Home » Dr Dasaradhi Rangacharya » Dasaradhi Rangacharya Rachanalu - 6
ఉమ్రావ్ : మీకెలా అర్ధం అవుతుంది ? దాని వెనక ఒక రహస్యం దాగి ఉంది .
రుస్వా : అయితే చెప్పండి. ఇంకేమైనా అవమానం జరిగిందా ?
ఉమ్రావ్ : జరిగిందా ? జరిగిందంతా ముందే ఉంది. వినండి.
మౌల్వీ గారు వెళ్ళి పోయిన తరువాత బిస్మిల్లా ను అడిగాను. "ఏమైంది నీకు" అని.
బిస్మిల్లా : ఏం ?
నేను : డెబ్బయి ఏళ్ళ ముసలివాడు చెట్టు మీది నించి పడితే ఊరికే చచ్చేవాడుగా ?
బిస్మిల్లా : చస్తే పీడా పోయేది. ఈ వెధవ ముసలివాడంటే నాకు వళ్ళు మండుతూంది. నా "ధన్నూ" ను పడేస్తే దాని వెన్నుముక కాస్తా విరిగింది.
విషయమేమంటే బిస్మిల్లా జాన్ ఒక కోతిని పెంచింది. ఆ కోతి బిస్మిల్లా కు ప్రాణం. దాని ఆడంబరం వినండి. అత్లషు చొక్కా, పల్చని ఓణీ, వెండి మురుగులు, మెడలో గొలుసు, చెవులకు బంగారు దిద్దులు , తినడానికి జిలేబీలు, అమృత కేళీలు , కొన్నప్పుడు వెధవ, చిన్నగానే ఉంది. రెండు మూడేండ్లలో బాగా తిని దున్నలా అయిపొయింది. తెలిసిన వారి సంగతి సరే కొత్తవాళ్ల మీద పడిందో - ప్రాణాలు లేచిపోయేవి. మాంచి మగవాడి చేతిని పట్టుకుంటే దాన్ని విడిపించుకోలేకపోయేవాడు. దాని దంత బలం అలాంటిది.
మౌల్వీగారిని చెట్టేక్కించిన రోజుకు క్రితం రోజు విషయం. ఆ మహాశయుడు విచ్చేసి బల్ల మీద కూర్చున్నాడు. బిస్మిల్లా కొంటె పని చెయ్యాలనుకుంది. ధన్నూ కు సంజ్ఞ చేసింది. అది మెల్లగా వెనక నుంచి వచ్చి ఎగిరి మౌల్వీ భుజం మీద కూర్చుంది. మౌల్వీ తిరిగి చూచి బెదిరిపోయారు. గట్టిగా విదిలించారు. కోతి కింద కూలింది. దానంత అదే వెళ్ళిపోయినా వెళ్ళి పోయి ఉండవచ్చు. మౌల్వీ గారిని చూచి "గుర్ గుర్ " అన్నది. వారు కర్ర చూపించారు. భయపడి బిస్మిల్లా ఒడిలోకి దూకింది. బిస్మిల్లా దానికి కొంగు కప్పి మౌల్వీ ని ఇష్టం వచ్చినట్లు తిట్టింది. అప్పటికి కోపం చల్లారలేదు. రెండవరోజు ఆ శిక్ష.
రుస్వా : తగిన శిక్షే.
ఉమ్రావ్ : కావచ్చు. బిస్మిల్లా మౌల్వీ ని కొండముచ్చును చేసింది.
రుస్వా : మౌల్వీ గారు నిజంగా శిక్షార్హులే. మజ్నూ లైలాను ప్రేమించి వడిలో కూర్చుండ బెట్టుకుంటే మౌల్వీ బిస్మిల్లాకు ఇష్టమైన కోతిని విదిలిస్తాడూ, కర్ర చూపుతాడూ! అన్యాయం. ప్రేమకే అది తీరని ద్రోహం.
