Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 1
20. ఇంద్రుడు వివిధ శబ్దవంతుడు. సమస్త ప్రజల ధర్త. ధనవంతుడగు ఇంద్రుడు మా స్తుతులు స్వీకరించవలెను. మేము సత్యరూపమున అభిలషించినవానిని సమకూర్చవలెను. ఇంద్రా ! నీవు సమస్త ప్రాణులకు రాజువు. స్తోతకు మహిమాన్వితమగు యశస్సు లభించును. అట్టి అధిక యశస్సును మాకు కలిగించుము.
21. ఇంద్రా ! నిన్ను పూర్వ ఋషులు స్తుతించినారు. మేమును స్తుతించుచున్నాము. మా స్తుతులకు ప్రసన్నుడవగుము. జలములు నదిని పూరించినట్లు స్తోతల అన్నమును అభివృద్ధిపరచుము. హరి విశిష్ట ఇంద్రా ! మేము అభినవ స్తుతులు రచించెదము అందువలన మేము రథవంతులమయి సర్వదా నీ సేవ చేయగలము.
(ఇది 16వ సూక్తమునందలి 21వ మంత్రము పునరావృతము)
పద్దెనిమిదవ సూక్తము
ఋషి - వామదేవుడు దేవత - ఇంద్రుడు, అదితి; ఛందస్సు - త్రిష్టుప్.
1. ఇంద్రుడు అనుచున్నాడు :-
ఈ యోని నిర్గమణ రూపమార్గము అనాదిది. పూర్వాపర లబ్ధమైనది. ఈ యోని మార్గమునుండియే సమస్త దేవతలు, మానవులు జన్మించినారు. కావున నీవు గర్భమున పెరిగి ఈ మార్గము నుండియే జన్మించుము. తల్లి మృత్యువునకు కారకుడవుకాకుము.
2. వామదేవుడు అనుచున్నాడు :-
"నేను ఈ యోని మార్గము ద్వారా బయటికిరాను. ఇది అత్యంత దుర్గమ మార్గము. నేను పార్శ్వభేదము చేసి బయటకు వచ్చెదను. ఇతరులకు సాధ్యపడని అనేక కార్యములు నేను చేయవలసి ఉన్నది. ఒకరితో యుద్ధము చేయవలసి ఉన్నది. ఒకరితో వాద ప్రతివాదము చేయవలసి ఉన్నది"
3. ఇంద్రుడు అనుచున్నాడు :-
"తల్లి చనిపోవును. అట్లయినను పురాతన మార్గము చెరగదు. త్వరగా బయటకి రమ్ము"
వామదేవుడు బదులు పలుకుచున్నాడు :-
ఇంద్రుడు అభిషవకారి అయిన త్వష్ట గృహమున ప్రవేశించినాడు. అక్కడ అధిక ధనమున సమకూర్చిన సోమము ఉన్నది. దానిని ఇంద్రుడు బలపూర్వకముగా సంగ్రహించినాడు. పానము చేసినాడు.
(ఇంద్రుడు అకార్యము చేసినాడని ఎత్తిచూపినాడు)
4. వామదేవుడు అధిక్షేపించుచున్నాడు :-
అదితి ఇంద్రుని అనేక మాసములు అనేక సంవత్సరములు భరించినది. ఇంద్రుడు ఈ విరుద్ధ కార్యము ఏల చేసినాడు?
అదితి అనుచున్నది :-
వామదేవా ! కొందరు దేవతలు పుట్టినారు. కొందరు పుట్టనున్నారు. వారితో ఇంద్రుని పోల్చుట సరికాదు.
5. గహ్వరరూపమగు సూతికాగృహమున ఇంద్రుడు పుట్టినాడు. తల్లి అతనిని నిందనీయుడు అనుకున్నది. అతనిని అతిశయ సామర్థ్యముగల వానిని చేసినది. పుట్టగానే ఇంద్రుడు తన తేజమును ధరించినాడు. లేచినాడు. ద్యావాపృథ్వులను పరిపూర్ణము చేసినాడు.
