Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
3. హంసలు జలమున ప్రవేశించినట్లు సోమము సకల స్తోతల మనములందు ప్రవేశించును. సోమము గవ్యముతో కలసి స్నిగ్ధమగును.
4. సోమమా! నీవు యజ్ఞస్థానమును ఆశ్రయింతువు కలగలతువు. మృగమువలె ద్యావాపృథ్వులను చూతువు.
5. రమణి జారుని స్తుతించినట్లు - శబ్దము సోముని స్తుతించును. సోమము గమ్యమునెరిగిన మిత్రుని పగిది స్వహితార్ధము గమ్యస్ధానమునకు చేరును.
6. సోమమా! మేము హవివంతులము. స్తోతలము. మాకు దీప్తిశాలి అన్నము ప్రసాదించుము. ధనము బుద్ధి, కీర్తి కలిగించుము.
ముప్పది మూడవ సూక్తము
ఋషి - త్రితుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. మేధావి సోమము - నీటి అలలవలె - పాత్రవైపు సాగును. వృద్ధమృగము అరణ్యమున ప్రవేశించినరీతి పాత్రవైపు సాగును.
2. పింగళవర్ణ, దీప్తసోమము -గోమంత అన్నప్రదానము చేయుచు ధారగా ద్రోణకలశమునకు ప్రవహించును.
3. అభిషుత సోమము ఇంద్ర వాయు, మరుద్గణ, విష్ణువులవైపపు సాగును.
4. త్రివాక్య ఉచ్చారణ జరుగు చున్నది. గోవులు పాలిచ్చుటకు శబ్దించుచున్నవి హరిత సోమము నినదించుచు తరలుచున్నది.
5. స్తోతలు - యజ్ఞపు మాతృస్వరూపలగు - మహాస్తుతులను ఉచ్చరించుచున్నారు. ద్యులోకమునకు శిశువు వంటి సోమము మార్జితమగుచున్నది.
6. సోమమా! ధనసముద్రములను నలువైపులనుండి మాకు చేర్చుము. అంతములేని కోరికలను తీర్చుము.
ముప్పది నాలుగవ సూక్తము
ఋష్యాదులు పూర్వము వలెనే
1. అభిషుత సోమము ప్రేరితమగును. దశాపవిత్రమున చేరును. సుదృఢ శత్రుపురములను విరుచును.
2. అభిషుత సోమము ఇంద్ర, వాయు, మరుద్గణ, విష్ణువుల వద్దకు సాగును.
3. అధ్వర్యులు రససేచక, నియతసోమమును వర్దక ప్రస్తరములతో అభిషవింతురు. వారు కర్మబలమున సోమరూప దుగ్ధములను పితుకుదురు.
4. త్రితృషయొక్క మదకరసోమము అతని కొరకును, ఇంద్రుని పానము కొరకును పరిశుద్ధమగుచున్నది. హరిత సోమము తనరూపము దాల్చినది.
5. పృశ్నిపుత్రులు మరుత్తులు - యజ్ఞాశ్రమ, హోమసాధక, రమణీయ సోమమును దూషించుచున్నారు.
6. కుటిలము తెలియని స్తుతులు ఉచ్చరితములై సోమముతో కలియుచున్నవి. సోమము సహితము శబ్దము చేయుచు ప్రీతికర స్తోత్రములను అభిలషించుచున్నాడు.
ముప్పది అయిదవ సూక్తము
ఋషి - అంగిరస ప్రభూవసుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. ప్రవాహశీల సోమమా! ధారగా మాకు నలువైపుల క్షరితుడవగుము. విస్తీర్ణ ధనమును, ప్రకాశమాన యజ్ఞమును మాకు ప్రసాదించుము.
2. జలప్రేరకి, శత్రుకంపన సోమమా ! నీ బలమున మాకొరకు ధనము అందుకొనుము.
3. వీరసోమమా! నీ బలమున మేము సంగ్రామాభిలాషి శత్రువులను ఓడించెదము. మాకు స్వీకారయోగ్యమగు ధనమును ప్రసాదించుము.