ఉమ్రావ్ తిరిగి మొదలెట్టింది.
ఒకనాటి రాత్రి ఎనిమిది గంటలప్పుడు బిస్మిల్లా గదిలో ఉన్నాను. బిస్మిల్లా పాడుతుంది. నేను తంబూరా మీటుతున్నాను. ఖాలీఫాగారు తబలా వాయిస్తున్నారు. ఇంతలో మౌల్వీ మహాశయులు వేంచేశారు.
బిస్మిల్లా : (చూడగానే) వారం రోజుల నుంచి పత్తాలేరే?
మౌల్వీ : ఏం చెప్పను ? ఈ తడవ జ్వరం తీవ్రంగా వచ్చింది. బ్రతికి బయటపడ్తాననుకోలేదు. కాని నిన్ను చూడాలని ప్రాణాలు నింపుకొని వచ్చాను.
బిస్మిల్లా : అల్లాను చేరుకునేవారే.
ఆ మాట నన్నూ, ఖాలిఫా ను బాధ పెట్టింది.
మౌల్వీ : నేను చస్తే నీకేం లాభం?
బిస్మిల్లా : మహానుభావా! ప్రతి సంవత్సరం మీ ఉరుసు ( సమాధి వద్ద జరుగు సంవత్సరీకం) కు వెళ్తాం. ఆడి, పాడి ప్రజలను రంజింపజేస్తాం. మీ కీర్తి దిగంతాలకు వ్యాపింపజేస్తాం.
అలా కొన్ని మాటల తరవాత మళ్ళీ పాట మొదలైంది. సందర్బానుసారంగా ఈ పాట సాగింది.
గుర్తు లేదు మరణవేళ మృత్యుదేవి
గుర్తుకొచ్చే పదేపదే అదే చెలియ
మౌల్వీగారు ఆవేశంలో మునిగిపోయారు. కన్నీరు కాలువ కట్టింది. గడ్డంలో నుంచి బాష్పబిందువులు రాలుతున్నాయి. ఇంతలో ఎదురుగా ఉన్న తలుపు తెరచుకుంది. ఒక చామనచాయ మనిషి ప్రవేశించాడు. కోలముఖం, నల్లని గడ్డం, కసరత్తు శరీరం బిగుతుగా ఉన్న అంగరఖా, వదులు పైజమా , మఖ్మల్ బూట్లూ , పూల కండువా , అతణ్ణి చూడగానే బిస్మిల్లా "అయ్యా! పది రోజుల తరవాత ఇప్పుడా దర్శనం? చాలు, ఇక వెళ్ళండి. ఇలాంటి ప్రేమ నాకు సయించదు. ఆ ఎరుపురాళ్ళ గోలుసేది? అందుకే ముఖం తప్పించారుగాఁవాఁలు."
అతను : (ముఖస్తుతి ధోరణిలో) కాదు మహారాణీ! ఆ రోజునుంచీ తీరిక లేదు. తల్లిగారికి చాల జబ్బు చేసింది. అక్కడే ఉండిపోయా.
బిస్మిల్లా : అవును మహారాజా! ఇంకేం చెపుతారు ? బేయిన్ కూతురు మీద కన్ను పడిందని చెపుతారా ? ఆవిడ దర్బారు లోనెగా రాత్రులు గడుస్తున్నాయి? మాకూ వార్తలు అందుతుంటాయి. మాకు చెప్పడానికి తల్లిగారి జబ్బు సాకు.
ఈ మాటలు విని మౌల్వీగారు వెనక్కు తిరిగి చూశారు. వారిద్దరి చూపులు కలిశాయి. మౌల్వీగారు ముఖం తిప్పుకున్నారు. రెండో అతని ముఖం మీద నెత్తిటి చుక్క లేదు. కాళ్ళు చేతులు వణికాయి. తక్షణం తలుపు తీసుకొని మెట్లు దిగి వెళ్ళిపోయాడు. బిస్మిల్లా పిలుస్తూనే ఉంది. అతడు కనీసం జవాబు చెప్పలేదు. వెళ్ళిపోయాడు.