6. 'అలలా' శబ్దము చేయుచు జలవతులగు నదులు ఇంద్రుని మహత్తును ప్రకటించుటకుగాను హర్షపూర్వకముగ బహువిధ శబ్దములు చేయుచు ప్రవహించును.
ఋషీ ! అవి ఏమి పలుకుచున్నవో ఈ నదులను అడుగుము.
ఈ శబ్దము ఇంద్రుని మాహాత్మ్య సూచకము. నా కొడుకే ఉదకము ఆవరించిన మేఘమును భిన్నము చేసినాడు. జలములను ప్రవర్తింప చేసినాడు.
7. వృత్రవధవలన ఇంద్రునకు కలిగిన బ్రహ్మహత్య పాతకమును గురించి "వివిత్" ఏమంటున్నది? నీరు నురుగు రూపమున ఇంద్రుని పాపమును ధరించినది. నా కొడుకు మహావజ్రమున వృత్రుని వధించినాడు. తరువాత ఈ నదులను ప్రవహింపచేసినాడు.
("వివిత్" ఇంద్రుని, మరుత్తులను సంబోధించి చేసిన విశేష స్తోత్రములు. ఇంద్రుని పాపమును నీటి నురుగు ధరించినదని ఒక ఆఖ్యానము)
8. వామదేవుడు అనుచున్నాడు :-
ఇంద్రా ! యువతి అయిన నీ తల్లి అదితి ప్రమత్తముగనే నిన్ను ప్రసవించినది. ప్రమత్తముగనే 'కుషవ' రాక్షసి నిన్ను మింగినది. నీవు పుట్టినపుడు జల సమూహములు ప్రమత్తముగనే నిన్ను సుఖప్రదుని చేసినవి. నీవు ప్రమత్తముగనే నీ వీర్య ప్రభావమున సూతికా గృహమున రాక్షసిని వధించుటకు జాగృతుడవయినావు.
9.ధనవంతుడవగు ఇంద్రా ! "వ్యంప" రాక్షసుడు నీ హనుద్వయమును విరిచి అపహరించినాడు. అనంతరము నీవు అధిక బలవంతుడవు అయినావు. వజ్రమున వ్యంస రాక్షసుని తలను పిండికొట్టినావు.
10. తొలిచూలు ఆవుదూడను ప్రసవించినట్లు ఇంద్రమాత అదితి తన ఇచ్చానుసారము ఇంద్రుని ప్రసవించినది. ఇంద్రుడు పెద్దవాడు. అనంతబలశాలి. గెలువరానివాడు. అభీష్టవర్షి. ప్రేరకుడు. స్వయంగమనక్షముడు. శరీరాభిలాషి.
11. ఇంద్రమాత అదితి ఇంద్రుని అడిగినది. పుత్రా అగ్ని ! మున్నగు దేవతలు నిన్ను త్యజించుచున్నారట?
ఇంద్రుడు విష్ణువుతో అన్నాడు :-
సఖా ! విష్ణూ ! నీవు వృత్రుని వధింపదలచినచో అత్యంత పరాక్రమశాలివి అగుము.
12. ఇంద్రా ! నీవుకాక ఏ దేవత తల్లిని విధవను చేసినాడు? ఏ కారణమున నీవు నీ తండ్రి రెండుకాళ్లు పట్టి వధించినావు? నీవు నిద్రలో ఉన్నప్పుడుగాని మేల్కొని ఉన్నపుడుగాని నిన్ను ఎవడు చంపదలచినాడు? సుఖములు ప్రసాదించుటలో నిన్నుమించిన దేవత ఏడి?
13. మాకు జీవనాధారము లభించక కుక్క పేగులుతిన్నాము. దేవతల మధ్య ఇంద్రుని మించి సుఖములు ప్రసాదించు అవ్యయదేవతలేడు. మా భార్యను అవమానించుచుండగా చూచినాము. అనంతరము ఇంద్రుడు మా కొఱకు మధుర జలములు అందించినాడు.