4. సోమము అన్నదాత, సర్వదర్శి. కరం మతియు ఆయుధములు తెలిసినవాడు యజమానులకు ఆశ్రయము కలిగించగోరి వారికి అన్నము అందించును.
5. నేను స్తుతివచనములతో గోపాలకుడగు సోముని స్తుతిస్తాను. మేము స్తుతిప్రేరక, పవిత్ర సోమము వద్ద వసింతుము.
6. కర్మపతి, పవిత్ర ప్రభూతధనవంతుడగు సోమమును సకల జనులు మనసా భజింతురు.
ముప్పది ఆరవ సూక్తము
ఋష్యాదులు పూర్వమువలె
1.రథమునకు కట్టిన గుఱ్ఱములవలె - రెండు 'చమువు' లందు సోమము అభిషుతమైనది. దశాపవిత్రమున సిద్ధమైన వేగవంత సోమము యుద్ధమున సంచరించును.
2. సోమమా! నీవు వాహకుడవు. జాగృతుడవు, దేవాభిలాషివి. మధుస్రానివై దశాపవిత్రమును లంఘించి క్షరితుడవగుము.
3. ప్రాచీనక్షరణశీల సోమమా ! నీవు మా దివ్య స్థానములను ప్రకాశింపచేయుము. మమ్ము యజ్ఞము, బలమునకు ప్రోత్సహించుము.
4. సోమము యజ్ఞాభిలాషి ఋత్వికులచే అలంకృతము. వారి చేతులందు పరిమార్జికాము సోమము మేషలోమమయ దశాపవిత్రమును శోధితమగును.
5. అట్టి అభిషుత సోమము హవి సమర్పించువారికి ద్యులోక, భూలోక, అంతరిక్షపు, సకల ధనములను ప్రసాదించవలెను.
6. బలాధిపతి సోమమా !నీవు స్తోతల కొరకు అశ్వములు, గోవులు, వీరపుత్రులను అభిలషించి స్వర్గపు వీపుపై ఎక్కుము.
ముప్పది ఏడవ సూక్తము
ఋషి - రమాగణుడు దేవత - సోమము ఛందస్సు -గాయత్రి
1. ఇంద్రాదుల పానము కొరకు అభిషుతమగు సోమము కామవర్ధక, రాక్షసనాశక, దేవకామి అయి దశాపవిత్రమునకు సాగును.
2. సోమము సర్వదర్శక, హరితవర్ణ, సర్వధారకమై దశాపవిత్రము వైపు సాగును. తదుపరి ధ్వనించుచు ద్రోణకలశమున పడును.
3. వేగవంత, స్వర్గిప్రదీప్త, క్షరణశీల సోమము రాక్షస వినాశకమై మేషలోమమయ దశాపవిత్రమును లంఘించి పోవుచున్నది.
4. ఈ సోమము త్రితర్షి యజ్ఞమున పవిత్రమైనది - తన ప్రవృద్ధ తేజస్సుతో సూర్యుని ప్రకాశింప చేయును.
5. అశ్వము యుద్ధభూమి కేగినట్లు - వృత్రఘ్న అభిలాష ప్రదాత, అభిషుత, అహింసనీయ సోమము - కలశమునకు చేరును.
6. ఈ మహాసోమము కవిద్వారా ప్రేరితం మై ఇంద్రుని కొరకు ద్రోణకలశమున ప్రవేశించును.
ముప్పది ఎనిమిదివ సూక్తము
ఋష్యాదులు పూర్వమువలె
1. సోమము అభిలాషప్రదము. గతి పరాయణము. యజమానికి మరింత అన్నము ఇవ్వదలచి మేషలోమము, దశాపవిత్రము ద్వారా ద్రోణకలశమున ప్రవేశించును.
2. ఇంద్రుని పానమునకుగాను త్రితర్ది అంగుళులు హరితవర్ణ సోమమును రాతిమీద మారుచున్నవి.