బిస్మిల్లా కొంతసేపు మౌనంగా ఉండిపోయింది. తరవాత బొమలు ముడిపెట్టి "తరవాత చూద్దాం" అనుకోని పాటలో నిమగ్నం అయిపొయింది.
మళ్ళీ ఆ వచ్చినతను బిస్మిల్లా దగ్గరికి రాలేదు. మౌల్వీ గారు మాత్రం వస్తూనే ఉన్నారు.
రుస్వా : పూర్వకాలం మనుషులంతా అంతే. పట్టుదల కలవారు.
ఉమ్రావ్ : పాటసాగుతూనే ఉంది. నేను ఇక్కడ ఉన్నానని తెలిసినట్లుంది. గోహర్ మిర్జా వచ్చాడు. బిస్మిల్లా కూ అతనికీ నవ్వులూ, పరిహాసాలు జరిగేవి. తిట్ల నుంచి పోట్లాట వరకూ పోయేది. నాలో ఆకవ్వింపు లేదు.
గోహర్ మిర్జా వచ్చి మా ఇద్దరి మధ్యన కూర్చున్నాడు. చప్పున రెండు చేతులూ బిస్మిల్లా మెడలో వేసి "ఓహో! ఏం పాడుతున్నావే! నిన్ను చూస్తె ......." అన్నాడు.
అది చూచి మౌల్వీ గారి ముడతల ముఖము వణకసాగింది. అమాంతంగా గోహర్ మిర్జా దృష్టి మౌల్వీ గారి మీద పడింది. బాగా చూశాడు. బిస్మిల్లా మెడ వదిలి తన చెవులు పట్టుకున్నాడు. తుళ్ళిపడి వెనక్కు జరిగి భయపడినట్లు నటించాడు. అది చూచి బిస్మిల్లా విరగబడి నవ్వింది. ఖలీఫా చిరునవ్వు నవ్వాడు. నేను నోటికి గుడ్డ అడ్డు పెట్టుకున్నాను. మౌల్వీగారు తత్తరపడి లేవబోయారు కాని బిస్మిల్లా "కూర్చో" అంటే కూర్చుండిపోయారు. బిస్మిల్లా ఎంత కొంటేది? గోహర్ మిర్జా పెద్దగా నవ్వసాగాడు. చాలాసేపు వంచించింది మౌల్వీని. నిప్పుల్లో పొర్లాడినట్లుంది పాపం. పరిస్థితి . నవ్వీ నవ్వీ నా పొట్ట చెక్కలు అవుతుంది. చివరకు మౌల్వీ గారి స్థితిని చూచి నాకు దయ కలిగింది. విషయం చెప్పేశాను. దాంతో బిస్మిల్లాకు నామీద కోపం వచ్చింది. నేను గోహర్ మిర్జాతో "అనుకున్న పని అయిందిగా . ఇక వెళ్ళు" అన్నాను. గోహర్ మిర్జా కు నాతో సంబంధం ఉంది గాని బిస్మిల్లాతో కాదని తెలిసి మౌల్వీ గారు తృప్తి చెందారు. ముఖం చాటంత అయింది.
రుస్వా : మౌల్వీగారిది పవిత్ర ప్రేమ కదా!
ఉమ్రావ్ : కావచ్చు . పవిత్ర ప్రేమే .
రుస్వా : అయితే మాత్రం? ఎందుకంత కోపం?
ఉమ్రావ్ : వాహ్! పవిత్ర ప్రేమకు ఈర్ష్యా ఉండదనా? ఉంటుంది.
రుస్వా : ఉంటే అది పవిత్ర ప్రేమ కానేకాదు.
ఉమ్రావ్ : అది వారి మనసుకే తెలియాలి. నేను అర్ధం చేసుకున్నది అది.