ఆలోచనామృతము
1. 18వ సూక్తమునకు ప్రత్యేకత ఉన్నట్లు తోచును.
i) ఈ సూత్రమున ద్రష్ట. దేవత ఒక్కరే. ii) మహిళా ఋషి అదితి దర్శనమిచ్చి మాట్లాడినది. iii) అదితి తన పుత్రుని సమర్ధించుకొనుట.
2. ఇది ఇంద్ర వామదేవ సంవాదమని శాయణుడు వాఖ్యానించినాడు. వామదేవుడు గర్భమునందు ఉండగనే తాను సాధారణ మార్గమున బయటికిరాననియు తల్లి పక్క భాగమునుండి వత్తుననియు అన్నాడు. వామదేవుని తల్లి ప్రార్థనమీద ఇంద్రుడు అదితి వచ్చినారు. ఇది వారి సంభాషణము.
ii) "The interesting part of the absurd story is its accordance with the birth of SAKYAMUNI, according to the Buddhists, who may possibly have borrowed the notion from the vedas" whilson.
iii) The main subject is the birth and infarey of INDRA. The commentators erroneously take the stanza as refering to the bith of VAMADEVA....GRIFFITH.
iv) ప్రసవ ప్రకారమును, ప్రసవ వేదనను తగ్గించుటకు నాటినుండి నేటివరకు నిరంతర ప్రయత్నము సాగుచున్నది. ఇది మార్గము మార్చుటకు ఆనాడు జరిగిన ప్రయత్నము కావచ్చును. ప్రయత్నము, పరిశోధనలు అన్నియు అనుకున్న ఫలితములను ఇవ్వకపోవచ్చును. ఫలితము సరియైనది అయినను కలకాలము నిలువక పోవచ్చును.
ఇది పరిశోధన జరుగుతున్నప్పటి స్థితి అని నా అభిప్రాయము. ఇందు absurdity అసంగతము, అనుచితము ఏమియులేదు.
ఇక గర్భమున ఉండి మాట్లాడుటను గురించి, ఒక విషయమును వ్యక్తపరచుటకు కవి చేసిన కల్పన కావచ్చును.
రిప్ వాన్ వింకిల్ ఇరువది ఏళ్లనిద్ర కల్పనయే !.
అభిమన్యుడు గర్భమున ఉండి విన్నాడని భారతమున చెప్పబడినది.
గర్భస్థ శిశువులకు శిక్షణనిచ్చు కార్యక్రమము పాశ్చాత్య దేశములందు ప్రస్తుతము అమలులో ఉన్నది.
2. తొలిసారిగా ఇంద్రుని ఆధిపత్యమును ప్రశ్నించుట జరిగినది. ఇంద్రుడు సహితము సాధారణ మానవునివలె అకార్యము చేసినాడని తొలుత ఎత్తిచూపిన వామదేవుడు చివరన ఇంద్రుని మహత్తును పొగడినాడు.
3. ఇంద్రుని పాపమును నీటినురుగు గ్రహించుట ఒక సత్కార్యమునకు ప్రకృతి అనుకూలించుటను సూచించును.
4. ఈ సూక్తమునందలి వృత్తాంతముల వివరములు అందుబాటులో లేవు.
i) త్వష్ట వద్దనుంచి ఇంద్రుడు సోమము దొంగిలించుట. ii) ఇంద్రుడు అనేక సంవత్సరములు అదితి గర్భమున ఉండుట. iii) కుషవ రాక్షసి ఇంద్రుని మింగుట. iv) ఇంద్రుడు తండ్రిని వధించుట. v) అగ్నిదేవాదులు ఇంద్రుని దింద అలుగులు 13వ మంత్రమున తనను అతినీచముగా చెప్పుకున్నాడు. ఆ వృత్తాంతములు వివరములును లేవు.
విశ్వామిత్రుడు కుక్క మాంసము తిన్నట్లు మహాభారతమున చెప్పబడినది.