3. పదిహరిత వర్ణ అంగుళులు, కోరికల గూడి, సోమమున మార్జించును. వీని సాయమున ఇంద్రుని బలమునకు గాను సోమము శోధితమగును.
4. సోమము - శ్యేనపక్షివలె మానవ ప్రజమధ్య ఆసీనుడు అగును. జారుడు ఉపపత్ని వద్దకు వెళ్లినట్లు సోమము సాగును.
5. ఈ సోమపు మాదక రసము సకల పదార్ధములను వీక్షించును. ఈ సోమము స్వర్గ పుత్రుడు. దీప్త సోమము దశాపవిత్రమున ప్రవేశించును.
6. పానము కొరకు అభిషుత, హరిత వర్ణ, సర్వవధారక సోమము శబ్దించుచు తన ప్రియస్థానమగు కలశమున ప్రవేశించును.
ముప్పది తొమ్మిదవ సూక్తము
ఋషి - అంగిరస బృహన్మతి, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. మహామతి సోమమా! దేవతల ప్రియతమ శరీరయుక్తడవై త్వరత్వరగా 'దేవతలున్న దిశకు సాగుదును' అని తరలుము.
2. సోమమా! యజమానిని సంస్కరించుచు, యాజ్ఞికునకు అన్నము ఇచ్చుచు, అంతరిక్షమునుండి వర్షము కలిగించుము.
3. అభిషుత సోమము - దీప్తిని దాల్చి, సకల పదార్ధములను వీక్షించి, వానిని దీప్తముచేసి తన బలమున దశాపవిత్రము వైపు సాగును.
4. ఈ సోమము దశాపవిత్రమున తడిసి, జలతరంగములచే క్షరితమై స్వర్గమునకు శీఘ్రముగా సాగును.
5. దూరమునందున్న, దగ్గరలో ఉన్న దేవతల కొరకును - ఇంద్రుని కొరకును అభిషుతమైన సోమము మధువువలె సిద్ధమగును.
6. కలిసిమెలిసిన స్తోతలు స్తుతించుచు, హరిత వర్ణ సోమమును శిలలసాయమున సిద్ధము చేయుదురు. కావున దేవతలారా ! యజ్ఞస్ధానమున ఆసీనులు కండి.
నలుబదవ సూక్తము
ఋష్యాదులు పూర్వమువలె
1. క్షరణశీల, సర్వదర్శక సోమము సకల హింసకులను లంఘించినది. మేధావి సోమమును అందరు స్తుతింతురు. అలంకరితురు.
2. అరుణ వర్ణసోమము ద్రోణకలశమున ప్రవేశించుచున్నది. తదుపరి అభిషుతమైన అభిలాషదాత సోమము ఇంద్రుని వద్దకేగును. నిశ్చిత స్థానమున ఆసీనమగును.
3. దీప్తసోమమా! నీవు అభిషుతమై మా కొరకు గొప్ప, మరింత ధనమును నలువైపులనుంచి అందించుము.
4. క్షరణశీల సోమమా! నీవు బహువిధ అన్నములను తెమ్ము, సహస్రసంఖ్యక అన్నములను ప్రసాదించుము.
5. సోమమా! మా స్తోతలకొరకు పవిత్రుడవు, అభిషుతుడవు అగుము. సుపుత్రవంత ధనము తెమ్ము. స్తుతులను వర్ధిల్లచేయుము.
6. సోమమా! శోధన సమయమున - మాకొరకు - ద్యావాపృధ్వులందు వర్థిల్లు ధనమును తెమ్ము. మాకు స్తుతించ దగిన ధనము నిమ్ము.
నలుబది ఒకటవ సూక్తము
ఋషి - కాణ్వమేధ్యాతిధి, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. ఏ అభిషుత సోమము జలసమమైమ్ శీఘ్రదీప్తియుక్తమై, నలుపుచర్మమువారిని వధించుచు సంచరించునో ఆసోమమును స్తుతించండి.
