Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
4. ఈ సోమములన్నియు శోధితములు. అమరములు. ఇవి పయనించునపుడును, లోకములందు సంచరించునపుడును అలసట ఎరుగవు.
5. ఈ సోమములన్నియు ద్యావాపృధ్వుల వీపుల మీద స్వారిచేసి వ్యాపించును. ఇవి ఉత్తమద్యులోకమందును వ్యాపించును.
6. జలము యజ్ఞవిస్తారకము, ఉత్తమ సోమమును వ్యాపింప చేయునది. సోమముననే ఈ కార్యములన్నియు ఉత్తమములగును.
7. సోమమా ! నీవు పణుల వద్ద ఉన్న గోహితకర ధనమును సాధింతువు. ఎట్లు యజ్ఞము విస్తృతమగునో అట్లు ధ్వనించుము.
ఇరువది మూడవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు. దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. మధుర మదధారల శీఘ్రగామి సోమము స్రోత్ర సమయమున ఉద్భవించిణు.
2. వేగవంతములగు అశ్వములు -కొత్త అడుగులను అనుసరించును. కొత్తసోమము పురాతన సూర్యునకు దీప్తి కలిగించును.
3. శోధితసోమమా! హవ్యదాత కానివాని గృహమున మాకు ఇమ్ము. మాకు సంతానయుక్త ధనము ప్రసాదించుము.
4. గతిశీల సోమము మదకర రసమును క్షరితము చేయును. మధుశ్రాని రసమును క్షరితము చేయును.
5. సోమము లోకములను భరించుణు. ఇంద్రియ వర్ధక రసమును ధరించును. ఉత్తమ వీర యుక్తమగును హింసకుల నుండి రక్షించును.
6. సోమమా! నీవు యజ్ఞయోగ్యుడవు. ఇంద్రుడు ఇతర దేవతల కొరకు అగుదువు. మాకు అన్న దానము చేయదలచుము.
7. మాదక పదార్థములందు శ్రేష్ఠమగు సోమమును సేవించి అపరాజిత ఇంద్రుడు శత్రువులను వధించినాడు. ఇంకను వధించుచున్నాడు. 'జఘాన జఘనచ్చను'
ఇరువది నాలుగవ సూక్తము
ఋషి - అసిత దేవలుడు, దేవత - పవమాన సోమము, ఛందస్సు - గాయత్రి.
1. శోధితము, దీప్తమగు సోమము సాగును. మిశ్రితమై జలమున మార్జితమగును.
2. నిమ్నాభిముఖగామి జలమువలె గమనశీల సోమము సాగును. తదుపరి ఇంద్రునకు వ్యాప్తి కలిగించును.
3. శోధితసోమమా! మానవులు నిన్ను చేర్చిన చోటునుండి ఇంద్రునకు పానమగుటకు వెళ్లుదువు.
4. సోమమా! నీవు మానవులకు మదకరుడవు. శత్రుదమన ఇంద్రుని కొరకు క్షరితమగును.
5. సోమమా! నీవు శిలలపై అభిషుతమగుదువు. దశాపవిత్రము వైపు సాగుదువు. అప్పుడు నీవు ఇంద్రుని ఉదరమునకు పర్యాప్తమగుదువు.
(దశాపవిత్రమనగా 1.పది అంగుళులు లేదా రెండు చేతులతో శుభ్రము చేయబడినది.
2. అక్కచెల్లెండ్లయిన పదిమంది కన్యలచే శుభ్రము చేయబడినది. 3. వివస్వతుని పదిమంది కూతుళ్లుచే పరిశుద్ధము చేయబడినది.)
6. సోమమా! శత్రుహంతక ఇంద్రుని కొరకు క్షరితమగుము. నీవు ఉక్థమంత్రముచే స్తుతించ బడువాడవు. పరిశుద్ధడవు. శోధకుడవు. అద్భుతుడవు.
7. అభిషుత మదకర సోమము పరిశుద్ధము, శోధకము అనబడును. అతడు దేవతలను ప్రసన్నులను చేయును. శత్రువులను నాశనము చేయును.
(ఆంధ్ర వచన ఋగ్వేద సంహిత ఆరవ అష్టకము తొమ్మిదవ మండలము ఎనిమిదవ అధ్యానమున మొదటి అనువాకము సమాప్తము.)
రెండవ అనువాకము ఇరువది అయిదవ సూక్తము
ఋషి - అగస్త్యపుత్ర, దృహ్లుచ్యుతుడు. దేవత -
పవమాన సోమము ఛందస్సు - గాయత్రి
1. పాప రహిత సోమమా ! నీవు బలసాధకుడవు. మదకరుడవు. దేవతలు, మరుత్తులు, వాయువు పానమునకు క్షరితమగుము.