(ఆంధ్రవచన ఋగ్వేద సంహిత మూడవ అష్టకము నాల్గవ మండలమున అయిదవ అధ్యాయము సమాప్తము)
ఆరవ అధ్యాయము పందొమ్మిదవ సూక్తము
ఋషి - వామదేవుడు, దేవత - ఇంద్రుడు, ఛందస్సు - త్రిష్టుప్.
1. హే వజ్రవంతా ! ఇంద్రా ! ఈ యజ్ఞమునకు శోభన ఆహ్వానయుక్తులు, రక్షకులగు నిఖిల దేవగణములు, ద్యావాపృథ్వులు వృత్రవధకు ఏకమాత్ర బాధ్యుడవగు నిన్ను భజించుటకు విచ్చేసినారు. నీవు స్తోతవ్యుడవు. మహాగుణోత్కర్షుడవు. ప్రవృద్ధుడవు. దర్శనీయుడవు.
2. ఇంద్రా ! వృద్దుడగు తండ్రి పుత్రుని బోధించినట్లు సకల దేవగణములు అసురవధకు నిన్ను పురికొల్పుదురు. నీవు సత్య వికాస స్వరూపుడవు. సర్వ లోకాధీశ్వరుడవు. నీవు జలమును కట్టిపెట్టిన వృత్రుని వధించినావు. అందరిని ప్రసన్నులనుచేయు నదులను త్రవ్వినావు.
3. ఇంద్రా ! వృత్రుడు అనుభవములందు అతృప్తుడు. శిథిలాంగుడు. దుర్విజ్ఞానుడు. అజ్ఞాని. భావాపన్నుడు. జలమును ఆక్రమించుకుని శయనించినవాడు. అట్టి వృత్రుని పూర్ణిమనాడు వజ్రమున వధించినావు.
4. వాయువు తన బలమున జలమును క్షోభింప చేయును. అట్లే పరమ ఐశ్వర్యవంతుడగు ఇంద్రుడు అంతరిక్షమును క్షీణజలనుచేసి పిండివేయును. ఇంద్రుడు బలసంపన్నుడు. మేఘములను భగ్నముచేయును. పర్వతముల రెక్కలు విరుచును.
5. ఇంద్రా ! తల్లుల బిడ్డల దగ్గరకు పరుగులిడుదురు. అట్లే మరుత్తులు నీ వద్దకు చేరినారు. మరుత్తులవలెనే వృత్రవధకుగాను నీవెంట వేగవంతమగు రథము సాగినది.
ఇంద్రా ! నీవు ప్రసరణశీలములగు నదులను జలపూర్ణములు చేసినావు. మేఘమును భగ్నమొనరించినావు. వృత్రుడు ఆక్రమించిన జలమును విడిపించినావు.
6. భూమి మహంతము. సకల ప్రాణులకు ప్రియమయినది. 'తుర్వీత' 'వయ్యు' జలములతో రమణీయము చేసినావు. జలములను సులభముగా ప్రవహించునట్లు చేసినావు.
7. నదులు తట ధ్వంసినులు జలయుక్తములు. అన్న జనయిత్రులు. ఇంద్రుడు శత్రుహింసక సేననువలె నదులను పరిపూర్ణములను చేసినాడు. జలశూన్య దేశములను వర్షము ద్వారా జలపూర్ణము చేసినాడు. దప్పిగొన్న బాటసారుల దాహము తీర్చినాడు. ఇంద్రుడు దస్యుల గొడ్డుపోతు ఆవులపాలు పితికినాడు.
8. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. చీకట్లు మింగిన ఉషస్సులను విముక్తము చేసినాడు. సంవత్సరములను విముక్తము చేసినాడు. వృత్రుడు నిరోధించిన జలములను విముక్తము చేసినాడు. వృత్రుడు చుట్టుముట్టిన మేఘములను విముక్తము చేసినాడు. నదులను భూమిమీద ప్రవహించుటకు విముక్తము చేసినాడు.