2. వ్రతశూన్యులను, దుష్టమతులను అణచిన సోమపు రక్షక, రాక్షసవినాశ కాంక్షను స్తుతింతుము.
3. అభిషుత సమయమున బలశాలియగు సోమపు దీప్తులు అంతరిక్షమున సంచరించును. సోమపు ధ్వని వర్షధ్వని వలె వినిపించును.
4. సోమమా! అభిషుతమగుము. గో, అశ్వ, బలయుక్త మహన్నమును మా ముందుకు పంపుము.
5. సర్వ దర్శక సోమమా! నీవు ప్రవహింపుము. సూర్యుడు తన కిరణములచే పగళ్లను నింపినట్లు నీవు ద్యావాపృథ్వులను నింపుము.
6. సోమమా! నీ ధారలు మాకు సుఖకరములు. వానిని - నదులు భూమండలమును నింపినట్లు మాకు నలుదిశల నింపుము.
నలుబది రెండవ సూక్తము
ఋష్యాదులు పూర్వమువలె
1. ఈ హరిత వర్ణ సోమము ద్యులోక సంబంధమగు నక్షత్రాదులను, అంతరిక్షమున సూర్యుని సృజించి, దిగువకు పారు జలమును కప్పుకొనిసాగును.
2. ఈ సోమము ప్రాచీన స్తోత్రయుక్తము, అభిషుతమై దేవతల కొరకు ధారగా పడును.
3. వర్థమాన అన్నమును చప్పున అందుకొనుటకు పరిమిత వేగమున సోమము క్షరితమగును.
4. పురాతన రసవంత సోమము దశాపవిత్రమున ఉండును. శబ్దము చేయును. దేవతలను ఆవిర్భవింప చేయును.
5. ఈ సోమము అభిషవ సమయమున సకల స్వీకరణీయ ధనముల యజ్ఞవర్థక దేవతల వద్ద కేగును.
6. సోమమా! అభిషుతమగుము. మాకు గోవులు, అశ్వములు, వీరులు. సంగ్రామ ధనము మరియు అనంత అన్నమును ప్రసాదించుము.
నలుబది మూడవ సూక్తము
ఋష్యాదులు పూర్వమువలె
1. ఏ సోమము నిరంతర గమనవంత అశ్వమువలె దేవతల మత్తుకొరకు పాడితో కలియునో, ఏది కమనీయనుగునో ఆ సోమమును స్తుతులతో ప్రసన్నుని చేయుదుము.
2. రక్షణాభిలాషగల స్తుతులు - పూర్వమువలెనే - ఇంద్రుని పానము కొరకు ఈ సోమమును దీప్తము చేయును.
3. విప్రమేధ్యాతిథి కొరకు, శోధన సమయమందు, కమనీయ స్తోమము స్తుతులతో అలంకృతమై, కలశమువైపు మరలును.
4. క్షరణశీల, అభిషసమయ సోమమా! మాకు ఉత్తమ దీప్తిమంతము, అతిశ్రీమంతమగు ధనమును ప్రసాదించుము.
5. యుద్ధముకేగు అశ్వమువంటి సోమము దశాపవిత్రమున శబ్దించును. దేవాభిలాషి అగును. అప్పుడు ఎంతో ధ్వనించును.
6. సోమమా! మాకు అన్నము కలిగించుటకు, మేధ్యాతిధిని వర్థిల్లచేయుటకు ప్రవహించుము. వీర్యవంతులగు సుపుత్రులను ప్రసాదించుము.
దాశరథి లక్ష్మిణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండును, ఆంధ్ర ప్రదేశ ఆస్థాన కవి దాశరథి కృష్ణమాచార్య అనుజుండును, కమలానామ్ని ధర్మపత్నిసమేతుండును, "రణభేరి" సమరకవితాసంకలన కర్తయు, "రణరంగం" వివిధభారతీయ భాషా కథాసంకలన కర్తయు అగు దాశరథిరంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహితమున ఆరవ అష్టకము సమాప్తము "సర్వేపిసుఖినస్సంతు"