2. మత్తు కలిగించు సోమమా! మా కర్మమును భరింపుము. శబ్దము చేయుము. నీ స్థానమున ప్రవేశింపుము కర్మవలన వాయువున ప్రవేశింపుము.
3. సోమము తన స్థానమున స్థాపితమగును. అతడు కోరికలు తీర్చువాడు. క్రాంతదర్శి. ప్రాజ్ఞుడు. ప్రియుడు. శత్రుఘ్నుడు. దేవాభిలాషి. శోధింపబడువాడు.
4. శోధితము, కమనీయమగు సోమము సకల రూపములందు ప్రవేశించుచు దేవతలున్న చోటునకు వెళ్లును.
5. శోభన సోముడు శబ్దము చేయుచు క్షరితుడగును. దగ్గర ఉన్న ఇంద్రుని వద్దకు వెళ్లును. ప్రజ్ఞాయుక్తుడగును.
6. సోమము అన్నింటిని మించిన మత్తు కలిగించువాడు. విద్వాంసుడు. పూజనీయుడగు ఇంద్రుని స్థానమును అందుకొనుటకు దశాపవిత్రమును లంఘించి ధారారూపమున ప్రవహించును.
ఇరువది ఆరవ సూక్తము
ఋషి - దృహ్లుచ్యుపుత్రుడు ఇద్మవాహనుడు, దేవత -
పవమాన సోముడు, ఛందస్సు - గాయత్రి.
1.వేగవంత సోమమును, భూమివడిలో , విప్రులు అంగుళులతోనూ స్తుతులతోను, మార్జితము చేయుదురు.
2. సహస్రధారల, అక్షీణ, దీప్త, స్వర్గధారక సోమమును స్తుతులు స్తుతించును.
3. సర్వధారి, బహుకర్మకారి, సర్వవిధాత, శుద్ధసోమమును ప్రజలు ప్రజ్ఞద్వారా స్వర్గమువైపు ప్రేరేపింతురు.
4. సోమము పాత్రయందున్నవాడు స్తుతిపతి. అహింసనీయుడు పరిచారకులగు ఋత్వికులు రెండు చేతుల వేళ్లతో సోమమునకు ప్రేరణ కలిగించును.
5. హరితవర్ణ సోమమా! ఋత్విక్కులు నిన్ను ఇంద్రుని వద్దకు పంపుదురు. నీవు స్తుతులతో వర్థిల్లువాడవు. దీప్తుడవు, మదకరుడవు.
ఇరువది ఏడవ సూక్తము
ఋషి - అంగిసనృమేధుడు, దేవత - సోమము, ఛందస్సు - గాయత్రి.
1. సోమము విద్వాంసుడు. నలువైపుల స్తుతులు కలవాడు, అతడు దశాపవిత్రమును లంఘించిపోవును. శోధితుడగును. శత్రువినాశము చేయును.
2. సోమము అందలి విజేత బలకారకుడు. ఇంద్ర వాయువుల కొరకు సోమమును దశాపవిత్రమున సిక్తము చేయబడును.
3. ఈ సోమమును ఋత్విక్కులు నానా ప్రకారములుగ ఉంచుదురు. సోమము ద్యులోకశిరము, మనోహర పాత్రయందు ఉండును. అభిషుతుడగును సర్వజ్ఞుడగును.
4. సోమము శోధితమై ధ్వనించును. అతడు మాగోవులను, హిరణ్యమును కోరును. సోమము దీప్తుడు. మహాశత్రువిజేత. స్వయం అహింసనీయుడు.
5. శోధక సోమము సూర్యుని ద్వారా పవిత్రుడై, ద్యులోకమున పరిత్యక్తుడగును. సోమము అత్యంత మాదకము.
6. బలవంత సోమము అంతరిక్షమునకు వెళ్లును. సోమము కామవర్షక, హరిత వర్ణ, పవిత్ర కర్తయగు దీప్తుడు. అతడు ఇంద్రునివైపు సాగును.
ఇరువది ఎనిమిదివ సూక్తము.
ఋషి - ప్రియమేధ దేవత - సోమము ఛందస్సు - గాయత్రి
1. ఈ సోమము గమన శీలుడు, పాత్రయందు అవస్థితుడు, సర్వజ్ఞుడు. అందరకు స్వామి. అతడు మేషలోమము మీద పరుగులిడును.
2. సోమము దేవతల కొరకు అభిషుతమగును. వారి సకల శరీరములందు ప్రవేశించుటకు దశాపవిత్రమున చేరును.
3. అమర, వృత్రఘ్న, దేవాభిలాషి సోమము తన స్థానమున శోభిల్లును.
4. అభిలాషప్రదాత, ధ్వనికర్త, అంగుళలందు నలిగిన సోమము ద్రోణమువైపు సాగును.
