలవారు చౌకులో కూడుతున్నారు. ఈరోజు ప్రత్యేకంగా జనసందోహం ఎక్కువ ఉండడానికి కారణం శుక్రవారం. అయిష్ బాగ్ జాతరకు సాగిపోతున్నారు జనులు. ఖుర్షిద్, అమీర్ జాన్, బిస్మిల్లా, నేనూ జాతరకు వెళ్ళడానికి అలంకరించుకుంటూన్నాము. అప్పుడే అద్దిన ధాన్యపు రంగు ఓణీలు ఇచ్చిపోయాడు రంగులవాడు. ఎంపిక జరుగుతుంది. తలలు దువ్వుకుంటున్నారు. కొప్పులు దిద్దుతున్నారు. విలువైన సొమ్ములు తీయబడుతున్నాయి. ఖానమ్ ఎదురుగా బల్ల మీద బాలీసుకు అనుకోని కూర్చుని ఉంది. బువహుసేనీ వచ్చి "పెచ్వాన్ పెట్టి వెళ్ళిపోయింది. ఖానమ్ ముందు మీర్ గారు కూర్చొని ఉన్నారు. జాతరకు వెళ్దామంటున్నారు. తనకు సుస్తీగా ఉందనీ , తాను రాననీ అంటున్నారామే. ఆమె రాకుండాలని మేమూ మనస్సులో కోరుకుంటున్నాం. ఖానమ్ లేకుంటేనే జాతర సంబరం.
    ఆనాటి ఖుర్షిద్ అందం చూడాలి. ధాన్యపురంగు మల్మలు "దుపట్టా నీలిరంగు పైజమా, బిగుతైన చొక్కా, చేతులకు సన్నని బంగారు గాజులు, రాళ్ళ ముక్క పుడక, చెవులకు బంగారు దిద్దులు, మెడలో ముత్యాల హారము - అందం విరుచుకుపడినట్లుంది. గదిలో నిలువుటద్దంలో నా ముఖం చూసుకుంటుంటే ఆ సౌందర్యరాశి కనిపించింది. నాకే ఆ అందం ఉంటేనా నా ప్రతిబింబాన్ని నేనే ప్రేమించేదాన్ని. ఆవిడ వ్యధ ఏమంటే తనను వలచేవాడు లేడని. ప్యారేసాహేబ్ విడిపోవడంతో ముఖం ఉదాసీనం అయింది. ఆ ఔదాసీన్యంలో కూడా అందం ఉంది. అందమైనవారు ఎలా ఉన్నా సొగసే! ఆ అప్సరసని చూస్తె మనసులో గిలిగింతలు పెట్టినట్లు అవుతుంది. మరొక  ఉపమానం గోచరించడం లేదు . సుకవి కవిత చిన్నప్పటి అనందంలా ఉంది.
    బిస్మిల్లా వికారం అయింది కాదు. చామనచాయ, వెడల్పు ముఖం! పొట్టి ముక్కు, విశాల నేత్రాలు, మనిషి కురచ. అల్లికపు పనిచేసిన క్రేపు దుపట్టా వేసుకుంది. ఆకుపచ్చని పైజమా తొడిగి నఖశిఖపర్యంతం విలువైన ఆభరణాలు ధరించింది. పైగా జడపూలు పెళ్ళి కూతురులా ఉంది. హాస్యం, కొంతెదనం ఉండనే ఉన్నాయి. జాతరలో ఒకరిని వెక్కిరిస్తుంది. ఒకని మీద చూపు తూపులు విసురుతుంది. అతడు మళ్ళీ చూస్తె ముఖం తిప్పుకుంటుంది. మరచాను. మేము అలంకరించుకొని మేనాలలో ఎక్కి జాతర చేరాం.