5. సర్వద్రష్ట, సర్వజ్ఞ సోమము సూర్యుని, సమస్త తేజో పదార్థములను ప్రకాశవంతము చేయును.
6. శోధన కాలపు సోమము బలవంతుడు అహింసనీయుడు. ఇతడు దేవతల రక్షకుడు. పాపుల వినాశకుడు.
ఇరువది తొమ్మిదవ సూక్తము
ఋషి - అంగిరస నృమేధ, దేవత - పవమాన సోమము.
1. వర్షక, అభిషుత, దేవతలపై ప్రభావము వేయదలచు సొమము ధారగా క్షరితమగును.
2. స్తోతలు, విధాతలు, కర్మకర్త అధ్వర్యులు - దీప్తిమంత, ప్రవృద్ధ, స్తుత్య, సర్వాణస్వభావ - సోమమును మార్జితము చేయుదురు.
3. ప్రభూత ధనవంత సోమమా! శోధన సమయమున నీ తేజస్సులన్నియు శోభించును. నీవు సముద్రము వంటి ద్రోణమున నిండుము.
4. సోమమా! సకల ధనములు గెలిచి ధారగా - ప్రవాహముగా - రమ్ము. సకల శత్రువులను ఒకేసారి దూర దేశములకు పంపుము.
5. సోమా! దానము చేయని వారినుండియు, నిందకుల నుండియు మమ్ము రక్షింపుము. మేము విముక్తులము కావలెను.
6. సోమా ! నీవు ధారగా క్షరితుడవగుము. స్వర్గమునందలి, భూమి మీద ధనమును మరియు దీప్తివంత బలమును తీసికోని రమ్ము.
ముప్పదవ సూక్తము
ఋషి - అంగిరసబిందు, దేవత - పవమాన సోమము, ఛందస్సు -గాయత్రి.
1. బలవంత సోమపుధార అనాయాసముగా దశాపవిత్రమున పడుచున్నది. శోధన సమయమున సోమము ధ్వని చేయును.
2. సోమము అభిషవకారులచే ప్రేరితమై, శోధన మప్పడు, ధ్వనించుచు. ఇంద్ర సంబంధ ధ్వనిని కలుగ చేయును.
3. సోమమా! నీవు ధారగా క్షరితమగుము. అందువలన మానవులకు అభిభవకర, వర్యవంత, అనేకుల అభిలషణీయ బలము కలుగును.
4. శోధన కాలమున సోమము ధారగా ద్రోణమున చేరుటకు - దశాపవిత్ర్రమును దాటి క్షరితమగును.
5. సోమమా! నీవు జలములందు మధురతమవు, హరిత వర్ధవు అగుదువు. ఇంద్రుని పానమునకుగాను నిన్ను రాతిపై నూరుదురు.
6. ఋత్విక్కులారా! సోమము అత్యంత మధురము. మనోహరము. మాదకము. మాకు బలము కలుగునట్లు ఇంద్రుని పానము కొరకు - సోమము అభిషవించండి.
ముప్పది ఒకటవ సూక్తము
ఋషి - రాహూగణ గోతముడు, దేవత - సోమము, ఛందస్సు -గాయత్రి.
1. ఉత్తమ కర్మవంత, శోధన సమయ సోమము అదిగో వెళ్లుచున్నాడు. అతడు మాకు ప్రజ్ఞాపకధనము ప్రసాదించినాడు.
2. సోమమా! నీవు అన్నముల స్వామివి. ద్వావ్యాపృథ్వుల ప్రకాశక ధన వర్ధకుడవు అగుము.
3. సకల వాయువులు నీకు ఆనందకరములగును. సకల నదులు నీ కొరకు ప్రవహించును. వారు నీ మహిమను పెంచవలెను.
4. సోమమా! నీవు వాయువు, జలములతో వర్థిల్లుము. నలుదిశలనుండి నీకు వర్షక బలము అందవలెను. యుద్ధమందు అన్నములు కలిగించుము.
5. పింగళ వర్ణసోమమా! గోసమూహములు నీ కొరకు ఘృతము, అక్షయదుగ్ధములు ఇచ్చును. నీవు ఉన్నత స్దానమున ఉన్నవాడవు.
6. భువనపతి సోమమా! నీవు ఉత్తమ ఆయుధవంతుడవు. మేము నీ బంధుత్వము ఆశించుచున్నాము.
ముప్పది రెండవ సూక్తము
ఋషి - ఆత్రేయశ్యావాశ్వుడు, దేవత - సోమము, ఛందస్సు -గాయత్రి.
1. సోమము మదస్రావియై, అభిషుతమై యజ్ఞమున హవ్యదాతకు అన్నము అందించుటకు అరుదెంచును.
2. ఇంద్రుని పానముకొరకు. హరిత సోమమును త్రితఋషి అంగుళులు రాతిమీద రాపిడి చేయును.