    జాతరలో ఇసుక వేస్తె రాలని జనం. బొమ్మలమ్మేవారు మిఠాయి దుకాణాలు , పండ్ల వాళ్ళు, పూలమాలలు అమ్మేవాళ్ళు, తాంబూలీలు, సాఖీనులు జాతరలలో ఉండేవన్నీ ఉన్నాయి. నాకవేమీ అవసరం లేదు. మనుషులు ముఖాలు చూడ్డం నాకు సరదా. ముఖ్యంగా సంతల్లోనూ, జాతరల్లోనూ అనేక రకాల ముఖాలు కనిపిస్తాయి. సంతోషులు, అసంతోషులు, దరిద్రులు, ధనవంతులు, బుద్దిహీనులు, బుద్దిమంతులు, ఉత్తములు, అధములు ఉదారులు, కృపణులు అంతా కనిపిస్తారు. ఒకతను వదులు అంగరఖా , పొడవైన నీలిమడత టోపీ, బూట్లమీదికి జారిన పుజామాతో నడుస్తున్నాడు. ఒకతను చందనపు రంగు తలగుడ్డ చుట్టుకొని బోగం వాళ్ళను చూస్తూ తిరుగుతున్నాడు. ఇంకొకతను వచ్చింది జాతర చూడడానికే అయిన పరాకు చిత్తగిస్తున్నాడు. పెళ్ళాంతో పోట్లడుకొని వచ్చి అప్పటి ప్రశ్నలకు ఇప్పుడు జవాబులు తోచినట్లుగా గొణుగుకుంటూ పోతున్నాడు. మరొకతను ఒక చిన్న పిల్ల వ్రేలు పట్టుకొని నడుస్తున్నాడు, మాటకు అమ్మ అనే పదం వాడుతున్నాడు. అమ్మ అన్నం వండుతుండవచ్చు. అమ్మ విసుక్కుంటుండవచ్చు. అమ్మ పడుకొని ఉండవచ్చు. ఇప్పుడు మేలుకుందేమో? ఎక్కువ కోరికలు కొరకు. అమ్మ వైద్యుని దగ్గరకి వెళుతుంది. ఒకతను ఎరుపు దుస్తులు ఎనిమిదేళ్ళ అమ్మాయిని భుజం మీద ఎక్కించుకున్నాడు. అమ్మాయి ముక్కుకు చిన్న వత్తు ఉంది. ఎత్తు కొప్పు, ఎర్రని ఓణీ, చేతికి వెండి మురుగులున్నాయి. ఆపసిదాని రెండు చేతులు గట్టిగా పట్టుకున్నాడు. మురుగులు లాక్కుంటారేమోనని పట్టుకున్నట్లున్నాడు పాపం! అమ్మాయి చేతులు నొప్పులు, ఏడుపు ముఖం పెట్టింది. అలాంటప్పుడు మురుగులు పెట్టి తీసుకొని రావడం ఎందుకు చెప్పండి?
    ఇదిగో ఇంకో మహాశయుడు మిత్రబృందం సహితంగా కోరిన తిట్లు అమ్మా! ఆ తినమ్మా జేబులోంచి పైసా తీసి తాంబూలి దుకాణంలోకి విసిరాడు. ధనికుడని తెలిసింది. పైస రెండు పైసలు ఒక లెక్కా! వెంటనే హుక్కా సాఖీని పిలిచాడు. "ఏయ్ !క్ సాఖీ! ఇలారా, హుక్కా వెలుగుతుందా?" ఈలోగా ఇంకొక మిత్రుడు వచ్చాడు. సలాము, కరచాలనము, క్షేమం అడగడం జరిగాయి. "అరె! తాంబూలమైనా తినిపించరా వెధవ. తాంబూలి పాన్ అందించగానే లాక్కున్నాడు. అతడు డబ్బు ఇవ్వందే. చిరాకు పది రొంటి నుంచి డబ్బు తీసి మాక్కూడా రెండు పాన్లు ఇవ్వు . యాలక్కాయ వెయ్యి. సున్నం ఎక్కువ వెయ్యొద్దు." అని "అరే భాయీ చిలమ్ అయినా త్రాగించు" అడిగాడు. కొట్టు మీదినుంచి చిలమ్ తీసేవరకు సాఖీ గుడ్లేర్ర చేసి చూసింది. వెంటనే జేబులోంచి డబ్బు తీసి అందించాల్సి వచ్చింది.




Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.